Sep 7, 2014

రామ్ గోపాల్ వర్మకు తిక్క: ఒక పరిశీలన


              రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కరలేని సంచలన సినిమా దర్శకుడు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కుతుంటారు. అటు సినిమా గురించి గానీ, ఇతర అంశాల గురించి గానీ ఏదో ఒక వ్యాఖ్య చేసి వివాదాలు సృష్టిస్తుంటారు.రాజకీయ నాయకుల గురించి, అదీ చాలా వింతగా  మాట్లాడతారు. మత విశ్వాసాలపై మాట్లాడి వారి మనోభావాలు నొప్పిస్తారు.కొన్ని కొన్ని సందర్భాలలో అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తారు.  వివాదాలు లేకపోతే అతనికి నిద్రపట్టదేమో. తన సినిమా టైటిల్ ద్వారానే రాము సంచలనం సృష్టిస్తారు. తన ప్రచారం ద్వారా ఆ సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి రేకెత్తిస్తారు. సినిమా చూసేందుకు థియేటర్కు రప్పిస్తారు. విరుద్ధ భావాలతో విశిష్ట లక్షణాలు ఉన్న వ్యక్తి రాము. అతనికి జీవితంలో  రెండే ముఖ్యమైన విషయాలు. ఒకటి సినిమా, రెండు మగువ.సినిమాకు సంబంధించి కీర్తి శిఖరం అందుకున్నారు. మగువకు సంబంధించి కూడా సుఖ శిఖరం అందుకొనే ఉంటారు. మగువేగా మగవాడికి మధుర భావన అనేది అందరికీ తెలిసిందే. రాము కూడా అంతే. తను చేసే పనిలోనే(సినిమా - మగువ) ఆనందాన్ని పొందుతాడు. అవే అతని ప్రపంచం.  చీకు - చింతా - దిగులు - నిరుత్సాహం...వంటివి రాము దరికి రావు. అయితే రాము కూడా బాధపడతారు - ఏడుస్తారు - నవ్వుతారు - నవ్విస్తారు. తన సినిమాల ద్వారా నరకం కూడా చూపిస్తారు. తన ప్రపంచం సినిమా. అతని ఆలోచనలు సినిమా. అతని శ్వాస సినిమా. వృత్తి పరంగా అతనికి సినిమా తప్ప మరొకటిలేదు. అవసరంలేదు. మరో ఆలోచన చేయరు. యాడ్ ఫిల్మ్ తీయమని అడిగినా, ఎందుకు సినిమా తీస్తానని చెబుతారు.  రాము ఓ వ్యాపారికి కూడా వ్యాపారం నేర్పగలరు. యాడ్ సంస్థకు కూడా మతులుపోగొట్టే కొత్తకొత్త  ఆలోచనలు ఇస్తారు.  తన లక్ష్యసాధనలో ఎంతటి మేధావినైనా బురిడీకొట్టించగలరు. స్థిత ప్రజ్ఞుడు.
  
                  రాముకి తిక్క ఉందా? తనకి తిక్క ఉందని ఆయన చెప్పుకుంటారు. అదివేరే విషయం. అతనికి తిక్క ఉంటే అతనిని నమ్మి నిర్మాతలు కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారు?  సినీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు అతనితో కలసి ఎలా పనిచేస్తారు? టాలీవుడ్లోనే కాకుండా, బాలీవుడ్లో కూడా అగ్రాసనానికి ఎలా చేరుకోగలిగారు? అయినా ఆయన లక్షణాలు ఒకసారి పరిశీలిద్దాం.

                ఎవరు ఎన్ని అనుకున్నా భారతీయ సినిమా చరిత్రలో అతనితో పోల్చగల దర్శకులు లేరు. అటు బాలీవుడ్లో గానీ, ఇటు టాలీవుడ్లోగాని మనం గొప్ప దర్శకులుగా భావించే వారికి ఉండే ప్రతిభా సామర్థ్యాలతోపాటు ఇతనికి చాలా అదనపు అర్హతలు, తెలివితేటలు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. కథ- కథనం -  సంగీతం- చిత్రీకరణలో కొత్తదనం - ఆధునిక సాంకేతికతను ఆసాంతం వాడుకునే సమర్ధత ఉన్నాయి. కొత్త కొత్త ఆలోచనలు - కొత్తపోకడలు - ఎటువంటి ఆలోచనలకైనా చిత్ర రూపం ఇవ్వగల సత్తా, సామర్ధ్యం ఉంది. మన దర్శకులలో ఒక్కొక్కరు ఒక్కో అంశంలో ప్రతిభావంతులుగా చెప్పుకుంటాం. కథల ఎంపిక- కథనం- సంగీతం- అపురూపమైన కొత్త అందాల(హీరోయిన్లు)ను తెరకు పరిచయం చేయడం- హీరోయిన్లో ఉంటే అందాన్ని వివిధ భంగిమలలో అద్భుతంగా చూపించడం...ఇటువంటి అంశాలలో ఒక్కొక్కరికి ఒక్కోదాంట్లో ప్రావీణ్యత ఉంటుంది. రామ్ గోపాల్ వర్మలో వీటన్నిటితోపాటు ఫొటోగ్రఫీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో కూడా అవగాహన, అనుభవం ఉంది. ప్రతి సినిమాలో రాము ముద్ర ఉంటుంది. కొత్తకొత్త కథలతో, కొత్త ఆలోచనలతో చిత్రాలు తీస్తున్నారు. వీటికి తోడు ఏ దర్శకునికీ లేనంత ప్రచార సామర్ధ్యం రాముకి ఉంది.అది అతని ప్రత్యేకత. గతంలో ఏ దర్శకుడూ ప్రచారానికి సంబంధించి ఇంతటి ప్రావీణ్యాన్ని ప్రదర్శించలేదు.

                              సినిమాలు సమాజాన్ని మార్చవనేది అతని ఖఛ్చితమైన అభిప్రాయం. అందుకే సామాజిక ప్రయోజనం కోసం తాను సినిమాలు తీయను అని చెబుతారు. అతనితో కొద్ది సేపు మాట్లాడిన తరువాత చాలా మందికి తాము తెలుసుకోవలసింది చాలా ఉన్నదన్న విషయం తెలుస్తుంది. లేకపోతే అటువంటి అభిప్రాయానికి వస్తారు. జడత్వం గల మనిషిలోనైనా ఆలోచనలు పుట్టించగల ఘటికుడు. ప్రతిమనిషిలో విభిన్న కోణాలు ఉన్నట్లే రాములో కూడా ఉన్నాయి.  అతని పేరే రామ్ గోపాల్. అక్కడే రెండు ధృక్పదాలు - అలాగే అతని ఆలోచనా విధానం - నడవడి - ప్రవర్తన - వ్యవహర శైలి - మాటల తీరు....భిన్నంగానే ఉంటాయి. అయితే అతనేంటో అతనికి తెలుసు. అతనికి ఏం కావాలో తెలుసు. ఏం చేస్తున్నాడో తెలుసు. ఏం చేయాలో తెలుసు. జీవితం పట్ల స్పష్టత ఉంది.సినిమా నిర్మాణం పట్ల సంపూర్ణ అంకిత భావం ఉంది.  ప్రతి విషయంలో అతనికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అవి ఎదుటి వారికి నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. అది వేరే విషయం.  అతనికీ చదువు, సభ్యత, సంస్కారం ఉన్నాయి. మంచీచెడు తెలుసు. అందరిలాగానే భావోద్వేగాలు ఉన్నాయి. తల్లిదండ్రులను ప్రేమిస్తారు. గౌరవిస్తారు. అభిమానిస్తారు. వారికి అండగా ఉంటారు. అతనికీ స్నేహితులు ఉన్నారు. ప్రియురాలు కూడా ఉండేది. చదువుకునే వయసులో ప్రేమలో  పడ్డారు. పుట్టి పెరిగిన ఊళ్లంటే అభిమానం. దేశం పట్ల గౌరవం ఉంది.  అతనికి మంచి చేసిన వారిని, సహాయం చేసిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అతనూ సహాయం చేస్తారు.

               రాముకి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంది.  అతని ఆలోచనలు, సాధించిన విజయాలే అతనిలోని విశ్వాసాన్ని పెంచుతున్నాయి. అతనికి ధైర్యం కూడా ఎక్కువే. కష్టపడే స్వభావం. తనకు నచ్చిన పని(సినిమా)ని శ్రమ అనుకోరు. బద్ధకం - సొల్లుకబుర్లు అతనికి అసలు నచ్చవు. పనిలోనే సంతృప్తి, ఆనందం  పొందుతారు. ప్రపంచ సినిమా రంగాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు పోతుంటారు. అటువంటి ఆలోచనలతో తన వద్దకు వచ్చినవారిని కూడా స్వాగతిస్తారు. తను ఏవిధంగా అప్పటికి భిన్నమైన ఆలోచనతో సినిమా రంగానికి వచ్చారో, ఆ విధంగా వచ్చిన ప్రతివారిని ప్రోత్సహిస్తారు. సహకరిస్తారు. సహాయపడతారు. అండగా నిలుస్తారు.  అతనికి ముసుగు(మాస్క్)లేదు. తన అభిప్రాయాలు - ఆలోచనలు బయటకు చెప్పడానికి జంకడు. ఏ విషయాన్నైనా ఎంతవరకైనా, ఎంత లోతుగానైనా ఆలోచించగలరు. ఆ ఆలోచనను బహిరంగంగా చెప్పగల ధైర్యం ఉన్నవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతను ఓ ప్రపంచ పౌరుడు(ఇది చాలా విస్తృతార్ధం. ఓ మతానికో, ఓ సంస్కృతికో, ఓ కులానికో, ఓ కుటుంబానికో చెందినవాడు కాదు.  ప్రపంచంలో వివిధ సంస్కృతులు - వివిధ ఇజాలు-వివిధ ధృక్పదాలు ఉన్నాయి. ఈ విశాల విశ్వంలో అతనిదో ఇజం.) అతనిలో ఎన్ని ప్రత్యేకతలు, ఎన్ని వ్యతిరేక అంశాలు ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం అతనిపై ఉంటుంది.  అతను ముక్కు సూటిగా మాట్లడతారు. అలాగే వెళతారు.

            అందరూ అనుకుంటున్నట్లుగా రాములో ఎన్ని వ్యతిరేక అంశాలు ఉన్నప్పటికీ అతనికి కోపం రావడం తక్కువ. పనిలో కూడా ఎవరినీ తిట్టరు. విసుక్కోరు. కోప్పడరు. ఏ పనైనా తనకు కావలసిన విధంగా వారు చేయకపోతే ఇక అంతే. ఏమీ అనకుండా వారిని వదిలేస్తారు. ఎవరినీ శత్రువులుగా భావించరు. ఒకరిని మోసం చేయాలన్న ఉద్దేశం అతనికి ఉండదు. ఒకరికి హాని తలపెట్టాన్న ఆలోచన కూడా రాదు. ఆయాచితంగా డబ్బు రావాలని కోరుకోరు. కష్టపడి సంపాదించాలనే స్వభావం అతనిది. ఎవరినీ కష్టపెట్టాలని గానీ, నష్టపరచాలని గానీ అనుకోరు.  అయితే తన పనులను చక్కబెట్టుకోవడానికి, తన లక్ష్యాలను చేరుకోవడానికి అబద్దాలు ఆడతారు. నాటకీయంగా వ్యవహరిస్తారు. లౌక్యంగా మాట్లాడతారు. అంతేగానీ తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం మరొకరిని మోసం చేసే స్వభావం మాత్రం అతనికిలేదు. స్వయం కృషి, టాలెంట్తో ముందుకు పోవడమే అతనికి తెలుసు.

        సాధారణంగా ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి లౌక్యం తెలియదు. రాముకు లౌక్యం బాగా తెలుసు. అదే అతని విజయానికి మూలం. రాముకి లౌక్యం ఏమిటని మీరు అనుకోవచ్చు. అతను ఈ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అతని దగ్గరకు నిర్మాతలు వస్తున్నారు. ప్రారంభంలో అతను ఎన్నో అబద్దాలు చెప్పి- నాటకీయంగా వ్యవహరించి - లౌక్యం ప్రదర్శించి విజయం సాధించారు. ఈ స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కూడా అతని దగ్గర లౌక్యంలేకపోతే ఇలా కొనసాగలేరు.
  
                 ప్రపంచంలో ఏ దర్శకుడికి ఆపాదించనన్ని లక్షణాలను భారతీయ ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మకు ఆపాదించారు. తిక్క- చపలచిత్తం - మూర్ఖుడు - అసాంఘీక శక్తి - మేథావి - క్రియేటివ్ డైరెక్టర్ - జీనియస్ - స్వేచ్ఛాజీవి -- తలతిక్క- పబ్లిసిటీ స్టంట్ -  అజ్ఞాని - స్త్రీలంటే గౌరవంలేదు - నైతిక విలువలు లేనివాడు - హింసాత్మక చిత్రాలు తీసేవాడు - అట్టర్ ఫ్లాప్ చిత్రాలు తీసి అటు నిర్మాతలను నష్టపరుస్తూ, పరమ చెత్త సినిమాలతో ఇటు ప్రేక్షకులను హింసిస్తున్నాడు -  మొండివాడు - పొగరుబోతు - తెలివితక్కువ వాడు - నాస్తికుడు-స్వార్ధపరుడు - ఉన్మాధి - అహంభావి - చంచల స్వభావుడు - నిజాయితీలేనివాడు - వింత మనిషి - తెలివైన మూర్ఖుడు - పబ్లిసిటీ పిచ్చోడు - చిత్రమైన వ్యక్తి -  సూపర్బ్ డైరెక్టర్ - దర్శక నక్షత్రం - సత్తా ఉన్నదర్శకుడు - వాస్తవాలకు చిత్ర రూపం ఇచ్చే అద్భుత దర్శకుడు - చిత్ర నిర్మాణంలో కొత్తపుంతలు తొక్కిన గొప్ప దర్శకుడు - రెటమతం - పెద్దల పట్ల గౌరవంలేదు - మంచీమర్యాద తెలియదు - సభ్యతలేదు - గర్వం - వెటకారం ఎక్కువ - సమాజం పట్ల బాధ్యతలేదు - భార్యను వదిలేశాడు - ప్రేమానుబంధాలు తెలియదు - సమాజాన్ని నాశనం చేసే చిత్రాలు నిర్మిస్తాడు- అన్నీ కాపీ సినిమాలే- అతని సినిమాలలో హింస, రౌడీయిజం, గూండాయిజం, మాఫియా, అండర్ వరల్డ్... ఇవే ఉంటాయి- దెయ్యాలు - భూతాలు - ప్రేక్షకులను భయపెట్టే చిత్రాలు తీస్తాడు - ఒకటి బంపర్ హిట్ కొడితే, నాలుగు ఫ్లాపులు - ఏది మాట్లాడినా పబ్లిసిటీ కోసమే - సినిమా వ్యాపారం కోసం తిక్కతిక్కగా మాట్లాడి ప్రేక్షకులను ఆకర్షించడం - చెత్త సినిమాలు తీసి జనంమీద రుద్దడం - జీవితం పట్ల ఒక దృక్పధం లేదు.....ఇలా ఎవరికి తోచిన విధంగా వారు అనేక చిత్రవిచిత్రమైన లక్షణాలు అతనికి ఆపాదించారు.

             అతనూ తక్కువేం కాదు అదే స్థాయిలో తిక్కతిక్కగా, అడ్డదిడ్డంగా, ఆలోచనలు రేకెత్తించే విధంగా, వీడెవడ్రా బాబూ అనుకునేట్లుగా, నేనింతే, నా ఇష్టం- నాకోసమే సినిమాలు తీసుకుంటా- నా ఇష్టం వచ్చినట్లు తీస్తా - నాకు తోచింది తీస్తా - చూడాలనుకున్నవారు చూస్తారు - వద్దనుకున్నవారు చూడరు.- నాకు ఏ సమయంలో ఏది అనిపిస్తే అది తీస్తా - క్లిక్ అయితే క్లిక్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ - కాపీ కొడుతూనే ఉంటా- కాపీ కొట్టి ఇంజనీరింగ్ పాసయ్యా - అనేక సినిమాలు కాపీ కొట్టి హిట్లు సాధించా - నా చావు నేను చస్తాను - నా సినిమా చూడండి అని నేను చెప్పడంలేదు. ...ఇలా మాట్లాడుతుంటారు.  మీడియా వారు సదుద్దేశంలో అడిగిన ప్రశ్నలకు సరిగానే సమాధానం చెబుతారు. అతని చేత ఏదో చెప్పించడానికి ప్రయత్నిస్తే మాత్రం కావాలని తిక్కతిక్కగా, అడ్డదిడ్డంగా సమాధానాలు చెబుతాడు. తిక్క ప్రశ్నలకు తిక్క సమాధానాలు, మంచి ప్రశ్నలకు మంచి సమాధానాలు ఇస్తుంటారు. కావాలని పనిగట్టుకొని ఏ ఒక్కరిని  విమర్శించరు. పేరు పెట్టి ఒకరి గురించి మాట్లాడే సమయంలో ఒక స్థాయిని మించి విమర్శించరు. సందర్భం వచ్చినప్పుడు తన అభిప్రాయం ధైర్యంగా చెబుతారు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో దూకుడుగా మాట్లాడతారు. అవతలవారిని బాధపెడుతుంటారు. తనకు తన అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని మాత్రమే అనుకుంటారు. ఆ అభిప్రాయం అవతలివారి మనసు నొప్పించకూడదు అనే విషయం మరచిపోతారు. ఎదుటి వారి మనోభావాలను గౌరవించాలనే అంశం వదిలివేస్తారు. అటువంటి సందర్భాలలో వివాదం కొని తెచ్చుకుంటారు.



అతని ప్రపంచం సినిమా - తను అనుకున్న సినిమా తీస్తారు- మనసు పెట్టి పనిచేస్తారు. తన సినిమా సక్సెస్కి పొంగిపోవడం - ఫ్లాప్కు కుంగిపోవడం అనేది ఉండదు.  రెండిటికి ఒకే రకంగా పని చేస్తారు. ఒకే రకంగా ఆలోచన చేస్తారు.  సినిమా ఫ్లాప్ అయితే తను ఫెయిల్ అయినట్లుగా భావించరు. ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందా అని ఆలోచన చేస్తారు. అదే అతని ప్రత్యేకత. ఎంత గొప్ప సినిమాలు తీశారో అంత చెత్త సినిమాలు కూడా తీశారు. అయితే ఏదైనా అతని సొంతం, అతని ఆలోచనల నుంచి పుట్టినదే. రాము ఎవరి మాట వినరు. తన ఇష్టం వచ్చిన విధంగా సినిమాలు తీస్తారు. నచ్చిన విధంగా జీవిస్తారు. అదే అతని స్టైల్.
  
వేరు వేరు రాములు

సినిమా ప్రపంచం రాము, మీడియా ముందు కనిపించే రాము, కుటుంబంలో రాము వేరువేరుగా ఉంటారు. సినిమా రంగంలో తనకు కావలసిన పనుల కోసం చాలా కలుపుగోలుగా వ్యవహరిస్తుంటారు. తనకు కావలసిన నటన, షాట్, సంగీతం, దృశ్యం... రాబట్టుకోవడం కోసం చాలా తెలివిగా, చనువుగా, నొప్పించకుండా సూచనలు ఇస్తుంటారు.  మీడియాను వాడుకోవడంలో రాము దిట్ట. చిక్కడు-దొరకడు పద్ధతిలో సమాధానాలు చెబుతుంటారు. అతనిని ఇంటర్వ్యూ చేయడం కూడా కష్టమే. ఎటువంటి ప్రశ్నకైనా తెలివిగా సమాధానం చెబుతారు. ఒక్కోసారి తర్కాన్ని  కూడా చొప్పిస్తుంటారు. పబ్లిసిటీలో భాగం కానివ్వండి, అతని స్వభావం కానివ్వండి తన సినిమా కథను గానీ, సన్నివేశాలను గానీ, దృశ్యాల చిత్రీకరణను గానీ, సంగీతాన్ని కానీ  ఎవరి దగ్గర నుంచి,  ఎక్కడ నుంచి, ఎలా కాపీ కొట్టింది సవివరంగా, స్పష్టంగా చెబుతారు. కాపీ కొట్టడం, అనుసరించడం  తనకు కావలసిన విధంగా మలుచుకున్నట్లు కూడా వివరిస్తారు. శంకరాభరణం ఒరిజినల్ - శివ కాపీ అని చెబుతారు. అదే అతని నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. తల్లిదండ్రులు అంటే అపారమైన గౌరవం, అభిమానం, ప్రేమ ఉన్నాయి. తమ్ముడు, చెల్లెలిపై  కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయి. కుటుంబంలో కూడా ఏదైనా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు. తన మాట వినకపోతే వదిలివేస్తారు. తను చెప్పినది ఎదుటివాళ్లు వినాలనే స్వభావంకాదు.

పెళ్లి - విడాకులు

ఇది పూర్తిగా వ్యక్తిగతం. ప్రముఖ వ్యక్తి అయినందున ప్రస్తావించడం సహజం. మేథావులు, శాస్త్రవేత్తలు, మితిమీరిన తెలివితేటలు, విజ్ఞానం గలవారు, తమ వృత్తిలో అపర నైపుణ్యం గలవారు వైవాహిక జీవితంలో విఫలమవుతుంటారు. ఇటువంటి వారిలో ఎక్కువ మంది భార్యలను పట్టించుకోకపోవడం వల్ల వారికి భర్తపై విరక్తి కలగడమో,  వైవాహిక జీవితంపై విరక్తి కలగడమో లేక అసలు జీవితంపైనే విరక్తికలగడమో జరుగుతుంటుంది. దాంపత్య జీవితం పదికాలాలపాటు సుఖవంతంగా కొనసాగాలంటే పరస్పర అవగాహన - ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించడం - ఒకరినొకరు అర్ధం చేసుకోవడం(ఒకరినొకరు భరించడం అని కూడా అంటారు) ముఖ్యం. తనను భరించినప్పటికీ, తను భరించడానికి సిద్దంగా ఉండి ఉండకపోవచ్చు.  వేధించడం, హింసించడం, అసంతృప్తితో జీవించడం కంటే పరస్పర అంగీకారంతో విడిపోవడం ఉత్తమం. రాము అదే చేశారు.

రాము ప్రత్యేకతలు:

v  రాము తన జీవితంలో అత్యంత ఇష్టపడే  వ్యక్తి  తండ్రి కృష్ణంరాజు. తండ్రి అంటే భయం లేదు. అభిమానం, అత్యంత గౌరవం. 

v   అతనిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు  బ్రూస్లీ, అయాన్ ర్యాండ్, నీషే, మిత్రుడు సత్యేంద్ర

v  శ్రీదేవి అంటే అతనికి అత్యంత ఇష్టం. ఆరాధనా భావం.

v  అతనికి ఈర్ష్యాద్వేషాలు లేవు.

v  రాముని ఎవరైనా శత్రువులుగా భావించవచ్చునేమోగానీ, రాము ఎవరినీ శత్రువుగా భావించరు.

v  తనకు నచ్చని వారిని దూరంగా ఉంచుతారు లేకపోతే ఆయనే  దూరంగా ఉంటారు.

v  ఎదుటి మనిషిలో టాలెంట్ని గుర్తించడంలో  ఘటికుడు.. ప్రోత్సహించడంలో కూడా ముందుంటారు.

v సినిమాకు సంబంధించిన 24 రంగాలలో వందల మంది కొత్తవారిని పరిచయం చేశారు. ప్రోత్సహించారు.  * తనకు అసిస్టెంట్లుగా పనిచేసినవారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి మరీ సినిమాలు నిర్మించారు.

v  సినిమా ప్రమోషన్కు నటీనటులు ఎవరూ అవసరంలేదు. అతనొక్కడే చాలు.

v  తనకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని, ఎదుటివారిని హర్ట్ చేస్తుంటారు.

v  పబ్లిసిటీ టెక్నిక్లో భాగంగా రెటమతంగా మాట్లాడతారు. వాస్తవాలనే కాస్త పొగరుగా చెబుతారు. టాలెంట్ ఉన్నవారికి పొగరు ఉండటం సహజం. కొత్త ఆలోచనలు రేకెత్తించేవిధంగా చర్చిస్తుంటారు.

v  విపరీతంగా పుస్తకాలు చదువుతారు. అయితే ఎవరినీ గుడ్డిగా అనుసరించరు.

v  ప్రతి విషయంలోనూ అతనికి ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. జీవితం పట్ల స్పష్టత ఉంది. అతను అతనులానే ప్రవర్తిస్తారు.

v  అతనికి అవార్డులపై ఆసక్తిలేదు.

v  డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వరు.అంటే కనీస అవసరాలకు సరిపోను ఉంటే చాలనుకుంటారు.

v  నైతిక విలువలు పాటిస్తారు.

v  సినిమాను తన ఇష్టం వచ్చినట్లే తీస్తారు. కమర్షియల్గా ఆలోచించరు. ఆ సినిమా హిట్ అనేది ఆ నిర్మాత అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. తను మాత్రం అన్ని చిత్రాలు మనసుపెట్టే తీస్తారు.

రామ్ గోపాల్ వర్మపై పిహెచ్ డిలు చేసే అవకాశం

భవిష్యత్లో రామ్ గోపాల్ వర్మపై దేశంలో యూనివర్సిటీ లేక యూనివర్సీటీలలో పిహెచ్డిలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సినిమా - జర్నలిజం - సైకాలజీ - యాడ్స్ - కామర్స్ - హిస్టరీ...వంటి డిపార్ట్మెంట్లలో పిహెచ్డి చేయడానికి వీలుంది. సినిమా విభాగంలో అయితే 'సినిమా మేకింగ్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ, జర్నలిజంలో అయితే 'మీడియాను వాడుకోవడంలో వర్మ దిట్ట',  సైకాలజీలో అయితే 'వైరుధ్య భావాల రామ్ గోపాల్ వర్మ', యాడ్స్లో అయితే 'సినిమా ప్రమోషన్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ' కామర్స్లో అయితే 'సినిమా బిజినెస్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ'  హిస్టరీలో అయితే 'హిస్టరీ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ'....ఇలా వర్మకు సంబంధించి అనేక అంశాలపై పరిశోధనలు చేయవచ్చు.
ఇదంతా చదివిన తరువాత కూడా రామ్ గోపాల్ వర్మకు తిక్క ఉందని అనుకుంటున్నారా?

                                                                            శిరందాసు నాగార్జున -    9440222914 

                                                         Sep 07, 2014, 10:04 IST


అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...