Dec 13, 2016

రాజధాని నిర్మాణానికి బాండ్స్ ద్వారా నిధుల సేకరణ

v  9వ తేదీ వరకు ఆర్ఎఫ్ పీల స్వీకరణ
v వివిధ మార్గాలలో నిధుల సమీకరణ
v మసాలా బాండ్లకు ప్రయత్నాలు
v ఇప్పటి వరకు 2, 26, 554 మంది ప్రజల భాగస్వామ్యం
v మూడేళ్లలో రాజధానికి ఒక రూపం

           నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మహానగర నిర్మాణం కోసం బాండ్స్ ద్వారా కూడా నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆహ్వానించిన ప్రకారం బ్యాంకుల నుంచి వచ్చిన టెండర్లను ఈ నెల 9న తెరుస్తారు. గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాజధాని మహా నగరాన్ని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వేగంగా నిర్మాణ పనులు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాజధానిలో  వివిధ అంశాలకు సంబంధించి 9 నగరాలను నిర్మించదలచిన విషయం తెలిసిందే. ఆధునిక అమరావతి నిర్మాణానికి ప్రపంచదేశాలు సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, బ్రిటన్, రష్యా, చైనా, ఆస్థానా వంటి అనేక దేశాలు  సహాయ సహకారాలు అందించడానికి తమ సంసిద్ధత తెలిపాయి.

మూడేళ్లలో రాజధానికి ఒక రూపం
      తాజా అంచనాల ప్రకారం రాజధానిని బ్లూ-గ్రీన్ (జలకళ-పచ్చదనం) నగరంగా అభివృద్ధి చేయడానికి రూ.58 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 70 శాతం నిధులను రాబోయే మూడేళ్లలో ఖర్చుచేసి రాజధానికి ఒక రూపం తీసుకురావలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇదే కాలంలో రాయలసీమలోని అనంతపురం – కర్నూలు -కడపల  నుంచి అమరావతికి రూ.27,600 కోట్ల అంచనా వ్యయంతో ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. అత్యధిక నిధులు మౌలిక సదుపాయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇందులో కొన్ని ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతుల్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదానికి, పర్యవేక్షణకు ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేస్తారు.  రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపే దేశాలను ఇందులో భాగస్వాములను చేస్తారు.  మిశ్రమ ప్రాయోజక అభివృద్ధి (మిక్స్‌డ్‌ యూజ్‌ డెవలప్‌మెంట్‌), సాంఘిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.  కట్టడాల నిర్మాణంలో ఉపయోగించే సామాగ్రికి కొరతలేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ సామాగ్రి ఎంత అవసరమో, ఎక్కడ నుంచి తెప్పించాలో వంటి విషయాలపై కూడా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 25 రెవెన్యూ గ్రామాలలో కూడా రూ.2,537 కోట్లతో మౌలికసదుపాయాలు కల్పిస్తారు.  

వివిధ మార్గాలలో నిధుల సేకరణ
      నిర్మాణానికి వివిధ మార్గాలలో నిధులు సేకరించడానికి ఏపీసీఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) తగిన ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రపంచ బ్యాంకు(ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకంనస్ట్రక్షన్ అండ్ డవలప్ మెంట్), ఆసియా మౌలికవసతుల పెట్టుబడి బ్యాంకు (ఎఐఐబీ), భారత ప్రభుత్వ సంస్థ హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) నిధులు సమకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి నిధులు కొరతలేకుండా చూడాలన్న  సీఎం ఆదేశాలు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) సూచించిన మేరకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా ఏపీసీఆర్డీఏ నిధులు సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ప్రాజెక్టులు, జాతీయ పెట్టుబడి సంస్థల నుంచి అవసరమైన నిధుల సమీకరించే ప్రయత్నంలో ఉంది. దానికి తోడు బాండ్ల ద్వారా కూడా నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఈ బాండ్లు తీసుకునే వారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్స్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరుతాయని అంచనా.  ఇందుకోసం మర్చంట్ బ్యాంకుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 23 నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఆర్ఎఫ్ పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)లను స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్ఎఫ్ పీలను తెరుస్తారు. ఈ నెల 12వ తేదీన అర్హత గల సంస్థలను, 13 తేదీన సాంకేతికంగా అర్హత గల సంస్థలను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన ప్రతిపాదనలను ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు తెరుస్తారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మసాలా బాండ్ల (రూపీ-డినామినేటెడ్ బాండ్లు) రూపంలో  నిధులు సేకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ప్రజా భాగస్వామ్యం : ప్రజారాజధాని నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్న సీఎం పిలుపుని అందుకుని ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా లక్షల మంది విరాళాలు అందజేస్తున్నారు. అమరావతి వెబ్ సైట్ ద్వారా దేశవిదేశాలలోని తెలుగు ప్రజలు ఒక్కో ఇటుక పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మంగళవారం  మధ్యాహ్నం వరకు ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా 2,26,554 మంది 56,27,184 ఇటుకలు కొనుగోలు చేశారు.
  
జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

విమానాశ్రయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి

·       కొత్త విమానాశ్రయాల నిర్మాణం
·       విమాన సర్వీసులు పెంచే ప్రయత్నాలు
·       విమానాశ్రయాల మధ్య ప్రాంతీయ అనుసంధానం
·       విమానాశ్రయాలకు తక్కువ చార్జీలతో వాహన సౌకర్యం
·       బీచ్, టెంపుల్, హెలీ టూరిజం అభివృద్ధి

            మౌలిక వసతుల కల్పనలో భాగంగా  రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. రాష్ట్రం పారిశ్రామికంగా, సాంకేతికంగా, విద్య, వైద్య పరంగా అభివృద్ధి చెందాలంటే విమాన సర్వీసులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. పర్యాటక రంగం అభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుంది. ఈ అంశాలను దృష్టిలోపెట్టుకుని  రాష్ట్రాన్ని  విమానయాన హబ్‌గా రూపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది.  నూతన రాజధాని అమరావతికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తారు. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ఈ నెలాఖరికి అందుబాటులోకి వస్తుంది. ఈ టెర్మినల్ పూర్తి అయితే దీనికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించే అవకాశం ఉంటుంది. గన్నవరం - విశాఖపట్నం, గన్నవరం - హైదరాబాద్, గన్నవరం - తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచే ఆలోచన కూడా ఉంది.
               రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం (డొమెస్టిక్, కస్టమ్స్ రెండు విమానాశ్రయాలు), రాజమండ్రి, గ్ననవరం (విజయవాడ), తిరుపతి, కడప, పుట్టపర్తి విమానాశ్రయాల ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులున్నాయి. పుట్టపర్తిలోని విమానాశ్రయం ప్రైవేటుది కాగా, విశాఖలోని కస్టమ్స్ విమానాశ్రయం ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో ఉంటుంది. మిగిలినవాటిని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది.
           ప్రకాశం జిల్లా దొనకొండలోని విమానాశ్రయం పనిచేయడంలేదు. గుంటూరు జిల్లా విజయపురిలో నాగార్జున సాగర్ వద్ద ఒక ప్రైవేటు విమానాశ్రయం ఉంది. రాష్ట్రంలో విశాఖపట్నందే అతి పెద్ద విమానాశ్రయం.  తిరుమలకు దేశవిదేశీ భక్తుల తాకిడి ఎక్కువ. అందువల్ల తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతారు.  విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా  అభివృద్ధి చేస్తారు. రాజమండ్రిలోని మధురపూడి  విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుగోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రన్ వేని విస్తరించాలని నిర్ణయించారు. ఇందుకోసం  850 ఎకరాలు సేకరించి, ప్రస్తుతం ఉన్న 1750 మీటర్ల  రన్ వేను 3,165 మీటర్ల కు పొడిగిస్తున్నారు.  రూ.181 కోట్ల ఖర్చుతో ఈ రన్ వే విస్తరణ పనులు జరుగుతున్నాయి. 2018 ఏప్రిల్ నాటికి అంతర్జాతీయ స్థాయిలో ఈ విస్తరణ పనులు పూర్తి చేస్తారు.
విమానాశ్రయాల మధ్య ప్రాంతీయ అనుసంధానం
       రాష్ట్రంలోని విమానాశ్రయాలను ప్రాంతీయంగా అనుసంధానం చేస్తారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ ఆధారిటీ - పౌర విమానయాన శాఖ - ప్రభుత్వాల మధ్య ఒప్పందం కూడా జరిగింది.  ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో విమానాశ్రయాల మధ్య తక్కువ ఛార్జీలతో ప్రాంతీయ పౌర విమాన సర్వీసులు పెరుగుతాయి. విశాఖ గన్నవరం - తిరుపతి విమానాశ్రయాల మధ్య సర్వీసులు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొత్త విమానాశ్రయాల నిర్మాణం
       విజయనగరం జిల్లా భోగాపురంలో గ్రీన్ ఫీల్డు విమానాశ్రయం, విశాఖ-చెన్నయ్ పారిశ్రామిక కారిడార్ లో నెల్లూరు జిల్లా దగదుర్తి విమానాశ్రయం, కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలను కొత్తగా నిర్మిస్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దేశవిదేశీ వ్యాపారులు, అధికారులు, పర్యాటకులకు గన్నవరం విమానాశ్రయం ఒక్కటే సరిపోదన్న ఆలోచనతో దీనిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5వేల ఎకరాలలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం(పీపీపీ)తో అంతర్జాతీయ స్థాయిలో దీనిని నిర్మిస్తారు. సింగపూర్ సంస్థ రూపొందించిన నూతన రాజధాని ముసాయిదా ప్రణాళికలో కూడా దీనిని పేర్కొన్నారు. అయితే దీనికి ఇంకా స్థల నిర్ణయం జరుగలేదు. భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ  గ్రీన్‌ఫీల్డు విమానాశ్రయంగా నిర్మించేందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపింది. కర్నూలు జిల్లా శ్రీశైలం, గుంటూరు జిల్లా నాగార్జున సాగర్, ప్రకాశం జిల్లా దొనకొండలలో ప్రాంతీయ విమానాశ్రయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
        అత్యంత ఆధునిక సౌకర్యాలు, అన్ని హంగులతో తీర్చిదిద్దేటటువంటి దానిని  గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం అంటారు.   వీటి నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ ఒక పాలసీని రూపొందించింది. గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం పూర్తిగా పీపీపీ విధానంలోనే చేపట్టాలి. ఈ విమానాశ్రయానికి అవసరమైన భూమిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. అవసరాన్నిబట్టి ప్రభుత్వం 20 శాతం వరకు పెట్టుబడి నిధులను సమకూర్చుతుంది. అయితే  గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాన్ని నిర్మించవలసిన అవసరం ఏర్పడితేముందుగా  స్టీరింగ్‌ కమిటీ దాని ఆవశ్యకతను పరిశీలిస్తుంది. కేంద్రానికి నివేదిక అందజేస్తుంది.  కేంద్రం పూర్తిగా సంతృప్తి చెందిన తరువాతే డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) అనుమతిస్తుంది.  భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మాణానికి ఈ తతంగం అంతా పూర్తి అయిన తరువాతే అనుమతించారు.
ఎయిర్ పోర్ట్స్  ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్:  రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి కోసం ఎయిర్ పోర్ట్  ఆథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  స్థానికంగా విమానాశ్రయాల అభివృద్ధి, వాటిమధ్య అనుసందానత,  దేశీయ సర్వీసులు పెంచేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ఈ ఎయిర్ పోర్ట్ ఆథారిటీని పర్యాటక శాఖతో అనుసంధానం చేస్తారు.  రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి ఇది దోహదపడుతుంది.
విమాన సంస్థల కొత్త ప్యాకేజీలు
          విమాన ప్రయాణికులను ఆకర్షించే విధంగా విమానయాన సంస్థలు కొత్త కొత్త ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరాలను కలుపుతూ టెంపుల్ టూరిజం’, సముద్రతీర పర్యాటక ప్రాంతాలను కలుపుతూ బీచ్ టూరిజంఅని వివిధ ప్యాకేజీలను రూపొందించనున్నారు. ఉదాహరణకు విశాఖపట్నం జిల్లాలో విశాఖ అరకు పాడేరు - అనంతగిరి, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అఖండ గోదావరి కోనసీమ అంతర్వేది పాపికొండలు ప్రత్యేక ఆకర్షణ గల ప్రధాన పర్యాటక కేంద్రాలు. ఈ ప్రాంతాలను పర్యటించడానికి ప్యాకేజీలు రూపొందిస్తారు. విమానాశ్రయాలకు సమీపంలో ఉండే పర్యాటక ప్రదేశాలకు వెళ్లడానికి హెలీ టూరిజంని అభివృద్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో అటు దేశవిదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. విమానయాన సంస్థలకు ఆదాయం కూడా పెరుగుతుంది. విమాన చార్జీలు సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం గంటలోపు విమాన ప్రయాణ టిక్కెట్ ధర రూ.2500 ఉంటుంది.
విమానాశ్రయాలకు తక్కువ చార్జీలతో వాహన సౌకర్యం
    అన్ని చోట్ల పట్టణాలకు విమానాశ్రయాలు దూరంగానే ఉన్నాయి. రవాణా సౌకర్యం తక్కువగా ఉంటుంది. అక్కడకు వెళ్లాలంటే చార్జీలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటి దృష్ట్యా కూడా ప్రజలు విమానంలో ప్రయాణించడానికి అంతగా ఆసక్తి చూపడంలేదు.  వీటిని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయాలకు సమీప పట్టణాల నుంచి అందుబాటులో ఉండే చార్జీలతో వాహన సౌకర్యం కల్పించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తోంది.  
        
జారీ చేసినవారు: రీసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Dec 5, 2016

యుద్ధప్రాతిపదికన ఈ-పోస్ మిషన్ల ఏర్పాటు

§  ప్రభుత్వ శాఖలకు 7,832 ఈ-పోస్ మిషన్ల సరఫరా
§  వాణిజ్య పన్నుల శాఖలో అత్యధిక మిషన్లు
§  64,672 ఈ-పోస్ మిషన్ల అవసరం
§  గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా వినియోగానికి ఏర్పాట్లు


                పెద్ద నోట్ల చలామణిపై ఆంక్షల విధింపు, కొత్త నోట్ల కొరత వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టింది. నోట్ల కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి నగదు తెప్పిస్తున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉజ్జిత్ పటేల్ తో మాట్లాడి శుక్రవారం రెండు ప్రత్యేక విమానాల్లో రూ.2,420 కోట్ల విలువైన నోట్లు రప్పించారు. రాత్రంతా నిద్ర కూడా పోకుండా 13 జిల్లాలకు నగదు పంపించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరో పక్క ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలలో  ఈ-పోస్ (పీఓఎస్- పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు (ప్రింటర్లు) ద్వారా నగదురహిత లావా దేవీలు జరిపేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించారు.  వాటిని రాష్ట్రం వ్యాప్తంగా తక్షణం అమలు చేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలకు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్), పీఓపీ (పాయింట్ ఆఫ్ పర్చేజ్), ఎం-పీఓఎస్(మొబైల్ పోస్),ఎఫ్-పీఓస్(ఫింగర్ ప్రింట్ పోస్), డిజిటల్ సెక్యూర్ పోస్ (స్మార్ట్ ఫోన్ ద్వారా ఉపయోగించేది), కార్డ్ రీడర్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఈ మిషన్ల వాడకం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులలో వీటి వాడకాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రస్తుతం వాడుతున్న మిషన్లు కాకుండా 64,678 ఈ-పోస్ మిషన్లు అవసరం కాగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 20 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన  7,835 మిషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్నాపెద్దా అన్ని రకాల వాణ్యిజ్య సంస్థలలో కూడా ఈ మిషన్లను వాడే ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో  పెట్రోల్ బంకులు, హోటళ్లు, బార్లు, వైన్ షాపులు, వివిధ రకాల షోరూమ్స్, షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటిని విస్తృతంగా వినియోగించడానికి అటు చిన్నచిన్న వ్యాపారులకు, ఇటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల వర్తకుల వివరాలను సేకరించి వారికి ఇ-పోస్‌ మిషన్‌లు పంపిణీ చేసే ఏర్పా ట్లు చేస్తున్నారు.

ఈ-పోస్ మిషన్లు సరఫరా చేస్తున్న బ్యాంకులు
      నగదు రహిత లావాదేవీలు జరపడానికి ఈ-పోస్ మిషన్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అయితే కావలసినన్ని మిషన్లు ఉన్నపళంగా సరఫరా చేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ మిషన్లను బ్యాంకులే అందజేస్తాయి. డిమాండ్ ఎక్కువగా ఏర్పడిన కారణంగా కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు కూడా వీటిని సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు కావలసిన ఈ-పోస్ మిషన్లను బ్యాంకులు, సాఫ్ట్ వేర్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో 19వేల మిషన్లు అవసరం కాగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 13 వేలు, ఆంధ్రా బ్యాంక్ 2,180 సరఫరా చేస్తానికి అంగీకరించాయి. ఇప్పటికే ఈ శాఖలో 6,238 మిషన్లు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖకు 7,500 మిషన్లు అవసరం కాగా, డిజిట్ సెక్యూర్ పోస్ మిషన్లు 2,500, కార్డ్ రీడర్స్ 5 వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 281 మిషన్లు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో 5వేల మిషన్లు అవసరం కాగా, ఎస్ బీఐ 3వేలు, హెచ్ డీఎఫ్ సీ రెండు వేలు మిషన్లు పెడతాయి. ఇప్పటికే 265 మిషన్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాలలోని మీసేవ కేంద్రాలకు అవసరమైన 880 మిషన్లను యాక్సెస్ బ్యాంకు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 154 ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని మీ సేవ కేంద్రాలకు అవసరమైన 3,088 మిషన్లను పేనియర్ సొల్యూషన్స్ సంస్థ సరఫరా చేస్తుంది. ప్రస్తుతానికి 260 ఏర్పాటు చేశారు. ఏపీ ఆన్ లైన్ కేంద్రాలకు కావలసిన 13 వందల మిషన్లను పిన్ ల్యాబ్స్ సంస్థ పరఫరా చేస్తుంది. ఇప్పటికే ఈ కేంద్రాలలో 80 మిషన్లను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖకు అవసరమైన 240 మిషన్లను ఎస్ బీఐ అందజేస్తుంది.  ఇప్పటికే 40 మిషన్లను సరఫరా చేసింది. సివిల్ సప్లైస్ లోని గ్యాస్ డీలర్లకు కావలసిన 820 మిషన్లను ఆంధ్రాబ్యాంక్ సరఫరా చేస్తుంది. అలాగే మరో పది వేల మొబైల్ పోస్ మిషన్లను కూడా ఆంధ్రాబ్యాంక్ అందజేస్తుంది. గ్రామాలలోని షాపుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కావలసిన 5 వేల మిషన్లలో ఎస్ బీఐ రెండు వేలు, ఐసీఐసీఐ వెయ్యి మిషన్లను సరఫరా చేస్తాయి. రైతు బజార్లు, చెక్ పోస్టుల వద్ద 2,500 మిషన్లు కావలసి ఉంది. వాటిలో రెండు వేలు ఎస్ బీఐ, 500 ఆంధ్రాబ్యాంకు అందజేస్తాయి. ఇప్పటికే 95 మిషన్లను ఏర్పాటు చేశారు. కార్మిక శాఖకు కావలసిన 19 వేల మిషన్లను విజన్ టెక్ సంస్థ 15వేలు, అనలాజిక్ సంస్థ నాలుగు వేలు సరఫరా చేస్తాయి. ఈ శాఖలో శుక్రవారం ఒక్క రోజే 294 మిషన్లు ఏర్పాటు చేశారు. ఏపీఈపీడీసీఎల్(ఈస్టరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కావలసిన 350 మిషన్లను పిన్ ల్యాబ్ సంస్థ సరఫరా చేస్తుంది. ప్రస్తుతం 128 మిషన్లు ఏర్పాటు చేశారు.

వాణిజ్య పన్నుల శాఖలో అత్యధిక మిషన్లు
       ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలలో ఒకటైన వాణిజ్య పన్నుల శాఖలో అత్యధిక ఈ-పోస్ మిషన్లు ఉన్నాయి. ఈ శాఖలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 33,022 మిషన్లు ఉన్నాయి. మరో 20,235 మిషన్ల అవసరం ఉంది. పెద్ద నోట్లపై ఆంక్షలు విధించిన నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ శాఖలో యుద్ధ ప్రాతిపదికన 6,238 మిషన్లు ఏర్పాటు చేశారు.  శుక్రవారం ఒక్క రోజులోనే 428 మిషన్లు ఏర్పాటు చేశారు.
 జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

ఉత్తమ కథలలో ఒకటి

సాహిత్యం

     ఈనాడు ఆదివారం  అనుబంధం 2016 డిసెంబర్ 4వ తేదీ సంచికలో సునీత గంగవరపు గారు ‘మనసే... ఒక పూలతోట’ అనే కథ రాశారు. చాలా బాగుంది. ఈ ఏడాది ఉత్తమ కథలలో ఒకటిగా ఎంపిక చేయతగినది.  ఇందులో పూల పరిమళం - ప్రకృతి సౌందర్యం ఉంది. ఓ యువతి వ్యథ  - నెగ్గుకొచ్చిన ఓ మహిళ.... వెరసి ఓ జీవితం. ఇది చాలా మందికి చెందిన కథ. వాస్తవ ప్రపంచంలో ఇటువంటి నరకయాతన అనుభవించిన మహిళలు ఎందరో ఉన్నారు.  ఇందులో సావిత్రి పాత్ర చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఈ వ్యవస్థలో కొందరు మగాళ్లకు అద్దంపట్టే పాత్ర రాంబాబుది.
          అనుమానంతో భార్య నుంచి వాస్తవాలు రాబట్టడానికి నాటకీయంగా వ్యవహరించే రాంబాబు లాంటి భర్తల వద్ద అమాయకంగా నిజాలు చెప్పి జీవితాలు నాశనం చేసుకున్న, చేసుకుంటున్న, నరకయాతన అనుభవించిన, అనుభవిస్తున్న మహిళలు ఈ సమాజంలో ఎందరో ఉన్నారు. మానసిక వేదన – సుదీర్ఘమైన ఆలోచనలు - నిద్రలేని రాత్రులు- కన్నీళ్లు – అవమాన భారం ...ఇదే వారి జీవితం. రాంబాబు లాంటి మగవాళ్లు సుఖంగా జీవించలేరు. భార్యాబిడ్డలను  సుఖంగా జీవించనివ్వరు.
 
       ఆత్మాభిమానం గల ఓ మహిళ తీసుకునే నిర్ణయమే ఇందులో సావిత్రి తీసుకుంది. జీవితాన్ని గౌరవంగా నెగ్గుకొచ్చింది. కథని చాలా చక్కగా ముగించారు.  పూలకు, పూల తోటకు సావిత్రికి ఉన్న సంబంధంలో ఎంతో స్వచ్ఛత ఉంది. ఆ బంధం అనిర్వచనీయమైంది.

ఈనాడు ఆదివారం అనుబంధంలో వచ్చిన కథ మీ కోసం 






ఏపీలో భారీ పెట్టుబడులతో 44 మెగా ప్రాజెక్టులు

·       రూ.2,38,761 కోట్ల పెట్టుబడులు
·       11 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు
·       5 బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ ప్రాజెక్టులు
·       3 సిమెంట్ ఫ్యాక్టరీలు

      రాష్ట్రం పారిశ్రామిక హబ్ గా రూపొందడానికి సమాయత్తమవుతోంది. ప్రభుత్వం అనుసరించే విధానాలు, సమకూర్చే మౌలిక సదుపాయా వల్ల ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలో రాష్ట్రం నెంబర్ స్థానం పొందింది. దాంతో ఇక్కడ మెగా ప్రాజెక్టులు నెలకొల్పేందుకు బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వివిధ రంగాలకు సంబంధించి గడచిన ఏడాదిన్నర కాలంలో 44 మెగా ప్రాజెక్టుల స్థాపనకు అనుమతి కోరుతూ సింగిల్ డెస్క్ కు దరకాస్తులు వచ్చాయి. ఈ ప్లాంట్ల నిర్మాణానికి, మిషనరీకి 2,38,761 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయా కంపెనీలు తెలిపాయి.
మెగా ప్రాజెక్టులలో పవర్ జనరేషన్ కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. రూ.28,464 కోట్లతో 11 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నారు. ఆ తరువాత రూ.26,040 కోట్లతో 5 బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ ప్రాజెక్టులు  ఏర్పాటు చేయనున్నారు. రూ.4,600 కోట్లతో డిఫెన్స్ అండ్ ఎరో ప్రాజెక్టు నిర్మిస్తారు. రూ.3,172 కోట్లతో మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కోరారు. రూ.1,726 కోట్లతో ఆహారం, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల శుద్ధి కర్మాగారాలు మూడు నెలకొల్పుతారు.  రూ.873 కోట్లతో ఆటో విడి భాగాల ఉత్పత్తి ఫ్యాక్టరీలు రెండు, రూ.811 కోట్లతో రెండు  కెమికల్, పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీలు, రూ.304 కోట్లతో టెక్స్ టైల్ పరిశ్రమ నెలకొల్పడానికి అనుమతులు పొందారు. ఇక రూ. 1,72,771 కోట్ల పెట్టుబడులతో ఇంజనీరింగ్, ఐటీ, యంత్రపరికరాల తయారీ, సెరామిక్స్, మినరల్స్, స్టోన్ క్రషర్, పైప్స్ ఉత్పత్తి వంటి ఫ్యాక్టరీలు ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతులు కోరారు.

ప్రముఖ సంస్థల ప్రాజెక్టులు
         అనుమతులు పొందిన, పొందవలసిన వాటిలో పేరుపొందిన ప్రముఖ సంస్థలే ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(జీఏఐఎల్), హిందూజా నేషనల్ పవర్ కార్పోరేషన్, ఏషియన్ పెయింట్స్,  ఎమ్మెన్నార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సిటీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మా ఇండస్ట్రీస్(సెరామిక్స్), ఏపీ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్, దయానిధి సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కేకేఆర్ గ్రూప్ కు చెందిన ఎస్బీక్యూ స్టీల్స్, శ్రీ సత్యలక్ష్మి స్టోన్ క్రషర్స్, శెట్టినాడు సిమెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, కేసీపీ సిమెంట్స్, అరవిందో ఫార్మా లిమిటెడ్, మోండెల్జ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోకెమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి.

14 రోజుల్లో అనుమతులు
            ఒక పరిశ్రమ స్థాపించడానికి అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువు, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా 20 నుంచి 30 రకాల అనుమతులు పొందాలి. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతుల పొందాలి. ఈ అనుమతులు పొందడానికి గతంలో అయితే సుదీర్ఘ కాలం పట్టేది. ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  సింగిల్ డెస్క్ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజులలోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులకు కావలసిన ఫ్యాక్టరీ ప్లాన్, భవన నిర్మాణాలకు అనుమతి, పట్టణ, గ్రామీణ ప్రణాళికా శాఖ, గాలి, నీరు చట్టాలకు సంబంధించి రెడ్ క్యాటగిరీ, ఆరంజ్ క్యాటగిరి, పవర్ ఫీజుబిలిటీ సర్టిఫికెట్,  బాయిలర్ ఎరక్షన్ సర్టిఫికెట్, విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, ప్రమాదకర వ్యర్థాలకు సంబంధించి, కొత్త బావుల తవ్వకం, అగ్నిమాపకదళం, వ్యాట్, సీఎస్టీ  రిజిస్ట్రేషన్, 11కేవీ లేక 35 కేవీ విద్యుత్ సరఫరా వంటి అనుమతులు చాలా వరకు మంజూరు చేశారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆయా శాఖలు కోరిన విధంగా కంపెనీలను వివరణ కోరారు.
ఈ ప్రాజెక్టులు అన్నీ కార్యరూపం దాల్చితే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉపాధికి కొదవ ఉండదు. లక్ష్యాల మేరకు రాష్ట్రం ఆర్థిక వృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.
 జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
 apspecialnews@gmail.com


రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు

అత్యుత్తమ పారిశ్రామిక విధానాల ఫలితం

  రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు - ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం - సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం – అపార ఖనిజ సంపద – విమానాశ్రయాల నిర్మాణం – పోర్టులు, జలరవాణాకు అనుకూలత - నిరంతరం విద్యుత్ సరఫరా – తగినంత నీరు అందుబాటులో ఉండటం - మౌలిక సదుపాయాల కల్పన – పారిశ్రామిక టౌన్ షిప్స్ ఏర్పాటు - పెట్టుబడులకు అనుకూల వాతావరణం – సింగిల్ విండో ద్వారా కేవలం 14  రోజుల్లో అనుమతులు – డిజిటలైజేషన్ లో ముందుండటం – పరిపాలనలో ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగించడం - భూముల కేటాయింపు - అనేక ప్రోత్సాహకాలు - అపరిమిత మానవ వనరులు  ఉన్న కారణంగా పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.  పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రంలోనూ, విదేశీ పర్యటనలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చైనా, జపాన్‌, సింగపూర్‌, ఆస్ర్టేలియా, యూకే, బెల్జియం, మలేషియా, రష్యా, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య ప్రతినిధుల బృందాలతో చర్చలు జరిపారు. దాదాపు 26 దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. భారీ పెట్టుబడులు, ఉపాధికి ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది.
    రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ముందుకొచ్చింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. చైనాకు చెందినదే ప్రముఖ  మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కంపెనీ అప్పో ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పే యూనిట్ ద్వారా 25వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూనిట్  ఏర్పాటుకు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మొబైల్) ఎరిక్ అంగీకారం తెలిపారు. ఈ కంపెనీ 2014లో నోయిడాలో ఒక ప్లాంట్ ను నెలకొల్పింది. మొబైల్ ఫోన్ల తయారీలో చైనాలో అగ్రగామి సంస్థ ఫ్యాక్స్‌ కాన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. ఈ సంస్థ ఏటా 5 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది.
స్విట్జర్లాండ్‌కు చెందిన మెడ్‌టెక్ ఇన్నొవేషన్ పార్టనర్స్’ (ఎంటీఐపీ) బయోటెక్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదిక చేసుకోవాలని నిర్ణయించింది. డిజిటల్ వైద్య చికిత్స ఉపకరణాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపకరించే పరికరాల తయారీలో ఈ సంస్థ పేరుగాంచింది. బయోటెక్-బయోమెడికల్ ఇంజినీరింగ్, వైద్య సేవల్లో స్వయం సంవృద్ధి సాధించడమే కాకుండా  స్విస్ ఇన్నోవేషన్ పార్క్ పునర్‌నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించింది. అంతే కాకుండా ఈ సంస్థకు యూనివర్సిటీతో పాటు పరిశోధనా కేంద్రం కూడా ఉంది.  ఈ సంస్థ రాష్ట్రానికి రావడం ద్వారా రాబోయే పదేళ్లలో 75 వేల నుంచి 95 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అంచనా.

కుప్పంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్
   చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.700 కోట్లతో రోజుకు 100 మెట్రిక్ టన్నుల  ప్రాసెసింగ్ సామర్ధ్యంతో రష్యా భాగస్వామ్యంతో  కూరగాయలు, పండ్ల శుద్ధి కర్మాగారం ఏర్పాటు కానుంది. రష్యాకు చెందిన నెవ్‌సాక్యా-కో రష్యా’, రాష్ట్రానికి చెందిన శివసాయి గ్రూప్ సంయుక్తంగా  నెలకొల్పే ఈ కర్మాగారంలో టొమేటోతో పాటు ఉల్లి, మిర్చిని  ప్రాసెసింగ్ చేస్తారు.  నెవ్‌సాక్యా-కో రష్యా కంపెనీ సెయింట్ పీటర్స్ బర్గ్ కేంద్రంగా దిగుమతులు, పంపిణీ వ్యాపారంలో రష్యా అంతటా విస్తరించింది. ఏటా 3.6 లక్షల టన్నుల ఉత్పత్తుల దిగుమతి సామర్ధ్యం ఈ కంపెనీకి ఉంది. శివసాయి గ్రూప్  తొమ్మిదేళ్లుగా ఉత్పత్తి, ఎగుమతి రంగాల్లో, ప్రత్యేకించి ఆహార శుద్ధి రంగంలో, పండ్ల ఎగుమతిలో  రష్యాతో కలసి పనిచేస్తోంది.  ఈ రెండు సంస్థలు మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. కడపలో గతంలో బ్రాహ్మణి స్టీల్స్ కు కేటాయించిన స్థలంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థలం కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలో ఉంటుంది.

కువైట్ కేంద్రంగా గల్ఫ్ దేశాలలో ప్రశిద్ధిగాంచిన కువైట్‌ డానిష్‌ డెయిరీ(కేడీడీ) కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తోంది. తిరుపతిలో కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, థీమ్‌ పార్కులను ఒకే చోట నిర్మించాలన్న ప్రతిపాదన  బెల్జియం వాణిజ్య ప్రతినిధుల బృందం పరిశీలనలో ఉంది. రాష్ట్ర  ఐటి, సమాచార, పౌరసంబంధాల శాఖ  మంత్రి పల్లె రఘునాధరెడ్డి అమెరికా పర్యటనలో దాదాపు 15కు పైగా యుఎస్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అనంతపూర్ లో 650 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ సెక్టార్ ను స్థాపించేందుకు అమెరికన్ హిల్లార్డ్ కంపెనీ రూ.3,600 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. క్లౌడ్ రాక్ సంస్థ, ఆర్కిటెక్ట్ డొమైన్ డాట్ కామ్ కంపెనీలు తిరుపతిలో, గ్లామ్ టెక్ కంపెనీ ప్రకాశం జిల్లా మేదరమెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 

     ఇప్పటికే చిత్తూరు జిల్లా శ్రీసిటీలో జపాన్ కు చెందిన అగ్రగామి వాహన తయారీ సంస్థ ఇసుజు 107 ఎకరాల స్థలంలో కార్ల తయారీ ప్లాంట్ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్ ఏడాదికి 50,000 వాహనాల  తయారీ సామర్థ్యం కలిగి ఉంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని 1,20,000 వాహనాలకు పెంచాలన్నది ఇసుజు మోటార్స్ ఇండియా లక్ష్యం. ఈ సంస్థ దశల వారీగా రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.  అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మాండెల్జ్ ఇంటర్నేషనల్(క్యాడ్బరీ) చాక్లెట్ ఫ్యాక్టరీని కూడా శ్రీసిటీలో ప్రారంభించారు. 134 ఎకరాల్లో రూ.1000 కోట్ల పెట్టుబడితో తొలి దశ నిర్మాణం చేపట్టారు. ఆసియా-పసిఫిక్ లోనే అతిపెద్ద చాక్లెట్ కర్మాగారంగా దీనిని తీర్చిదిద్దుతారు.

ప్రభుత్వం అనుసరించే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, ఇక్కడి పారిశ్రామిక అనుకూలతల వల్ల విదేశీ పెట్టుబడులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టులు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా ఉంటుంది.


జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...