Dec 13, 2016

రాజధాని నిర్మాణానికి బాండ్స్ ద్వారా నిధుల సేకరణ

v  9వ తేదీ వరకు ఆర్ఎఫ్ పీల స్వీకరణ
v వివిధ మార్గాలలో నిధుల సమీకరణ
v మసాలా బాండ్లకు ప్రయత్నాలు
v ఇప్పటి వరకు 2, 26, 554 మంది ప్రజల భాగస్వామ్యం
v మూడేళ్లలో రాజధానికి ఒక రూపం

           నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మహానగర నిర్మాణం కోసం బాండ్స్ ద్వారా కూడా నిధులు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆహ్వానించిన ప్రకారం బ్యాంకుల నుంచి వచ్చిన టెండర్లను ఈ నెల 9న తెరుస్తారు. గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాజధాని మహా నగరాన్ని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వేగంగా నిర్మాణ పనులు కొనసాగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. రాజధానిలో  వివిధ అంశాలకు సంబంధించి 9 నగరాలను నిర్మించదలచిన విషయం తెలిసిందే. ఆధునిక అమరావతి నిర్మాణానికి ప్రపంచదేశాలు సింగపూర్, మలేషియా, చైనా, జపాన్, బ్రిటన్, రష్యా, చైనా, ఆస్థానా వంటి అనేక దేశాలు  సహాయ సహకారాలు అందించడానికి తమ సంసిద్ధత తెలిపాయి.

మూడేళ్లలో రాజధానికి ఒక రూపం
      తాజా అంచనాల ప్రకారం రాజధానిని బ్లూ-గ్రీన్ (జలకళ-పచ్చదనం) నగరంగా అభివృద్ధి చేయడానికి రూ.58 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఇందులో 70 శాతం నిధులను రాబోయే మూడేళ్లలో ఖర్చుచేసి రాజధానికి ఒక రూపం తీసుకురావలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఇదే కాలంలో రాయలసీమలోని అనంతపురం – కర్నూలు -కడపల  నుంచి అమరావతికి రూ.27,600 కోట్ల అంచనా వ్యయంతో ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. అత్యధిక నిధులు మౌలిక సదుపాయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇందులో కొన్ని ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతుల్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదానికి, పర్యవేక్షణకు ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేస్తారు.  రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవడానికి ఆసక్తి చూపే దేశాలను ఇందులో భాగస్వాములను చేస్తారు.  మిశ్రమ ప్రాయోజక అభివృద్ధి (మిక్స్‌డ్‌ యూజ్‌ డెవలప్‌మెంట్‌), సాంఘిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారు.  కట్టడాల నిర్మాణంలో ఉపయోగించే సామాగ్రికి కొరతలేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ సామాగ్రి ఎంత అవసరమో, ఎక్కడ నుంచి తెప్పించాలో వంటి విషయాలపై కూడా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న 25 రెవెన్యూ గ్రామాలలో కూడా రూ.2,537 కోట్లతో మౌలికసదుపాయాలు కల్పిస్తారు.  

వివిధ మార్గాలలో నిధుల సేకరణ
      నిర్మాణానికి వివిధ మార్గాలలో నిధులు సేకరించడానికి ఏపీసీఆర్డీఏ (ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) తగిన ఏర్పాట్లు చేస్తోంది. అమరావతి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ప్రపంచ బ్యాంకు(ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకంనస్ట్రక్షన్ అండ్ డవలప్ మెంట్), ఆసియా మౌలికవసతుల పెట్టుబడి బ్యాంకు (ఎఐఐబీ), భారత ప్రభుత్వ సంస్థ హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్) నిధులు సమకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణానికి నిధులు కొరతలేకుండా చూడాలన్న  సీఎం ఆదేశాలు, కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) సూచించిన మేరకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా ఏపీసీఆర్డీఏ నిధులు సేకరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.  ప్రాజెక్టులు, జాతీయ పెట్టుబడి సంస్థల నుంచి అవసరమైన నిధుల సమీకరించే ప్రయత్నంలో ఉంది. దానికి తోడు బాండ్ల ద్వారా కూడా నిధులు సేకరించాలని నిర్ణయించింది. ఈ బాండ్లు తీసుకునే వారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్స్ ద్వారా రెండు వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమకూరుతాయని అంచనా.  ఇందుకోసం మర్చంట్ బ్యాంకుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తూ గత నెల 23 నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఆర్ఎఫ్ పీ(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్)లను స్వీకరిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఆర్ఎఫ్ పీలను తెరుస్తారు. ఈ నెల 12వ తేదీన అర్హత గల సంస్థలను, 13 తేదీన సాంకేతికంగా అర్హత గల సంస్థలను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక పరమైన ప్రతిపాదనలను ఈ నెల 14వ తేదీ ఉదయం 10 గంటలకు తెరుస్తారు. అంతేకాకుండా అమరావతి నిర్మాణానికి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మసాలా బాండ్ల (రూపీ-డినామినేటెడ్ బాండ్లు) రూపంలో  నిధులు సేకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.

ప్రజా భాగస్వామ్యం : ప్రజారాజధాని నిర్మాణంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్న సీఎం పిలుపుని అందుకుని ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా లక్షల మంది విరాళాలు అందజేస్తున్నారు. అమరావతి వెబ్ సైట్ ద్వారా దేశవిదేశాలలోని తెలుగు ప్రజలు ఒక్కో ఇటుక పది రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 6వ తేదీ మంగళవారం  మధ్యాహ్నం వరకు ‘నా ఇటుక- నా అమరావతి’ ద్వారా 2,26,554 మంది 56,27,184 ఇటుకలు కొనుగోలు చేశారు.
  
జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...