Dec 5, 2016

ఏపీలో భారీ పెట్టుబడులతో 44 మెగా ప్రాజెక్టులు

·       రూ.2,38,761 కోట్ల పెట్టుబడులు
·       11 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు
·       5 బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ ప్రాజెక్టులు
·       3 సిమెంట్ ఫ్యాక్టరీలు

      రాష్ట్రం పారిశ్రామిక హబ్ గా రూపొందడానికి సమాయత్తమవుతోంది. ప్రభుత్వం అనుసరించే విధానాలు, సమకూర్చే మౌలిక సదుపాయా వల్ల ‘ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలో రాష్ట్రం నెంబర్ స్థానం పొందింది. దాంతో ఇక్కడ మెగా ప్రాజెక్టులు నెలకొల్పేందుకు బహుళ జాతి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వివిధ రంగాలకు సంబంధించి గడచిన ఏడాదిన్నర కాలంలో 44 మెగా ప్రాజెక్టుల స్థాపనకు అనుమతి కోరుతూ సింగిల్ డెస్క్ కు దరకాస్తులు వచ్చాయి. ఈ ప్లాంట్ల నిర్మాణానికి, మిషనరీకి 2,38,761 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయా కంపెనీలు తెలిపాయి.
మెగా ప్రాజెక్టులలో పవర్ జనరేషన్ కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. రూ.28,464 కోట్లతో 11 పవర్ జనరేషన్ ప్రాజెక్టులు నెలకొల్పనున్నారు. ఆ తరువాత రూ.26,040 కోట్లతో 5 బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్ ప్రాజెక్టులు  ఏర్పాటు చేయనున్నారు. రూ.4,600 కోట్లతో డిఫెన్స్ అండ్ ఎరో ప్రాజెక్టు నిర్మిస్తారు. రూ.3,172 కోట్లతో మూడు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అనుమతులు కోరారు. రూ.1,726 కోట్లతో ఆహారం, వ్యవసాయ, సముద్ర ఉత్పత్తుల శుద్ధి కర్మాగారాలు మూడు నెలకొల్పుతారు.  రూ.873 కోట్లతో ఆటో విడి భాగాల ఉత్పత్తి ఫ్యాక్టరీలు రెండు, రూ.811 కోట్లతో రెండు  కెమికల్, పెట్రోకెమికల్స్ ఫ్యాక్టరీలు, రూ.304 కోట్లతో టెక్స్ టైల్ పరిశ్రమ నెలకొల్పడానికి అనుమతులు పొందారు. ఇక రూ. 1,72,771 కోట్ల పెట్టుబడులతో ఇంజనీరింగ్, ఐటీ, యంత్రపరికరాల తయారీ, సెరామిక్స్, మినరల్స్, స్టోన్ క్రషర్, పైప్స్ ఉత్పత్తి వంటి ఫ్యాక్టరీలు ప్రారంభించడానికి ప్రభుత్వ అనుమతులు కోరారు.

ప్రముఖ సంస్థల ప్రాజెక్టులు
         అనుమతులు పొందిన, పొందవలసిన వాటిలో పేరుపొందిన ప్రముఖ సంస్థలే ఉన్నాయి.  కేంద్ర ప్రభుత్వ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(జీఏఐఎల్), హిందూజా నేషనల్ పవర్ కార్పోరేషన్, ఏషియన్ పెయింట్స్,  ఎమ్మెన్నార్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్, సిటీ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, పద్మా ఇండస్ట్రీస్(సెరామిక్స్), ఏపీ పవర్ జనరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్, దయానిధి సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కేకేఆర్ గ్రూప్ కు చెందిన ఎస్బీక్యూ స్టీల్స్, శ్రీ సత్యలక్ష్మి స్టోన్ క్రషర్స్, శెట్టినాడు సిమెంట్ కార్పోరేషన్ లిమిటెడ్, కేసీపీ సిమెంట్స్, అరవిందో ఫార్మా లిమిటెడ్, మోండెల్జ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్లోకెమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి సంస్థలు ఉన్నాయి.

14 రోజుల్లో అనుమతులు
            ఒక పరిశ్రమ స్థాపించడానికి అక్కడ ఉత్పత్తి అయ్యే వస్తువు, వాడే ముడిపదార్ధం, ప్రమాదకర వ్యర్థాల తీవ్రత తదితర అంశాల ఆధారంగా 20 నుంచి 30 రకాల అనుమతులు పొందాలి. పరిశ్రమల శాఖ మొదలుకొని కాలుష్యం నియంత్రణ, విద్యుత్, పౌరసరఫరాలు, అటవీ, భూగర్భజలాలు, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, మునిసిపాలిటీ, పంచాయతీరాజ్, వాణిజ్యపన్నులు, రెవెన్యూ, జలవనరులు, కార్మిక, బాయిలర్, సీఏటీ, సీఎస్టీ తదితర అనుమతుల పొందాలి. ఈ అనుమతులు పొందడానికి గతంలో అయితే సుదీర్ఘ కాలం పట్టేది. ఇప్పుడు  ఆ జాప్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  సింగిల్ డెస్క్ విధానం ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా కావలసిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 14 రోజులలోనే అనుమతులు మంజూరు చేస్తున్నారు. మెగా ప్రాజెక్టులకు కావలసిన ఫ్యాక్టరీ ప్లాన్, భవన నిర్మాణాలకు అనుమతి, పట్టణ, గ్రామీణ ప్రణాళికా శాఖ, గాలి, నీరు చట్టాలకు సంబంధించి రెడ్ క్యాటగిరీ, ఆరంజ్ క్యాటగిరి, పవర్ ఫీజుబిలిటీ సర్టిఫికెట్,  బాయిలర్ ఎరక్షన్ సర్టిఫికెట్, విద్యుత్ శాఖ, గ్రామ పంచాయతీ, ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్, ప్రమాదకర వ్యర్థాలకు సంబంధించి, కొత్త బావుల తవ్వకం, అగ్నిమాపకదళం, వ్యాట్, సీఎస్టీ  రిజిస్ట్రేషన్, 11కేవీ లేక 35 కేవీ విద్యుత్ సరఫరా వంటి అనుమతులు చాలా వరకు మంజూరు చేశారు. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఆయా శాఖలు కోరిన విధంగా కంపెనీలను వివరణ కోరారు.
ఈ ప్రాజెక్టులు అన్నీ కార్యరూపం దాల్చితే పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. యువతకు ఉపాధికి కొదవ ఉండదు. లక్ష్యాల మేరకు రాష్ట్రం ఆర్థిక వృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది.
 జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
 apspecialnews@gmail.com


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...