Dec 5, 2016

యుద్ధప్రాతిపదికన ఈ-పోస్ మిషన్ల ఏర్పాటు

§  ప్రభుత్వ శాఖలకు 7,832 ఈ-పోస్ మిషన్ల సరఫరా
§  వాణిజ్య పన్నుల శాఖలో అత్యధిక మిషన్లు
§  64,672 ఈ-పోస్ మిషన్ల అవసరం
§  గ్రామీణ ప్రాంతాలలో విస్తృతంగా వినియోగానికి ఏర్పాట్లు


                పెద్ద నోట్ల చలామణిపై ఆంక్షల విధింపు, కొత్త నోట్ల కొరత వల్ల రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపట్టింది. నోట్ల కొరతను అధిగమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పక్క ఎప్పటికప్పుడు రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడి రాష్ట్రానికి నగదు తెప్పిస్తున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉజ్జిత్ పటేల్ తో మాట్లాడి శుక్రవారం రెండు ప్రత్యేక విమానాల్లో రూ.2,420 కోట్ల విలువైన నోట్లు రప్పించారు. రాత్రంతా నిద్ర కూడా పోకుండా 13 జిల్లాలకు నగదు పంపించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరో పక్క ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలలో  ఈ-పోస్ (పీఓఎస్- పాయింట్ ఆఫ్ సేల్) మిషన్లు (ప్రింటర్లు) ద్వారా నగదురహిత లావా దేవీలు జరిపేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించారు.  వాటిని రాష్ట్రం వ్యాప్తంగా తక్షణం అమలు చేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలకు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్), పీఓపీ (పాయింట్ ఆఫ్ పర్చేజ్), ఎం-పీఓఎస్(మొబైల్ పోస్),ఎఫ్-పీఓస్(ఫింగర్ ప్రింట్ పోస్), డిజిటల్ సెక్యూర్ పోస్ (స్మార్ట్ ఫోన్ ద్వారా ఉపయోగించేది), కార్డ్ రీడర్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో ఈ మిషన్ల వాడకం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులలో వీటి వాడకాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 వివిధ ప్రభుత్వ శాఖలలో ప్రస్తుతం వాడుతున్న మిషన్లు కాకుండా 64,678 ఈ-పోస్ మిషన్లు అవసరం కాగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 20 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన  7,835 మిషన్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చిన్నాపెద్దా అన్ని రకాల వాణ్యిజ్య సంస్థలలో కూడా ఈ మిషన్లను వాడే ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలలో  పెట్రోల్ బంకులు, హోటళ్లు, బార్లు, వైన్ షాపులు, వివిధ రకాల షోరూమ్స్, షాపింగ్ మాల్స్ వంటి వాటిలో ఇప్పటికే వీటిని వినియోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా వీటిని విస్తృతంగా వినియోగించడానికి అటు చిన్నచిన్న వ్యాపారులకు, ఇటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల వర్తకుల వివరాలను సేకరించి వారికి ఇ-పోస్‌ మిషన్‌లు పంపిణీ చేసే ఏర్పా ట్లు చేస్తున్నారు.

ఈ-పోస్ మిషన్లు సరఫరా చేస్తున్న బ్యాంకులు
      నగదు రహిత లావాదేవీలు జరపడానికి ఈ-పోస్ మిషన్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అయితే కావలసినన్ని మిషన్లు ఉన్నపళంగా సరఫరా చేయడం సాధ్యం కాదు. సాధారణంగా ఈ మిషన్లను బ్యాంకులే అందజేస్తాయి. డిమాండ్ ఎక్కువగా ఏర్పడిన కారణంగా కొన్ని సాఫ్ట్ వేర్ సంస్థలు కూడా వీటిని సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు కావలసిన ఈ-పోస్ మిషన్లను బ్యాంకులు, సాఫ్ట్ వేర్ సంస్థలు సరఫరా చేస్తున్నాయి. వాణిజ్య పన్నుల శాఖలో 19వేల మిషన్లు అవసరం కాగా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 13 వేలు, ఆంధ్రా బ్యాంక్ 2,180 సరఫరా చేస్తానికి అంగీకరించాయి. ఇప్పటికే ఈ శాఖలో 6,238 మిషన్లు ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖకు 7,500 మిషన్లు అవసరం కాగా, డిజిట్ సెక్యూర్ పోస్ మిషన్లు 2,500, కార్డ్ రీడర్స్ 5 వేలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 281 మిషన్లు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఆర్టీసీలో 5వేల మిషన్లు అవసరం కాగా, ఎస్ బీఐ 3వేలు, హెచ్ డీఎఫ్ సీ రెండు వేలు మిషన్లు పెడతాయి. ఇప్పటికే 265 మిషన్లు ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాలలోని మీసేవ కేంద్రాలకు అవసరమైన 880 మిషన్లను యాక్సెస్ బ్యాంకు ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే 154 ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలలోని మీ సేవ కేంద్రాలకు అవసరమైన 3,088 మిషన్లను పేనియర్ సొల్యూషన్స్ సంస్థ సరఫరా చేస్తుంది. ప్రస్తుతానికి 260 ఏర్పాటు చేశారు. ఏపీ ఆన్ లైన్ కేంద్రాలకు కావలసిన 13 వందల మిషన్లను పిన్ ల్యాబ్స్ సంస్థ పరఫరా చేస్తుంది. ఇప్పటికే ఈ కేంద్రాలలో 80 మిషన్లను ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ శాఖకు అవసరమైన 240 మిషన్లను ఎస్ బీఐ అందజేస్తుంది.  ఇప్పటికే 40 మిషన్లను సరఫరా చేసింది. సివిల్ సప్లైస్ లోని గ్యాస్ డీలర్లకు కావలసిన 820 మిషన్లను ఆంధ్రాబ్యాంక్ సరఫరా చేస్తుంది. అలాగే మరో పది వేల మొబైల్ పోస్ మిషన్లను కూడా ఆంధ్రాబ్యాంక్ అందజేస్తుంది. గ్రామాలలోని షాపుల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కావలసిన 5 వేల మిషన్లలో ఎస్ బీఐ రెండు వేలు, ఐసీఐసీఐ వెయ్యి మిషన్లను సరఫరా చేస్తాయి. రైతు బజార్లు, చెక్ పోస్టుల వద్ద 2,500 మిషన్లు కావలసి ఉంది. వాటిలో రెండు వేలు ఎస్ బీఐ, 500 ఆంధ్రాబ్యాంకు అందజేస్తాయి. ఇప్పటికే 95 మిషన్లను ఏర్పాటు చేశారు. కార్మిక శాఖకు కావలసిన 19 వేల మిషన్లను విజన్ టెక్ సంస్థ 15వేలు, అనలాజిక్ సంస్థ నాలుగు వేలు సరఫరా చేస్తాయి. ఈ శాఖలో శుక్రవారం ఒక్క రోజే 294 మిషన్లు ఏర్పాటు చేశారు. ఏపీఈపీడీసీఎల్(ఈస్టరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) కావలసిన 350 మిషన్లను పిన్ ల్యాబ్ సంస్థ సరఫరా చేస్తుంది. ప్రస్తుతం 128 మిషన్లు ఏర్పాటు చేశారు.

వాణిజ్య పన్నుల శాఖలో అత్యధిక మిషన్లు
       ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖలలో ఒకటైన వాణిజ్య పన్నుల శాఖలో అత్యధిక ఈ-పోస్ మిషన్లు ఉన్నాయి. ఈ శాఖలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 33,022 మిషన్లు ఉన్నాయి. మరో 20,235 మిషన్ల అవసరం ఉంది. పెద్ద నోట్లపై ఆంక్షలు విధించిన నవంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ శాఖలో యుద్ధ ప్రాతిపదికన 6,238 మిషన్లు ఏర్పాటు చేశారు.  శుక్రవారం ఒక్క రోజులోనే 428 మిషన్లు ఏర్పాటు చేశారు.
 జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...