Dec 5, 2016

రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులు

అత్యుత్తమ పారిశ్రామిక విధానాల ఫలితం

  రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు - ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం - సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం – అపార ఖనిజ సంపద – విమానాశ్రయాల నిర్మాణం – పోర్టులు, జలరవాణాకు అనుకూలత - నిరంతరం విద్యుత్ సరఫరా – తగినంత నీరు అందుబాటులో ఉండటం - మౌలిక సదుపాయాల కల్పన – పారిశ్రామిక టౌన్ షిప్స్ ఏర్పాటు - పెట్టుబడులకు అనుకూల వాతావరణం – సింగిల్ విండో ద్వారా కేవలం 14  రోజుల్లో అనుమతులు – డిజిటలైజేషన్ లో ముందుండటం – పరిపాలనలో ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వంటి అత్యంత ఆధునిక టెక్నాలజీని వినియోగించడం - భూముల కేటాయింపు - అనేక ప్రోత్సాహకాలు - అపరిమిత మానవ వనరులు  ఉన్న కారణంగా పెట్టుబడుల ప్రవాహం మొదలైంది.  పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రంలోనూ, విదేశీ పర్యటనలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చైనా, జపాన్‌, సింగపూర్‌, ఆస్ర్టేలియా, యూకే, బెల్జియం, మలేషియా, రష్యా, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు వాణిజ్య ప్రతినిధుల బృందాలతో చర్చలు జరిపారు. దాదాపు 26 దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. భారీ పెట్టుబడులు, ఉపాధికి ఎక్కువగా అవకాశం ఉన్న ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్రద్ధ వహిస్తోంది.
    రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చైనా ప్రభుత్వరంగంలోని అతిపెద్ద ఉక్కు కంపెనీ అన్‌స్టీల్‌ ముందుకొచ్చింది. 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. చైనాకు చెందినదే ప్రముఖ  మొబైల్ ఫోన్ల ఉత్పత్తి కంపెనీ అప్పో ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. ఈ కంపెనీ వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడితో నెలకొల్పే యూనిట్ ద్వారా 25వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. రాష్ట్రంలో యూనిట్  ఏర్పాటుకు ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (మొబైల్) ఎరిక్ అంగీకారం తెలిపారు. ఈ కంపెనీ 2014లో నోయిడాలో ఒక ప్లాంట్ ను నెలకొల్పింది. మొబైల్ ఫోన్ల తయారీలో చైనాలో అగ్రగామి సంస్థ ఫ్యాక్స్‌ కాన్ ఫెసిలిటీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. ఈ సంస్థ ఏటా 5 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది.
స్విట్జర్లాండ్‌కు చెందిన మెడ్‌టెక్ ఇన్నొవేషన్ పార్టనర్స్’ (ఎంటీఐపీ) బయోటెక్‌ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదిక చేసుకోవాలని నిర్ణయించింది. డిజిటల్ వైద్య చికిత్స ఉపకరణాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఉపకరించే పరికరాల తయారీలో ఈ సంస్థ పేరుగాంచింది. బయోటెక్-బయోమెడికల్ ఇంజినీరింగ్, వైద్య సేవల్లో స్వయం సంవృద్ధి సాధించడమే కాకుండా  స్విస్ ఇన్నోవేషన్ పార్క్ పునర్‌నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించింది. అంతే కాకుండా ఈ సంస్థకు యూనివర్సిటీతో పాటు పరిశోధనా కేంద్రం కూడా ఉంది.  ఈ సంస్థ రాష్ట్రానికి రావడం ద్వారా రాబోయే పదేళ్లలో 75 వేల నుంచి 95 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు అంచనా.

కుప్పంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్
   చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.700 కోట్లతో రోజుకు 100 మెట్రిక్ టన్నుల  ప్రాసెసింగ్ సామర్ధ్యంతో రష్యా భాగస్వామ్యంతో  కూరగాయలు, పండ్ల శుద్ధి కర్మాగారం ఏర్పాటు కానుంది. రష్యాకు చెందిన నెవ్‌సాక్యా-కో రష్యా’, రాష్ట్రానికి చెందిన శివసాయి గ్రూప్ సంయుక్తంగా  నెలకొల్పే ఈ కర్మాగారంలో టొమేటోతో పాటు ఉల్లి, మిర్చిని  ప్రాసెసింగ్ చేస్తారు.  నెవ్‌సాక్యా-కో రష్యా కంపెనీ సెయింట్ పీటర్స్ బర్గ్ కేంద్రంగా దిగుమతులు, పంపిణీ వ్యాపారంలో రష్యా అంతటా విస్తరించింది. ఏటా 3.6 లక్షల టన్నుల ఉత్పత్తుల దిగుమతి సామర్ధ్యం ఈ కంపెనీకి ఉంది. శివసాయి గ్రూప్  తొమ్మిదేళ్లుగా ఉత్పత్తి, ఎగుమతి రంగాల్లో, ప్రత్యేకించి ఆహార శుద్ధి రంగంలో, పండ్ల ఎగుమతిలో  రష్యాతో కలసి పనిచేస్తోంది.  ఈ రెండు సంస్థలు మహారాష్ట్రలో పలు ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. కడపలో గతంలో బ్రాహ్మణి స్టీల్స్ కు కేటాయించిన స్థలంలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థలం కృష్ణపట్నం పోర్టుకు దగ్గరలో ఉంటుంది.

కువైట్ కేంద్రంగా గల్ఫ్ దేశాలలో ప్రశిద్ధిగాంచిన కువైట్‌ డానిష్‌ డెయిరీ(కేడీడీ) కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనపరుస్తోంది. తిరుపతిలో కన్వెన్షన్‌ సెంటర్‌, ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, థీమ్‌ పార్కులను ఒకే చోట నిర్మించాలన్న ప్రతిపాదన  బెల్జియం వాణిజ్య ప్రతినిధుల బృందం పరిశీలనలో ఉంది. రాష్ట్ర  ఐటి, సమాచార, పౌరసంబంధాల శాఖ  మంత్రి పల్లె రఘునాధరెడ్డి అమెరికా పర్యటనలో దాదాపు 15కు పైగా యుఎస్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. అనంతపూర్ లో 650 మెగావాట్ల సోలార్, విండ్ పవర్ సెక్టార్ ను స్థాపించేందుకు అమెరికన్ హిల్లార్డ్ కంపెనీ రూ.3,600 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. క్లౌడ్ రాక్ సంస్థ, ఆర్కిటెక్ట్ డొమైన్ డాట్ కామ్ కంపెనీలు తిరుపతిలో, గ్లామ్ టెక్ కంపెనీ ప్రకాశం జిల్లా మేదరమెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 

     ఇప్పటికే చిత్తూరు జిల్లా శ్రీసిటీలో జపాన్ కు చెందిన అగ్రగామి వాహన తయారీ సంస్థ ఇసుజు 107 ఎకరాల స్థలంలో కార్ల తయారీ ప్లాంట్ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్ ఏడాదికి 50,000 వాహనాల  తయారీ సామర్థ్యం కలిగి ఉంది. వార్షిక తయారీ సామర్థ్యాన్ని 1,20,000 వాహనాలకు పెంచాలన్నది ఇసుజు మోటార్స్ ఇండియా లక్ష్యం. ఈ సంస్థ దశల వారీగా రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.  అమెరికాలోని ఇల్లినాయిస్ కేంద్రంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మాండెల్జ్ ఇంటర్నేషనల్(క్యాడ్బరీ) చాక్లెట్ ఫ్యాక్టరీని కూడా శ్రీసిటీలో ప్రారంభించారు. 134 ఎకరాల్లో రూ.1000 కోట్ల పెట్టుబడితో తొలి దశ నిర్మాణం చేపట్టారు. ఆసియా-పసిఫిక్ లోనే అతిపెద్ద చాక్లెట్ కర్మాగారంగా దీనిని తీర్చిదిద్దుతారు.

ప్రభుత్వం అనుసరించే అత్యుత్తమ పారిశ్రామిక విధానాలు, ఇక్కడి పారిశ్రామిక అనుకూలతల వల్ల విదేశీ పెట్టుబడులు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టులు రావడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా ఉంటుంది.


జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...