Dec 29, 2017

ఏపీలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి పెద్దపీట


      పేదల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. తల్లి-బిడ్డ క్స్ ప్రెస్, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఉచిత డయాలసిస్, చంద్రన్న సంచార చికిత్స, మహిళా మాస్టర్ హెల్త్ చెకప్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు వంటి వాటి ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. అన్ని స్థాయిల్లో ఆరోగ్య రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తోంది.  గర్భిణీల సంరక్షణలో తల్లి-బిడ్డ క్స్ ప్రెస్ విజయవంతంగా పని చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన తరువాత ప్రతి తల్లి, బిడ్డను తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్  ప్రత్యేక వాహనంలో వారి ఇంటికి చేరుస్తారు. ఆరోగ్య సౌకర్యాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. 2016 జనవరి 1 నుంచి రాష్ట్రంలో ఈ సేవలను ప్రారంభించారు. రాష్ట్రంలో ఈ వాహనాలు మొత్తం 279 ఉన్నాయి. 2017 డిసెంబర్ 15 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన తరువాత బాలింతలు 4,60,182 మందిని సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చారు.  జీవికే ఈఎంఆర్ఐ సంస్థ ఈ సేవలను అందజేస్తోంది. విజయవాడలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 102 కాల్ సెంటర్ ద్వారా తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ రవాణా సేవలను సమన్వయపరుస్తారు. ఈ సెంటర్ వారంలో ఏడు రోజులు, 24 గంటలూ పని చేస్తుంది. ఏ ల్యాండ్ లైన్ నుంచైనా, మొబైల్ నుంచైనా ఈ నెంబర్ కు కాల్ చేసి ఈ సేవలు ఫొందవచ్చు. 102 కాల్ సెంటర్ కు ఫోన్ వచ్చిన వెంటనే అది ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ప్రాంతంలోని తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందికి కాల్ చేసి ఆ గర్భిణీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు. 30 నిమిషాల్లో వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. అత్యధికంగా 96.02 శాతం మంది బాలింతను  తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్  ద్వారా వారి ఇళ్లకు చేర్చడంలో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అతి తక్కువగా 59.06 శాతం మంది బాలింతలను ఇంటికి చేర్చి శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది.
ఎన్టీఆర్ బేబీ కిట్ : ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన మహిళకు ఓ ఎన్టీఆర్ బేబీ కిట్ కూడా ఉచితంగా అందజేస్తారు. అందులో ఓ బేబి టవల్, బేబి బెడ్ జిప్ బ్యాగ్, చేతులు కడుక్కొనే ద్రవపదార్ధం(సోప్ వాటర్), గొడుగు/దోమ తెర, కిట్ బ్యాగ్ మొత్తం 5 వస్తువులు ఉంటాయి. బేబి టవల్ ( చిన్నారి శరీరానికి చుట్టే టవల్, తలకు పెట్టే టోపీ) చిన్నారి శరీరాన్ని వెచ్చగా, పొడిగా (తేమ లేకుండా) ఉంచి పొత్తిళ్లలోని అనుభూతికి కలిగిస్తుంది. దీని వల్ల శిశువు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, ఆరోగ్య సమస్యలు లేకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎదుగుతారు. బేబి బెడ్ జిప్ బ్యాగ్ (చిరు పరుపు, జిప్ బ్యాగ్) చిన్నారిని టవల్ లో చుట్టి, తలపై టోపీ పెట్టిన తరువాత పడుకోబెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. తరువాత జిప్ లాగివేసినట్లైతే శిశువు సరైన ఉష్ణోగ్రతలో ఉంటాడు. తల్లి బిడ్డను ఎత్తుకోవడానికి, ఒక చోట నుంచి మరోచోటకు మార్చడానికి సౌకర్యంగా ఉంటుంది. శిశువుకు అదనపు రక్షా కవచంగా ఉపయోపడుతుంది.  తల్లి బిడ్డను తాకాల్సిన ప్రతిసారి, పాలు పట్టించడానికి ముందర చేతులను శుభ్రపరుచుకోవడానికి  సోప్ వాటర్ ఉపయోగపడుతుంది. దీని వల్ల శిశువుకు తల్లి నుంచి వ్యాధికారక క్రిములు సంక్రమించకుండా నివారించవచ్చు. గొడుగు లేక దోమ తెర క్రిములు, కీటకాల నుంచి శిశువుని రక్షిస్తుంది.   ప్రాణాంతకమైన మలేరియా, డెంగీ, మెదడు వాపు వంటి వ్యాధుల నుంచి  కాపాడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన తల్లులు అందరికీ ఎన్టీఆర్ బేబి కిట్స్ ఇస్తారు.  నవంబర్ 2017 వరకు 3,67,463 మందికి ఈ కిట్స్ ఇచ్చారు.
ఉచిత డయాలసిస్: దీర్ఘ కాలంగా కిడ్నీ వ్యాధితో(సీకేడీ)తో బాధపడేవారికి చికిత్స చేయడానికి రాష్ట్రంలోని 32 ప్రభుత్వ ఆస్పత్రులలో జాతీయ ఉచిత డయాలసిస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పేదలకు ఉచిత డయాలసిస్ సేవలు అందించడానికి జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ఎం)లో భాగంగా 2016లో దీనిని ప్రారంభించారు.
 ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులలో, ఒక్క చిత్తూరులో తప్ప మిగిలిన అన్ని జిల్లా ఆస్పత్రులలో, ప్రతి జిల్లాలోని ఒక ఏరియా ఆస్పత్రిలో ఈ డయాలసిస్ కేంద్రాలు పని చేస్తున్నాయి. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఏహెచ్/సీహెచ్ సీ స్థాయిలో ఒక్కో దాంట్లో అదనంగా మరో మూడు కేంద్రాలు ఉన్నాయి. విశాఖలోని విమ్స్ లో కూడా ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 32 డయాలసిస్ కేంద్రాల్లో 2,600 మంది రోగులు ఈ సేవలు పొందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో క్రమం తప్పకుండా ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటారో వారికి నెలకు రూ. 2,500 పెన్షన్ కూడా అందజేస్తారు. రోగి వేతనాన్ని కోల్పోయినందున, మందులు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఈ పెన్షన్ ఇస్తారు. 2017 అక్టోబర్ నెలలోడయాలసిస్ చేయించుకుంటున్న 2338 మంది సీకేడీ రోగులకు పెన్షన్ అందజేశారు. అర్హత కలిగిన నెఫ్రాలజిస్ట్ ద్వారా డయాలసిస్ చేయించుకొనే అందరు దీర్ఘకాల కిడ్నీ వ్యాధి(సీకేడీ)గ్రస్తులకు ఉచిత డయాలసిస్ సేవలు అందుతాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్ చేయించుకునే అందరు సీకేడీ రోగులకు పెన్షన్ అందజేస్తారు. ఎనిమియా, హైపర్ టెన్షన్, డయాబెట్స్ వంటి  ఇతర వ్యాధులకు కూడా అన్ని రకాల డయాగ్నస్టిక్ పరీక్షలు, చికిత్స సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చేస్తారు. ఈ సేవల నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాల(సీడీసీ, అంట్లాంటా, యుఎస్ఏ)కు అనుగుణంగా ఉన్నాయా లేవా అనేది బయట ఏజన్సీ ఒకటి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. అర్హత కలిగిన నెఫ్రాలజిస్ట్ లు, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఈ డయాలసిస్ సేవలు అందజేస్తారు. డయాలసిస్ కోసం నమోదు చేయించుకోవడానికి రోగికి  ఒక్క రోజు సరిపోతుంది.  అర్హత కలిగిన నెఫ్రాలజిస్ట్ కావలసిన అన్ని పరీక్షలు చేసి, వ్యాధి స్థితిని సమీక్షించిన తరువాత డయాలసిస్ చేయడం మొదలుపెడతారు.
చంద్రన్న సంచార చికిత్స: ఆరోగ్య సౌకర్యాలు లేని ప్రాంతాల్లో చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా ప్రాధమిక చికిత్స అందిస్తారు. 5 కిలో మీటర్ల పరిధిలో ఆరోగ్య సౌకర్యం లేని 12 వేల ప్రాంతాలను గుర్తాంచారు. ఆ ప్రాంతాలకు ప్రతి నెల నిర్ధారించిన రోజున సంచార వైద్య బృందాలు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. మధుమేహం, రక్తపోటు, మూర్చ వంటి సాధారణ వ్యాధులను పరీక్షించి ఈ బృందం వైద్యం చేస్తుంది. దీనిని ప్రారంభించినప్పటి నుంచి 2017 అక్టోబర్ వరకు 2,44,843 వైద్య శిబిరాలు నిర్వహించారు. 70,41,319 మంది రోగులకు వైద్యసేవలు అందించారు. 23,03,866 వైద్య పరీక్షలు చేశారు. 50,23,292 ఔషదాలను అందజేశారు.
మహిళా మాస్టర్ హెల్త్ చెకప్: అంటు వ్యాధులు కాని (ఎన్ సీడీ) నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, విజన్, హార్మోన్ అస్థవ్యస్థతలు వంటి 7 ప్రధాన వ్యాధులు త్వరగా కనుగొనడం కోసం 30 ఏళ్ల పైబడిన మహిళలకు మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం కింద పరీక్షిస్తారు. ఎన్ సీడీల పరీక్షల కోసం 12 వేల మంది ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. అనుమానిత కేసులను రోగ నిర్ధారణ, చికిత్సల కోసం రాష్ట్రంలోని సంబంధిత 57  ఆస్పత్రులకు పంపుతారు. గత అక్టోబర్ వరకు 8,92,679 మంది మహిళలకు వివిధ రకాల పరీక్షలు చేశారు. వారిలో 30 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఎన్టీఆర్ వైద్య పరీక్షలు: ప్రభుత్వ ఆస్పత్రులలోని ల్యాబరేటరీల ద్వారా ఇప్పటికే కొనసాగుతున్న పరీక్షలకు అదనంగా ఎన్టీఆర్ వైద్య పరీక్షల సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్దతిలో వైద్య పరీక్షలు చేస్తారు. . 2016 జనవరి నుంచి అమలవుతున్న ఈ కార్యక్రమం వల్ల రోగికి ఆరోగ్య రక్షణ కల్పించడంతోపాటు వారికి వ్యయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 మథర్ ల్యాబ్ లతోపాటు 98 ప్రాసెసింగ్ ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. గత అక్టోబర్ వరకు 2,65,25,264 పరీక్షలు చేసి 88,78,632 మందికి ఈ సేవలు అందించారు.  దేశంలో ఇటువంటి లేబరేటరీ సేవలు ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏపీ.
ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు: పట్టణ పేదలకు, మురికివాడలలో నివసించేవారికి వైద్య సేవలు అందించడం కోసం  ఈ కార్యక్రమం ప్రారంభించారు. వారికి ఉచితంగా స్పెషాలిటీ సేవలు, పూర్తి కాల వైద్యాధికారి నుంచి నాణ్యమైన ఆరోగ్య రక్షణ లభిస్తుంది. 30 డయాగ్నస్టిక్ పరీక్షలు, మందుల సరఫరా, టెలీకన్సల్టెన్సీ ద్వారా స్పెషలిస్టుల సేవలతోపాటు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సేవలు 365 రోజులూ అందిస్తారు. అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కింద 28,48,092 మంది బయటి రోగులకు వైద్య సేవలు అందించారు. 1,69,381 టెలీకన్సల్టెన్సీలను నర్వహించారు. 5,33,754 ఇమ్మునైజేషన్లు పూర్తి చేశారు. బయోకెమిస్ట్రీ, క్లినికల్ పాథాలజీ, హెమటాలజీ వంటి టెస్ట్ లు దాదాపు 15 లక్షలు చేశారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ, గిరిజన ఆరోగ్యం వంటి పలు కార్యక్రమాల ద్వారా పేదలకు వైద్యసేవలు అందిస్తోంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914

ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ ఆధ్వర్యంలో రైతులకు 9 రోజుల శిక్షణ

ప్రభుత్వ సలహాదారు టి.విజయ కుమార్

        సచివాలయం, డిసెంబర్ 29:  ఆచార్యా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ప్రకృతి వ్యవసాయ ప్రాంగణంలో సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి జనవరి 8వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వ్వయసాయ రంగ సలహాదారు టి.విజయ కుమార్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించే ఈ శిక్షణా శిబిరానికి రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి 8వేల మంది రైతులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, వానపాములు అంతరించిపోవడం, భూసారం దెబ్బతినడం, ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు, బీజామృతం, ఘన, ధ్రవజీవామృతం తయారుచేయడం, చీడపీడల నుంచి రక్షణ కల్పించే పద్దతులు, వివిధ పంటలకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అంతర్ పంటల సాగు వంటి అంశాలలో శిక్షణ ఇస్తారు.  ప్రకృతి వ్యవసాయానికి మళ్లకపోతే మరో 200 ఏళ్లకు భూసారం పూర్తీగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించినట్లు చెప్పారు.  రైతులు, వినియోగదారుల సంక్షేమం, భూసారం పెంచడానికి వినూత్న పద్దతిలో  ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చని, దీర్ఘకాలంలో రైతులు లాభపడతారని చెప్పారు. రసాయన రహిత ఆహార పదార్ధాలు అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమానికి 5 ఏళ్ల వరకు 700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రీయ కృషివికాస్ యోజన, పరంపరాగత్ కృషివికాస్ యోజన, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి నిధులు సమకూరుతున్నట్లు వివరించారు. 5 ఏళ్ల కాలంలో అజీమ్ ప్రేమ్ జీ ఫిలాంత్రొపిక్ ఇన్షియేటివ్  రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

2016-17లో రాష్ట్రంలోని 704 గ్రామాల్లో 40,656 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి వచ్చినట్లు వివరించారు. 2017-18లో రాష్ట్రంలోని సగం 331 మండలాల్లో 399 క్లస్టర్లలో 972 గ్రామాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎంపిక చేసిన గ్రామాలతో కలుపుకొని  ప్రస్తుతం 1,38,993 మంది రైతులు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ప్రకృతి వ్యవసాయం పద్దతులు అనుసరిస్తున్నట్లు వివరించారు. వీరిలో 25 శాతం మంది రైతులు విత్తన దశ నుంచే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరకు లక్షా 80వేల మంది వరకు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టే అవకాశం ఉందన్నారు.  గతంలో కాకినాడ, తిరుపతిలలో పాలేకర్ నిర్వహించిన మెగా రైతు శిక్షణ శిబిరాలు మంచి ఫలితాలనిచ్చినట్లు తెలిపారు. రైతులకు అవగాహన కల్పించడానికి, వారు ప్రకృతి వ్యవసాయం వైపు మారడానికి ఉపయోగపడినట్లు చెప్పారు. ఇప్పుడు 9 రోజులపాటు నిర్వహించే మెగా శిబిరంలో రాష్ట్రం నలుమూలల 331 మండలాల్లోని 972 గ్రామాల నుంచి ఏడాది, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేసే 5వేల మంది రైతులు హాజరవుతారన్నారు. ఈ వ్యవసాయంలో మెళకువలు తెలిసి, అధిక ఉత్పత్తులు సాధించిన రైతులను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరి ఇక్కడ శిక్షణ పొందిన తరువాత తమ గ్రామాలలోను, ఇతర గ్రామాలలోనూ రైతులకు శిక్షణ ఇస్తారన్నారు. మిగిలిన 333 మండలాల నుంచి 1700 మంది కొత్త రైతులు హాజరవుతారని చెప్పారు. తెలంగాణ నుంచి 500 మంది రైతులను ఆహ్వానించినట్లు తెలిపారు. గత మే నెలలో తెలంగాణలో జరిగిన శిక్షణ శిబిరానికి మన రాష్ట్రం నుంచి 500 మంది రైతులు వెళ్లినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖలో ఇంతకు ముందు శిక్షణ పొందని 400 మంది ఉద్యోగులు, దేశం నలుమూలల నుంచి కార్పోరేట్ రంగం నిపుణులు 300 మందితోపాటు మారిషస్ హైకమిషనర్ గోబర్దన్ కూడా హాజరవుతారన్నారు. 13 వందల మంది మహిళా రైతులు కూడా ఈ శిబిరానికి హాజరవుతున్నారని, వారికి విశ్వవిద్యాలయం వారు వసతి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు  తెలిపారు.
     ఈ శిక్షణ వల్ల చిన్న, మధ్యతరహా రైతులకు ఎక్కవ ప్రయోజనమని ఆయన చెప్పారు. రైతులకు ఉపయోగపడే 5 నుంచి 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ లు  300 వరకు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రకృతి వ్యవసాయ సాగుకు ఉపయోగపడే పరికరాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు.   గ్రామంలో ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే సర్టిఫికేషన్ తేలికవుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ధాన్యం ఉత్పత్తి 6 శాతం, పత్తి 10 శాతం, వేరుశనగ 23 శాతం అధికంగా ఉత్పత్తి సాధించినట్లు విజయకుమార్ వివరించారు.చివాలయం, అమరావతి.




Dec 28, 2017

దేశంలో అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్ట్ పోలవరం


అస్యూరెన్సెస్ కమిటీ చైర్మన్  గాలి ముద్దుకృష్ణమ నాయుడు
       
సచివాలయం, డిసెంబర్ 28: దేశంలో అతిపెద్ద బహుళార్థసాధక ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ అని, దీనిని త్వరగా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని శాసనమండలి ప్రభుత్వ అస్యూరెన్సెస్ కమిటీ చైర్మన్ గా గాలి ముద్దుకృష్ణమ నాయుడు కొనియాడారు. శాసనసభ భవన సముదాయంలోని కమిటీ హాల్ లో గురువారం ఉదయం ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో కమిటీ సభ్యుల సమావేశం ముగిసిన తరువాత మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా తరువాత ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రోఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ఇదని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం ప్రధాన మంత్రి మోడీని, కేంద్ర మంత్రి గడ్కరీని ఒప్పించి, దానిని త్వరగా పూర్తి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. భూ సేకరణ వ్యయం పెరిగిపోవడం ప్రాజెక్ట్ వ్యయం కూడా విపరీతంగా పెరిగిందన్నారు. గతంలో ఎకరానికి రూ.1.50 లక్షల రూపాయలు ఇవ్వగా, ఇప్పుడు రూ.10.64 లక్షల వరకు ఇస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ నిర్మాణం వల్ల 110 టీఎంసీల నీటిని తెచ్చుకోగలిగామన్నారు. కృష్ణా జిల్లాలో మూడు పంటలకు నీరిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పంపులు వృధా కావని, ఆ తరువాత వాటిని మరోచోట అమర్చుకోవచ్చన్నారు. పోలవరం బాధితులకు చక్కటి ఇళ్లు కట్టిస్తున్నట్లు చెప్పారు. రోడ్లు, కమ్యునిటీ హాళ్లు, డ్రైనేజీ, త్రాగునీరు మొదలైన సకల వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఒకే ఇంట్లో పెళ్లైన వారు ఉంటే వారికి కూడా వేరే ఇల్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 29వ తేదీ శుక్రవారం కమిటీ పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించనున్నట్లు తెలిపారు. కౌన్సిల్ లో ప్రభుత్వం మొత్తం 24 హామీలు ఇచ్చిందని, వాటన్నిపై శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు నీటి ప్రాజెక్టులపై  అధికారులతో చర్చించినట్లు చెప్పారు. వాటిలో ఓ 5 హామీలు నెరవేర్చారని, మిగిలినవి పెద్ద ప్రాజెక్టులని,  వాటి నిర్మాణాలు కొనసాగుతున్నాయని వివరించారు. గత మూడేళ్ల నుంచి జలవనరుల ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పని చేస్తున్నట్లు తెలిపారు.  జలవనరుల శాఖ ఇంజనీర్లు, సిబ్బంది కష్టపడి పని చేస్తున్నారని అభినందించారు.  
దేశానికే తలమానికం బకింగ్ హామ్ కెనాల్
           కాకినాడ నుంచి చెన్నై వరకు 560 కిలోమీటర్ల జలరవాణాకు సంబంధించి చేపట్టిన బకింగ్ హామ్ కెనాల్ ప్రాజెక్ట్ దేశానికే తలమానికం అని ముద్దు కృష్ణమనాయుడు చెప్పారు. దీనికి రూ.9,465 కోట్లు వ్యయం అవుతుందని, వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూ.3 వేల కోట్ల వరకు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, తమిళనాడు ప్రభుత్వం ఆమోదం తెలుపవలసి ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు అనుసందానం ఏర్పడుతుందని, జలరవాణా పెరిగి రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
             రాయలసీమలో హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ ప్రాజెక్టుల పనులు చురుకుగా సాగుతున్నట్లు తెలిపారు. హంద్రీ-నీవాను పుట్టపర్తిఆ తరువాత మదనపల్లి వరకు పొడిగించమని చెప్పామన్నారు. ఆ పనులు పూర్తి అయితే తరువాత కుప్పం వరకు కూడా నీరు వెళుతుందన్నారు. గాలేరు-నగరి మార్గంలో టర్నల్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదని  చెప్పారు. ఎస్ఎస్ కెనాల్ ను సామర్థ్యాన్ని పెంచాలని కోరినట్లు తెలిపారు. కాలువలను ఆధునీకరించుకోవలసి అవసరం ఉందని, సిమెంట్ నిర్మాణం చేపడితే తప్ప నీరు పారదని గాలి అన్నారు.
ప్రాజెక్టుల యుగం మొదలైంది: యండపల్లి శ్రీనివాసులు రెడ్డి
కమిటీ సభ్యుడు యండపల్లి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుల యుగం మొదలైందన్నారు. రాయలసీమకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి ముఖ్యమైన ప్రాజెక్టులన్నారు. నీటిపారుదల శాఖలో ఏఈలు, ఈఈలు తగినంతమంది ఉన్నారని, ఇతర సిబ్బంది కొరత ఉందని, ఆ ఖాళీలను భర్తీ చేయాలని కోరినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మరో సభ్యుడు బుద్దా వెంకన్న కూడా పాల్గొన్నారు.

ఫైబర్ నెట్ ద్వారా ఏపీకి మంచి భవిష్యత్


రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
సచివాలయం, డిసెంబర్ 27: టెక్నాలజీ, ఫైబర్ నెట్ ద్వారా ఏపీకి మంచి భవిష్యత్ ఉందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం ఏపీ ఫైబర్ నెట్ ను ఆయన ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 24 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేసిన పైలెట్ ప్రాజెక్ట్ గా దీనిని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా పౌరుల జీవనం మెరుగవుతుందన్నారు. డేటా కనెక్టటివిటీ, ఆప్టికల్ ఫైబర్ ని విద్యుత్ పోల్స్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడాన్ని ఆయన కొనియాడారు. అదే విధంగా ఇంటి అవసరాలకు 15 నుంచి 20 ఎంబిపీఎస్ స్పీడ్ నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం రూ.149లకు అందించడాన్ని ఆయన అభినందించారు. వినోదంతోపాటు విద్య, వైద్యం, టెలిమెడిసిన్, ఆరోగ్య రక్షణ, వ్యవసాయం తదితర రంగాలలో ఉపయోగపడే బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా దీనిని పేర్కొన్నారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థుల టాలెంట్ వెలుగులోకి వస్తుందని చెప్పారు.  డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి నెట్ సౌకర్యం, విద్యుత్, వంట గ్యాస్ అందిస్తారని చెప్పారు.
అత్యంత ఆధునిక టెక్నాలజీతో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీసీ) ద్వారా  24/7 ప్రపంచంతో అనుసంధానమై అమరావతి ముందుందన్నారు. ఏపీ ఆర్టీజీ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రాజెక్ట్ గా ఆయన  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తండ్రీకొడుకులు ఇద్దరూ కలసి సాధించిన విజయం
ఏపీకి సంతోషకరమైన రోజులు వచ్చాయని, టెక్నాలజీ ద్వారా ప్రజలకు ఆనందం అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కొడుకు మంత్రి నారా లోకేష్ విజయం సాధించారని తెలంగాణ, అంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనియాడారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఆధునిక టెక్నాలజీతో అతి తక్కువ ధరకే ఇంటర్ నెట్, కేబుల్ టీవి, టెలిఫోన్ అందిస్తున్నారని, వీడియో ద్వారా అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రజలు ప్రభుత్వం మాకు ఏం చేసిందిఅని అంటుంటారని, ప్రభుత్వం మీకు అన్నీ చేసిందని, ఇక మీరు ఏదైనా చేసి సంతోషంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వం మీకు అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించిందన్నారు.
ప్రపంచానికే ఆదర్శం: చంద్రబాబు
ఇది చరిత్రను సృష్టించే కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేవిధంగా టెక్నాలజీని ఉపయోలోకి తెస్తామని చెప్పారు. అందరూ విద్యపై శ్రద్ధ చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండమై భవిష్యత్ ఉందని అన్నారు. ప్రపంచం మొత్తం మీద ఐటీ నిపుణులలో నూటికి నలుగురు భారతీయులు ఉన్నారని, ఆ నలుగురిలో ఒకరు తెలుగువారని, నాదెండ్ల సత్య వంటి వారిని గుర్తు చేశారు. పారిశ్రామిక విప్లవంతో యాత్రీకరణ మొదలైందని, విద్యుత్ దానికి ఊతం ఇచ్చిందని, 1990లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగినట్లు పేర్కొన్నారుఇప్పుడు 4వ ఐటీ రివల్యూషన్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటి) మొదలైందన్నారు. ఫైబర్ గ్రిడ్ రూ.5వేల కోట్ల ప్రాజెక్ట్ అని, విద్యుత్ పోల్స్ ని ఉపయోగించడం ద్వారా ఖర్చుని చాలా వరకు తగ్గించినట్లు తెలిపారు. రూ.860 కోట్ల వ్యయంతో ప్రతి పంచాయతీకి ఫైబర్ నెట్, వైఫై కనెక్షన్ ఇస్తామని చెప్పారు. ట్రిపుల్ ప్లే బాక్లుల కొరత వల్ల ఆలస్యమైనట్లు తెలిపారు. గూగుల్ ఎక్స్ సంస్థ సహకారంతో ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా మారుమూల ఉండే పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాలకు కూడా వైర్ లెస్ నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ తదితర రంగాల్లో దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. ఆడవారు పనిమీద బయటకు వెళ్లినప్పుడు మగవారు ఇంట్లోనే వీడియో చూస్తూ కాఫీ పెట్టుకునే సౌకర్యం కల్పిస్తామని నవ్వుతూ అన్నారు. అమరావతి గ్రీన్ సిటీ నిర్మాణానికి రూ.50 వేల కోట్ల విలువైన 33,500 ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు మరోసారి అభినందనలు తెలిపారు. తమ రాష్ట్ర ప్రజలు తెలివైనవారని, దేనినైనా సాధించగలరన్నారు. వారి సహకారంతోనే తాము ఈ విజయాలు సాధింస్తున్నట్లు చెప్పారు.
9 నెలల్లో 24వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ లైన్ ఓ ప్రపంచ రికార్డ్: లోకేష్
        ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రదర్శించే అవకాశం లభించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ మంత్రి  నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన 5 గ్రిడ్స్ లో ఫైబర్ గ్రిడ్ ఒకటని తెలిపారు. అందరూ ఆంధ్రప్రదేశ్ ని మోడల్ గా తీసుకునే విధంగా అభివృద్ధిపరుస్తున్నట్లు చెప్పారు. 9 నెలల్లో 24 వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ లైన్ ఏర్పాటు చేసి దేశంలోనేకాదు ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.4700 కోట్లని, 3 లక్షలకు పైగా విద్యుత్ పోల్స్ ని వినియోగించుకొని రూ.333 కోట్లతో పూర్తి చేసినట్లు తెలిపారు. వైర్ లెస్ టెక్నాలజీతో మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా నెట్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కేవలం రూ. 149 రూపాయలకు ఇంటర్ నెట్, టెలీఫోన్ తోపాటు 250 ఛానల్స్ తో కేబుల్ టీవీ అందిస్తున్నట్లు తెలిపారు. 2018 డిసెంబర్ నాటికి కేంద్రం మంజూరు చేసే రూ.860 కోట్లతో ప్రతి మున్సిపాలిటీకీ, ప్రతి పంచాయతీకి వైఫై కనెక్షన్ ఇస్తామన్నారు. ఐటీలో గతంలో హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలో చరిత్ర సృష్టించనున్నారని పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా స్ర్కీన్ పై అన్ని చానల్స్ ని ప్రదర్శించి రాష్ట్రపతికి చూపించారు. అలాగే పోలవరం నిర్మాణ పనులు, వివిధ పంచాయతీలలో సర్పంచ్ లను, అంగన్ వాడీ కేంద్రాలను, పాఠశాలలు, వర్చువల్ క్లాస్ రూమ్ ని,  హెల్త్ సెంటర్లను లైవ్ లో చూపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కెమెరాలు: బాబు.
             రాష్ట్ర వ్యాప్తంగా  లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సివిల్ వ్యవహారాలను 20 వేల కెమెరాలు పర్యవేక్షిస్తున్నట్లు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండి, ఆర్టీజీ సీఈఓ బాబు.ఏ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్ ని రాష్ట్రపతికి లైవ్ లో చూపించారు. పార్కింగ్ ప్లేస్ కాని చోట వాహనాలను పార్క్ చేస్తే ఆ కెమెరాలు ఆటోమేటిక్ గా రికార్డ్ చేసి, నెంబర్ ప్లేట్ ని ఫొటో తీసి చలానాలను ఆ వాహనం యజమాని మెయిల్ కు పంపుతాయి. రౌడీషీటర్ల ముఖాలను గుర్తించి పోలీస్ శాఖను అలర్ట్ చేసే టెక్నాలజీ కూడా ఆ సీసీ కెమెరాలకు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 37వేల పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు, మొదటి దశలో 4వేల క్లాస్ రూమ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పనులను లైవ్ లో చూపించారు.
ఇతర రాష్ట్రాలకు మోడల్: అజయ్ జైన్
            తొలుత ఎనర్జీ, మౌలికసదుపాయలు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు, ఇతర అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించడం ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు పేర్కొన్నట్లు తెలిపారు. ఇంత భారీ నెట్ వర్క్ ద్వారా రూ.149 రూపాయలకు ఇంటర్ నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం కల్పించే  దేశంలో మొదటి రాష్ట్రం ఏపీ అని చెప్పారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఏపీ ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచిందన్నారు. 2018లో  లక్ష కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
             అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను శాలువాతో సన్మానించి, పరిమళబరిత పుష్పగుచ్చం అందజేశారు. అలాగే గవర్నర్ నరసింహన్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ మంత్రి వైఎస్ చౌదరి, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, శాసన మండలి చైర్మన్ ఎన్ ఎండీ ఫరూక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ ను శాలువాలతో సన్మానించి ఫుష్పగుచ్చాలు అందజేశారు. ఏపీ ఫైబర్ నెట్ ని ప్రారంభించిన అనంతరం ఫైబర్ నెట్ పనితీరుని స్క్రీన్ పై ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మోరీ గ్రామంలో మొట్టమొదటిసారిగా నెట్ కనెక్షన్ ఇచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకు లక్షకు మించి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. 2 వేల కెమెరాలతో వర్చువల్ క్లాస్ రూమ్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్న పాత్రుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు.

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...