Dec 29, 2017

ప్రకృతి వ్యవసాయంపై పాలేకర్ ఆధ్వర్యంలో రైతులకు 9 రోజుల శిక్షణ

ప్రభుత్వ సలహాదారు టి.విజయ కుమార్

        సచివాలయం, డిసెంబర్ 29:  ఆచార్యా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ప్రకృతి వ్యవసాయ ప్రాంగణంలో సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి జనవరి 8వ తేదీ వరకు 9 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వ్వయసాయ రంగ సలహాదారు టి.విజయ కుమార్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించే ఈ శిక్షణా శిబిరానికి రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి 8వేల మంది రైతులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, వానపాములు అంతరించిపోవడం, భూసారం దెబ్బతినడం, ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు, బీజామృతం, ఘన, ధ్రవజీవామృతం తయారుచేయడం, చీడపీడల నుంచి రక్షణ కల్పించే పద్దతులు, వివిధ పంటలకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అంతర్ పంటల సాగు వంటి అంశాలలో శిక్షణ ఇస్తారు.  ప్రకృతి వ్యవసాయానికి మళ్లకపోతే మరో 200 ఏళ్లకు భూసారం పూర్తీగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించినట్లు చెప్పారు.  రైతులు, వినియోగదారుల సంక్షేమం, భూసారం పెంచడానికి వినూత్న పద్దతిలో  ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించవచ్చని, దీర్ఘకాలంలో రైతులు లాభపడతారని చెప్పారు. రసాయన రహిత ఆహార పదార్ధాలు అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమానికి 5 ఏళ్ల వరకు 700 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రీయ కృషివికాస్ యోజన, పరంపరాగత్ కృషివికాస్ యోజన, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి నిధులు సమకూరుతున్నట్లు వివరించారు. 5 ఏళ్ల కాలంలో అజీమ్ ప్రేమ్ జీ ఫిలాంత్రొపిక్ ఇన్షియేటివ్  రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

2016-17లో రాష్ట్రంలోని 704 గ్రామాల్లో 40,656 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి వచ్చినట్లు వివరించారు. 2017-18లో రాష్ట్రంలోని సగం 331 మండలాల్లో 399 క్లస్టర్లలో 972 గ్రామాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎంపిక చేసిన గ్రామాలతో కలుపుకొని  ప్రస్తుతం 1,38,993 మంది రైతులు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ప్రకృతి వ్యవసాయం పద్దతులు అనుసరిస్తున్నట్లు వివరించారు. వీరిలో 25 శాతం మంది రైతులు విత్తన దశ నుంచే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరకు లక్షా 80వేల మంది వరకు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టే అవకాశం ఉందన్నారు.  గతంలో కాకినాడ, తిరుపతిలలో పాలేకర్ నిర్వహించిన మెగా రైతు శిక్షణ శిబిరాలు మంచి ఫలితాలనిచ్చినట్లు తెలిపారు. రైతులకు అవగాహన కల్పించడానికి, వారు ప్రకృతి వ్యవసాయం వైపు మారడానికి ఉపయోగపడినట్లు చెప్పారు. ఇప్పుడు 9 రోజులపాటు నిర్వహించే మెగా శిబిరంలో రాష్ట్రం నలుమూలల 331 మండలాల్లోని 972 గ్రామాల నుంచి ఏడాది, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేసే 5వేల మంది రైతులు హాజరవుతారన్నారు. ఈ వ్యవసాయంలో మెళకువలు తెలిసి, అధిక ఉత్పత్తులు సాధించిన రైతులను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరి ఇక్కడ శిక్షణ పొందిన తరువాత తమ గ్రామాలలోను, ఇతర గ్రామాలలోనూ రైతులకు శిక్షణ ఇస్తారన్నారు. మిగిలిన 333 మండలాల నుంచి 1700 మంది కొత్త రైతులు హాజరవుతారని చెప్పారు. తెలంగాణ నుంచి 500 మంది రైతులను ఆహ్వానించినట్లు తెలిపారు. గత మే నెలలో తెలంగాణలో జరిగిన శిక్షణ శిబిరానికి మన రాష్ట్రం నుంచి 500 మంది రైతులు వెళ్లినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖలో ఇంతకు ముందు శిక్షణ పొందని 400 మంది ఉద్యోగులు, దేశం నలుమూలల నుంచి కార్పోరేట్ రంగం నిపుణులు 300 మందితోపాటు మారిషస్ హైకమిషనర్ గోబర్దన్ కూడా హాజరవుతారన్నారు. 13 వందల మంది మహిళా రైతులు కూడా ఈ శిబిరానికి హాజరవుతున్నారని, వారికి విశ్వవిద్యాలయం వారు వసతి కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు  తెలిపారు.
     ఈ శిక్షణ వల్ల చిన్న, మధ్యతరహా రైతులకు ఎక్కవ ప్రయోజనమని ఆయన చెప్పారు. రైతులకు ఉపయోగపడే 5 నుంచి 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ లు  300 వరకు ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రకృతి వ్యవసాయ సాగుకు ఉపయోగపడే పరికరాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు.   గ్రామంలో ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే సర్టిఫికేషన్ తేలికవుతుందన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ధాన్యం ఉత్పత్తి 6 శాతం, పత్తి 10 శాతం, వేరుశనగ 23 శాతం అధికంగా ఉత్పత్తి సాధించినట్లు విజయకుమార్ వివరించారు.చివాలయం, అమరావతి.




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...