Dec 7, 2017

రాజ్యాంగ ఫలాలు దిగువ స్థాయికి చేరాలంటే సచివాలయ ఉద్యోగుల బాధ్యతలు కీలకం


ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ

         సచివాలయం, డిసెంబర్ 6: బాబా సాహేబ్ అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి రూపొందించిన భారత రాజ్యాంగ ఫలాలు దిగువ స్థాయి వారికి చేరాలంటే  సచివాలయ ఉద్యోగుల బాధ్యతలే కీలకం అని  ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం సచివాలయ ఎస్టీ,ఎస్సీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 62వ అంబేద్కర్ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ కు దేశంలో సంస్కృతం నేర్పించకపోతే ఆయన జర్మనీ వెళ్లి ఆ భాష నేర్చుకున్నారని తెలిపారు.  భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న కుల వ్యవస్థ మూలాలను పెకలించేందుకు, సంస్కృతంలో ఉన్న మను ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేసి, అందులోని విషయాలను  తెలుసుకొని, దానిని తగులబెట్టారని చెప్పారు. ఆయన చదువునే ఆయుధంగా చేసుకొని  మనువాదం, కుల వ్యవస్థ, అంటరానితనంపై పోరాటం చేశారన్నారు. మనం దేశంలోని ప్రజలందరూ అన్నదమ్ముల్లా ఐకమత్యంతో ముందుకు వెళుతున్నామంటే ఆయన రూపొందించింన రాజ్యాంగం వల్లనేనని, మన రాజ్యాంగంలోని అంశాలను చూసి ప్రపంచ దేశాలు హర్షిస్తున్నాయని చెప్పారు. ఎస్సీ,ఎస్టీల ప్రమోషన్ల విషయంలో పోరాటం చేయవలసిరావడం బాధాకరంగా ఉందన్నారు. అంబేద్కర్ చెప్పిన విధంగా అందరూ కలసి చర్చల ద్వారా ప్రమోషన్ల సమస్యను పరిష్కరించుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా ఉంటుదని శివాజీ తెలిపారు.

చట్టాలను అమలు చేస్తే చాలు: ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్
     
          దేశంలో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే కుల వివక్ష దానంతట అదే పోతుందని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు. దేశంలో ఇంకా కుల వివక్ష కొనసాగడం బాధాకరం అన్నారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్ అందరివాడని, ఆయన చేసిన సేవలను వివరించి కొనియాడారు. ఉద్యోగులు అందరూ ఐక్యంగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని శ్రావణ్ కుమార్ కోరారు.

అంబేద్కర్ అందరివాడు: రవిచంద్ర
        
           సమాజంలోని అన్ని వర్గాలలో వివక్షకు గురైనవారు, పీడిత, అణగారిన వర్గాలు, మహిళలకు న్యాయం జరగడం కోసం అంబేద్కర్ శ్రమించాదని, ఆ విధంగా ఆయన అందరివాడని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర అన్నారు. ప్రపంచ మానవాళికి మానవత్వం నేర్పిన మహామనిషి అంబేద్కర్ అని, ఆయన ఒక కులానికో, ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదని, అంతర్జాతీయ స్థాయి నేత అని కొనియాడారు. వివక్షే మౌలిక సూత్రంగా, ఒకే కులంలోని వివక్షతో సహా అణగారిన వర్గాల వారి కోసం ఆయన చేసినంత చరిత్రలో ఎవరూ చేయలేదన్నారు. దేశంలోని వైరుద్యాలు, వివిధ జాతులు, భాషల వారు అందరూ కలసి జీవించే విధంగా, కలసి బతకడానికి అవకాశం కల్పించే రీతిలో మానవీయ కోణంలో ఆలోచన చేసి తన మేథా శక్తితో రూపొందించన రాజ్యాంగాన్ని మనకు అందించిన వ్యక్తి అంబేద్క్ అని రవిచంద్ర  అన్నారు.
         సచివాలయ ఎస్టీ,ఎస్సీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కత్తి రమేష్ మాట్లాడుతూ భారత దేశం అంటే అంబేద్కర్ కు ముందు, తరువాత అని ఆలోచన చేసే రోజులు వస్తాయన్నారు. కుల వ్యవస్థ నిర్మూలనపై ఆయన రాసిన పుస్తకం అందరూ చదవాలన్నారు. ఆయన రచనలను తెలుగులో అనువాదం చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రిజర్వేషన్ల వల్ల ఎస్సీ, ఎస్టీలు లక్ష మంది ఉపాధ్యాయులుగా ఉండటమే గాక, జడ్జీలుగా, ఇతర ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అది అంబేద్కర్ చలవేనని అన్నారు. సంఘం అధ్యక్షుడు కె.బొంజుబాబు మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు దేవుడు అంబేద్కర్ అన్నారు. కుల వివక్ష పోరాట సమితీ అధ్యక్షుడు మాల్యాద్రి మాట్లాడుతూ దేశంలో కుల సమస్యలను అంబేద్కర్ స్వానుభవంతో పరిశీలించి పరిష్కార మార్గాలను కనుగొన్నారన్నారు. ప్రమోషన్ల విషయంలో న్యాయం జరగడం కోసం అన్ని సంఘాల నాయకులతో  ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయమని ఆయన శివాజీని కోరారు. తొలుత కారెం శివాజీ, రవిచంద్రలు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కె.శ్యామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...