Dec 29, 2017

ఏపీలో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి పెద్దపీట


      పేదల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. తల్లి-బిడ్డ క్స్ ప్రెస్, ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఉచిత డయాలసిస్, చంద్రన్న సంచార చికిత్స, మహిళా మాస్టర్ హెల్త్ చెకప్, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు వంటి వాటి ద్వారా వైద్య సేవలు అందిస్తోంది. అన్ని స్థాయిల్లో ఆరోగ్య రక్షణ వ్యవస్థను పటిష్టపరుస్తోంది.  గర్భిణీల సంరక్షణలో తల్లి-బిడ్డ క్స్ ప్రెస్ విజయవంతంగా పని చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన తరువాత ప్రతి తల్లి, బిడ్డను తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్  ప్రత్యేక వాహనంలో వారి ఇంటికి చేరుస్తారు. ఆరోగ్య సౌకర్యాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. 2016 జనవరి 1 నుంచి రాష్ట్రంలో ఈ సేవలను ప్రారంభించారు. రాష్ట్రంలో ఈ వాహనాలు మొత్తం 279 ఉన్నాయి. 2017 డిసెంబర్ 15 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన తరువాత బాలింతలు 4,60,182 మందిని సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చారు.  జీవికే ఈఎంఆర్ఐ సంస్థ ఈ సేవలను అందజేస్తోంది. విజయవాడలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 102 కాల్ సెంటర్ ద్వారా తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ రవాణా సేవలను సమన్వయపరుస్తారు. ఈ సెంటర్ వారంలో ఏడు రోజులు, 24 గంటలూ పని చేస్తుంది. ఏ ల్యాండ్ లైన్ నుంచైనా, మొబైల్ నుంచైనా ఈ నెంబర్ కు కాల్ చేసి ఈ సేవలు ఫొందవచ్చు. 102 కాల్ సెంటర్ కు ఫోన్ వచ్చిన వెంటనే అది ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఆ ప్రాంతంలోని తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ సిబ్బందికి కాల్ చేసి ఆ గర్భిణీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తారు. 30 నిమిషాల్లో వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. అత్యధికంగా 96.02 శాతం మంది బాలింతను  తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్  ద్వారా వారి ఇళ్లకు చేర్చడంలో తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. అతి తక్కువగా 59.06 శాతం మంది బాలింతలను ఇంటికి చేర్చి శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది.
ఎన్టీఆర్ బేబీ కిట్ : ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన మహిళకు ఓ ఎన్టీఆర్ బేబీ కిట్ కూడా ఉచితంగా అందజేస్తారు. అందులో ఓ బేబి టవల్, బేబి బెడ్ జిప్ బ్యాగ్, చేతులు కడుక్కొనే ద్రవపదార్ధం(సోప్ వాటర్), గొడుగు/దోమ తెర, కిట్ బ్యాగ్ మొత్తం 5 వస్తువులు ఉంటాయి. బేబి టవల్ ( చిన్నారి శరీరానికి చుట్టే టవల్, తలకు పెట్టే టోపీ) చిన్నారి శరీరాన్ని వెచ్చగా, పొడిగా (తేమ లేకుండా) ఉంచి పొత్తిళ్లలోని అనుభూతికి కలిగిస్తుంది. దీని వల్ల శిశువు శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉండి, ఆరోగ్య సమస్యలు లేకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎదుగుతారు. బేబి బెడ్ జిప్ బ్యాగ్ (చిరు పరుపు, జిప్ బ్యాగ్) చిన్నారిని టవల్ లో చుట్టి, తలపై టోపీ పెట్టిన తరువాత పడుకోబెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. తరువాత జిప్ లాగివేసినట్లైతే శిశువు సరైన ఉష్ణోగ్రతలో ఉంటాడు. తల్లి బిడ్డను ఎత్తుకోవడానికి, ఒక చోట నుంచి మరోచోటకు మార్చడానికి సౌకర్యంగా ఉంటుంది. శిశువుకు అదనపు రక్షా కవచంగా ఉపయోపడుతుంది.  తల్లి బిడ్డను తాకాల్సిన ప్రతిసారి, పాలు పట్టించడానికి ముందర చేతులను శుభ్రపరుచుకోవడానికి  సోప్ వాటర్ ఉపయోగపడుతుంది. దీని వల్ల శిశువుకు తల్లి నుంచి వ్యాధికారక క్రిములు సంక్రమించకుండా నివారించవచ్చు. గొడుగు లేక దోమ తెర క్రిములు, కీటకాల నుంచి శిశువుని రక్షిస్తుంది.   ప్రాణాంతకమైన మలేరియా, డెంగీ, మెదడు వాపు వంటి వ్యాధుల నుంచి  కాపాడుతుంది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన తల్లులు అందరికీ ఎన్టీఆర్ బేబి కిట్స్ ఇస్తారు.  నవంబర్ 2017 వరకు 3,67,463 మందికి ఈ కిట్స్ ఇచ్చారు.
ఉచిత డయాలసిస్: దీర్ఘ కాలంగా కిడ్నీ వ్యాధితో(సీకేడీ)తో బాధపడేవారికి చికిత్స చేయడానికి రాష్ట్రంలోని 32 ప్రభుత్వ ఆస్పత్రులలో జాతీయ ఉచిత డయాలసిస్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పేదలకు ఉచిత డయాలసిస్ సేవలు అందించడానికి జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్ హెచ్ఎం)లో భాగంగా 2016లో దీనిని ప్రారంభించారు.
 ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన అన్ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులలో, ఒక్క చిత్తూరులో తప్ప మిగిలిన అన్ని జిల్లా ఆస్పత్రులలో, ప్రతి జిల్లాలోని ఒక ఏరియా ఆస్పత్రిలో ఈ డయాలసిస్ కేంద్రాలు పని చేస్తున్నాయి. శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో ఏహెచ్/సీహెచ్ సీ స్థాయిలో ఒక్కో దాంట్లో అదనంగా మరో మూడు కేంద్రాలు ఉన్నాయి. విశాఖలోని విమ్స్ లో కూడా ఉచిత డయాలసిస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 32 డయాలసిస్ కేంద్రాల్లో 2,600 మంది రోగులు ఈ సేవలు పొందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో క్రమం తప్పకుండా ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటారో వారికి నెలకు రూ. 2,500 పెన్షన్ కూడా అందజేస్తారు. రోగి వేతనాన్ని కోల్పోయినందున, మందులు, ప్రయాణ ఖర్చుల నిమిత్తం ఈ పెన్షన్ ఇస్తారు. 2017 అక్టోబర్ నెలలోడయాలసిస్ చేయించుకుంటున్న 2338 మంది సీకేడీ రోగులకు పెన్షన్ అందజేశారు. అర్హత కలిగిన నెఫ్రాలజిస్ట్ ద్వారా డయాలసిస్ చేయించుకొనే అందరు దీర్ఘకాల కిడ్నీ వ్యాధి(సీకేడీ)గ్రస్తులకు ఉచిత డయాలసిస్ సేవలు అందుతాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో డయాలసిస్ చేయించుకునే అందరు సీకేడీ రోగులకు పెన్షన్ అందజేస్తారు. ఎనిమియా, హైపర్ టెన్షన్, డయాబెట్స్ వంటి  ఇతర వ్యాధులకు కూడా అన్ని రకాల డయాగ్నస్టిక్ పరీక్షలు, చికిత్స సంబంధిత ప్రభుత్వ ఆస్పత్రులలో ఉచితంగా చేస్తారు. ఈ సేవల నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాల(సీడీసీ, అంట్లాంటా, యుఎస్ఏ)కు అనుగుణంగా ఉన్నాయా లేవా అనేది బయట ఏజన్సీ ఒకటి ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది. అర్హత కలిగిన నెఫ్రాలజిస్ట్ లు, వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఈ డయాలసిస్ సేవలు అందజేస్తారు. డయాలసిస్ కోసం నమోదు చేయించుకోవడానికి రోగికి  ఒక్క రోజు సరిపోతుంది.  అర్హత కలిగిన నెఫ్రాలజిస్ట్ కావలసిన అన్ని పరీక్షలు చేసి, వ్యాధి స్థితిని సమీక్షించిన తరువాత డయాలసిస్ చేయడం మొదలుపెడతారు.
చంద్రన్న సంచార చికిత్స: ఆరోగ్య సౌకర్యాలు లేని ప్రాంతాల్లో చంద్రన్న సంచార చికిత్స వాహనాల ద్వారా ప్రాధమిక చికిత్స అందిస్తారు. 5 కిలో మీటర్ల పరిధిలో ఆరోగ్య సౌకర్యం లేని 12 వేల ప్రాంతాలను గుర్తాంచారు. ఆ ప్రాంతాలకు ప్రతి నెల నిర్ధారించిన రోజున సంచార వైద్య బృందాలు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. మధుమేహం, రక్తపోటు, మూర్చ వంటి సాధారణ వ్యాధులను పరీక్షించి ఈ బృందం వైద్యం చేస్తుంది. దీనిని ప్రారంభించినప్పటి నుంచి 2017 అక్టోబర్ వరకు 2,44,843 వైద్య శిబిరాలు నిర్వహించారు. 70,41,319 మంది రోగులకు వైద్యసేవలు అందించారు. 23,03,866 వైద్య పరీక్షలు చేశారు. 50,23,292 ఔషదాలను అందజేశారు.
మహిళా మాస్టర్ హెల్త్ చెకప్: అంటు వ్యాధులు కాని (ఎన్ సీడీ) నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, విజన్, హార్మోన్ అస్థవ్యస్థతలు వంటి 7 ప్రధాన వ్యాధులు త్వరగా కనుగొనడం కోసం 30 ఏళ్ల పైబడిన మహిళలకు మహిళా మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం కింద పరీక్షిస్తారు. ఎన్ సీడీల పరీక్షల కోసం 12 వేల మంది ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చారు. అనుమానిత కేసులను రోగ నిర్ధారణ, చికిత్సల కోసం రాష్ట్రంలోని సంబంధిత 57  ఆస్పత్రులకు పంపుతారు. గత అక్టోబర్ వరకు 8,92,679 మంది మహిళలకు వివిధ రకాల పరీక్షలు చేశారు. వారిలో 30 మందికి కేన్సర్ ఉన్నట్లు నిర్ధారించారు.
ఎన్టీఆర్ వైద్య పరీక్షలు: ప్రభుత్వ ఆస్పత్రులలోని ల్యాబరేటరీల ద్వారా ఇప్పటికే కొనసాగుతున్న పరీక్షలకు అదనంగా ఎన్టీఆర్ వైద్య పరీక్షల సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స చేయించుకోవడానికి వచ్చే రోగులకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య(పీపీపీ) పద్దతిలో వైద్య పరీక్షలు చేస్తారు. . 2016 జనవరి నుంచి అమలవుతున్న ఈ కార్యక్రమం వల్ల రోగికి ఆరోగ్య రక్షణ కల్పించడంతోపాటు వారికి వ్యయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 మథర్ ల్యాబ్ లతోపాటు 98 ప్రాసెసింగ్ ల్యాబ్ లు అందుబాటులో ఉన్నాయి. గత అక్టోబర్ వరకు 2,65,25,264 పరీక్షలు చేసి 88,78,632 మందికి ఈ సేవలు అందించారు.  దేశంలో ఇటువంటి లేబరేటరీ సేవలు ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏపీ.
ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు: పట్టణ పేదలకు, మురికివాడలలో నివసించేవారికి వైద్య సేవలు అందించడం కోసం  ఈ కార్యక్రమం ప్రారంభించారు. వారికి ఉచితంగా స్పెషాలిటీ సేవలు, పూర్తి కాల వైద్యాధికారి నుంచి నాణ్యమైన ఆరోగ్య రక్షణ లభిస్తుంది. 30 డయాగ్నస్టిక్ పరీక్షలు, మందుల సరఫరా, టెలీకన్సల్టెన్సీ ద్వారా స్పెషలిస్టుల సేవలతోపాటు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సేవలు 365 రోజులూ అందిస్తారు. అక్టోబర్ వరకు ఈ కార్యక్రమం కింద 28,48,092 మంది బయటి రోగులకు వైద్య సేవలు అందించారు. 1,69,381 టెలీకన్సల్టెన్సీలను నర్వహించారు. 5,33,754 ఇమ్మునైజేషన్లు పూర్తి చేశారు. బయోకెమిస్ట్రీ, క్లినికల్ పాథాలజీ, హెమటాలజీ వంటి టెస్ట్ లు దాదాపు 15 లక్షలు చేశారు. ఇవే కాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ, గిరిజన ఆరోగ్యం వంటి పలు కార్యక్రమాల ద్వారా పేదలకు వైద్యసేవలు అందిస్తోంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్-9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...