Dec 22, 2017

అమరావతి ఆకృతులు సిద్ధం


Ø 2018లో నిర్మాణాలు ప్రారంభం
Ø ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
Ø పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ
Ø ఉన్నత జీవనం
Ø పర్యావరణ అనుకూల అభివృద్ధి
    
  అంతర్జాతీయ స్థాయి మహానగరాల సరసన చేరేవిధంగా నిర్మించతలపెట్టిన నూతన ప్రజా రాజధాని అమరావతి మహానగరంలో నిర్మాణాల ఆకృతులు ఎట్టకేలకు  సిద్ధమయ్యాయి.  ఈ నెలాఖరుకు గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ వీటిని ఖరారు చేసే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మన సంస్కృతి, సంప్రదాయలు ప్రతిబింభించే విధంగా పరిపాలన, న్యాయ వ్యవస్థల భవనాల తుది ఆకృతులను లండన్ కు చెందిన ఫోస్టర్ అండ్ పార్టనర్స్ సంస్థ  అత్యున్నత ప్రమాణాలతో అత్యద్భుతంగా రూపొందింది. అంతర్జాతీయ నగరాల ఆకృతుల రూపకల్పనలో అనుభవం కలిగిన ఈ సంస్థ పలు నమూనాలను రూపొందించి సీఎంకు చూపించింది. మళ్లీ ఆయన అనేక మార్పులు చేర్పులు సూచించారు. ఆ ప్రకారం తుది ఆకృతులను సిద్ధం చేశారు. నార్మన్ ఫోస్టర్ ఆకృతులను పరిశీలించిన మంత్రిమండలి  రాష్ట్ర శాసనసభ కోసం  రూపొందించిన స్పైక్ మోడల్/టవర్ డిజైన్‌కు  మొగ్గు చూపిందిఫోస్టర్ అందించిన డిజైన్లలో ఇదే అత్యుత్తమంగా ఉందని సీఎం కూడా అభిప్రాయపడ్డారు.
ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి నిర్మాణానికి శంకుస్థాపన తేదీ ఖరారు చేస్తారు. అన్నీ అనుకూలిస్తే సంక్రాంతికి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది.   నూతన ప్రజారాజధాని అమరావతిని త్వరితగతిన నిర్మించాలన్న పట్టుదలతో  ప్రభుత్వం ఉంది. సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ), ఏడీసీ(అమరావతి అభివృద్ధి సంస్థ)లు ఆ పనులలో తలములకలై ఉన్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 25 రెవెన్యూ గ్రామాల (29 గ్రామాలు) పరిధిలోని  217.23 చదరపు కిలోమీటర్ల (53,478 ఎకరాలలు) విస్తీర్ణంలో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్మాణ వ్యవహారాలను చూసుకునేందుకు 2014, డిసెంబరు 30న  చట్టం ద్వారా సీఆర్ డీఏను ఏర్పాటు చేశారుదీనికి చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా పురపాలక శాఖ మంత్రి నారాయణ  వ్యవహరిస్తున్నారుల్యాండ్ పూలింగ్ ద్వారా 27, 822 మంది రైతుల నుంచి 34,152 ఎకరాల భూమి  సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 26,842 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 33,214 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. హామీ ఇచ్చిన మేరకు 29 గ్రామాల రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను పంపిణీ చేశారు.    అమరావతి మహానగరాన్ని నిర్మించుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడుకు దక్కిన ఓ అద్భుత అవకాశం. కృష్టానది ఒడ్డున ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూల అభివృద్ధి, పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ, ఉన్నత జీవనం కొనసాగే విధంగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ నగరాన్ని నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశంలో  20, ప్రపంచంలో  20 అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయాలను ఏపీకి తీసుకురావల్లన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకు ఇప్పటికే దేశవిదేశాలలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు, భూముల కేటాయింపు జరిగిపోయాయి. వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్), శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) యూనివర్సిటీలు నిర్మాణాలు మొదలుపెట్టి తరగతులు కూడా ప్రారంభించాయి.  అమృత యూనివర్సిటీ, ఇండో-యుకే హెల్త్ ఇన్ స్టిట్యూట్, డాక్టర్ బీఆర్ శెట్టి మెడికల్ సిటీ, ఇండో-యూకే ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్, నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్(ఎన్ఐడీ), సెంట్రల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్ (సీఐటీడీ), ఆంధ్రప్రదేశ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంక్, నబార్డ్, నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ కాన్సర్ ఫౌండేషన్, ఎఫ్ సీఐ, కేంద్రీయ విద్యాలయం, కృష్ణా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కెఐఎంఎస్), ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, పుల్లెల గోపిచంద్ అకాడమీ, బ్రహ్మకుమారీల శాంతి సరోవర్ ప్రాజెక్ట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ (వ్యక్తివికాస కేంద్రం), సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, పోస్టల్ డిపార్ట్ మెంట్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)  వంటి వాటితోపాటు మరికొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు భూములు కేటాయించారు.  


          ఇప్పటికే కొన్ని ప్రధాన రహదారులను నిర్మించారు. 2018 జనవరి 15 నాటికి సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తుంది. ఈ మార్గంలోని రెండు ప్రధాన వంతెనల పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాజధానిలో చేపట్టిన 7 ప్రాధాన్య రహదారులు, 3 అదనపు ప్రాధాన్య రహదారుల నిర్మాణం సత్వరం పూర్తిచేయడానికి పనులలో  వేగం పెంచారురహదారుల నిర్మాణం పూర్తయితే రాజధానికి తొలి రూపు వస్తుందని భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నూతన నిర్మాణాలకు కావలసిన మెటీరియల్ రవాణాకు వీలు ఏర్పడింది. తొలి దశలో మొత్తం 21 ప్రధాన రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జల కళ-పచ్చదనం నిండిన అంతర్జాతీయ స్థాయి అద్భుత నగర (బ్లూ-గ్రీన్ సిటీ) నిర్మాణానికి రూ.58 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రధాన నిర్మాణాలు 2018లో మొదలు పెడతారు. 2019 ఎన్నికల నాటికి 32,463 కోట్లు ఖర్చు చేసి ఒక రూపు తీసుకురావాలన్న కృతనిశ్ఛయంతో ప్రభుత్వం ఉంది. మౌలికవసతులు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే రూ.9,190 కోట్ల విలువైన పనులను చేపట్టిందిమొదటి దశలో ఖర్చు చేయాలనుకుంటున్న నిధులను సమకూర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాలలో సీఆర్డీఏ ప్రయత్నించి విజయం సాధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్), ప్రపంచ బ్యాంకు నిధులను సమకూరుస్తున్నారు. పీపీపీ విధానంలో మౌలిక వసతులు, బాండ్స్ వంటి ఇతర మార్గాల్లో కూడా నిధులను సమకూరుస్తున్నారు. తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించేవిధంగా నగరం నిర్మిస్తారు. రాజధాని పరిధిలోని గ్రామాల అస్థిత్వాన్ని నిక్షిప్తం చేయడానికి  ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కృషి చేస్తోంది. పుత్రజయ, ఆస్థానా, వాషింగ్టన్ డీసీ, లండన్, బ్రెసీలియా, అబుదాబి, న్యూఢిల్లీ, గాంధీనగర్, నయారాయపూర్, చండీగర్  తదితర నగరాలలో ఉత్తమమైన అంశాలను తీసుకొని, వాటికంటే అత్యుత్తమంగా బ్లూ, గ్రీన్ ఫీల్డ్ సిటీగా, ఆర్ధిక కార్యకలాపాలకు వేదికగా, ప్రపంచశ్రేణి నగరంగా, ప్రజా రాజధానిగా భాసిల్లేవిధంగా అమరావతిని నిర్మించనున్నారు.  వచ్చే వందేళ్లలో జరిగే మార్పులు, అంచనాల ఆధారంగా అత్యంత కీలకమైన వాణిజ్య సదుపాయాలు, కల్పన, ప్రజల అవసరాలకు సంబంధించి సీఆర్డీఏ పలు ప్రాతిపాదనలు చేసిందిపెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలుగల జిల్లా కేంద్ర వాణిజ్య కేంద్రాలు (సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్-సీబీడీ) ఏర్పాటు చేయడంతోపాటు, ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. వివిధ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ 9 నగరాలు (పరిపాలన, ఆర్థిక, న్యాయ, వైద్య, పర్యాటక, మీడియా, ఎలక్ట్రానిక్, విజ్ఞాన, క్రీడల నగరాలు) రాజధానిలో నిర్మిస్తారు.
             రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుత  జనాభా 58 లక్షలు.  2035 నాటికి కోటి 12 లక్షల 50 వేలకు, ఉద్యోగుల సంఖ్య 3 లక్షల 36 వేలకు చేరుతుందని అంచనా. 2050 నాటి జనాభా కోటి 38 లక్షలకు, ఆ తరువాత రెండు కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. అంతే కాకుండా భవిష్యత్ లో విజయవాడ-గుంటూరు అన్ని విధాలుగా జంటనగరాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాజధాని అంటే కేవలం పరిపాలనకే పరిమితం కాదు. అక్కడ నివశించే ప్రజల జీవన శైలికి అనుగుణంగా విద్య, వైద్యం, పరిశోధనలు, న్యాయం, ఐటీ, స్పోర్ట్స్, ఆతిధ్యం, ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పర్యాటకం, వాణిజ్యం....ఇలా ప్రజల వివిధ అవసరాలను తీర్చగలిగేటటువంటి వాటితో కూడిన ఒక ఆర్థిక వ్యవస్థ రూపొందాలి. ఇంత మంది జనాభాకు త్రాగునీటి అవసరాలు తీరాలి. అందరూ ఆరోగ్యకరంగా జీవించడానికి అనువైన వాతావరణం కల్పించాలి. వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా పరిసరాలను రూపొందించుకోవాలి. విశాలమైన ప్రదేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మించుకుంటున్న నగరమైనందున వీటన్నిటికీ వీలవుతుంది. వీటన్నిటితోపాటు  పెరిగే జనాభాను, భవిష్యత్  అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణానికి కావలసిన మాస్టర్ ప్లాన్ ను ప్రభుత్వం  సిద్ధం చేసింది. అంతర్జాతీయ శ్రేణి నగరంగానే కాకుండా ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా  నిర్మించాలంటే మేధోమథనం జరగాలని, అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అటువంటి తపన, స్పృహ దీని నిర్మాణంలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరిలో ఉండాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. అమరావతి నిర్మాణంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న కన్సల్టెంట్ సంస్థలతో డిసెంబర్ 14, 15 తేదీల్లో 2 రోజులపాటు విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో సీఆర్డీఏ సమావేశం నిర్వహించిందిప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగానికి సంబంధించి 15 అంశాల్లో  విశేష అవగాహన కలిగిన నిపుణులు, నిర్మాణ సంస్థలు, కన్సల్టెంట్లు ఇందులో పాల్గొని తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రెండురోజులుగా సాగిన మేధోమధనంలో నిపుణుల సూచనలు, సలహాలు పాటించి
అమరావతిని ప్రామాణిక నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. రహదారులు పూర్తయితే రాజధాని నిర్మాణానికి ఊపు వస్తుందని, పనిచేస్తే వెన్నుతట్టి ప్రోత్సహిస్తానని, అలసత్వాన్ని ఊరుకోనని అధికారులను హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అన్నిరకాల అభివృద్ధి పనులకు అత్యంత అవసరమైన ఇసుక, మొరం, కంకర తదితర నిర్మాణ సామాగ్రికిఎలాంటి లోటు లేకుండా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అన్ని పనులు నిర్దేశిత వ్యవధిలో జరిగితీరాలని నిర్మాణ సంస్థలకు స్పష్టం చేశారుఅమరావతి నిర్మాణంలో పాలుపంచుకునే నిర్మాణ సంస్థలు, అధికారులు తమకున్న పేరును నిలబెట్టుకోవాలని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల పురోగతికి సంబంధించిన డ్రోన్ వీడియో ప్రదర్శించాలని సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ ఆన్‌లైన్‌లో ఉంచాలని కూడా సీఎం చెప్పారు. అంటే రాజధాని నిర్మాణంలో సీఎం ఎంత పట్టుదలతో ఉన్నారో అర్ధమవుతోంది. ఇదే ఊపు కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి అమరావతికి స్పష్టంగా  ఓ రూపు వచ్చే అవకాశం ఉంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...