Dec 6, 2017

ఫలించిన వాల్మీకుల సుదీర్ఘపోరాటం


     
     
             భారతదేశంలో ఆర్థిక ప్రాతిపదినక రిజర్వేషన్లు లేనందున సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. కుల వ్యవస్థను కూల్చివేసి ఆర్థిక వెనుకబాటుతనం
ఆధారంగా అవకాశాలు, రాయితీలు కల్పించడానికి రాజకీయ పార్టీలు, నాయకులు అంగీకరించరు. అందువల్ల శతాబ్దాలుగా సామాజికంగా దయనీయమైన పరిస్థితుల్లో జీవించేవారు తమ ఉనికిని చాటుకుంటూ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. అటువంటి వారిలో మన రాష్ట్రంలోని వాల్మీకి, బోయ తెగలవారు ఉన్నారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాలలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలుగా ఉన్న బోయ(వాల్మీకి)లను  మన రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా గుర్తించారు. దాంతో ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనుకబడిన వీరు దశాబ్ధాలుగా నానా అవస్థలు పడుతున్నారు. బోయ, వాల్మీకి, వాల్మీకి బోయ, బోయ వాల్మీకి, దొంగ బోయ, దొర, గెంటు, మొండి బోయ, బేదర్, కిరాతక, నిషాద, ఎల్లాపి, చుండు వాళ్లు, పెద్ద బోయ, తలయారి, తలారి, ఎల్లాపు, చుండి నాయకులు, గురికర, కలావతిల బోయ, కావలి వారు,కిరాతకులు, నాయకులు,నిషాదులు, శబరి, సుంకులమ్మ బోయ తదితర పేర్లతో పిలిచే వీరంతా ఒకే తెగకు చెందినవారు. వీరు విభిన్నమైన సంస్కృతితో  సాధారణ జనాలతో కలవలేకపోవడం, భౌగోళిక ఒంటరి జీవనం, వెనుకబాటుతనం, సాంఘిక పరిస్థితి, జాతరలు, జీవన విధానం, జీవన సామర్ధ్యం, శారీరక రూపం, సామాజిక, ఆర్థిక పరిస్థితి, అత్యల్ప అక్షరాస్యత, జనాభా తరుగుదల తదితర లక్షణాల ద్వారా దేశంలోని ఇతర గిరిజన తెగలలో ఒకటిగా అనేక అధ్యయనాల ద్వారా స్పష్టమైంది. బ్రిటీష్ వారి పరిపాలనా కాలంలో వీరిని సి.టి.(క్రిమినల్ ట్రైబ్ యాక్ట్) 1936 చట్టం కింద నమోదు చేశారు. వారు నివాసం ఉండే ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో రాత్రి 11 గంటలకు, తెల్లవారుజామున 3 గంటలకు రెండు సార్లు సంతకాలు చేయాలి. అలా సంతకం పెట్టనివారిని స్టేషన్ కు పిలిపించి ఏదో ఒక కేసు బనాయించి, జైళ్లకు పంపేవారు. ఇలా పదేపదే పోలీస్ స్టేషన్లు, జైళ్ల చుట్టూ తిరగడం వల్ల వారికి కూలి పని దొరికేదికాదు. దొరికిన పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఈ జాతుల్లో ఎక్కువగా ఆడవాళ్లే పనులకు పోతూ కుటుంబాలను పోషించేవారు. ఆ తరువాత బ్రిటీష్ వారు వీరిని ఎస్టీలుగా గుర్తించి ప్రభుత్వ రాయితీలు ఇచ్చారు. స్వాతంత్ర్యం అనంతరం మన పాలకులు 1950లో వీరిని డీఎన్టీ(డీ నోటిఫైడ్ ట్రైబ్స్)లుగా అంటే విముక్తి జాతులుగా గుర్తించింది.  అంతే కాకుండా మాజీ క్రిమినల్ ట్రైబ్స్ గా కూడా గుర్తించారు. ఎస్టీలుగా ఉన్న వీరిని ఎస్సీ జాబితాలో చేర్చారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రలలో ఉండే వాల్మీకులు ఎస్సీలుగా ఉన్నారు. మాజీ నేరస్తులుగా ముద్ర వేయడంతో సమాజం వీరిని చాలా హీనంగా చూసింది. దాంతో వారు సమాజానికి దూరంగా బతకవలసి పరిస్థితి ఏర్పడింది.
               1956లో దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాల్మీకులను కోస్తా జిల్లాల్లో ఎస్టీలుగా, తెలంగాణ జిల్లాల్లో బిసీలుగా, రాయలసీమలో విముక్తి జాతులుగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా విభజించి ప్రాంతీయ వ్యాత్యాసాన్ని చూపింది. దాంతో వారు రాజ్యాంగ పరంగా రావలసిన రాయితీకు దూరమవడంతోపాటు ప్రభుత్వ పథకాలు అందని పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ తోడు సామాజికంగా చాలా అవస్థలు పడుతున్నారు. జిల్లా జిల్లాకు రిజర్వేషన్ మారడంతో ఒకే కులం అయినప్పటికి ఇతర జిల్లాల వారితో పెళ్లి సంబంధాలు కలుపుకోవడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిందిరాయలసీమ అమ్మాయినీ కోస్తా అబ్బాయికి ఇస్తే ఎస్టీ అవుతుంది. రాయలసీమ అబ్బాయి కోస్తా అమ్మాయిన చేసుకుంటే బీసీ అవుతుంది. ఈ విధంగా వీరు దశాబ్దాలుగా చాలా చిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని విధాల వెనుకబడిన వీరి జీవితాలతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు ఆడుకున్నారు.  ఫ్యాక్షన్ కు బలయ్యేవారిలో అత్యధికులు వాల్మీకి కులస్తులే. ఇక్కడ ఫ్యాక్షనిజంలో చంపేది, చచ్చేది, బతికి ఉంటే జైలుకు వెళ్లేది వీరే. ఇరు వర్గాల వారు వీరిని ఉపయోగించుకొని రోడ్డున పడేశారు. వందల కేసుల్లో ఇరుక్కొని నానా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతీయ విభేదాలు తొలగించి రాష్ట్రంలోని వాల్మీకులు అందరిని ఎస్టీల జాబితాలో చేర్చాలని, ప్రభుత్వ పథకాలు, రాయితీలు కల్పించాలని 61 ఏళ్లుగా వారు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఐక్య వాల్మీకి తెగ పోరాట కమిటీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి(బోయ) ఫెడరేషన్ చైర్మన్ బిటీ నాయుడు, మంత్రి కాలవ శ్రీనివాసులు వంటి వారి పోరాటం ఫలించింది. అత్యధిక రాష్ట్రాలలో ఎస్టీలుగా ఉన్న వారిని మన రాష్ట్రంలో కూడా ఎస్‌టీ జాబితాలో చేర్చాలన్న దశాబ్దాల నాటి డిమాండుకు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వాల్మీకి, బోయలను షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చాలని  కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిసెంబర్ 2న ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మాజీ నేరస్థులనే ముద్ర, అమానవీయ వివక్ష, గ్రామ శివార్లకే పరిమితం చేసిన సామాజిక కట్టుబాట్లు, మగవాళ్లు వేటను, మహిళలు అటవీ ఉత్పత్తులను ఆధారంగా చేసుకుని జీవించడం తదితర అంశాలన్నింటి దృష్ట్యా వీరిని 33 గిరిజన గ్రూపులలో ఒకటిగా చేర్చడమే అన్నివిధాలుగా న్యాయం చేసినట్టు అవుతుందని ఏపీ శాసనసభ అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడానికి కేంద్ర ప్రభుత్వ నియమిత లోకూర్ కమిటీనిర్దేశించిన అర్హతలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉన్న వాల్మీకి, బోయలు కలిగివున్నట్టుగా ఈ శాసనసభ భావించింది. ఇప్పటికే కర్ణాటక తదితర అనేక రాష్ట్రాలలో వీరిని షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించారు. 1961లో భారతదేశ జనగణన, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త జనరల్ బీకే రాయ్ బర్మన్, 1961-62 ఆంధ్రప్రదేశ్ షెడ్యూలు తెగల విచారణ కమిటీ, 2016 ప్రొఫెసర్ పి.డి. సత్యపాల్ కుమార్ కమిటీ, 2017 ఆంధ్రప్రదేశ్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ తదితర కమిటీలు, కమిషన్లు అధ్యయనం జరిపి చేసిన సిఫారసులు, లోకూర్ కమిటీ నిర్దేశిత అర్హతలు అన్నింటినీ పరిశీలించి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఉపనామాలతో పిలవబడుతున్న వాల్మీకి, బోయలను షెడ్యూల్డ్ తెగలోకి చేర్చడం అత్యంత ఆవశ్యమని ధృవీకరిస్తూ, అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే దీనిని పార్లమెంట్ ఆమోదించన రోజునే వారిని ఎస్టీలుగా గుర్తించడానికి అవకాశం ఏర్పడుతుంది.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...