Dec 8, 2017

సీఎం దక్షిణ కొరియా పర్యటన విజయవంతం



        ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. అనేక అవరోధాలను, ప్రతికూలతలను అధిగమించి దక్షిణకొరియా అద్వితీయమైన అభివృద్ధిని సాధించింది. తయారీ, సాంకేతిక రంగంలో ఈ దేశం చాలా ముందంజలో ఉంది.  అటువంటి దేశంలో  పెట్టుబడుల ఆకర్షణే ప్రధానాంశంగా సీఎం బృందం డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో సియోల్, బూసన్ నగరాలలో పర్యటించింది. రోడ్ షో, బిజినెస్ సెమినార్ లో పాల్గొన్నారు.  పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులతో సీఎం బృందం భేటీ అయింది. 25 ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొన్నారు.  రెండు ముఖ్యమైన ఒప్పందాలు(ఎంఓయు), ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ చేసుకున్నారు. ఈ పర్యటన వల్ల మన రాష్ట్రంలో అపారంగా ఉన్న వనరులు, పెట్టుబడికి అవకాశాలు, నైపుణ్యత కలిగిన మానవవనరుల లభ్యత, రవాణా, విద్యుత్, రైలు మార్గాలు, పోర్టులు, విమానాశ్రయాలు, నీరు, టెలీకమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వం కల్పించే రాయితీలను వారికి స్వయంగా తెలియజేయడానికి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించడానికి, ఇరు దేశాల మధ్య పారిశ్రామిక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటాని అవకాశం ఏర్పడింది. అంతే కాకుండా అక్కడి వ్యవస్థను ప్రత్యక్షంగా చూడటానికి, మన రాష్ట్ర ప్రత్యేకత వారికి తెలియజేసే వీలు చిక్కింది. అక్కడి వారు మన రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం మన బృందం ప్రదర్శించిన లఘుచిత్రాలు అన్ని కొరియన్ భాషలోనే రూపొందించారు.  ముఖ్యంగా పారిశ్రామిక నగరం బూసన్ కు, ఏపీ రాజధాని అమరావతికి మధ్య పటిష్టమైన సంబంధం ఏర్పడటానికి మార్గం ఏర్పడింది.  అక్కడి పారిశ్రామిక వేత్తల అనుమానాలను వివృత్తి చేయడానికి అవకాశం లభించింది. భారత్‌లో వ్యాపారం చేయాలనుకుంటే ఏపీని మించిన ప్రాంతం మరొకటి లేదని దక్షిణ కొరియాలో భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి కొరియన్ పారిశ్రామికవేత్తలకు పిలుపుఇచ్చారంటే ఇక్కడి అవకాశాలను మనం అర్ధం చేసుకోవచ్చు. అంటేకాకుండా బూసన్ మెట్రోపాలిటన్ సిటీ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్ తన ప్రసంగంలో సీఎం  చంద్రబాబును డైనమిక్ లీడర్గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కూడా రాష్ట్రప్రగతి, పారిశ్రామిక అనుమతులు, సింగిల్ డెస్క పోర్టల్ పై తన ప్రసంగాల ద్వారా, కొరియన్ భాషలో పలకరించడం ద్వారా వారిని బాగా ఆకట్టుకున్నారు.

ఏపీ బృందం కలసిన ప్రముఖులు
      ఏపీ బృందం ప్రభుత్వ ప్రముఖులు బూసన్ మెట్రోపాలిటన్ సిటీ మేయర్ సుహ్ బ్యూంగ్ సూ, వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్, బూసన్ పోర్ట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ బూ వో, ఎఫ్ఈజడ్ కమిషనర్ జింగ్ యంగ్ హ్యూమ్‌తోనూ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కియా సంస్థ ప్రెసిడెంట్ హూన్ వూ పార్క్, ఎల్జీ  ప్రెసిడెంట్ సూన్‌ క్వోన్, లొట్టే కార్పొరేషన్ ప్రెసిడెంట్ వాంగ్‌ కాగ్ జు, దాసన్ నెట్‌వర్క్ చైర్మన్ నామ్ మెయిన్ వూ, జుసంగ్ ఇంజినీరింగ్ సీఈవో వాన్గ్ చుల్ జు, ఐరిటెక్ కంపెనీ సీఈవో కిమ్ డెహోన్‌, కోకమ్ గ్రూపు సీఈవో జేజే హాంగ్‌, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లిమ్ చాంగ్ మిన్‌, హేన్సోల్ కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాని, జనరల్ మేనేజర్ గెనెబోక్ కిమ్‌, గ్రాన్ సియోల్ (జీఎస్) ప్రెసిడెంట్ ఫోరెస్ట్ లిమ్‌, ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ టె జిన్ కిమ్‌, బీటీఎన్  కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై కిమ్‌, పోస్కో దేవూ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జూ సీ బో, హ్యోసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జూంగ్ లీ, గ్రీన్ క్రాస్ సెల్ సంస్థ ఎండీ లీ డక్ జూ, కామాజాతీయ కార్ల కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కిమ్ యాంగ్ హ్యూన్‌, హుందాయ్ మార్చంట్ మెరైన్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సూ హో కిమ్, జనరల్ మేనేజర్ డేవిడ్, డార్సిల్  డైరెక్టర్ బెన్నీ కాంగ్‌, ఓసీఐ  కంపెనీ సీఈవో వు హ్యూమ్ లీలతో సమావేశమయ్యారు.

   ఈ సమావేశాల్లో వైద్య-ఆరోగ్య రంగం, వ్యవసాయం, సాఫ్ట్ వేర్, ఐఓటీ, పునరుత్పాదక విద్యుత్, ఓడరేవులు, నగరాల అభివృద్ధి వంటి అనేక అంశాలలో పరస్పరం సహకరించుకోవడానికి అవకాశం ఉన్న వాటిపై చర్చించారు. దక్షిణకొరియాలో ఫిషరీస్ కి సంబంధించిన పుక్యోంగ్ నేషనల్ యూనివర్శిటీ  ఫిషరీస్ రంగంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించే అంశాలను పరిశీలించారు. సియోల్ లో తొలుత కియాఅనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తమ పెట్టుబడుల ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాలలో ఎంతమేర పెట్టుబడులు పెట్టేది, తాము ఏర్పాటుచేసే సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేది  వివరించారు. అనంతపురము జిల్లాలలో కియా మోటార్స్ సంస్థకు కేటాయించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న దృశ్యాలను ఏపీ బృందం ప్రదర్శించింది. అనంతపురము జిల్లా అటు బెంగళూరు విమానాశ్రయానికి, ఇటు కృష్ణపట్నం నౌకాశ్రయానికి అనుసంధానంగా ఉందని, మౌలికవసతులు, శాంతిభద్రతలు సవ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి కార్మిక అశాంతి లేని వాతావరణం  రాష్ట్రంలో ఉందని సీఎం వారికి తెలిపారు. మూడేళ్లలో ఏపీ సాధించిన ప్రగతిని, రెండంకెల వృద్ధి రేటుని వివరించిఏపీలో కొరియా టౌన్ షిప్ ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్లు తెలిపి పెట్టుబడులు భారీ స్థాయిలో పెట్టమని వారిని ఆహ్వానించారు.  కియాఅనుబంధ సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం ఆ సంస్థలన్నీ  రాష్ట్రంలో రూ. 4,995.20 కోట్లు  పెట్టుబడులు పెడతాయి. ఏపీలో కొరియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తారు. బూసన్‌లో జరిగిన బిజినెస్ సెమినార్‌లో మేకిన్ ఇండియా కొరియా సెంటర్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం బూసన్‌లో ఆంధ్రప్రదేశ్ సెంటర్‌ను నెలకొల్పుతారు.  37 కంపెనీల పారిశ్రామిక గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్(లెటర్ ఆఫ్ ఇంటెంట్- అంగీకార లేఖ) తీసుకుంది. ఆ సంస్థలు పెట్టే మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా మొత్తం 7,171 ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంది.

          భారత్‌లో తయారీ రంగంలో ప్రవేశించాలని అనుకుంటున్నట్లు  అందుకు గల అవకాశాలపై దృష్టిపెడుతున్నామని దాసన్ నెట్ వర్క్ చైర్మన్ నామ్ మెయిన్ వూ చెప్పారు. ఇప్పటికే ఏపీ స్టేట్ ఫైబర్ నెట్‌వర్క్ లిమిటెడ్‌తో దాసన్ నెట్ వర్క్ కలిసి పనిచేస్తోంది. 2022 కల్లా భారత్‌లో 100 గిగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పే యోచనలో ఉన్నట్లు జుసంగ్ ఇంజనీరింగ్ సీఈఓ వాన్గ్ చుల్ జు చెప్పారు. డిసెంబర్ 10 తరువాత ఏపీకి వస్తానని ఐరిటెక్ కంపెనీ సీఈఓ కిమ్ డెహోన్‌ చెప్పారు. ఇప్పటికే ఈ కంపెనీ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.  కలిసి పనిచేసేందుకు 90కు పైగా వివిధ బిజినెస్ యూనిట్స్ ఉన్న లొట్టే కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈఓ వాన్గ్ కాగ్ జు, ఏపీ బృందం సంయుక్త కార్యసాధన బృందం ఏర్పాటుచేయాలని నిర్ణయించాయి. బీటీఎన్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వై కిమ్‌తో సమావేశమైన సందర్భంగా దేశంలో మొదటి లోకల్ ఫ్రెండ్లీ సస్టెయినబుల్ ఇంటిగ్రేటెడ్ స్మాల్ సిటీ  అనంతపురంలో ఏర్పాటు చేసే ప్రతిపాదన చేశారు. దక్షిణకొరియా-ఇండియా మధ్య 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయానికి జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ సిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టెక్స్‌టైల్స్, గార్మెంట్ పరిశ్రమల యూనిట్లను భారత్‌లో నెలకొల్పేందుకు తగిన ప్రదేశం కోసం అన్వేషిస్తున్నట్లు నైలాన్ పాలిస్టర్, పవర్ సిస్టమ్ అంశాలలో అనుభవం ఉన్న  హ్యోసంగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ జె జూంగ్ లీ చెప్పారు. భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఓసీఐ కంపెనీ సీఈవో వు హ్యూమ్ లీ తెలిపారు. గత ఏడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు హాజరైనప్పటి నుంచి ఏపీ అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నానని, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్ విధానం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన వెళ్లడించారు. ఇప్పటివరకు తయారీరంగంలో కొరియా దాటి పూర్తిస్థాయిలో మరే దేశానికి వెళ్లలేదని,  ఏపీలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలన్న సీఎం చంద్రబాబు  ప్రతిపాదనను పరిశీలిస్తామని ఎల్‌జీ ప్రెసిడెంట్ సూన్ క్వోన్ చెప్పారుఏపీలో లాజిస్టిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అపూర్వం అని, అందులో భాగస్వామ్యం కావడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నామని  దక్షిణ కొరియాలోని అతిపెద్ద లాజిస్టిక్ సంస్థ డార్స్ల్ డైరెక్టర్ బెన్నీ కాంగ్ తెలిపారు. వారే కాకుండా ఈ పర్యటనలో ఇంకా అనేక సంస్థలు ఏపీలో పెట్టుబడిపెట్టడానికి ఆసక్తి కనబరిచాయి. ఈ ప్రతిపాదనలన్నీ త్వరలో కార్యరూపం దాల్చుతాయని ఆశిద్ధాం.

-శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ – 9440222914
  


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...