Dec 12, 2017

ఆర్థిక వృద్ధిరేటు పెంపుపై ప్రభుత్వం దృష్టి


Ø మూడేళ్ల నుంచి ప్రగతి పథంలో ఏపీ
Ø స్థిరమైన రెండంకెల సమ్మిళిత వృద్ధి రేటే ప్రభుత్వ లక్ష్యం
Ø 9 వృద్ధి కారకాల గుర్తింపు
Ø ఉన్నతాధికారులతో నేడు సీఎం సమావేశం
 
  
రాష్ట్రంలో స్థిరమైన, రెండంకెల వృద్ధి రేటును కొనసాగించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. 2017-18 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో జాతీయ వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిరేటును ఏపీ సాధించింది. జీవీఏ వృద్ధిరేటు జాతీయ స్థాయిలో 5.8 శాతం కాగా, ఏపీలో 11.37శాతంగా నమోదయింది. వ్యవసాయం, పారిశ్రామిక, సేవారంగాలన్నింటిలోనూ గణనీయంగా అభివృద్ధిని సాధించింది.ఏపీ వృద్ధిరేటు 201415లో 8.5 శాతం, 2015-16లో 10.95 శాతం, 2016-17లో  11.61 శాతం సాధించింది. గత మూడేళ్ల నుంచి రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది వృద్ధి రేటు లక్ష్యం 15 శాతంగా నిర్ధేశించారు. ఒక దశాబ్ధం పాటు స్థిరమైన రెండంకెల సమ్మిళిత వృద్ధి రేటు 12 నుంచి 19 శాతం నమోదు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సమ్మిళిత అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వ గణాంక శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ పలు చర్యలు చేపట్టింది. 17 ప్రధాన లక్ష్యాలు, స్థూల స్థాయిలో 27 లక్ష్యాలు, సూక్ష స్థాయిలో 104 సూచికలతో ఒక ప్రణాళిక రూపొందించి మొదటి అడుగు వేసింది. జాతీయ స్థాయిలో నీతి(నేషనల్ ఇన్ స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా) అయోగ్, అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ రూపొందించిన అంశాల ఆధారంగా రాష్ట్రాభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రీయంగా ప్రణాళికలను అమలు చేయడం మొదలుపెట్టింది. ఆచరణలో సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల కార్యకలాపాలను సమన్వయపరచడానికి రాష్ట్ర ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో విజన్ మేనేజ్ మెంట్ యూనిట్(విఎంయు)ని ఏర్పాటు చేశారుమానవాభివృద్ధికి పేదరికం పెద్ద అండ్డంకిగా ఉంటుంది. అందువల్ల 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆదాయం, వినియోగం ఆధారంగా ప్రస్తుతం దేశంలో వివిధ రూపాలలో ఉన్న పేదరికం  రేటు 20.9 శాతం ఉండగా, రాష్ట్రంలో 9.2 శాతం మాత్రమే ఉంది. దానిని 2019 నాటికి 7.3 శాతానికి, 2022 నాటికి 2.8 శాతానికి, 2029 నాటికి 0 కి చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యంఅలాగే అందరికీ సామాజిక భద్రక కల్పించాలని కూడా నిర్దేశించుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలకు మంచినీరు, రవాణా, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కనీస సౌకర్యలు కల్పించడం, పెన్షన్ వంటి వాటి ద్వారా సామాజిక రక్షణ కల్పించడం, వనరులు అందరికీ సమానంగా అందుబాటులో ఉంచడం, ఆదాయ మార్గాలు కల్పించడం వంటి బహువిధాలైన చర్యల ద్వారా వారి జీవన ప్రమాణ స్థాయిని ప్రభుత్వం పెంచుతోంది.  రాష్ట్రంలో తలసరి ఆదాయం 201415లో రూ.93,699లు, 201516లో రూ.1,07,532లు, 201617లో రూ.1,22,376లకు చేరింది. 2030 నాటికి తలసరి ఆదాయం రూ.9,60,768లకు చేరాలన్నేది ప్రభుత్వం లక్ష్యం.
           జీఏవీ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) అత్యధిక శాతం వాటా కలిగిన 9 రంగాలను  ప్రధాన వృద్ధి కారకాలు (గ్రోత్ ఇంజన్స్)గా ప్రభుత్వం గుర్తించింది. మత్స్య, సముద్ర ఉత్పత్తులు, పశుసంవర్ధక, తయారీ రంగం, ఉద్యాన శాఖ, వర్తకం, మరమ్మతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వల రంగం, వ్యవసాయ రంగాలలో వృద్ధి రేటు పెరగడానికి అవకాశం  ఉండటంతో వాటికి అధిక లక్ష్యాలను నిర్దేశించారు. ముఖ్యంగా ఆక్వా, పండ్ల తోటల పెంపకంలో వృద్ధి రేటు గణనీయంగా పెరగడానికి అవకాశం ఉంది. మెరైన్ ఉత్పత్తుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో 974 కిలో మీటర్ల సముద్రతీర ప్రాంతం ఉంది. సముద్రం ఉత్పత్తుల ద్వారా రాష్ట్ర ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది.  2015-16లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయిఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే స్థాయికి ఎదగడానికి తగిన ప్రణాళికలు రూపొందించారు. ఈ రంగంలో ప్రాసెసింగ్ విభాగంపై దృష్టి సారించారు.  గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయిరాయలసీమలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం కూడా పెరుగుతోందిఈ ఏడాది తొలి అర్ధభాగంలో  వ్యవసాయం, అనుబంధ రంగాలలో 25.6 శాతం వృద్ధి నమోదైంది.  వ్యవసాయంలో సుస్థిర అభివృద్ది సాధిస్తూ, రైతుల ఆదాయం పెరగడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  వివిధ శాఖల వృద్ధి రేటుపై ఆయా శాఖాధిపతులతో ఎప్పటికప్పుడు  సమావేశమవుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. వృద్ధికి అవకాశం ఉన్న రంగాలను ప్రోత్సహిస్తున్నారు.  ఏయే రంగాల్లో వృద్ధి రేటు పెరుగడానికి అవకాశం ఉంది, ఏయే రంగంలో వృద్ధి రేటు అంత ఆశాజనకంగా లేదో సమగ్రంగా విశ్లేషించుకుంటూ రియల్ టైం గవర్నెన్స్, ప్రణాళిక శాఖ, ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఉమ్మడిగా  వ్యూహాలను ఖరారు చేసుకుంటున్నాయి. మరింత వృద్ధి రేటుకు ఆస్కారం ఉన్న శాఖలపై దృష్టిసారిస్తున్నారు. అభివృద్ధికి అవకాశం కల్పించే సూచికలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. తక్కువ వృద్ధి రేటు ఉన్న రంగాలతోపాటు ఆదాయం పెరిగే అవకాశం ఉన్న పర్యాటక, పరిశ్రమలు వంటి రంగాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదల అంశంపై లోతుగా చర్చించేందుకు  సీఎం ఈ నెల 12వ తేదీ మంగళవారం అన్ని శాఖల ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధిపతులతో సమావేశం కానున్నారు.

-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...