Dec 5, 2017

విమాన సర్వీసులు పెంపుపై ప్రభుత్వం దృష్టి


రాష్ట్రాభివృద్ధిలో భాగంగా  మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి మౌలిక సదుపాయాలు కీలకంగా ఉంటాయి. సాంకేతికత అభివృద్ధితో ప్రపంచం రోజురోజుకు చిన్నదైపోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం పారిశ్రామిక, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్యం తదితర రంగాలలో బహుముఖంగా అభివృద్ధి చెందడానికి విమానాశ్రయల అభివృద్ధి, విమాన సర్వీసులు అందుబాటులో ఉంచడం అత్యవసరంముఖ్యంగా  ప్రజా రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయిలో మహానగరంగా రూపుదిద్దుకోవాలంలే విమాన సర్వీసులు అందుబాటులో ఉండాలి. అందువల్ల రాష్ట్ర  ప్రభుత్వం  వసతుల కల్పనలో భాగంగా  విమానాశ్రయాల అభివృద్ధిపై, విమాన సర్వీసులు పెంచడంపైన దృష్టి పెట్టింది. అంతేకాకుండా రాష్ట్రంలో పెరుగుతున్న విమాన ప్రయాణికులను, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటుచేయడం ద్వారా రాష్ట్రాన్ని  విమానయాన హబ్‌గా రూపొందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న క్రమంలో రోజురోజుకు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందది. దాంతో రాష్ట్రంలో వీలైనన్ని విమాన సర్వీసులను నడపడం ద్వారా ఎయిర్ కనెక్టివిటీ పెంచడానికి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నిర్దిష్ట కాలవ్యవధిలో రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, విమానయాన సర్వీసుల పెంపు జరిగేలా ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు
రాజధాని అమరావతికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఎన్టీఆర్-అమరావతి (గన్నవరం) విమానాశ్రయం నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య భారీగా పెరింగింది. దాంతో దీనిని అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేశారు. ఇక్కడ నుంచి దేశంలోని అన్ని నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ని అందుబాటులోకి  రావడంతో అంతర్జాతీయ విమానాశ్రయ హోదా లభించింది. గన్నవరం - విశాఖపట్నం, గన్నవరం - హైదరాబాద్, గన్నవరం - తిరుపతి, గన్నవరం - కడప మధ్య సర్వీసులు పెంచే ఆలోచన కూడా ఉంది. రాష్ట్రం నుంచి అన్ని విమానాలు 90 నుంచి 95 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయిపెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులను పెంచవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. రాజధాని నుంచి దేశంలోని ఇతర నగరాలకు కనెక్టివిటీ పెంచడం కోసం  కేంద్రంపై వత్తిడి పెంచాలని నిర్ణయించింది. . రాష్ట్రంలోని విమానాశ్రయాలను ప్రాంతీయంగా అనుసంధానం చేస్తారు. ఈ మేరకు ఎయిర్ పోర్ట్ ఆధారిటీ - పౌర విమానయాన శాఖ - ప్రభుత్వాల మధ్య ఒప్పందం కూడా జరిగిందిఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో విమానాశ్రయాల మధ్య తక్కువ ఛార్జీలతో ప్రాంతీయ పౌర విమాన సర్వీసులు పెరుగుతాయి. మరిన్ని విమాన సర్వీసులను నడపడం ద్వారా రీజనల్ కనెక్టివిటీ పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. . ఇందులో భాగంగా విజయవాడ కడప  మార్గంలో రోజుకు రెండు పర్యాయాలు, విజయవాడ-పుట్టపర్తి మార్గంలో రోజుకు ఒక పర్యాయం చొప్పున విమాన సర్వీసులు నడిపే ఏర్పాట్లు చేస్తున్నారు.   ప్రస్తుతానికి 8 నుంచి 20 సీటర్ల చిన్న ఎయిర్ క్రాఫ్ట్ లను  నడుపుతారు. సంబంధిత అనుమతులు రాగానే జనవరి 1 నుంచి ఈ సర్వీసులను ప్రారంభిస్తారు. హైదరాబాద్-విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మరిన్ని విమాన సర్వీసులను నడపడానికి ఎయిరిండియా, జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో వంటి విమానయాన సంస్థలతో ప్రభుత్వం  సంప్రదింపులు జరుపుతోంది.. తిరుపతి విమానాశ్రయం నుంచి త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయిఅక్కడ 3 అదనపు పార్కింగ్ బేస్‌తో విస్తరణ పనులు ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. విజయవాడ విమానాశ్రయానికి  అంతర్జాతీయ హోదా దక్కిన నేపథ్యంలో కోడ్-ఇ తరహా ఎయిర్ క్రాఫ్టులు నడిపేందుకు వీలుగా ప్రస్తుత రన్‌వే విస్తరణ పనులు జరుగుతున్నాయి.. ఇప్పటికే మంజూరైన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాల నిర్మాణాన్ని రెండున్నరేళ్లలో పూర్తిచేయడానికి అధికారులు కృషి చేస్తున్నారు. .
               రాజమండ్రిలోని మధురపూడి  విమానాశ్రయంలో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుగోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రన్ వేని విస్తరిస్తున్నారు. ఇందుకోసం  850 ఎకరాలు సేకరించి, ప్రస్తుతం ఉన్న 1750 మీటర్ల  రన్ వేను 3,165 మీటర్ల కు పొడిగిస్తున్నారురూ.181 కోట్ల ఖర్చుతో ఈ రన్ వే విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ  నెలాఖరుకు అయ్యే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయానికి సంబంధించి 3 అదనపు పార్కింగ్ బేస్‌కు సంబంధించిన యాప్రాన్ నిర్మాణం పూర్తయింది. ఇండిగో విమాన సంస్థ ఇక్కడి నుంచి వచ్చే జనవరి 16న ఒకేసారి 4 సర్వీసులు ప్రారంభించనుందిహైదరాబాద్ కు రెండు, బెంగళూరు, చెన్నైలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 సర్వీసులు నడపనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి ఇక్కడ స్పైస్ జెట్, ట్రూజెట్ లు ఒక్కొక్కటి, జెట్ ఎయిర్ వేస్ రెండు సర్వీసులు మొత్తం 4 సర్వీసుఃలు అందుబాటులో ఉన్నాయి. గోదావరి పుష్కరాల ముందు డీ గ్రేడ్ లో ఉన్న ఈ విమానాశ్రయం సీ గ్రేడ్ సాధించింది. దాంతో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కుప్పం, దొనకొండ, నాగార్జునసాగర్, పుట్టపర్తిలలో ప్రస్తుతం ఉన్న బ్రౌన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దొనకొండ విమానాశ్రయానికి సంబంధించి చిన్నతరహా విమానాల రాకపోకలకు వీలుగా ప్రస్తుతం ఉన్న రన్‌వేను విస్తరించడానికి అనుమతి కోరుతూ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. విజయనగరం జిల్లా భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఇప్పటికే అన్నిరకాల పర్యావరణ అనుమతులు లభించాయి280.4 ఎకరాల ప్రైవేట్ భూములు సహా మొత్తం 493 ఎకరాల భూమి ఈ విమానాశ్రయానికి సమకూర్చవలసి ఉంది.. దగదర్తి విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి మొత్తం 1399 ఎకరాల భూమిలో 1095 ఎకరాల స్థలం స్వాధీనం చేశారు.. వోర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటుకు అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు లభించాయి. ఈ విధంగా విమానాశ్రయాలు, సర్వీసులు పెంచడం ద్వారా పౌరవిమానయాన రంగంలో 2022 నాటికి రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలన్న ధ్యేయంతో ప్రభుత్వం ఉంది. ఎంపిక చేసిన పట్టణాలకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంచడం ద్వారా సమతౌల్య అభివృద్ధికి మార్గం ఏర్పరచనున్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయనున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. . విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, డొమెస్టిక్‌ సర్వీసుల పెంపు వంటి బాధ్యతలను  ఈ అథారిటీకి అప్పగిస్తారు. పుట్టపర్తిలో ఫ్లయింగ్ అకాడమీని కూడా ఏర్పాటు చేయనున్నారు.

-       శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...