Dec 2, 2017

ముగిసిన శాసనసభ సమావేశాలు


ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి
           సచివాలయం, డిసెంబర్ 2: ఏపీ 14వ శాసనసభ 10వ సెషన్ సమావేశాలు ముగిశాయని ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద శనివారం సాయంత్రం ఆయన మాట్లాడారు. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 2 వరకు 12 రోజుల్లో 67.42 గంటల పాటు ఈ సమావేశాలు జరిగినట్లు తెలిపారు. మొత్తం 88 స్టార్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని, అందుకు 17.52 గంటల సమయం పట్టిందని, 94 మంది సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నట్లు వివరించారు. 10 అంశాలకు సంబంధించి 25.13 గంటలపాటు జరిగిన స్వల్పకాలిక చర్చలో 71 మంది పాల్గొన్నట్లు తెలిపారు. 344 రూల్ కింద 6 ఆరు అంశాలపై 7.32 గంటలపాటు చర్చ జరిగిందని, ఈ చర్చల్లో 27 మంది పాల్గొన్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ, రూరల్, అర్బన్ హౌసింగ్, గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా,శిశు సంక్షేమం, కాపు, బ్రాహ్మణ కార్పోరేషన్, వైద్యఆరోగ్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం, కేంద్ర ఆర్థిక సహాయం, పెట్టుబడులు, చంద్రన్న బీమా, రెండంకెల వృద్ధి రేటు, విద్యుత్, విద్యార్థుల ఆత్మహత్యలు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారిత, అభివృద్ధి తదితర అంశాలను కూలంకషంగా చర్చించినట్లు వివరించారు.

ప్రతిపక్షం లేకపోయినా అధికార పక్షం, మిత్ర పక్షం సభ్యులు అనేక ప్రశ్నలు అడిగారని, మంత్రులు సమర్థవంతంగా సమాధానాలు చెప్పారని తెలిపారు. బాధ్యతాయుతంగా, జవాబుదానితనంతో టీడీపీ సభ్యులు వ్యవహరించారని చెప్పారు. చర్చలలో పాల్గొనేందుకు పలువురికి అవకాశం వచ్చిందన్నారు. సభ సజావుగా జరిగిందని, అందుకు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  ప్రజా సమస్యలను చర్చించి, పరిష్కరించుకునే వేదిక ఇదని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీనిని ఉపయోగించుకోలేకపోవడం విచారకరం అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కాపు రిజర్వేషన్, బోయ(వాల్మీకి)లను ఎస్టీల్లో చేర్చమని కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానాలు చేసినట్లు తెలిపారు. రజకులను ఎస్సీల్లో చేర్చే అంశం పరిశీలనలో ఉందని చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...