Dec 1, 2017

విద్యా వ్యవస్థను గాడిలోపెడుతున్న ప్రభుత్వం


v సీఎం అనుకుంటే వదిలిపెట్టరు
v మౌలిక వసతుల కల్పనకు రూ. 4,848 కోట్లు
v 220 ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలల ఉన్నతీకరణ
v విద్యార్ధుల సందేహాల నివృత్తికి ఏపీఈకెఎక్స్
v ప్రైవేటు పాఠశాలల్లోనూ బయోమెట్రిక్ అటెండెన్స్
v ప్రైవేటు విద్యా సంస్థలకు హెచ్చరిక
v 5వేల డిజిటల్ తరగతులకు ఏర్పాట్లు
v మందడంలో తొలి వర్చువల్ క్లాస్ రూమ్ ప్రారంభం
v ప్రభుత్వ కళాశాలలకు వైఫై
v విద్యార్థులు అందరి వివరాలు ఆధార్ తో అనుసంధానం


        రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టత, ప్రమాణాల పెంపుపై ప్రభుత్వం దృష్టిపెట్టారు. పాఠశాల విద్యావ్యవస్థను చక్కదిద్దేందుకు పూనుకుంది. వ్యవస్థలో వచ్చే సాంకేతిక మార్పులకు అనుగుణంగా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది.  పాఠశాల స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు ఇటీవల కాలంలో పెరిగిపోతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైనా ఒకటి అనుకుంటే అది పూర్తి అయ్యేవరకు దానిని వదిలిపెట్టరు. పట్టుదలగా పని చేస్తారు. తాను నిద్రపోరు, అధికారులను నిద్రపోనివ్వరు. ప్రజా రాజధాని మహానగరం అమరావతి నిర్మాణం,  పోలవరం ప్రాజెక్టుల కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఏకంగా వారంలో ఒక రోజు  సోమవారం పోలవరం కోసం కేటాయించారు. ఆయన ఎక్కడ ఉన్నా ఆ రోజు ఆ ప్రాజెక్ట్ ప్రగతిని సమీక్షిస్తారు. ఇప్పుడు అలాగే రాష్ట్రంలో విద్యా వ్యవస్థ మెరుగుపడేవరకు, విద్యాశాఖ పనితీరు గాడిలో పడేంతవరకు అవసరమైతే వారానికోసారి సమీక్ష నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్ర పాఠశాల విద్యార్ధులు  ఇంగ్లీష్‌లో 17వ స్థానం, మాథ్స్ లో 6వ స్థానం, సైన్స్‌ లో 11వ స్థానంలో వున్నారు. 2022 నాటికి ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో రాష్ట్ర విద్యార్ధులు దేశంలోనే మొదట నిలిచేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇ-హాజరు100 శాతం  అమలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. 41,601 పాఠశాలలు, 1,66,931 మంది ఉపాధ్యాయులు, 34,04,109 విద్యార్ధులు ఇ-హాజరుపరిధిలోకి వచ్చారు. ఉపాధ్యాయుల హాజరులో 82.49 శాతంతో శ్రీకాకుళం జిల్లా ముందుండగా, 70.67 శాతంతో ప్రకాశం జిల్లా చివరి స్థానంలో ఉంది.   ప్రైవేటు పాఠశాలల్లో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ప్రవేశ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవస్థను చక్కదిద్దే కార్యక్రమంలో భాగంగా ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులకు రేటింగ్ విధానం అమలు చేస్తారు. ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం కోసం ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం అమలు చేయడంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు 5,582 ఉపాధ్యాయ పోస్టులలో ఖాళీలు వున్నాయి.  మే 2018 నాటికి మరో 501 పోస్టులు ఖాళీ అవుతాయని అధికారులు  లెక్క తేల్చారు. ఈ పోస్టులను వచ్చే ఏడాది భర్తీ చేసే అవకాశం ఉంది.

 సామాజికసేవ, సచ్ఛాంధ్రప్రదేశ్ రెండింటిలో విద్యార్ధులను మరింతగా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో వారికి గ్రేస్ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్ధి వివరాలను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసి, అందరి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్త పరుస్తారు. పదో తరగతి ఉత్తీర్ణత తర్వాత ఎంతమంది విద్యార్ధులు ఇంటర్మీడియేట్, తత్సమాన కోర్సులు చదువుతున్నారో, పాఠ్యాంశాల్లో ఎలాంటి మార్పులుచేర్పులు తీసుకురావాలనే దానిపై అధ్యయనం జరగవలసిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వైఫై ఏర్పాటు చేస్తారు.  అన్ని విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లకు ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా 100 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తారు. అలాగే అన్ని కళాశాలలకు, పాఠశాలలకు వర్చువల్ క్లాస్ రూముల కోసం 15 ఎంబీపీఎస్ వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తారు. రాష్ట్రంలోని మొత్తం 447 ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ల్యాబ్‌తో పాటు తాగునీటి సదుపాయం కల్పించారు. 402 కళాశాలకు సొంత భవనాలు వుండగా, 45 కళాశాలలకు సొంత భవనాలు నిర్మించవలసి ఉంది.

విద్యార్ధుల సందేహాల నివృత్తి కోసం, పలు విషయాలపై  ఉపాధ్యాయులతో చర్చించేందుకు, సమీక్షించేందుకు, ఇ-కంటెంట్ కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ఇ-నాలెడ్జ్ ఎక్స్చేంజ్ (ఏపీఈకేఎక్స్) పోర్టల్ ప్రారంభించారు.  కేంద్రం ఇదే తరహాలో తీసుకొచ్చిన దీక్షపోర్టల్‌తో దేశంలో మొట్టమొదటగా అనుసంధానమైన పోర్టల్ ఇదే.  ఏపీఈకేఎక్స్ ద్వారా 130 మంది విషయ నిపుణులు సేవలు అందిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు డిజిటల్ తరగతులు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి దశలో 5 వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు 2,399 పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశారు.  మిగిలిన చోట కూడా వచ్చే ఏడాది జనవరి 15 నాటికి సిద్ధం చేస్తారు. రాష్ట్రంలో తొలి వర్చువల్ క్లాస్ రూమ్ ని రాజధాని అమరావతి పరిధిలోని మందడం హైస్కూల్ లో నవంబర్ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులను విద్యార్థులకు వివరించారు. సాధారణ పద్ధతిలో ఉపాధ్యాయుడు గంటసేపు చెప్పగలిగే పాఠ్యాంశాన్ని వర్చువల్ క్లాస్ రూమ్ పద్ధతిలో 10 నిమిషాల్లో విద్యార్థి అవగాహన చేసుకునే వీలుంది. ప్రతి పాఠశాలకు ఒక టీవీని అందజేస్తారు.  వర్చువల్ క్లాస్‌రూమ్‌ ద్వారా చెప్పే పాఠాలను టీవీ ద్వారా మళ్లీ మళ్లీ ప్లే చేసుకొని చూసే అవకాశం ఉంటుంది. వర్చువల్ క్లాస్‌రూమ్స్ కోసం 40 స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క స్టూడియోలో 10 మంది సబ్జెక్ట్ నిపుణులు, ప్రత్యేక ఉపాధ్యాయులు ఉంటారు. బోధనాంశాల తయారీ కోసం ప్రత్యేక విభాగం ఉంటుంది.  ఒక్కొక్క వర్చువల్ స్కూలుకు సమీపంలో ఉన్న మరో 20 పాఠశాలలు అనుసంధానంగా ఉంటాయి. ఒకే సమయంలో ఈ 20 స్కూళ్ల విద్యార్థులు పారాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. డిజిటల్ తరగతులకు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మునిసిపల్ పాఠశాలల్లో విద్యార్ధుల చేరిక శాతాన్ని పెంచడానికి, వారికి మెరుగైన రీతిలో విద్య బోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనలతో ప్రణాళికలు రూపొందించింది.  కెరీర్ ఫౌండేషన్ కోర్స్(సీఎఫ్ సీ) ప్రవేశపెట్టింది. ఈ కోర్సులో ప్రతిభ చూపిన వారికి అడ్వాన్స్‌ డ్ ఫౌండేషన్ కోర్సు(ఏఎఫ్ సీ)లో అవకాశం కల్పిస్తారు. సివిల్స్, ఐఐటీ  వంటి చదువులకు విద్యార్ధుల్లో ఆసక్తి పెంచి ప్రోత్సహించడానికి, వారి ఉజ్వల భవితకు ఈ కొత్త కోర్సులు బాటవేస్తాయి. సీఎఫ్ సీకి 57,252 మంది విద్యార్ధులను ఎంపిక చేశారు. వారికి 1,500 మంది రెగ్యులర్ టీచర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు


 2019-20 నాటికి 33,145 అదనపు తరగతి గదులు, 21,249 పాఠశాలలకు ప్రహరీగోడలు నిర్మించడంతో పాటు, 40,665 పాఠశాలలకు ఫర్నిచర్ సౌకర్యం కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 220 ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను ప్రాథమికోన్నత పాఠశాలలుగా ఉన్నతీకరిస్తారు.  పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ. 4,848 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి నూరు శాతం గ్యాస్ కనెక్షన్లు ఇప్పించడంతో పాటు నూరు శాతం గ్యాస్ వినియోగించేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని 9వ తరగతి విద్యార్ధులకు ఓడీఎఫ్‌(ఓపెన్ డిఫెక్షన్ ఫ్రీ - బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత)పై ప్రాజెక్టు వర్క్ ప్రవేశపెట్టారు.  రాష్ట్రంలోని 27,813 పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది.  
           కాలేజీల్లో, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రాష్ట్రంలోని కార్పోరేట్ కాలేజీలు, ఇతర ప్రైవేటు కాలేజీలు, పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థులపై వత్తిడి, పాఠ్యాంశాలు, తరగతి గదులు, మరుగుదొడ్లు, హాస్టల్ రూమ్స్, స్టడీ అవర్స్, కాలేజీలో గానీ, హాస్టల్ లోగాని ఎన్ని గంటలు చదివిస్తున్నారు, ఆటల సమయం, సైకాలజిస్టుల ఉన్నారా లేరా, కాలేజీల మధ్య పోటీ తదితర అంశాలను అధ్యయనం చేసింది. విద్యార్థుల ద్వారా పరిస్థితులను సమీక్షించింది. చదువు విషయంలో విద్యార్థులు తీవ్ర వత్తడికి గురవుతున్నట్లు,  స్టడీ అవర్స్ ఎక్కవగా ఉన్నట్లు, ఉదయం 5 గంటలకు లేచిన విద్యార్థి రాత్రి 11 గంటలకు పడుకోవడం నిద్ర సరిపోవడంలేదని, ఇంటర్ బోర్డు సిలబస్ కాకుండా అదనపు సిలబస్ బోధిస్తున్నారని, ఆటలకు సమయం కేటాయించడంలేదని, చాలీచాలని తరగతి గదులు, హాస్టల్ గదులు, ముగ్గురు కూర్చునే బెంచ్ పై అయిదుగురిని కూర్చోపెట్టడం, అతి తక్కువ మరుగుదొడ్లతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నట్లు, గుర్తింపులేని హాస్టళ్ల నిర్వహణ, విద్యా సంస్థల మధ్య పోటీ వల్ల ఒకరిని మించి ఒకరు స్టడీఅవర్స్ నిర్వహించడం వంటి అంశాలను  కమిటీ గుర్తించింది.  ప్రభుత్వానికి కొన్ని సలహాలు, సూచనలు చేసింది.  ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విద్యాశాఖ ఉన్నతాధికారులు,  ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు, ట్రిపుల్ ఐటీ వైస్ చాన్సలర్, డైరెక్టర్లతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. విద్యార్థులపై వత్తిడి తగ్గించడానికి స్టడీ అవర్స్ తగ్గించాలని, ఆటలకు, ఎంటర్ టైన్ మెంట్ కు తప్పనిసరిగా కొంత సమయం కేటాయించాలని, సైకాలజిస్టులను నియమించాలని, పరిస్థితుల్లో మార్పు రాకపోతే ఎవరిపైనైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ విధమైన చర్యల ద్వారా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడుతుందని ఆశిద్ధాం.
-         శిరందాసు నాగార్జున,  డెవలప్ మెంట్ జర్నలిస్ట్ – 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...