Dec 20, 2017

బ్రాహ్మణ కార్పోరేషన్ కు నిధుల కొరతలేదు


చైర్మన్ వేమూరి ఆనంద సూర్య
              సచివాలయం, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ(బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పోరేషన్)కు నిధుల కొరతలేదని ఆ సంస్థ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. తమకు నిధులు విడుదల సమస్య ఏమీ లేదని, ఇతర అన్ని శాఖలకు విడుదల చేస్తున్న రీతిలోనే ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్ కు కూడా క్వార్టర్లీ విధానంలో నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల కింద 33,162 మందికి  రూ.59 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం తమ సంస్థకు రూ.75 కోట్లు బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు.  వివిధ పథకాల కింద 42,895 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటి వరకు మూడు క్వార్టర్లకు రూ.56.25 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. 4వ క్వార్టర్ కు సంబంధించిన రూ.18.75 కోట్లు జనవరిలో విడుదల చేస్తామని చెప్పారు. పరిశీలించవలసిన దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉన్నాయని, అవసరమైతే అదనపు సిబ్బందిని తీసుకొని పరిశీలన వేగవంతం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పేద బ్రాహ్మణుల స్థితిగతులను, సమస్యలను అర్ధం చేసుకొని ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్రలో భాగంగా 2013 ఫిబ్రవరి 23న గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పారని, ఆ తరువాత అధికారంలోకి రాగానే దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కార్పోరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం గాయత్రి విద్యా ప్రశస్తి పథకం కింద 279 మందికి రూ.27.17 లక్షలు, భారతి విద్యా పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్న తేడా లేకుండా  10,397 మంది విద్యార్థులకు రూ.15 కోట్లు, భారతి విదేశీ విద్యా పథకం కింద పది మంది విద్యార్థులు విదేశాలలో విద్యాభ్యాసం చేసేందుకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. వేదవ్యాస విద్య పథకం కింద 186 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు చెప్పారు. చాణక్య పథకం కింద వ్యాపార, పారిశ్రామిక సంస్థలు నెలకొల్పేందుకు, బ్రాహ్మణులను కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ ఏడాది 145 మందికి రూ.1.20 కోట్లు సబ్సిడీ విడుదల చేసినట్లు తెలిపారు. వశిష్ట పథకం కింద సివిల్ సర్వీస్, గ్రూప్ 1, 2, బ్యాంకింగ్, రైల్వే వంటి పోటీ పరీక్షలకు 35 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. కాశ్యప పథకం కింద వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు నెలకు వెయ్యి రూపాయలు పెన్షన్ అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 12,402 మందికి రూ.11 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. మరో 4వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. కాశ్యప-అహల్య పెన్షన్ పథకం కింద భర్తకు దూరమైన ఒంటరి మహిళలకు, వివాహం కాని 50 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నామని, ఈ పథకం కింద 229 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఇంకా ద్రోణాచార్య నైపుణ్య అభివృద్ధి, చంద్రశేఖర-వివాహ సంస్కరా, భార్గవ భాగస్వామ్య వంటి పలు పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఉన్న జిల్లా, నియోజకవర్గ సమన్వయ కర్తల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు. త్వరలో కొత్త వ్యవస్థను రూపొందించి, పేద బ్రాహ్మణులకు చేరువై సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
          కార్పోరేషన్ కార్యకలాపాలన్నీ పూర్తిగా కంప్యూటరీకరణ చేసి ఎటువంటి పక్షపాతానికి తావులేకుండా అత్యంత పారదర్శికంగా అర్హతల ఆధారంగా లబ్దిదారులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన అన్నీ ఆన్ లైన్ విధానంలో చేయడం వల్ల అవినీతి, అవకతవకలకు తావులేకుండా పథకాల నిధులు లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతున్నట్లు వివరించారు. దరఖాస్తుదారులు ఎప్పటికప్పుడు తమ దరఖాస్తు పురోగతిని ఆంధ్రబ్రాహ్మిణ్ వెబ్ సైట్, టోల్ ఫ్రీ నెంబర్ 18001083579 ద్వారా తెలుసుకోవచ్చన్నారు. తనతోపాటు అధికారులు అందరూ సమన్వయంతో బ్రాహ్మణుల పురోభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఆనంద్ సూర్య చెప్పారు. ఈ సమావేశంలో కార్పోరేషన్ డైరెక్టర్ డీవీ శ్యామారావు, జీఎం వెంకట శాస్త్రి పాల్గొన్నారు.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...