Dec 15, 2017

త్వరలో కొత్త టూరిజం పాలసీ


పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ
                సచివాలయం, డిసెంబర్ 14: రాష్ట్రంలో పర్యాటక శాఖ అభివృద్ధికి త్వరలో కొత్త టూరిజం పాలసీని ప్రకటించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ వెల్లడించారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆమె మాట్లాడారు. పెట్టుబడులు ఆకర్షించే విధంగా, యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా  నూతన పాలసీ ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సలహాలు, సూచనల మేరకు పాలసీ రూపొందించడం దాదాపు పూర్తి అయిందని, ఆయన అనుమతితో త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. భూమికి సంబంధించి లీజు డబ్బు, కాలపరిమితి విషయంలో మార్పులు చేయవలసి ఉందని, ప్రస్తుతం ఉన్న లీజు కాలపరిమితి 33 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచే ఆలోచన ఉందని, అలాగే లీజు సొమ్ము ప్రస్తుతం మొత్తం భూమి మార్కెట్ విలువలో 2 శాతంగా ఉందని, దానిని ఒక శాతానికి తగ్గించే ఆలోచన ఉందని తెలిపారు. సీఎం గారి అనుమతితో స్నేహపూర్వక వాతావరణంలో పెట్టుబడులు (ఇన్ వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ) పెట్టే విధంగా పాలసీని రూపొందించినట్లు ఆమె వివరించారు. టూరిజం అభివృద్ధికి భూమి సమస్య లేదని, ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు ల్యాండ్ బ్యాంక్ ఉందని తెలిపారు. భూములు తీసుకొని సకాలంలో ప్రాజెక్టులు ప్రారంభించని వారి వద్ద నుంచి భూములు తీసివేసుకుంటామని చెప్పారు. ఇక నుంచి అన్ని అంశాలను పరిశీలించి ఆసక్తి ఉన్నవారికి మాత్రమే అనుమతులు ఇస్తామని, భూముల కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా రాయలసీమ టూరిస్ట్ సర్క్యూట్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రూ.100 కోట్లు కోరుతూ డీపీఆర్(సమగ్ర సమాచారంతో ప్రాజెక్ట్ నివేదిక) సమర్పించినట్లు వివరించారు. ఆ నిధులతో అక్కడి దేవాలయాలతోపాటు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. అలాగే అరకు టూరిజం స్క్యూట్  కోసం రూ.50 కోట్లు కోరినట్లు తెలిపారు. టూరిజం ఫైనాన్స్ కార్పోరేషన్ ప్రాంతీయ కార్యాలయం దక్షిణ భారతదేశంలో విజయవాడలో ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. బోటు ప్రయాణానికి లైఫ్ జాకెట్లు తప్పసరి చేసిన నేపథ్యంలో వాటికోసం నిధులు కేటాయించమని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మని కోరామన్నారు. ఏపీ టూరిజం ప్రమోషన్ లో భాగంగా తాము లండన్ లో జరిగిన వరల్డ్ టూరిజం మార్ట్ కు వెళ్లినట్లు తెలిపారు. అక్కడ టూరిజం రంగంలో హోటల్ సీఈఓల వంటి పలువురు ప్రముఖులను కలిసినట్లు, అంతర్జాతీయ స్థాయి మీడియాకు మన రాష్ట్రంలోని 973 కిలో మీటర్ల సముద్ర తీరం, పర్యాటక ప్రదేశాల గురించి, ఈ రంగం అభివృద్ధికి అవకాశాల గురించి తెలియజేసినట్లు చెప్పారు. అక్కడకు వెళ్లడం వల్ల కొత్త ప్రతిపాదనలు కూడా వచ్చినట్లు మంత్రి తెలిపారు. అలీబాబా ఆన్ లైన్ షాపింగ్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పరిశీలించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ అందుబాటులోకి రానున్నందున ఇంటర్ నెట్ వాడకం దారులు పెరుగుతారని, ఆ విధంగా ఆన్ లైన్ షాపింగ్ ఎక్కవగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ రంగంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వెయ్యి నుంచి రెండు వేల మంది యువతకు ఉపాధి అభించే అవకాశం ఉందన్నారు. ఉప్పాడ, కొండపల్లి బొమ్మలు వంటి వాటికి ఆన్ లైన్ మార్కెట్ ఉంటుందన్నారు. విశాఖ, తిరుపతి వంటి చోట్ల మోనో రైలు ప్రవేశపెట్టే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బుద్దిజం సర్క్యూట్ ని అభివృద్ధి చేస్తున్నామని, విశాఖ నుంచి శ్రీలంకకు ప్రస్తుతం నడుతున్న శ్రీలంక ఎయిర్ లైన్స్ సర్వీసును పెంచనున్నట్లు తెలిపారు. విశాఖ, తిరుపతి, కర్నూలు వంటి చోట్ల పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. సదస్సులలో వారి ఉపయోగపడే అనేక అంశాలతోపాటు వారి సమస్యలు కూడా చర్చించవచ్చన్నారు.
          అరకులో బెలూన్ల ఫెస్టివల్ నిర్వహించామని, అలాగే తిరుపతిలో క్రాఫ్ట్ మేళా, కర్నూలులో ఓ పెద్ద కార్యక్రమం నిర్వహిస్తామని, ఇంకా ధూల్ ఫెస్టివల్, హస్తకళలు, గిరిజన, సాంస్కృతిక ఫెస్టివల్స్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించడంతోపాటు వాటికి కాపీరైట్స్ కూడా తీసుకోమని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కాకినాడలో ఈ నెల 21న నిర్వహించే కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ పాల్గొంటున్నారని, అందరికీ ఉచిత ప్రవేశం కల్పించినట్లు మంత్రి తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతోపాటు హోటల్స్ ఆదాయం పెరుగుతుందన్నారు. హరిత హోటళ్లను అప్ గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపారు.  కేంద్రం నుంచి నిధులు రాబట్టడం ద్వారా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని, ఈ ఆర్థిక సంవత్సరంలోనే రూ.300 కోట్ల నిధులు తీసుకువస్తామని,  సీఎం ఆలోచనలకు అనుగుణంగా వెంటవెంటనే పనులు చేపడతామని చెప్పారు.  విజయవాడలో సీ ప్లెయిన్ డెమో నిర్వహించినందుకు సీఎంకు, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

పని చేయనివారికి ఉద్వాసన: మంత్రి హెచ్చరిక
         పర్యాటక శాఖలో పని చేయనివారికి ఉద్వాసన తప్పదని మంత్రి హెచ్చరించారు. పర్యాటక రంగాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేయడానికి మంచి టీమ్ ని ఏర్పాటు చేస్తున్నామని, ఈ విషయమై అధికారులతో మాట్లాడినట్లు  చెప్పారు. అనుమతి ఉన్న బోట్లకు మాత్రమే బోటింగ్ కు అనుమతిస్తున్నట్లు, బోటింగ్ కు సంబంధించి శాటిలైట్ మ్యాపింగ్ సిద్ధం చేస్తున్నట్లు  తెలిపారు. విశాఖలో నేవీ వారి అనుమతి పొందడంలో ఆలస్యం అయినందున హెలీ టూరిజంని ప్రారంభించలేకపోయామని మంత్రి చెప్పారు. నేవీ వారు అనమతించారని, తర్వలో సీఎం దీనిని ప్రారంభిస్తారన్నారు. విశాఖతోపాటు తిరుపతి, శ్రీశైలం, పుట్టపర్తి వంటి చోట్ల కూడా హెలీ టూరిజంకు అవకాశం ఉందన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా పర్యాటక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు, సీఆర్డీఏ వారిని కొంత భూమి కూడా అడిగినట్లు తెలిపారు. ఏపీ టూరిజంకు ఓ బ్రాండ్ అంబాసిడర్ ని నియమించే ఆలోచన ఉన్నట్లు మంత్రి తెలిపారు.

తెలుగు భాష అమలుకు చర్యలు
రాష్ట్రంలో తెలుగు భాష అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి శాఖలో తెలుగు అమలు సెక్రటేరియేట్ నుంచి అమలు చేస్తామనిబోర్డులు కూడా  తెలుగులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అధికార తెలుగు భాష సంస్థకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉందని, అది చట్ట రూపం దాల్చగానే సమూల మార్పులు చేస్తామని మంత్రి అఖిల ప్రియ చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...