Dec 28, 2017

ఫైబర్ నెట్ ద్వారా ఏపీకి మంచి భవిష్యత్


రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
సచివాలయం, డిసెంబర్ 27: టెక్నాలజీ, ఫైబర్ నెట్ ద్వారా ఏపీకి మంచి భవిష్యత్ ఉందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. సచివాలయం పక్కన ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో బుధవారం మధ్యాహ్నం ఏపీ ఫైబర్ నెట్ ను ఆయన ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 24 వేల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ లైన్లు ఏర్పాటు చేసిన పైలెట్ ప్రాజెక్ట్ గా దీనిని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా రూపొందించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా పౌరుల జీవనం మెరుగవుతుందన్నారు. డేటా కనెక్టటివిటీ, ఆప్టికల్ ఫైబర్ ని విద్యుత్ పోల్స్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేయడాన్ని ఆయన కొనియాడారు. అదే విధంగా ఇంటి అవసరాలకు 15 నుంచి 20 ఎంబిపీఎస్ స్పీడ్ నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం రూ.149లకు అందించడాన్ని ఆయన అభినందించారు. వినోదంతోపాటు విద్య, వైద్యం, టెలిమెడిసిన్, ఆరోగ్య రక్షణ, వ్యవసాయం తదితర రంగాలలో ఉపయోగపడే బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ గా దీనిని పేర్కొన్నారు. దీని ద్వారా మారుమూల గ్రామాల్లో ఉండే విద్యార్థుల టాలెంట్ వెలుగులోకి వస్తుందని చెప్పారు.  డిజిటల్ ఇండియాలో భాగంగా దేశంలోని ప్రతి గ్రామ పంచాయతీకి నెట్ సౌకర్యం, విద్యుత్, వంట గ్యాస్ అందిస్తారని చెప్పారు.
అత్యంత ఆధునిక టెక్నాలజీతో రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీసీ) ద్వారా  24/7 ప్రపంచంతో అనుసంధానమై అమరావతి ముందుందన్నారు. ఏపీ ఆర్టీజీ ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రాజెక్ట్ గా ఆయన  పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాష్ట్రపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
తండ్రీకొడుకులు ఇద్దరూ కలసి సాధించిన విజయం
ఏపీకి సంతోషకరమైన రోజులు వచ్చాయని, టెక్నాలజీ ద్వారా ప్రజలకు ఆనందం అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కొడుకు మంత్రి నారా లోకేష్ విజయం సాధించారని తెలంగాణ, అంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనియాడారు. నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఆధునిక టెక్నాలజీతో అతి తక్కువ ధరకే ఇంటర్ నెట్, కేబుల్ టీవి, టెలిఫోన్ అందిస్తున్నారని, వీడియో ద్వారా అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. సాధారణంగా ప్రజలు ప్రభుత్వం మాకు ఏం చేసిందిఅని అంటుంటారని, ప్రభుత్వం మీకు అన్నీ చేసిందని, ఇక మీరు ఏదైనా చేసి సంతోషంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వం మీకు అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించిందన్నారు.
ప్రపంచానికే ఆదర్శం: చంద్రబాబు
ఇది చరిత్రను సృష్టించే కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శంగా ఉండేవిధంగా టెక్నాలజీని ఉపయోలోకి తెస్తామని చెప్పారు. అందరూ విద్యపై శ్రద్ధ చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు బ్రహ్మాండమై భవిష్యత్ ఉందని అన్నారు. ప్రపంచం మొత్తం మీద ఐటీ నిపుణులలో నూటికి నలుగురు భారతీయులు ఉన్నారని, ఆ నలుగురిలో ఒకరు తెలుగువారని, నాదెండ్ల సత్య వంటి వారిని గుర్తు చేశారు. పారిశ్రామిక విప్లవంతో యాత్రీకరణ మొదలైందని, విద్యుత్ దానికి ఊతం ఇచ్చిందని, 1990లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరిగినట్లు పేర్కొన్నారుఇప్పుడు 4వ ఐటీ రివల్యూషన్, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటి) మొదలైందన్నారు. ఫైబర్ గ్రిడ్ రూ.5వేల కోట్ల ప్రాజెక్ట్ అని, విద్యుత్ పోల్స్ ని ఉపయోగించడం ద్వారా ఖర్చుని చాలా వరకు తగ్గించినట్లు తెలిపారు. రూ.860 కోట్ల వ్యయంతో ప్రతి పంచాయతీకి ఫైబర్ నెట్, వైఫై కనెక్షన్ ఇస్తామని చెప్పారు. ట్రిపుల్ ప్లే బాక్లుల కొరత వల్ల ఆలస్యమైనట్లు తెలిపారు. గూగుల్ ఎక్స్ సంస్థ సహకారంతో ప్రపంచంలో ఎక్కడాలేనివిధంగా మారుమూల ఉండే పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాలకు కూడా వైర్ లెస్ నెట్ కనెక్షన్ ఇస్తామని చెప్పారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ తదితర రంగాల్లో దీనిని ఉపయోగిస్తామని చెప్పారు. ఆడవారు పనిమీద బయటకు వెళ్లినప్పుడు మగవారు ఇంట్లోనే వీడియో చూస్తూ కాఫీ పెట్టుకునే సౌకర్యం కల్పిస్తామని నవ్వుతూ అన్నారు. అమరావతి గ్రీన్ సిటీ నిర్మాణానికి రూ.50 వేల కోట్ల విలువైన 33,500 ఎకరాల భూమి ఇచ్చిన రైతులకు మరోసారి అభినందనలు తెలిపారు. తమ రాష్ట్ర ప్రజలు తెలివైనవారని, దేనినైనా సాధించగలరన్నారు. వారి సహకారంతోనే తాము ఈ విజయాలు సాధింస్తున్నట్లు చెప్పారు.
9 నెలల్లో 24వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ లైన్ ఓ ప్రపంచ రికార్డ్: లోకేష్
        ఫైబర్ నెట్ ద్వారా రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రదర్శించే అవకాశం లభించిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ మంత్రి  నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాభివృద్ధికి చేపట్టిన 5 గ్రిడ్స్ లో ఫైబర్ గ్రిడ్ ఒకటని తెలిపారు. అందరూ ఆంధ్రప్రదేశ్ ని మోడల్ గా తీసుకునే విధంగా అభివృద్ధిపరుస్తున్నట్లు చెప్పారు. 9 నెలల్లో 24 వేల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ లైన్ ఏర్పాటు చేసి దేశంలోనేకాదు ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ.4700 కోట్లని, 3 లక్షలకు పైగా విద్యుత్ పోల్స్ ని వినియోగించుకొని రూ.333 కోట్లతో పూర్తి చేసినట్లు తెలిపారు. వైర్ లెస్ టెక్నాలజీతో మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా నెట్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కేవలం రూ. 149 రూపాయలకు ఇంటర్ నెట్, టెలీఫోన్ తోపాటు 250 ఛానల్స్ తో కేబుల్ టీవీ అందిస్తున్నట్లు తెలిపారు. 2018 డిసెంబర్ నాటికి కేంద్రం మంజూరు చేసే రూ.860 కోట్లతో ప్రతి మున్సిపాలిటీకీ, ప్రతి పంచాయతీకి వైఫై కనెక్షన్ ఇస్తామన్నారు. ఐటీలో గతంలో హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏపీలో చరిత్ర సృష్టించనున్నారని పేర్కొన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ టెక్నాలజీ ద్వారా స్ర్కీన్ పై అన్ని చానల్స్ ని ప్రదర్శించి రాష్ట్రపతికి చూపించారు. అలాగే పోలవరం నిర్మాణ పనులు, వివిధ పంచాయతీలలో సర్పంచ్ లను, అంగన్ వాడీ కేంద్రాలను, పాఠశాలలు, వర్చువల్ క్లాస్ రూమ్ ని,  హెల్త్ సెంటర్లను లైవ్ లో చూపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల కెమెరాలు: బాబు.
             రాష్ట్ర వ్యాప్తంగా  లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, సివిల్ వ్యవహారాలను 20 వేల కెమెరాలు పర్యవేక్షిస్తున్నట్లు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ ఎండి, ఆర్టీజీ సీఈఓ బాబు.ఏ తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలలో ట్రాఫిక్ ని రాష్ట్రపతికి లైవ్ లో చూపించారు. పార్కింగ్ ప్లేస్ కాని చోట వాహనాలను పార్క్ చేస్తే ఆ కెమెరాలు ఆటోమేటిక్ గా రికార్డ్ చేసి, నెంబర్ ప్లేట్ ని ఫొటో తీసి చలానాలను ఆ వాహనం యజమాని మెయిల్ కు పంపుతాయి. రౌడీషీటర్ల ముఖాలను గుర్తించి పోలీస్ శాఖను అలర్ట్ చేసే టెక్నాలజీ కూడా ఆ సీసీ కెమెరాలకు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 37వేల పాఠశాలల్లో వర్చువల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు, మొదటి దశలో 4వేల క్లాస్ రూమ్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. డ్రోన్ కెమెరాల ద్వారా పోలవరం ప్రాజెక్ట్ పనులను లైవ్ లో చూపించారు.
ఇతర రాష్ట్రాలకు మోడల్: అజయ్ జైన్
            తొలుత ఎనర్జీ, మౌలికసదుపాయలు, పెట్టుబడుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు, ఇతర అతిథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జైన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించడం ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్టు పేర్కొన్నట్లు తెలిపారు. ఇంత భారీ నెట్ వర్క్ ద్వారా రూ.149 రూపాయలకు ఇంటర్ నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం కల్పించే  దేశంలో మొదటి రాష్ట్రం ఏపీ అని చెప్పారు. వర్చువల్ క్లాస్ రూమ్స్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఏపీ ఇతర రాష్ట్రాలకు మోడల్ గా నిలిచిందన్నారు. 2018లో  లక్ష కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు.
             అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను శాలువాతో సన్మానించి, పరిమళబరిత పుష్పగుచ్చం అందజేశారు. అలాగే గవర్నర్ నరసింహన్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ స్టేట్ మంత్రి వైఎస్ చౌదరి, శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్, శాసన మండలి చైర్మన్ ఎన్ ఎండీ ఫరూక్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది జస్టిస్ వి.రామసుబ్రహ్మణియన్ ను శాలువాలతో సన్మానించి ఫుష్పగుచ్చాలు అందజేశారు. ఏపీ ఫైబర్ నెట్ ని ప్రారంభించిన అనంతరం ఫైబర్ నెట్ పనితీరుని స్క్రీన్ పై ప్రదర్శించారు. తూర్పుగోదావరి జిల్లా మోరీ గ్రామంలో మొట్టమొదటిసారిగా నెట్ కనెక్షన్ ఇచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకు లక్షకు మించి కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. 2 వేల కెమెరాలతో వర్చువల్ క్లాస్ రూమ్స్ నిర్వహిస్తున్నట్లు వివరించారు.  ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్న పాత్రుడు, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...