Jul 25, 2018


బంద్ విఫలం చేసిన ప్రజలు

మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ హిదాయత్
        
                 సచివాలయం, జూలై 24: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్ విఫలమైందని ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ హిదాయత్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. బంద్ కు ప్రజా సంఘాలు కూడా సహకరించలేదన్నారు. ప్రధాన ప్రతిపక్షం బంద్ కు పిలుపు ఇస్తే ఈ విధంగా విఫలం కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని పేర్కొన్నారు. బీజేపీ డైరెక్షన్ లోనే వైసీపీ బంద్ చేసిందని విమర్శించారు. బంద్ ద్వారా విధ్వంసం సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలన్నదే వారి ఉద్దేశం అన్నారు. బంద్ వల్ల ఎవరికి లాభం అని ప్రశ్నించారు.   బిజేపీ ప్రయోజనం కోసమే వైసీపీ బంద్ చేస్తున్నదని తెలుసుకున్న ప్రజలు ఆ పార్టీకి సహకరించలేదన్నారు. బంద్ కారణంగా ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించవలసిన ఎంబీబీఎస్ 2, 4వ సంవత్సరం పరీక్షలు వాయిదాపడ్డాయన్నారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించే బంద్ ఎందుకు చేయాలని అడిగారు. ఈ బంద్ వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోవడంతో రూ.170 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బీజేపీ వ్యూహంలో భాగంగానే వైసీపీ బంద్ కు పిలుపు ఇచ్చిందన్నారు. పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగానికి నిరసన తెలుపకుండా, పరోక్షంగా మద్దతు తెలిపిందన్నారు. టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని, ప్రధాని ప్రసంగానికి రోడ్డెక్కి నిరసన తెలిపిందని గుర్తు చేశారు. బంద్ ఓ నాటకంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో ప్రతిపక్ష నేత జగన్మోహన రెడ్డి కోర్టులో చేతులుకట్టుకొని నిలబడ్డారన్నారు. కర్ణాటక ఎన్నికల సమయంలో తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయవద్దని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారని, వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. కుటిల రాజకీయాలవైపు ప్రజలు ఉండరని, కుప్పిగంతులు వేసే జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని పేర్కొన్నారు. కేంద్రం నిరంకుశ విధానానికి టీడీపీ మడమ తిప్పకుండా పోరాటం చేస్తుందన్నారు. అల్లూరి సీతారామ రాజు, ప్రకాశం పంతులు, ఎన్టీఆర్ లా చంద్రబాబు నాయుడు పోరాట పటిమని ప్రజలు గుర్తించారని హిదాయత్ అన్నారు.
--------------


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...