Sep 7, 2020

ప్రకృతి వ్యవసాయం

 గ్రామాల డబ్బు గ్రామాల్లోనే ఉండాలి – నగరాల డబ్బు గ్రామాలకు రావాలి

అదే ప్రకృతి వ్యవసాయ ఫలితం

“ప్రకృతి వ్యవసాయం గురించి అందరికీ తెలియాలి. ఈ తరహా సాగు విధానంతో చిన్నపాటి భూమిలో ఒక కుటుంబంలో నలుగురూ కలిసి పని చేసుకొంటే ఎంత ఆదాయం వస్తుంది అనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం” అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు తెలిపారు. ప్రకృతితో ముడిపడిన ఈ వ్యవసాయం విధానం అవసరం, విశిష్టత గురించి తెలిపే అనుభవం శ్రీ విజయరామ్ గారికి ఉంది అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానం గురించి శ్రీ విజయరామ్ గారు మాట్లాడుతూ “ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పే ముందు  నేను ముందు ఆచరించాలి... తర్వాత చెప్పాలి అని కృష్ణా జిల్లాలో ఆరు ఎకరాలు కొని అక్కడ చెరువు తవ్వాను. శ్రీ పాలేకర్ గారు చెప్పే విధానంలో 10 శాతం చెరువు.. 10 శాతం అడవి అంటారు ఎక్కడైనా సరే.. నేను ముందుగా చెరువు తవ్వుకున్నాను. మనం మాగాణులు అంటే చాలా మంచిది అనుకుంటాం. అవి వరికి అనుకూలం. వైవిద్యం అంటే తెలంగాణ, రాయలసీమల్లోనే బతికుంది. మెట్ట సేద్యం మంచిది. ప్రకృతి వ్యవసాయాన్ని మాగాణిలో కూడా మేం రూపొందిస్తున్న ఫైవ్ లేయర్ మోడల్ ప్రకారం చేసుకోవచ్చు.                                                                            

శ్రీ పాలేకర్ గారు ఒక మాట చెబుతారు – గ్రామం డబ్బులు గ్రామంలోనే ఉండాలి... నగరాల డబ్బులు గ్రామాలకు రావాలి అంటారు. యూరియా, డి.ఎ.పి. కలుపు మందులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, స్పేర్ పార్టులు, డీజిల్ ఆయిల్.. ఇలా ఏదైతేనేం ఒక గ్రామం నుంచి రూ.16 లక్షలు విదేశాలకు వెళ్తున్నాయి. భారత దేశంలో ఇలాంటి గ్రామాలు 6 లక్షలు ఉన్నాయి. రెండవది అందరికి అన్నంపెట్టే రైతుకి అన్నం దొరకడం లేదు. 15 సంవత్సరాల్లో 3 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

భారత దేశానికి ఈ ప్రపంచంలోనే ఇప్పటికీ అతి గొప్ప స్థానం ఉంది. గురు స్థానంలో ఉంది. ఎందుకు అంటే 75 శాతం జీవ వైవిద్యం భారత దేశానికి భగవంతుడు ఇచ్చి, మిగిలిన దేశాలకు 25 శాతం ఇచ్చాడు. ఇక్కడున్నది సమ శీతోష్ణస్థితి. కాలానికి తగ్గట్టు పండ్లు, ఫలసాయాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇది మీకు బయట దేశాల్లో చూసుకుంటే విపరీతమైన చలి లేదా విపరీతమైన ఎండ.  శ్రీ పాలేకర్ గారు గత 38 సంవత్సరాలుగా 40 లక్షల మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. అందులో నేను ఒక్కడిని. 40 లక్షలు అనుకున్నా కూడా చాలా పెద్ద సంఖ్యలా కనబడుతుంది గానీ, దేశ జనాభాతో మనం చూస్తే ఒక్క శాతం లేదు. శ్రీ పవన్ కల్యాణ్ గారు నాతో మాట్లాడినప్పుడు ఇది నేను రాజకీయాల గురించి చేయడం లేదు. ఇది నా బాధ్యత అన్నారు. 

భారతదేశంలో ఇప్పటి వరకు శ్రీ పాలేకర్ గారు తెలుగు రాష్ట్రాలకు చాలా ఎక్కువ సమయం ఇచ్చారు. కానీ ప్రకృతి వ్యవసాయంలో భారత దేశంలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. కారణం ఏంటంటే గోవుని పూజించే స్వాములు, పీఠాధిపతులు, వారి ఆశ్రమాలన్నీ అక్కడ ఎక్కువ. తమ భక్తులకు ప్రకృతి వ్యవసాయం గురించి వివరించారు. అలాంటి బాధ్యత ఇక్కడ స్వాములంతా తీసుకోవాలి. 

ఈ భూమ్మీద వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. మనిషి లేకుండా ఎప్పటి నుంచో ఈ భూమ్మీద ఉన్నాయి ఇవి. మనిషి అవసరం వాటికి ఎక్కడా లేదు. కానీ వాటి అవసరం మనిషికి ఉంది. వీటిని పెంచి పోషించేది ఈ ప్రకృతి వ్యవసాయం మాత్రమే.  శ్రీ పవన్ కల్యాణ్ గారు లాంటివారు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయంలో ముందు ఉంటుందని నమ్ముతున్నాను. అందరికీ విషతుల్యం కాని ఆహారం ఇవ్వాలి. మా తాత ఉన్నప్పుడు ఇన్ని క్యాన్సర్ ఆసుపత్రులు లేవు. నాన్న ఉన్నప్పుడు ఇన్ని లేవు. మనం ఉన్నప్పుడు ఇన్ని వచ్చాయి. మన కొడుకులు, మనవళ్లు వచ్చే సరికి పరిస్థితి ఏమవుతుంది అనే భయం ఉంది. అందరికీ ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కలగాలి” అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...