Jul 28, 2017

బీసీలకు నష్టంలేకుండా త్వరలో కాపులకు రిజర్వేషన్

కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ
సచివాలయం, జూలై 28: వెనుకబడిన తరగతుల(బీసీ)కు నష్టంలేకుండా తమ ప్రభుత్వం త్వరలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తుందని కాపు సంక్షేమ, అభివృద్ధి సంస్థ (కాపు కార్పోరేషన్) చైర్మన్ చలమలశెట్టి రామానుజయ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో శుక్రవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులకు విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్ కల్పిస్తామని, బీసీలకు అన్యాయం జరుగకుండా తమిళనాడు తరహాలో అదనంగా రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిపారు. విదేశీ చదువుల కోసం ఒక్కో పేద కాపు  విద్యార్థికి ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతోపాటు విమాన, ఇతర ఖర్చుల కింద రూ.70 నుంచి రూ.90 వేల వరకు అందజేస్తున్నట్లు వివరించారు. విదేశీ విద్యా సహాయం కోసం దరకాస్తు చేసుకున్న 220 మంది విద్యార్థులను గురువారం ఇంటర్వ్యూ చేసినట్లు, ఆ సమయంలో ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎంతో ఆనందం కనిపించినట్లు తెలిపారు. సివిల్ సర్వీస్ తోపాటు అనేక పోటీ పరీక్షలకు ప్రభుత్వం శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. సివిల్స్ ప్రిలిమ్స్  ఉత్తీర్ణులైనవారికి నెలకు రూ.10వేలు స్టైఫండ్ ఇస్తూ 9 నెలల పాటు శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు.  వివిధ రకాల ఉత్పత్తులకు, పరిశ్రమలకు ప్రభుత్వం కాపులకు సబ్సిడీతో అందించే ఆర్థిక సహాయం ద్వారా వారితోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. కాపు కార్పోరేషన్ అందించే ఆర్థిక సహాయం ద్వారా రాష్ట్రంలో 4.16 లక్షల మంది లబ్డిపొందినట్లు తెలిపారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సాధ్యమవుతున్నట్లు చెప్పారు. అన్ని రకాలుగా మేలు చేస్తున్న బాబువైపే కాపులు ఉన్నారని, రిజర్వేషన్ కూడా త్వరలో కల్పిస్తారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.  ప్రతిపక్షంవారు ఒక పక్క రాజధానిని నిర్మాణానికి అడ్డుతగులుతూ, మరో పక్క రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా, వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. అటువంటివారి కొమ్ముకాయడం ముద్రగడకు తగదని రామానుజయ హితవుపలికారు. ప్రతిపక్షం వద్ద తాయిలాలు తీసుకున్న ముద్రగడపై  తమ డిమాండ్లు అమలు చేయాలన్న వత్తిడి పెరగడంతో పాదయాత్రకు పూనుకున్నట్లుగా ఆయన ఆరోపించారు. అన్ని విషయాలు అర్ధం చేసుకొని పాదయాత్ర విషయంలో సయమనం పాటించిన కాపు యువతకు అభినందనలు తెలుపుతూ, పరిస్థితులను అదుపులో ఉంచడానికి చర్యలు తీసుకున్న ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పకు, డీజీపీ నండూరి సాంబశివరావుకు ఆయన కృతజ్ఙతలు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...