Sep 15, 2017

భిక్షాటన మానండి


అత్యంత వెనుకబడిన కులాల మేథోమథన సదస్సులో ఉదయలక్ష్మి
సచివాలయం,సెప్టెంబర్ 14: సంచార జాతులలో అత్యధిక కులాల వారు ఇంకా కొనసాగిస్తున్న భిక్షాటనను మానాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి బి. ఉదయలక్ష్మి కోరారు. ఆంధ్రప్రదేశ్ మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో గురువారం ఉదయం నిర్వహించిన అత్యంత వెనుకబడిన కులాల మేథోమథన సదస్సులో ఆమె మాట్లాడారు. వెనుకబడిన తరగతులలో అత్యంత వెనుకబడిన సంచార జాతులకు చెందిన 32 కులాలను గుర్తించి, వారికి సమాజిక భద్రత కల్పించేందుకు, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ కార్పోరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కులాలలో ఎక్కువమంది ఇప్పటికీ సంచార జీవనం సాగిస్తూ భిక్షాటన చేస్తున్నారని, వారు భిక్షాటన మాని ఎవరికి చేతనైన వృత్తిలో వారు స్థిరపడాలని అన్నారు. వారికి కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వం రుణాలు ఇస్తుందని తెలిపారు. ఇందుకోసం 60 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. కొన్ని కులాల వారికి ప్రభుత్వ పథకాల గురించి గానీ, బీసీ కార్పోరేషన్ ఉన్నట్లే తెలియదన్నారు. అటువంటివారిలో చైతన్య తీసుకురావలసిన అవసరం ఉందన్నారు. అత్యంత వెనుకబడిన 32 కులాల వారిని ఆహ్వానిస్తే 14 కులాల వారు మాత్రమే వచ్చారని, అంటే వారు ఎంత వెనుకబడి ఉన్నారో తెలుస్తోందన్నారు. ఈ కులాల వారు వారి సమస్యలు తెలియజేసిఏ పనులు, ఏ వృత్తి చేయగలరో తెలియజేస్తే  కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం వారికి 90 శాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. ఏ విధంగా సహాయం అందిస్తే ఆయా కులాలకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో తెలియజేస్తూ అభ్యర్థనలు ఇవ్వమన్నారు.  ఏఏ కులాల వారు ఏఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారో తెలియజేస్తే ఆయా ప్రాంతాల్లోని వారికి ప్రాధాన్యత ఇస్తామని ఉదయలక్ష్మి చెప్పారు. కార్పోరేషన్ ఎండి నాగభూషణం మాట్లాడుతూ తరచూ సంచార జాతులు అని మాట్లాడుతూ తమనుతాము తక్కువ చేసుకోవద్దని, సంచార జాతులు అనే పదం మరిచిపోవాలని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ తెలియజేసి, ఈ కులాల వారు అన్ని విధాల అభివృద్ధి చెందేందుకు ఈ కార్పోరేషన్ కృషి చేస్తుందని చెప్పారు. త్వరలో ఆన్ లైన్ వెబ్ సైట్ కూడా ప్రారంభించి ప్రభుత్వ పథకాలు అందరికి తెలియజేస్తామన్నారు. 32 కులాల వారితో త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు పి.రవి, వివిధ కులాల నేత నాగలింగం(జగం),కుల్లాయప్ప(బుడగజంగం), జోగి వెంకటరమణ(జోగి), అన్నపురెడ్డి మురళి(దొమ్మర), సుబ్బారావు(కాటికాపరి), శివాజీ(ఆరికటిక), చంద్ర రాజన్న(మందుల), ఎడ్లపల్లి చిన్న అమ్మోరయ్య(గంగిరెద్దుల), సురేష్ కుమార్(మొండిబండ), నరసింహారావు( నెట్టికోతల/వీరముష్టి/వీరభద్ర), .కృష్ణమూర్తి (పట్రా), సత్యం (బుడబుక్కల),శ్రీనివాస్ (పిచ్చిగుంట్ల) తదితరులు తమ తమ కులాల సమస్యలను వివరించారు. ఇంతకాలానికి తమని గుర్తించి ఇటువంటి సమావేశం ఏర్పాటు చేసినందుకు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలిపారు. కొందరు తమది యాచక వృత్తి అని, ఇప్పటికీ అదే వృత్తి కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కొందరు తమకు ఏ వృత్తీ లేదన్నారు. ఇంకొందరు తమ కులం వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలేదని చెప్పారు. తాము భిక్షాటనతోపాటు చిన్నచిన్న వీధి వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇంటింటికి తిరిగి వెంట్రుకలు, పాతగుడ్డలు కొనడం, ఆడవారికి కావలసిన గాజులు, పక్కపిన్నీసులు, పసుపు, కుంకుమ, ప్లాస్టిక్ సామానులు, ఆయుర్వేద మందులు, మొక్కలు అమ్మడం, చిత్తుకాగితాలు ఏరుకోవడం, పందుల పెంపకం, సర్కస్, పాములు అడించడం, సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్, చేపలు పట్టడం, ఆటోలు నడపడం, ఆడవాళ్లు  ఇళ్లలో పాచిపని చేయడం వంటి పనులు చేస్తున్నట్లు తెలిపారు. కొందరు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారని చెప్పారు.  గ్రామాల్లో తమకు సామాజిక భద్రతలేదని, తమ ఆడపిల్లలు పాఠశాలలకు వెళ్లలేని స్థితి ఉందని కొందరు చెప్పారు. తాము ఫ్యాన్సీ షాపు, డిటీపి షాపు, డెయిరీ, మేకలు, గొర్రెల పెంపకం, కోళ్ల పెంపకం, ఇటుకల తయారీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి, టైలరింగ్, గార్మెంట్ తయారీ, బొమ్మల తయారీ వంటి వాటికి రుణాలు ఇవ్వాలని కోరారు. బ్యాంకుల ద్వారా అయితే తమకు రుణాలు మంజూరు కావని, బ్యాంకులతో సంబంధంలేకుండా తమకు రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తమ కులాల్లో చదువుకున్న యువతకు వివిధ వృత్తులలో, సాంకేతిక అంశాలలో, సెక్యూరిటీ సిబ్బందిగా శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. తాము రెండు కుటుంబాలు, పది కుటుంబాలుగా గ్రామాల్లో ఉండటం వల్ల రక్షణ లేదని, అందువల్ల జిల్లాలో ఏదో ఒక చోట తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని అభ్యర్థించారు. చట్టసభల్లో తమ కులాలకు ప్రాధాన్యత ఇవ్వలన్నారు. తమ పిల్లలకు కార్పోరేట్ పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఎంబీసి కులాలలో లేని సిద్దపల్లి గురుప్రసాద్, కొలగంటి సతీష్, బీసీ రమణ, కర్నాటి కన్నయ్య తదితరులు వారికి మద్దతుగా మాట్లాడారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...