Sep 25, 2017

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి ప్రతిపాటి


Ø బకాయిలు చెల్లించని రైస్ మిల్లులు సీజ్
Ø ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.80 పెంపు
Ø పొలంలోనే ధాన్యం కొనుగోలు, అక్కడికక్కడే ట్యాబ్ పై రైతుకు ప్రింట్ అవుట్
Ø ప్రొక్యూర్ మెంట్ లేని జిల్లాలకు ధాన్యం సరఫరా చేసే ఆలోచన
సచివాలయం, సెప్టెంబర్ 25: రాష్ట్రంలో రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి ప్రతిపాటి పుల్లారావు హామీ ఇచ్చారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన చాంబర్ లో సోమవారం ఉదయం  మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను సావదానంగా విని పరిష్కరిస్తానని చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కనీస మద్దతు ధర రూ.80లు పెంచుతున్నట్లు తెలిపారు. అన్ని అవకాశాలను పరిశీలించి, రైస్ మిల్ పరిశ్రమకు ఏది మంచిదైతే దినిని అమలు చేస్తామని చెప్పారు. మిల్లర్లు సీఎంఆర్ (కస్టమ్ మిల్లడ్ రైస్) సరఫరా చేయనందున 2015-16 వరకు రూ.102 కోట్ల రూపాయలు బకాయిపడ్డారని తెలిపారు. ఆ మొత్తానికి బ్యాంక్ హామీ కూడా లేదని,   వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఆ రైస్ మిల్లులను సీస్ చేయిస్తానని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో మిల్లులు ఎక్కువ బకాయిపడినట్లు తెలిపారు. అవసరమైతే పీఆర్ యాక్ట్ కింద కేసులు పెట్టించి ఆయా మిల్లుల యజమానులను అరెస్ట్ చేయిస్తామన్నారు. ఈ ఏడాది ఇంకా 77వేల టన్నుల సీఎంఆర్ సరఫరా చేయవలసి ఉందన్నారు.  ధాన్యం బాగా పండే జిల్లాల నుంచి ప్రొక్యూర్ మెంట్ లేని జిల్లాలకు ధాన్యం పంపించి, అక్కడ మిల్లులకు పని కల్పించే అంశం పరిశీలనలో ఉందని, ఆ ఏర్పాట్లు చేస్తామని మంత్రి పుల్లారావు చెప్పారు.
        బ్యాంకు హామీకి సంబంధించి రాష్ట్రంలో ఒకే రకమైన విధానంలేదని, కొన్ని జిల్లాలకు మినహాయింపు ఇచ్చారని రైస్ మిల్లర్లు తెలిపారు. బ్యాంకు హామీ వల్ల తాము ఏడాదికి రూ.60 కోట్లకు పైగా కమిషన్ రూపంలో చెల్లించవలసి వస్తోందని,  దానిని ఎత్తివేయాలని లేని పక్షంలో ఆ ఖర్చుని ప్రభుత్వమే భరించాలని కోరారు. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ విధానంలేదన్నారు. ధాన్యం కొనుగోలుకు కావలసిన గోతాలను తామే కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలని, అందుకు గోతానికి రూ.30లు చెల్లించాలని కోరారు. 8 కిలోమీటర్లు దాటితేనే తమకు రవాణా చార్జీలు ఇస్తున్నారని, అలా కాకుండా జీరో నుంచి చార్జీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాదాపు 40 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయం ప్రకారం రూ.12.50ల మిల్లింగ్ చార్జీలు చెల్లిస్తున్నారని, దానిని పెంచాలన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ధాన్యంపైన, బియ్యంపైన ఒక శాతం పన్ను వసూలు చేస్తున్నాయని, తెలంగాణలో అటువంటిది ఏమీలేదని, రాష్ట్రంలో కూడా దానిని ఎత్తివేయాలని, అలాగే మండి చార్జీలు ఇవ్వాలని కోరారు. సీఎంఆర్ బియ్యం సరఫరా చేసిన వెంటనే తమకు రావలసిన రావాణా చార్జీలు తమ ఖాతాలో జమ చేయాలన్నారు. ఎఫ్ సీఐ వారు ఒక్కో మిల్లుకు ప్రత్యేకంగా కొంత జాగా కేటాయించినందున, తగినంత స్థలంలేక మిల్లర్లు  బియ్యం సరఫరా చేయలేకపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. తాము ప్రధానంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించాలన్నారు. పొరుగు రాష్ట్రాలలో మాదిరి ఎల్టీ రైస్ మిల్ వినియోగదారుల పరిధిని 100 హెచ్ పీ నుంచి 150 హెచ్ పీకి పెంచాలని కోరారు. ఈ ఏడాది సరఫరా చేయవలసిన సీఎంఆర్ ను పంట రాగానే సరఫరా చేస్తామని చెప్పారు.  ఇతర జిల్లాల నుంచి ధాన్యం సరఫరా చేస్తే, అడించి తాము బియ్యం సరఫరా చేస్తామని కడప జిల్లాకు చెందిన మిల్లర్లు కోరారు. తమ జిల్లాలో పెద్దగా ధాన్యం పండనందు తమకు పని ఉండటంలేదని, తాము చాలా బక్కచిక్కిన మిల్లర్లమని, తమను ఆదుకోవాలని  వారు కోరారు.

      ఈ ఏడాది నుంచి పొలంలో ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే  అక్కడికక్కడే ట్యాబ్ పై రైతుకు ప్రింట్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్లు సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఎండి కె.రామ్ గోపాల్ చెప్పారు. బ్యాంకు హామీ 1:1 తప్పనిసరని తెలిపారు. అయితే బ్యాంకు హామీ ఆరు నెలలకా, ఏడాదికా అనేదానిపై చర్చ జరిగింది. ఖరీఫ్, రబీ, ఒక్కో జిల్లాలో ఒక్కో సమయంలో పంటలు రావడం... వంటి అంశాల నేపధ్యంలో ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకోలేదు. బ్యాంకర్లతో మాట్లాడి బ్యాంక్ హామీ కమిషన్ తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచి మిల్లర్లతోపాటు గూడౌన్ ఇన్ చార్జిల డిజిటల్ సంతకం తీసుకుంటామని చెప్పారు. రవాణా చార్జీలు, మిల్లింగ్ చార్జీల అంశంపై మరోసారి సమావేశమవుదామని చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కనీస మద్దతు ధర రూ.80లు పెంచుతున్నామని, బస్తా ధర రూ.1590లు అవుతుందన్నారు. గత ఏడాది రూ.60లు పెంచినట్లు తెలిపారు. గోతాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే త్వరలో ఒక విధానం రూపొందించనుందని, రూ.15 నుంచి రు.19.50 వరకు నిర్ణయించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిల్లర్లు టారిఫ్ కమిషన్ కు బ్యాలన్స్ షీట్, వ్యాపార వివరాలు ఇవ్వనందున మిల్లింగ్ చార్జీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.
అధికారులతో సమీక్ష
రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశానికి ముందు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తమ శాఖ, ఎఫ్ సీఐ అధికారులతో సమావేశమయ్యారు. అన్ని అంశాలను సమీక్షించారు. సీఎంఆర్ బకాయిలు వసూలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బకాయిదారుల వివరాలు మీడియాకు విడుదల చేయడంతోపాటు లీడ్ బ్యాంక్ మేనేజర్(ఎల్బీఎం) ద్వారా బ్యాంకులకు కూడా సమాచారం అందించాలన్నారు. మిల్లర్ల బ్యాంక్ హామీ కాలపరిమితిని పరిశీలించే బాధ్యతలు డీఎంలకు అప్పగించాలని మంత్రి ఆదేశించారు. ఇతర జిల్లాల నుంచి ప్రొక్యూర్ మెంట్ లేని జిల్లాలకు ధాన్యం సరఫరా చేయడానికి ఒక విధానం రూపొందించమని మంత్రి అధికారులను ఆదేశించారు.
            ఎండి కె.రామ్ గోపాల్  మాట్లాడుతూ మిల్లర్లు ధాన్యం, బియ్యం నిల్వల వివరాలు ఎలక్ట్రానిక్ పద్దతిలో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖరీఫ్ పంట దిగుబడి అక్టోబర్ 20 తరువాత రావడం మొదలవుతుందని అధికారులు చెప్పారు. ఖరీఫ్ పంట వచ్చే కాలం విషయంలో జిల్లా జిల్లాకు వ్యత్యాసం ఉంటుందని, కొన్ని జిల్లాల్లో నవంబర్ 10 తరువాత వస్తుందని వివరించారు. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రొక్యూర్ మెంట్ లేదని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం, హాస్టళ్లకు, అంగన్ వాడీ కేంద్రాలు వంటి ప్రభుత్వ పథకాలకు నెలకు 28వేల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆరు నెలల అవసరాలకు సరిపడ బియ్యం నిల్వం ఉంచుతామని తెలిపారు. ఏడాదికి మూడు లక్షల టన్నుల బియ్యం వినియోగం అవుతుందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో స్వర్ణ రకం, నెల్లూరు జిల్లాలో ఎన్ఎల్ఆర్ రకం బియ్యం అధికంగా పండుతాయని తెలిపారు.  హాస్టళ్లు, మధ్యాహ్నం భోజన పథకానికి స్వర్ణ, ఎన్ఎల్ఆర్ వంటి మంచి బియ్యంతోపాటు సింగిల్ స్టీమింగ్ బియ్యం సరఫరా, హాస్టళ్లకు, పాఠశాలలకు నేరుగా బియ్యం సరఫరా తదితర అంశాలపై చర్చించారు. తమకు మిల్లర్ల నుంచి ఉప్పుడు బియ్యం ఎక్కువగా వచ్చే ఏర్పాటు చేయమని ఎఫ్ సీఐ అధికారులు కోరారు. తమ వద్ద నిల్వలను ఎక్కువగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు పంపుతామని వారు చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...