Nov 21, 2018


అవును! బాబు వచ్చారు జాబులొచ్చాయి

ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్

  • ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌-2019 ప్రతిపక్షాలకు చెంపపెట్టు
  • ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి
  • నైపుణ్యత గల యువతదే భవిష్యత్
  • రాష్ట్రంలో పటిష్ట రాజకీయ నాయకత్వం
  • మోడీ,జగన్,పవన్ బాబుని చూసి నేర్చుకోవాలి


            సచివాలయం, నవంబర్ 21: అవును! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు, రాష్ట్రంలో యువతకు జాబులొచ్చాయని శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద బుధవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఈ దఫా అధికారం చేపట్టిన తరువాత ప్రభుత్వ రంగంలో గానీ,ప్రైవేటు రంగంలో గానీ 5 లక్షల ఉద్యోగాల వరకు వచ్చాయని తెలిపారు. ఉద్యోగార్హ నైపుణ్య మానవవనరులపై పీపుల్‌ స్ట్రాంగ్‌, వీబాక్స్‌, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) సంయుక్తంగా నిర్వహించిన  సర్వే ఆధారంగా రూపొందించిన ఇండియా స్కిల్స్‌ రిపోర్ట్‌-2019 దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. అత్యధిక ఉద్యోగార్హ నైపుణ్యం (ఎంప్లాయిబిలిటీ)గల మానవవనరులున్న రాష్ట్రంగా కీర్తి గడించిందంటే ఇది తెలుగు యువత నైపుణ్యతకు దక్కిన గౌరవంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టు అన్నారు. ప్రభుత్వం ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా యువతకు శిక్షణ ఇప్పిస్తోందని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున యువతకు శిక్షణ ఇప్పించే ప్రభుత్వం దేశంలో మనదేనని చెప్పారు. విశాఖ నగరాన్ని ఫిన్ టెక్ వ్యాలీగా రూపొందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నైపుణ్యత గల యువత ఉన్నందునే ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, అమేజాన్ లాంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని, దాంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో బ్లాక్ చెయిన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందని, ఇంకా సోలార్ విద్యుత్, అగ్రిటెక్ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తూ నూతన ఆవిష్కరణలు, ఆధునిక పోకడలుపోవడంతో రాష్ట్రంలో  ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని తెలిపారు. కియా మోటార్ వంటి సంస్థలు వచ్చాయని, శ్రీసిటీలో ఎలక్ట్రానిక్ ఉత్సత్తులు ఉధృతం కావడంతో తెలుగు యువతకు ఉద్యోగాలు లభిస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల కోసం హైదరాబాద్ ని చెప్పుకునేవారని, ఇప్పుడు గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలలో ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయన్నారు.
        చంద్రబాబు వచ్చిన తరువాత ప్రభుత్వ రంగంలో డిఎస్సీ, ఏపీపీఎస్సీ ద్వారా, పోలీస్, వ్యవసాయ, పశుసంవర్థక శాఖలు, ఆర్టీసీలో ఖాళీలను, అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేశారని వివరించారు. ఆ రకంగా ప్రభుత్వంలో దాదాపు 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ, కాపు కార్పోరేషన్ ల ద్వారా లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించారన్నారు. ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు చూపించిందని డొక్కా చెప్పారు. వీటితోపాటు రాష్ట్రంలో పటిష్ట రాజకీయ నాయకత్వం, వ్యాపార అనుకూల వాతావరణ ఉండటం వల్ల అనేక పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయన్నారు.   ప్రైవేటు రంగంలో యువతకు భారీ స్థాయిలో ఉపాధి లభించినట్లు చెప్పారు. ఆ విధంగా వరదగా ఉద్యోగావకాశాలు లభించడంతో 5 లక్షల మంది యువతకు ఉపాధి వచ్చిన్నట్లు తెలిపారు. దీనంతటికీ సీఎం చంద్రబాబు ముందు చూపే కారణంగా పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి ద్వారానే రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్ ఉందన్నారు.  ప్రస్తుతం వైద్య శాఖలో డాక్టర్, బోధనా సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్, గ్రూప్ 3 వంటి పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాలైన బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ఇటువంటి అనుకూల అంశాలు కనిపించవా? అని డొక్కా ప్రశ్నించారు. ఆ పార్టీల వారిని కళ్లున్న కబోదులుగా ఆయన పేర్కొన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అందులో పది శాతం మందికి కూడా అవకాశాలు కల్పించని ప్రధాని మోడీని వీరు ఎందుకు ప్రశ్నించరని  మాణిక్య వరప్రసాద్ అడిగారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే బాధ్యతగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనంత భారీ స్థాయిలో ఇక్కడ నిరుద్యోగ భృతి ఇస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ, వైఎస్ జగన్మోహన రెడ్డి, పవన్ కల్యాణ్ చంద్రబాబుని చూసి నేర్చుకోవాలన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...