Feb 18, 2019


సాంఘీక సంక్షేమ శాఖలో లిడ్ క్యాప్ విలీనం
మంత్రి జవహర్, ఆర్టీసి చైర్మన్ వర్ల, ఎమ్మెల్సీ డొక్కా,
లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబు కృతజ్ఞతలు

                 సచివాలయం, ఫిబ్రవరి 18: పరిశ్రమలు, వాణిజ్య శాఖ నుంచి  లిడ్ క్యాప్ (లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)ను విడదీసి సాంఘీక సంక్షేమ శాఖలో విలీనం చేసినందుకు మంత్రి జవహర్, ఆర్టీ చైర్మన్ వర్ల రామయ్య, శాసన మండలిలో ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్, లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబులు హర్షం వ్యక్తం చేస్తూ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయంలో సోమవారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడారు. కొత్తగా జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 65 ప్రకారం మాదిగ, మాదిగ ఉప కులాలకు  ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం సహాయం చేయడానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రి జవహర్ తెలిపారు. అమలాపురం ఎంపీ పందుల రవీంద్ర ముందు తన ఇంటి పేరుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆయన ప్రవర్తన తల్లిపాలు త్రాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. ఆయన చంద్రబాబు నాయుడుని విమర్శించడాన్ని దృష్టిలో పెట్టుకొని సూర్యుడిపై ఉమ్మివేస్తే తన మీదే పడుతుందన్నారు.
               ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ జీఓ నెంబర్ 65 జారీ చేసినందుకు మాదిగ, ఉప కులాల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేసిన మాదిరిగా సంక్షేమ ఫలాలు మాదిగలకు, ఆయా ఉప కులాలకు చేరే అవకాశం ఉందన్నారు. ఈ జీఓ మాదిగలకు ఓ పెద్ద వరంగా పేర్కొన్నారు. ఇది సాహసోపేత నిర్ణయంగా వర్ల పేర్కొన్నారు. ఎంపీ పందుల రవీంద్ర నీడనిచ్చే చెట్టుని నరుక్కున్నారన్నారు. ఎండమావులను చూసి నీళ్లనుకున్నారని విమర్శించారు.
          ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ దళితులు, మాల, మాదిగ వర్గాలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. లిడ్ క్యాప్ చైర్మన్ గా గూడూరి ఎరిక్సన్ బాబుని నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎంపీ రవీంద్ర బురద జల్లే కార్యక్రమాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీ మారడం అనేది ఆయన ఇష్టమని, అయితే నిందారోపణలు చేయడం తగదన్నారు. అది మంచి సంప్రదాయం కాదన్నారు. దళితులకు చెడ్డ పేరు తేవద్దని, ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. అవాకులు చెవాకులు మానుకోమని సలహా ఇచ్చారు.
            లిడ్ క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల వరకు మాదిగలు ఉన్నట్లు తెలిపారు. కార్పోరేషన్ చైర్మన్ గా మాదిగ సామాజిక వర్గానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...