Jan 31, 2019

ఏడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం
v సీఎం చంద్రబాబు విప్లవాత్మక  నిర్ణయం
v చుక్కల భూముల రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం
v చుక్కల కేసుల్లో గుంటూరు జిల్లా ఫస్ట్
v సెక్షన్ 22-ఏ కేసుల్లో ప్రకాశం జిల్లా ఫస్ట్

            
  దాదాపు ఏడు దశాబ్దాల నుంచి ఉన్న ‘చుక్కల’ భూముల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించింది.  ఆ రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. దాదాపు 64 ఏళ్లుగా తాతలు, తండ్రులు, తరువాత తాము  సాగు చేసుకుంటున్నా ఆ రైతులకు ఈ భూములపై  హక్కులు లేవు. వారసులకు రాయడానికి గానీ, అవసరాలకు అమ్ముకోవడానికి గానీ అవకాశంలేదు. ఏడు దశాబ్దాలుగా వారు ఎమ్మార్వో, ఆర్డీఓ, కలెక్టర్  కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.  కొందరు కోర్టులను ఆశ్రయించారు. 1954 నుంచి ఈ సమస్య ఉంది. గతంలో ఏ ప్రభుత్వం ఈ భూములపై ఒక నిర్ణయం తీసుకోలేదు. రైతుల బాధలు స్వయంగా తెలుసుకున్న సీఎం చొరవ తీసుకుని విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల వేల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.   సీఎం ఆదేశాల ప్రకారం రిజిస్ట్రేషన్ చట్టం-1908 లోని 22-1లో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి చుక్కల భూములను తొలగిస్తూ2017 జూలై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం రైతుల ఆధీనంలో సాగులో ఉన్న చుక్కల భూములను మాత్రం  ఆ తేదీ నుంచి ప్రైవేటు పట్టా భూములుగా పరిగణించాలి. అయితే వివిధ కారణాల వల్ల ఆ ఆదేశాలు అమలుకాలేదు. రైతుల బాధలు తీరలేదు. పరిస్థితులను తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై, దీనిని తీవ్రమైన సమస్యగా పరిగణించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. దాంతో జనవరి 4న జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.  జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారులకు మార్గదర్శక సూత్రాలు పంపారు. చుక్కల భూముల సమస్య ప్రధానంగా గుంటూరు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్ కడప జిల్లాలలో ఉంది. ఈ భూముల సమస్యలకు సంబంధించి ఈ జిల్లాల నుంచి జనవరి 25వ తేదీ వరకు 86,307 వినతి పత్రాలు అందాయి. కర్నూలు జిల్లా నుంచి అత్యధికంగా 25,801, ఆ తరువాత గుంటూరు జిల్లా నుంచి 18,260, అనంతపురం జిల్లా నుంచి 15,316 వినతి పత్రాలు అందాయి. ఈ ఫిర్యాదులన్నిటిని రెవెన్యూ సిబ్బంది పరిశీలించింది.   జిల్లా కలెక్టర్లు జారీ చేసి ఆదేశాల ప్రకారం  రెవెన్యూ సిబ్బంది ఈ ఏడు జిల్లాలలో 3,189 గ్రామ సభలు నిర్వహించి, రైతులు, గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.  అత్యధికంగా కర్నూలు జిల్లాలో 810 గ్రామ సభలు నిర్వహించారు. కడపలో 642, గుంటూరు జిల్లాలో 505 నిర్వహించారు.   చుక్కల భూములను స్వాధీనంలో ఉంచుకుని, సాగుచేసుకుంటున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన  పత్రాలలో ఏదోఒకటి చూపిస్తే ఆ భూమి వారికి సంబంధించినదిగా భావించి రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌లింకు డాక్యుమెంట్‌ పత్రాలు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి రికార్డు ఆఫ్‌ హోల్డింగ్సు నమోదు చేసిన పత్రాలు,ఎన్‌క్యూంబరెన్స్‌ పత్రం,10(1) అకౌంట్‌,  భూమి శిస్తు రసీదులు,రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆర్‌వోఆర్‌ రికార్డు, న్యాయస్థానాలు,సంబంధిత అధీకృత అధికారి జారీ చేసిన ఉత్తర్వు ప్రతులు వంటి వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. 2017 జూలై 14వ తేదీకి ముందు 12 ఏళ్లు ఆధీనంలో ఉన్నట్లు ఏవైనా ఆధారాలు చూపినా రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తున్నారు. ఆర్వోఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్)చట్టం ప్రకారం 1బి రిజిస్టర్2వ కాలమ్ లో నమోదైన పట్టాదారు పేరుని సరిచూసుకొని తదనుగుణంగా 1బి రిజిస్టర్ 8వ కాలమ్ లో కొనుగోలు లేదా వారసత్వం లేదా వంశపారంపర్యం అని నమోదు చేసినవాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించారు. 8వ కాలమ్ లో ఏమీ రాయకపోయినా పట్టాదారు భూమిగా పరిగణించి నిషేధిత జాబితా నుంచి తొలగించారు. 8వ కాలమ్ లో 1954కు ముందు ఇచ్చిన డి పట్టాడికెటి పట్టాఅసైన్ మెంట్ భూములు అని నమోదు చేసినట్లైతే వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. 1954తరువాత ప్రభుత్వం ఇచ్చిన భూములు నిషేధిత జాబితాలోనే కొనసాగుతాయి.  నిషేధిత భూముల నుంచి చుక్కల భూములతోపాటు ఇతర భూములను తొలగించి సెక్షన్ 22-1 (ఏ) టు (డి) కొత్త జాబితాని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతారు. సెక్షన్ 22-1(ఇ) జాబితాని ప్రభుత్వనికి పంపుతారు.  ప్రభుత్వం దానిని గెజిట్ లో ప్రచురిస్తుంది.

అందిన వినతి పత్రాలు, ఫిర్యాదులలో 80,268 అంటే 93 శాతం పరిష్కరించారు. 30,148 వినతులకు సంబంధించిన భూములు వ్యక్తిగతంగా పట్టాలు పొందడానికి అర్హమైనవిగా నిర్ధారించారు. మిగిలిన వాటిని ప్రభుత్వ, అసైన్డ్ భూములుగా తేల్చారు. 928 ఫిర్యాదులు కోర్టు పరిధిలో ఉన్నాయి. 5,052 పరిశీలనలో ఉన్నాయి. వినతులన్నిటినీ వంద శాతం పరిష్కరించి గుంటూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో ఒక్క కేసు కూడా కోర్టు పరిధిలో లేదు. పెండింగ్ లో లేదు. నెల్లూరు జిల్లాలో కూడా ఒక్క కేసు కూడా పెండింగ్ లో లేదు. అయితే ఈ జిల్లాలో 267 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి.  అనంతపురం జిల్లాలో 98.78 శాతం, చిత్తూరు జిల్లాలో 98.25 శాతం, ప్రకాశంలో 97.65 శాతం, నెల్లూరులో 97.07 శాతం, కర్నూలులో 85.78, కడపలో 81.64 శాతం కేసులు పరిష్కరించారు. మిగిలిన వాటిని కూడా పది రోజులలో  పరిష్కరించే అవకాశం ఉంది.
                ఇక సెక్షన్ 22-ఏ((1)(), (1)(బి), (1)(సి), (1)(డి), (1)()) కి సంబంధించి 13 జిల్లాల్లో జనవరి 25 నాటికి మొత్తం 15,850 కేసులు ఉండగా, 14,948 అంటే 94.31 కేసులు పరిష్కరించారు. సీఎం ఆదేశాల ప్రకారం మిగిలిన కేసులను కూడా త్వరగా పరిష్కరించడానికి రెవెన్యూ సిబ్బంది చురుకుగా పని చేస్తోంది.  ఇంకా 902 కేసులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారంలో ప్రకాశం జిల్లా 98.97 కేసులు పరిష్కరించి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత వరుసగా కృష్ణా (98.29) ద్వితీయ, శ్రీకాకుళం (97.77) తృతీయ స్థానాల్లో నిలిచాయి. 78.07 శాతం కేసులు పరిష్కరించి కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఉంది. కోర్టు పరిధిలో లేని మిగిలిన వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోంది. అన్ని తాజా జాబితాలను జిల్లా కలెక్టర్లు ఆయా రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతారు. దాంతో జిల్లా కలెక్టర్లు అనుమతించిన భూములపై సాగు చేసుకునేవారికి హక్కు లభిస్తుంది. వారు ఆ భూములను అమ్ముకోవడానికి, వారసులకు రాసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.  దీర్ఘకాలంగా ఉన్న ఈ భూ సమస్యలను పరిష్కరిస్తున్నందువల్ల అనేక మంది రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
-         శిరందాసు నాగార్జునసీనియర్ జర్నలిస్ట్ –9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...