Jan 18, 2019


జీవితాంతం ఒకటే కుల సర్టిఫికెట్
కార్యదర్శుల సమావేశంలో సీఎస్ పునీఠ నిర్ణయం
15 రోజుల్లో జీఓ జారీ
                    సచివాలయం, జనవరి 18: ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశంలలో జీవీతాంతం మార్పులు ఏమీ ఉండవని, అందువల్ల ఒకసారి ఇచ్చిన ధృవపత్రం(సర్టిఫికెట్) జీవితాంతం ఉపయోగపడేవిధంగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పునీఠ నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం ఉదయం జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ  ఈ ధృవపత్రాల కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను రెవెన్యూ కార్యాలయాలు, మీసేవా కేంద్రాల చుట్టూ తిప్పడం సరైన పద్దతి కాదన్నారు. ఒకసారి ఇచ్చిన సర్టిఫికెట్ జీవితాంతం ఉపయోగపడాలన్నారు. ఆదాయంలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని, ఆ సర్టిఫికెట్ కూడా 4 ఏళ్ల వరకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సర్టిఫికెట్ల విషయంలో అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వ ఇ-గవర్నెన్స్, ఐటీ సలహాదారు జె.సత్యనారాయణతో చర్చించి సీనియర్ అధికారుల సలహాలు తీసుకొని 15 రోజుల్లో జీఓని  రూపొందించమని ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబుకు సూచించారు. అవసరంలేని పోలీస్ వెరిఫికేషన్, ఇతర సర్టిఫికెట్లను ఆయా శాఖలతో సంప్రదించి తీసివేయాలన్నారు.   సర్టిఫికెట్ల విషయంలో ప్రజలు ఇబ్బందిపడకుండా ఉండాలని సీఎస్ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి రామాంజనేయులు సీఎస్ కు ధన్యవాదాలు తెలిపారు. 60 ఏళ్లుగా ఈ సర్టిఫికెట్ల కోసం ప్రజలు నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఇది చాలా మంచి నిర్ణయంగా పేర్కొన్నారు.
21వ తేదీ నాటికి అవసరమైన ఫైల్స్ సిద్ధం చేయాలి
          ఈ నెల 21వ తేదీకి మంత్రి మండలి ఆమోదించవలసిన  అన్ని ఫైల్స్ సిద్ధం చేయాలని సీఎస్ కార్యదర్శులకు, హెచ్ఓడీలకు సూచించారు. కేంద్రం నుంచి రావలసిన నిధులపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. యుటిలిటీ సర్టిఫికెట్లు సమర్పించకపోతే సమర్పించాలని, సమర్పించినవాటి పరిస్థితి గురించి తెలుసుకోవాలని, ఏపీ భవన్ రెసిడెన్స్ కమిషనర్ తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ రావలసిన నిధులు రాబట్టాలని చెప్పారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను అధ్యయనం చేసి ఆ నిధులను పూర్తి స్థాయిలో పొందడానికి ప్రయత్నించాలన్నారు.  ప్రతి శాఖ నుంచి కార్యదర్శి గానీ, కమిషనర్ గానీ రావాలని, వారికి అవకాశం లేకపోతే ఆ శాఖ ప్రతినిధి ఒకరు తప్పనిసరిగా రావాలన్నారు. ఆ శాఖకు సంబంధించిన సమాచారం ఎవరు ఇస్తారని సీఎస్  ప్రశ్నించారు.   సమావేశంలో అధికారులకు, ఇతర సిబ్బందికి శిక్షణ, వివిధ శాఖలలో ఇంజనీరింగ్ విభాగం పనులు, హెచ్ ఆర్ పాలసీ, సర్వీస్ రూల్స్, మున్సిపాలీటీలలో పనులకు నిధులు,  ఏపీపీఎస్సీ ద్వారా ఖాళీల భర్తీకి నోటీఫికేషన్ జారీ చేసిన, చేయవలసిన పోస్టులు, సిలబస్, వివిధ పోస్టులకు కావలసిన విద్యార్హతలు,  గ్రామీణ, పట్టణ నీటి సరఫరా, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పని భారం, వివిధ శాఖలు జారీ చేసే లైసెన్సుల ప్రక్రియ సులభతరం చేయడం, లైసెన్స్ మేనేజ్ మెంట్ వ్యవస్థ, భూధార్, నబార్డ్ నిధుల వినియోగం, గ్రామీణ రహదారులు, వివిధ శాఖలలో చెల్లించవలసిన బిల్లులు, మధ్యాహ్న భోజన పథకం, స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు, జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులు, యువనేస్తం, గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణం, మునిసిపల్, పంచాయతీరాజ్ పథకాలు ... తదితర అంశాలపై చర్చించారు. వివిధ శాఖల పనితీరుపై ప్రజా స్పందనను, వారి సంతృప్తి స్థాయిని ఆర్టీజీ సీఈఓ బాబు వివరించారు. ఏపీ భవన్ రెసిడెన్స్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కేంద్రం నుంచి రావలసిన నిధులు, యుసీలు, నరేగా నిధులు, భారత్ నెట్ వర్క్, గ్రామీణ సడక్ యోజన, సాగరమాల పనులు, స్వచ్ఛభారత్ అర్బన్ నిధులు, కేంద్ర ప్రభుత్వ శిక్షణా కార్యక్రమాల గురించి వివరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అవకాశం ఉన్నమేరకు రాష్ట్రానికి రావలసిన వాటా నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఇ-ప్రగతి, ఇ-ఆఫీస్ ద్వారా సమయం చాలా ఆదా అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజలకు కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిందన్నారు. ఇ-ఆఫీస్ నిర్వహణలో కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ కృషిని అందరూ ప్రశంసించారు. కరతాళ ధ్వనులతో ఆయనను అభినందించారు.
         సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ డి.సాంబశివరావు, నీరబ్ కుమార్ ప్రసాద్, జెఎస్వీ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్, జి.అనంతరామ్, ముఖ్యకార్యదర్శులు కె.ప్రవీణ్ కుమార్, అజయ్ జైన్, షంషేర్ సింగ్ రావత్, కె.ఎస్.జవహర్ రెడ్డి, ఆర్.కరికాల వళవన్, బి.ఉదయలక్ష్మి,  కార్యదర్శులు రామాంజనేయులు, శశిభూషణ్ కుమార్, పియూష్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా, నాగులాపల్లి శ్రీకాంత్, కాంతిలాల్ దండే, సోలమన్ అరోకియా రాజ్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్ధ జైన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...