Jan 29, 2019


ప్రతి శాఖలో సమాధానాలకు
ఒక ఉద్యోగిని నియమించండి
ఉన్నతాధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో స్పీకర్ కోడెల
                       సచివాలయం, జనవరి 29: శాసనసభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి ప్రభుత్వంలోని ప్రతి శాఖలో ప్రత్యేక ఒక ఉద్యోగిని నియమించుకుంటే మంచిదని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద రావు సూచించారు. శాసనసభా భవనం మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రభుత్వ ఉన్నతాధికారులు, శాసనసభ అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ శాసనసభ సమావేశాలు విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది చాలా బాగా కృషి చేశారని వారందని అభినందించారు. కొత్త మంత్రులకు కూడా ఆయా శాఖల సిబ్బంది బాగా సహకరించారని ప్రశంసించారు. శాసనసభ సమావేశాలు ఈ నెల 30 నుంచి మొదలై ఫిబ్రవరి 8వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. దాదాపు ఇవే 14వ శాసనసభ చివరి సమావేశాలన్నారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు బాగా పని చేసిన్పటికీ చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదన్న భావన ఉందని చెప్పారు. అందువల్ల ప్రతి శాఖలో ఒక ఉద్యోగిని నియమించితే ఎక్కవ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ కోడెల అన్నారు.
            శాసన మండలి ఇన్ ఛార్జి చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమావేశాలు సక్రమంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు, శాంతిభద్రతల విషయంలో పోలీసులు నిర్వహించిన పాత్రకు అభినందనలు తెలిపారు.  ప్రజాస్వామ్యంలో మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పవలసిన అవసరం ఉందన్నారు.  పలు ప్రశ్నలకు సమాధానాలు రాలేదని చెప్పారు. పాఠశాల విద్య, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సభకు ప్రధాన ప్రతిపక్షాలు హాజరుకాకపోవడం సరైన విధానం కాదని, వారు కూడా వస్తే బాగుంటుందని సూచించారు. ప్రొటోకాల్ ఉల్లంగన జరుగకుండా శ్రద్ధ వహించాలన్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనీల్ చంద్ర పునీఠ మాట్లాడుతూ అన్ని శాఖల వారు ప్రశ్నలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రొటోకాల్ ని గౌరవించవలసిన అవసరం ఉందని ఆయన చెప్పారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ డాక్టర్ రవి శంకర్ అయ్యనార్ మాట్లాడుతూ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త వహిస్తామని చెప్పారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ మాట్లాడుతూ తమ శాఖకు సంబంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అందజేస్తామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డాక్టర్ డి.సాంబశివరావు, ఆదిత్యనాథ్ దాస్, నీరబ్ కుమార్ ప్రసాద్, ఎల్.వి.సుబ్రహ్మణ్యం, బుదితి రాజశేఖర్, ముఖ్య కార్యదర్శలు కె.దమయంతి, జి.అనంత రాము, అజయ్ జైన్, కె.ప్రవీణ్ కుమార్, కెఎస్ జవహర్ రెడ్డి, కార్యదర్శులు శశిభూషణ్ కుమార్, ముఖేష్ కుమార్ మీనా,  డి.వెంకట రమణ, హెచ్.అరుణ్ కుమార్, గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు, అర్బన్ ఎస్పీ విజయరావు, ఏపీ లెజిస్లేచర్ కార్యదర్శి ఎం. విజయరాజు, డిప్యూటీ సెక్రటరీ కె.సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...