Jan 13, 2019

ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం కృషి

                     

                     
     
 ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రధాన్యతను పౌరులకు తెలియజేస్తూ ఎన్నికలలో ఓటు వేసేవారి శాతాన్ని పెంచడానికి భారత ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా ఇంకో అడుగు ముందుకు వేసి అవకాశం ఉన్నమేరకు అత్యాధునిక  సాంకేతికతను ఉపయోగించి ఎన్నికలకు ఉన్న ప్రాధాన్యత తెలిపి, వారిలో అవగాహన పెంచడానికి చర్యలు చేపట్టారు. ఓటర్ ఐడీ(ఎలక్టొరల్ ఫొటో ఐడెంటిటీ కార్డ్)తో ఓటర్ సెల్ నెంబర్ అనుసంధానం చేసి ఎన్నికలు, ఎన్నికల సంఘానికి సంబంధించిన సమాచారం ఓటర్ కు అందజేయడానికి కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించిన వెబ్ సైట్ ని రూపొందించి తుదిమెరుగులు దిద్దుతున్నారు.
నాలుగు రోజుల్లో దీనిని ప్రారంభిస్తారు. వెబ్ సైట్ ద్వారా ప్రతి ఓటర్ తన ఓటర్ ఐడీతో సెల్ నెంబర్ ని అనుసంధానం చేసుకునే సౌకర్యం కల్పిస్తారు. దాంతో  ఆ సెల్ నెంబర్ కు ఓటర్ పేరు, తండ్రి పేరు, ఊరు పేరు, పోలింగ్ కేంద్రం అడ్రస్, పోస్టల్ పిన్ కోడ్... తదితర వివరాలన్నీ జతవుతాయి. ఇటువంటి విధానాన్ని దేశంలో తొలిసారిగా మన రాష్ట్రంలోనే మొదలుపెడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లలో దాదాపు 90 శాతం మందికి సెల్ ఫోన్లు ఉండే అవకాశం ఉంది.  వారిలో ఎక్కవ శాతం మంది అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. ఈ విధానం ద్వారా ఓటర్ కూడా కమిషన్ కు మెసేజ్ పంపి  తనకు కావలసిన సమాచారం పొందే అవకాశం ఉంది. ఓటర్ వివరాలన్నీ సెల్ నెంబర్ తో అనుసంధానం కావడంతో మెసేజ్ రాగానే ఓటర్ కు కావసిన పోలింగ్ కేంద్రం అడ్రస్, ఓటర్ ఇంటి నుంచి కేంద్రం దూరం తదితర వివరాలు అతనికి పంపడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాలలో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల పట్టణ ప్రాంతాలలో ఓటర్ ని పోలింగ్ కేంద్రానికి రప్పించడానికి, పోలింగ్ శాతం పెంచడానికి కూడా కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓటర్ కు తన ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్  ఎంత దూరం ఉంటుందో, వెళ్లే మార్గం, పోలింగ్ స్టేషన్ లో  ఏ సమయంలో ఎంతమంది బారులుతీరి ఉన్నారో తెలియజేసే ఏర్పాట్లు కూడా చేయనుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా చేర్పించడానికి కూడా కమిషన్ అనేక చర్యలు తీసుకుంటోంది. ఓటు విలువను తెలియజెప్పుతూ ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా వంటి అన్ని రకాల మాద్యమాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తోంది. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల, గ్రామ స్థాయిలో తొలిసారి కొత్తగా ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్న యువతీ, యువకులను, దివ్యాంగులను  సన్మానిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 20 మంది కొత్త ఓటర్లను సన్మానించి, ప్రోత్సాహకంగా వారికి ట్యాబ్ లు కూడా కమిషన్ అందజేసింది.  ఇప్పటి వరకు నమోదైన ఓటర్ల పేర్లతో జనవరి 11న జాబితా విడుదల చేస్తుంది. పౌరులు ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో చూసుకొని లేని వారు తమ పేరు నమోదు చేయించుకోవచ్చు.  ఓటర్ల పేర్ల నమోదు, జాబితా రూపొందించడంలో ఎక్కడా ఎటువంటి అవకతవకలకు తావులేకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో నలుగురు  ఐఏఎస్ అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా వివిధ ప్రాంతాలలో పర్యటించి స్వయంగా పరిశీలిస్తారు. 85 ఏళ్లు దాటిన వృద్ధుల జాబితా ప్రత్యేకంగా తయారు చేశారు.
               ఎన్నికలు అందరికి అందుబాటులో ఉండేవిధంగా, అందరూ ఓటు వేసే వింధంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది. ఇందు కోసం  9 మందితో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, శాసనసభ నియోజకవర్గ స్థాయిలలో స్టీరింగ్ కమిటీలు సూచనలు సలహాలు ఇస్తాయి.  వృద్ధులు, అంధులు, మూగ, చెవుడు గలవారు, దివ్యాంగులు, పోలింగ్ కేంద్రాలకు రావడానికి వాహనాలు ఏర్పాటు చేసే ఆలోచనలో కమిషన్ ఉంది. వారి కోసం పోలింగ్ స్టేషన్ల వద్ద వీల్ చైర్లు ఏర్పాటు చేస్తారు.  వారు క్యూలో నిలబడకుండా నేరుగా వెళ్లి ఓటు వేసే సౌకర్యం కల్పిస్తారు. అవకాశం ఉన్నంత వరకు భవనాలలో పోలింగ్ కేంద్రాలు కిందే ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేవాటిలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను గుర్తించి పోలింగ్ కు అనువుగా వాటికి తీర్చిదిద్దుతున్నారు. ఓటర్ల జాబితాను చాలా పకడ్బందీగా రూపొందిస్తున్నారు. రెండుమూడు చోట్ల నమోదైన  దాదాపు 27 లక్షల పేర్లను ఇప్పటికే జాబితా నుంచి తొలగించారు.  పేర్లు తప్పుగా నమోదు కావడం, భర్త పేరు బదులు భార్య పేరు, భార్య పేరు బదులు భర్త పేరు, తండ్రి పేరు, ఇంటి నెంబర్.... ఇలా వివిధ రకాలుగా తప్పుగా నమోదైన 3 లక్షల 50 వేల పేర్లను కూడా తొలగించారు. అనుమానాస్సదంగా ఉన్న మరో లక్షా 30 వేల పేర్లను కూడా తొలగించారు. ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం  స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.  ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసే చివరి రోజు వరకు ఓటర్లుగా నమోదు చేయించుకొనే అవకాశం కమిషన్ కల్పించింది. ఆ తరువాత ఎన్నికల ముందు తుది జాబితా విడుదల చేస్తారు. ఓటు, పోలింగ్ స్టేషన్ ...వంటి విషయాలలో  ఎవరికైనా ఏవైనా అనుమానాలు ఉంటే ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్ 1950కి పోన్ చేసి నివృత్తి చేసుకొనే వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర శాసనసభ స్థానాలు, ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటర్ నమోదు పత్రం... వంటి కమిషన్ కు సంబంధించిన సమాచారంతో 2019 కేలండర్ విడుదల చేశారు. జనవరి 26న జాతీయ ఓటర్స్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించి 18 ఏళ్లు నిండిన వారిలో అత్యధిక మందిని ఓటర్లుగా చేర్చడానికి కమిషన్ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...