Jan 2, 2019

అవార్డుల ఆంధ్రప్రదేశ్



     
      

విభజన సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఆంధ్రప్రదేశ్ తన సత్తాను చాటుతోంది. ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడంతోపాటు ప్రతి రంగం, ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తూ విజయం సాధిస్తోంది.  అధికార యంత్రాంగం కూడా పట్టుదలతో పని చేస్తూ లక్ష్యాలను సాధిస్తోంది. వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో 600కుపైగా  అవార్డులు సాధించడమే అందుకు నిదర్శనం. అనేక అంశాల్లో రాష్ట్రం అద్వితీయమైన విజయాలు సాధించింది. ప్రణాళికాబద్దంగా లక్ష్యాలను రూపొందించుకుని రెండంకెల వృద్ధి రేటు సాధిస్తోంది. మొత్తం జాతీయ స్థూల అదనపు విలువ (జీవీఏ - గ్రాస్ వ్యాల్యూ యాడెడ్) వృద్ధి రేటుతో పోల్చితే రాష్ట్ర జీవీఏ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటోంది. సమ్మితళిత, స్థిరమైన  రెండంకెల వృద్ధిరేటు సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుపోతోంది. మానవ వనరులు, మౌలిక వసతులు, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సుస్థిరత, పాలనావిధానం, వ్యాపార అనుకూల వాతావరణం అనే ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకొని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ (ఎన్‌సీఏఈఆర్‌) సంస్థ దేశవ్యాప్తంగా 2016లో 29 రాష్ట్రాలు, ఢిల్లీలో సర్వే నిర్వహించింది.  ఆర్థిక పరిస్థితులను పరిశీలించినప్పుడు ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందే వాతావరణం ఉన్నట్లు తేలింది. కార్మికుల లభ్యత, కార్గో నిర్వహణ, సులభతరమైన భూకొనుగోలు కార్యకలాపాలు, ఏపీ ప్రధాన బలాలని సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఆ తరువాత రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి ఆ సర్వేలోని ఖచ్ఛితత్వాన్ని తెలిపింది. సరళతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో రాష్ట్రం వరుసగా రెండేళ్ల నుంచి మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాల అమలు ప్రాతిపదికగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ, ప్రమోషన్‌ (డిఐపిపి) కార్యాలయం అందించిన తాజా వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ 96.75 శాతం ప్రగతి సూచీని నమోదు చేసుకుంది. భాగస్వామ్య సదస్సుల నిర్వహణ, అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి వేల కోట్ల రూపాయల పెట్టుబుడుల  ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో సులభత వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్‌ శరవేగంగా ప్రథమ స్థానానికి దూసుకు వెళ్ళిందని డిఐపిపి పేర్కొంది. ఎలక్ట్రానిక్ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది. దేశంలో తయారయ్యే ప్రతి 10 సెల్‌ఫోన్లలో 3 మన రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.

           పాలన వేగవంతం చేసేందుకు ప్రారంభించిన ఏడు మిషన్లు (ప్రాధమిక రంగం, సామాజిక సాధికారిత, నైపుణ్యాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పారిశ్రమలు, మౌలికసదుపాయాలు, సేవల రంగం), ఐదు గ్రిడ్లు (గ్యాస్, వాటర్, ఫైబర్, రోడ్, పవర్), మరో ఐదు (పేదరికంపై గెలుపు, పరిశుభ్ర-ప్రజారోగ్యం, నీరు-చెట్టు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది) ప్రచార కార్యక్రమాలు నిర్ణీత వ్యవధిలో నిర్ధేశించిన లక్ష్యాలు సాధించడానికి ఉపయోగపడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తూ రికార్డు నెలకొల్పింది. ఎల్ఈడీ బల్బుల వినియోగంలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. -ప్రగతిలో రాష్ట్రం దేశంలో అగ్రభాగాన నిలిచింది. లెడ్ బల్బుల ఏర్పాటులో కూడా రాష్ట్రం ముందుంది. అన్నిశాఖలలో నూరు శాతం డిజిటలైజేషన్ దిశగా పనులు జరుగుతున్నాయి. పేదలకు శాశ్వత గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో అత్యధిక ఇళ్లను కట్టించి ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది. పంచాయతీరాజ్, -ప్రగతి, విద్యుత్, గృహ నిర్మానం వంటి రంగంలో రాష్ట్రానికి అవార్డుల పంట పండింది. అత్యధిక అవార్డులు సాధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మొదటి స్థానంలో నిలిచింది.   ఉపాధి హామీ పథకం అమలులో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్ధానంలో నిలిచింది. ఈ నిధులను రాష్ట్రం సమర్థవంతంగా వినియోగించుకొంటూ గ్రామీణులకు ఉపాధి కల్పిస్తూనే స్థిరాస్థిని పెంచుతోంది. 100 రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల్లో, 67,265 పంట సంజీవనులను తవ్వించడంలో,  వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో, అనుసంధాన శాఖలతో కలసి మెటీరియల్ ఖర్చు చేయడంలో దేశంలో రాష్ట్రం  మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ రాష్ట్రాలకు ప్రకటించిన అవార్డులలో అత్యధికంగా 10 అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ సొంతం చేసుకుంది.   ఏపీకి 9 క్యాటగిరిల్లో అవార్డులు రాగా, పారదర్శకత, జవాబుదారీతనంలో మొదటి స్థానం లభించింది. విద్యుత్ రంగంలో  మొత్తం 105 అవార్డులు వచ్చాయి.  సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ 2015-16లో 3, 2016-17లో 3, 2017-18లో 4, ఈ ఏడాది 15 అవార్డులను సాధించింది.  'స్వచ్ఛ సర్వేక్షణ్' ర్యాంకుల్లో దేశంలోని టాప్ టెన్ లో ఏపీలో మూడు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. విజయవాడ 5వ ర్యాంక్, తిరుపతి 6, విశాఖపట్నం 7వ ర్యాంక్ సాధించాయి. వివిధ ప్రభుత్వరంగ సంస్థల పనితీరు మెచ్చిన స్కోచ్‌ఏపీకి భారీగా అవార్డులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 11 మెరిట్‌ పురస్కారాలతోపాటు మూడు గోల్డెన్‌ అవార్డులు, ఒక కార్పొరేట్‌ ఎక్సెలెన్స్‌ ప్లాటినం అవార్డు దక్కించుకుంది. ఇంధన రంగం కూడా పది అవార్డులను సొంతం చేసుకొంది. 2018 ఏడాదికి ఈ-మెజర్మెంట్‌ బుక్‌కు  ఏపీ ట్రాన్స్‌ కోకు స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు దక్కింది. పర్యావరణ పరిరక్షణ చర్యలకు రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్‌కు ఒక అవార్డు, పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించినందుకు  నెడ్‌క్యా్‌ప్ కు 8 స్కోచ్‌ పురస్కారాలు దక్కాయి. ఏపీ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌, ఏపీ పౌర సరఫరాల సంస్థ, ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఏపీ లిమిటెడ్‌కు ఒక్కో అవార్డు దక్కాయి. గ్రామీణ వ్యాపారవేత్తల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అయిదుగురికి, అనంతపురం జిల్లాకు చెందిన ఒకరికి స్కోచ్‌ అవార్డులు దక్కాయి.  విశాఖలో సొంతంగా స్థలాలు ఉండి, ఇళ్లు నిర్మించుకోవాలని ఆశగా ఉన్న లబ్దిదారుల కోసం చేసిన వినూత్న ప్రయోగానికి గోల్డెన్ అవార్డ్ వరించింది. లబ్దిదారులకి నేరుగా బ్యాంక్ ద్వారా డబ్బు పంపించడం వంటి ప్రతిభ‌కి ఈ అవార్డ్ వచ్చింది. ఈ విధంగా అన్ని రంగాలలో ప్రగతిని చూపిస్తూ అన్ని శాఖలు గణనీయంగా అవార్డులు సాధించాయి.
-        శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...