Jan 8, 2019


బహిరంగ చర్చకు జగన్ కు
 సవాల్ విసిరిన మంత్రి ప్రత్తిపాటి
                           సచివాలయం, జనవరి 8: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ పుస్తకం విడుదల చేయడంపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. సచివాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, బహిరంగ చర్చకు రావాలని ఆయన జగన్ కు సవాల్ విసిరారు. ప్రధాని మోడీ డైరెక్షన్ లో ఆ పుస్తకం రాసినట్లు ఆరోపించారు. ఆయన మొప్పు కోసమే ఈ తిట్ల దండకం అన్నారు. ఆ పుస్తకంలోనివి అన్నీ నిరాధారమైన ఆరోపణలన్నారు. రూ.6 లక్షల కోట్ల అవినీతి అని రాశారని, అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంతని ఆయన ప్రశ్నించారు. మంత్రి నారాయణ 3,129 ఎకరాలు కొన్నారని ఆరోపణలు చేశారని, రాజధాని పరిధిలో రెండు వేల ఎకరాలు మాత్రమే అమ్మకాలు, కొనుగోళ్లు  జరిగినట్లు ఆయన తెలిపారు. అవన్నీ పచ్చి అబద్దాలన్నారు. ఏదిపడితే అది రాస్తే ప్రజలు నమ్మరని చెప్పారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తులను ప్రకటించారని, జగన్మోహన రెడ్డికి కుటుంబ ఆస్తులు ప్రకటించే దమ్ము, ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. బెంగుళూరు ప్యాలెస్, హైదరాబాద్ లోని లోటస్ పాండ్, సాక్షి పత్రిక, టీవి ఆస్తులు వెళ్లడించాలని డిమాండ్ చేశారు. అతని అక్రమ ఆస్తులు రూ.43వేల కోట్లని సీబిఐ నిర్ధారించిందని, ఆ ఆస్తులను ముందు ప్రజలకు పంచాలన్నారు. అతను అవినీతి గురించి మాట్లాడటం ఏమిటన్నారు.  ఎన్ని ఏళ్లు పాదయాత్ర చేసినా జనం అతనిని నమ్మరని చెప్పారు.
           రాజధానిలో ఎస్ఆర్ఎం, విట్ వంటి విద్యా సంస్థలు వచ్చాయని, సీఆర్డీఏ  ప్రాంతంలో పలు సంస్థలు ఉత్పత్తిని కూడా ప్రారంభించాయన్నారు. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులతో 5 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. వైఎస్ హయాంలో ఎన్ని వేల ఎకరాల భూములు ఇచ్చారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో  చెప్పాలన్నారు. ఆయన ఇచ్చిన భూములను బ్యాంకులకు తాకట్టుపెట్టి డబ్బు దండుకున్నారని ఆరోపించారు. నీటి పారుదల శాఖలో రూ.లక్ష కోట్ల అవినీతి అని రాశారని, ఆ పుస్తకంలోనే మరో  చోట ఆ శాఖలో ఖర్చు చేసింది రూ.62 వేల కోట్లని రాశారని, ఈ రెండిటికీ పొంతన ఉందా అని మంత్రి ప్రశ్నించారు. ఖర్చు రూ.62వేల కోట్లు అయితే, అవినీతి రూ.లక్ష కోట్లు ఎలా జరుగుతుందన్నారు. జగన్మోహన రెడ్డి తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీని ప్రశ్నించే దమ్ము జగన్ కు లేదన్నారు. మోదీతో లాలూచిపడి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాఫెల్ కుంభకోణం, వెనుకబడిన జిల్లాల నిధులు వెనక్కు తీసుకోవడం, రాజధానికి నిధులు, పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు ఇవ్వకపోవడం, తన సొంత జిల్లా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం, విశాఖ రైల్వే జోన్.. వంటి వాటిలో ఏ ఒక్కదానిపై ప్రశ్నించలేదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రశ్నించే దమ్ములేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకి, రక్షణ వ్యవస్థకి, రాజ్యాంగ వ్యవస్థలకు, ఆంధ్రప్రదేశ్ కు, సెక్యులరిజానికి వెన్నుపోటు పొడిచిందన్నారు.
                  16 నెలలు జైలు జీవితం అనుభవించిన దోపిడీ దొంగకు పుస్తకం రాసే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు దేశంలో ఎక్కడైనా ఉన్నారా? అని అడిగారు.స్వాతంత్ర్య భారత చరిత్రలో ఇటువంటి నాయకుడు లేరన్నారు. చంద్రబాబు నాయుడుపై గతంలో 24 కేసులుయ పెట్టారని, వాటిలో ఒక్కటైనా రుజువు చేయగలిగారా? అని అడిగారు. జగన్ ఏమిటో, చంద్రబాబు ఏమిటో ప్రజలకు అర్ధమైందన్నారు. 2014లో ప్రజలు చంద్రబాబుని నమ్మారని, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా, విశ్వాసం కోల్పోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. జగన్ ఏం చేశారో ప్రజలకు తెలుసన్నారు. రాజధానిని అడ్డుకున్నారని, ఉపాధి హామీ నిధులు కూడా రాకుండా అడ్డుపడటానికి లేఖలు రాసిన ఘనాపాటి అని విమర్శించారు. 2019లో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు 150 సీట్లు ఇస్తారని, జగన్మోహన రెడ్డికి ఉన్న సీట్లు కూడా ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెడతారని అన్నారు. అవితీని పత్రికలో తప్పుడు రాతలు, అవినీతి టీవీలో తప్పుడు ప్రచారం చేయడం వల్ల వారికే ఓట్లు రావని, నష్టపోతారని మంత్రి పుల్లారావు హెచ్చరించారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...