Jan 6, 2019

చుక్కల భూముల సమస్య పరిష్కారానికి చర్యలు


జనవరి 24 నాటికి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు
                  సచివాలయం, జనవరి 4: దీర్ఘకాలంగా ఉన్న చుక్కల భూముల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సమస్యను ఈ నెల 24వ తేదీ నాటికి పరిష్కరించాలని  ప్రభుత్వం శుక్రవారం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తనంతట తానుగా చుక్కల భూముల పునఃపరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. చుక్కల భూముల పూర్వాపరాలను పరిశీలిస్తే స్వాతంత్య్రం రాక ముందు 1906లో దేశవ్యాప్తంగా భూముల సర్వే జరిగింది. అ తర్వాత 1954లో రీ సర్వే చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు సర్వే గానీ, రీ సర్వే జరగలేదు. దీంతో భూమి హక్కులకు సంబంధించి 1954 నాటి రెవెన్యూ రికార్డులే ప్రామాణికంగా ఉన్నాయి. 1954లో రీ సర్వే జరిగినప్పుడు రెవెన్యూ రికార్డుల్లో సర్వే నెంబర్‌ వారీగా ఖాతాదారుల పేర్లు, విస్తీర్ణం నమోదు చేశారు. అయితే, ఎవరూ యాజమాన్య హక్కు కోరని  భూముల వద్ద రికార్డుల్లో చుక్కలు(డాట్స్‌) పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఈ భూములను చుక్కల భూములు(డాటెడ్‌ ల్యాండ్స్‌)గా పిలుస్తున్నారు. 1954 తరువాత ఆ భూములను సాగు చేసుకునేవారికి ఎటువంటి యాజమాన్య హక్కులు లేవు. వాటిని బదిలీ చేసుకునే, అమ్ముకునే అవకాశం లేదు. దాంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూమి హక్కుల కోసం రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.  ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇది పెద్ద సమస్యగా తయారైంది. దాంతో ఈ సమస్యను పరిష్కరిచాలని ప్రభుత్వం తనంతతానుగా నిర్ణయం తీసుకుంది.  
                రిజిస్ట్రేషన్ చట్టం-1908 లోని 22-1లో నిషేధిత ఆస్తుల జాబితా నుంచి చుక్కల భూములను తొలగిస్తూ 2017 జూలై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇక ముందు  ఏవైనా రైతుల ఆధీనంలో సాగులో ఉన్న చుక్కల భూములు  ప్రైవేటు పట్టా భూములుగా పరిగణిస్తారు. చుక్కల భూములకు సంబంధించిన సర్వేనెంబర్లు, ఇతర వివరాలను రెవెన్యూ శాఖ ఆయా జిల్లాలలోని  రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపుతుంది. ఆ భూములను స్వాధీనంలో ఉంచుకున్నవారు, సాగుచేసుకుంటున్నవారు ప్రభుత్వం నిర్ణయించిన  పత్రాలలో ఏదోఒకటి చూపిస్తే ఆ భూమి వారికి సంబంధించినదిగా  రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తారు. 2017 జూలై 14వ తేదీకి ముందు 12 ఏళ్లు ఆధీనంలో ఉన్నట్లు ఏవైనా ఆధారాలు చూపినా రిజిస్టర్ లో వారి పేరు నమోదు చేస్తారు. చుక్కల భూములకు సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద,  తహశీల్దార్ కార్యాలయంలో పరిశీలనలో ఉన్న వాటిని, ఫిర్యాదులు, విజ్ఞప్తులను రెవెన్యూ సిబ్బంది తమంతటతాముగా పరిశీలిస్తారు. వాటికి కూడా ఇవే  నిబంధనలు  వర్తిస్తాయి.
ఆర్వోఆర్ చట్టం ప్రకారం 1బి రిజిస్టర్ 2వ కాలమ్ లో నమోదైన పట్టాదారు పేరుని సరిచూసుకొని తదనుగుణంగా 1బి రిజిస్టర్ 8వ కాలమ్ లో కొనుగోలు లేదా వారసత్వం లేదా వంశపారంపర్యం అని నమోదు చేసినవాటిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు.
8వ కాలమ్ లో ఏమీ రాయకపోయినా పట్టాదారు భూమిగా పరిగణించి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 8వ కాలమ్ లో 1954కు ముందు ఇచ్చిన డి పట్టా, డికెటి పట్టా, అసైన్ మెంట్ భూములు అని నమోదు చేసినట్లైతే వాటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. 1954 తరువాత ప్రభుత్వం ఇచ్చిన భూములు నిషేధిత జాబితాలోనే కొనసాగుతాయి. చుక్కల భూములు పరిశీలన పూర్తి అయిన తరువాత తుది జాబితాని తహశీల్దార్ కార్యాలయాల వద్ద ప్రదర్శనకు పెడతారు. వాటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, తెలియజేస్తే రెవెన్యూ శాఖ పరిశీలిస్తుంది. అభ్యంతరాల పరిశీలన తరువాత సవరించిన తుది జాబితాని ప్రకటిస్తారు.
                భూముల పున:పరిశీలన పూర్తి అయిన తరువాత నిషేధిత భూముల నుంచి చుక్కల భూములతోపాటు ఇతర భూములను తొలగించిన సెక్షన్ 22-1 () టు (డి) కొత్త జాబితాని నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపాలని  ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్ 22-1() జాబితాని నేరుగా ప్రభుత్వనికి పంపాలని, ప్రభుత్వం దానిని గెజిట్ లో ప్రచురిస్తుంది. ఈ నెల 24వ తేదీ లోపల ఈ ప్రక్రియ పూర్తి కావాలని  ఆ దేశాలలో ప్రభుత్వం పేర్కొంది. తాజా వివరాలతో కూడిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారులకు పంపాలని, సంబంధిత వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...