Jan 23, 2019


అమరావతికి ఆధునిక హంగులు
            
  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతికి ఆధునిక హంగులు సమకూరుస్తోంది. ప్రపంచ స్థాయిలో నిర్మించే ఈ మహానగర రూపకల్పనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సాంప్రదాయ నిర్మాణాలకు భిన్నంగా అత్యంత ఆధునిక విదేశీ టెక్నాలజీని వినియోగించి శరవేగంగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఒక్క ఇటుక కూడా వినియోగించకుండా మలేషియాలో అభివృద్ధి చేసిన షీర్ వాల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. స్లాబ్‌తో పాటు  గోడల నిర్మాణాన్ని ఏకకాలంలో  పూర్తి చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. భవన నిర్మాణ ఆకృతికి తగిన విధంగా అల్యూమినియం మౌల్డింగ్‌ను తయారు చేస్తారు.  పిల్లర్లతో పాటు గోడల్ని కూడా కాంక్రీట్, ఇనుము మిశ్రమం కలిపి వేగంగా కట్టుకుంటూ వెళ్లిపోతారు.  ఇలా ఒక దాని వెంట ఒక ఫ్లోర్  నిర్మస్తారు. భవన నిర్మాణ సమయాన్ని  తగ్గించడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. నూతన ప్రయోగాలలో  భాగంగా  ప్రీ కాస్ట్ టెక్నాలజీని కూడా ఇక్కడ వినియోగిస్తున్నారు. ఈ విధానంలో  భవన నిర్మాణానికి కావలసిన కాంక్రీట్, ఇనుము వంటి వాటితో తయారు చేసిన కొన్ని ఆకృతులను ఇతర చోట్ల తయారు చేసుకొని తీసుకువచ్చి ఇక్కడ బిగిస్తారు. దాంతో చాలా వరకు సమయం ఆదా అవుతుంది.  సాధారణంగా ఇంత భవనాలు నిర్మించడానికి రెండు, మూడు ఏళ్లు పడుతుంది. కానీ ఇక్కడ ఆధునిక టెక్నాలజీ వినియోగించడంతో వారానికో అంతస్తు లేస్తోంది. పలు  బహుళ అంతస్తుల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు, ఉద్యోగులకు 3800 ఫ్లాట్ల నిర్మాణం ఏక కాలంలో జరుగుతోంది.  ఈ విధంగా నెలల్లో నిర్మాణాలు పూర్తి చేస్తారు.


             రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద అత్యంత ఆధునిక హంగులతో అంతర్జాతీయ స్థాయిలో  ర్యాఫ్ట్ పౌండేషన్ ద్వారా నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం నిర్మాణానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్సోంది. దీనికి గత ఏడాది డిసెంబర్ 27న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.   ‘డయాగ్రిడ్’ సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి  సచివాలయం శాఖాధిపతుల కార్యాలయ భవన సముదాయం నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా అతి ఎత్తైన సచివాలయం కూడా ఇదే అవుతుంది.  41 ఎకరాల్లో 56 లక్షల చదరపు అడుగుల్లో 250 మీటర్ల ఎత్తులో శాశ్వత సచివాలయం నిర్మిస్తున్నారు. 40 అంతస్తులతో 4 టవర్లు, 50 అంతస్తులతో మరో టవర్ ను నిర్మిస్తారు. ఈ నిర్మాణాలన్నిటికీ పిల్లర్లు ఉండవు.  సచివాలయం నిర్మాణానికి 12 వేల క్యూబిక్ మీటర్ల మేర 13 అడుగుల లోతులో ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దేశంలో ఈ తరహా భారీ నిర్మాణం ఇదే. ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన 50 అంతస్థుల టవర్ కోసం 11,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఈ పనిని నిర్విరామంగా 55 గంటల్లో పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు.  భూగర్భ డ్రైనేజీతో పాటు తాగునీటి వ్యవస్థ పైపులు, గ్యాస్, విద్యుత్, కేబుల్ గ్రిడ్ వంటి వాటిని డక్ట్ ద్వారా భూగర్భంలోనే అమర్చుతారు. ఈ విధంగా దేశంలో డక్ట్ లను వినియోగిస్తున్న రాష్ట్రం మనదే. రాజధాని నిర్మాణం జెట్ స్పీడ్ తో జరగడానికి దాదాపు 20వేల మంది కార్మికులు రాత్రి, పగలు నిరంతరం శ్రమిస్తున్నారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్, ప్రభుత్వ గృహ నిర్మాణాలు మార్చి నాటికి పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఏపీ సీఆర్డీఏ ఉంది.

                    అమరావతిలోని పరిపాలనా నగరంలో భద్రతాపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. నగరం మొత్తం ఫేస్‌ డిటెక్షన్‌ సహా పలు అత్యాధునిక భద్రతా ఏర్పాట్లు చేస్తారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సచివాలయంలో విద్యుత్ వాహనాలను వాడుతున్నారు. కొంతమంది సచివాలయ, సీఆర్డీఏ అధికారులు కూడా ఈ వాహనాలను వాడుతున్నారు. సచివాలయంలో, విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో విద్యుత్ ఛార్జింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా రాజధాని నగరంలో ఉష్టోగ్రతను తగ్గించడానికి  ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీని వినియోగించనుంది. నగరం అంతటికీ ఉపయోగపడేవిధంగా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్(కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ) ఏర్పాటు చేయడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన సంస్థతో సీఆర్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి 440 మీటర్లకు ఒక కూల్ స్పాట్ ఏర్పాటు చేస్తారు. గ్యాస్, నీరు, విద్యుత్ మాదిరిగా కావలసిన ఇంటికి ఏసీని అందిస్తారు. ఇటువంటి వ్యవస్థ మన దేశంలో ఎక్కడాలేదు. అమరావతిలో 40 వేల టన్నుల సామర్ధ్యం కలిగిన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో సీఆర్డీఏ ఉంది. ఈ విధంగా రాజధాని అమరావతికి ప్రభుత్వం అనేక ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానుంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ – 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...