Jan 4, 2019

గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత



v జెట్ స్పీడ్ తో నిర్మాణం
v గేటెడ్ కమ్యూనిటి తరహాలో ఫ్లాట్లు
v ముందంజలో 5 జిల్లాలు
v 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి
                      
   రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ ఆధునిక సౌకర్యాలతో గృహాలు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా రూ.80 వేల కోట్ల అంచనా వ్యయంతో 20 లక్షల ఇళ్ల నిర్మాణానికి పూనుకుంది. 2022 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు సమకూర్చాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం.  ఈ ప్రాజెక్టుని ఓ పవిత్ర యజ్ఞంలా కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల కింద మొత్తం ఇళ్లు నిర్మాణ లక్ష్యం 19,57,429 కాగా, 13,61,252 మంజూరు చేశారు.  11,51,465  పనులు ప్రారంభించగా, 7,20,113 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. రాష్ట్రంలో మొత్తం  28 గృహ నిర్మాణ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. మిగిలిన వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి అధికార యంత్రాంతం తీవ్రంగా కృషి చేస్తోంది.  అవసరాన్ని బట్టి మరో 5 లక్షల ఇళ్లు అదనంగా నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గృహాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం కూడా నిధులు సమకూరుస్తోంది. భూమి, మౌలిక సదుపాయాలు, నిర్మాణ వ్యయం కలిపితే ఒక్కో ఫ్లాట్ విలువ రూ.10 నుంచి 12 లక్షలు ఉంటుంది. అయితే ప్రభుత్వం నిర్మాణ వ్యయాన్ని మాత్రమే లెక్కిస్తోంది. అందులో కూడా  రూ.3 లక్షల వరకు  సబ్సిడీ ఇస్తుంది.  అందువల్ల బ్యాంకులు రూ.2 నుంచి రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వలసి ఉంటుంది. బ్యాంకులకు కావలసిన అన్ని పత్రాలను మునిసిపల్, టిడ్కో, మెప్మా అధికారులు అందజేస్తారు. ప్రభుత్వం ఈ ఇళ్ల రిజిస్ట్రేషన్ కు, మార్ట్ గేజ్ కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చింది. పేదలకు సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ కల నెరవేర్చడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.  లబ్దిదారులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్లాట్ పొందిన లబ్దిదారులు నేరుగా గృహప్రవేశం చేసుకోవడమే.  పేదవారు ఏనాడు ఊహించని స్థాయిలో ఈ ఇళ్లను నిర్మించారు.  ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే స్థలం సమకూరుస్తోంది. అపార్ట్ మెంట్ల నిర్మాణానికి అనుమతులు, విద్యుత్ కనెక్షన్, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం, పరిసరాలు పచ్చదనంతో నింపడం,  మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే సమకూరుస్తోంది.  ఈ ఇళ్లను అత్యంత ఆధునిక షేర్ వాల్ టెక్నాలజీతో దృఢంగా టిడ్కో నిర్మిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఒకే పద్దతిలో జీ+3 విధానంలో  300, 365 చదరపు అడుగుల సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు, 465 చదరపు అడుగుల డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు మూడు కేటగిరీలుగా నిర్మిస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటి తరహాలో ఇవి ఉంటాయి.    ఇళ్ల నిర్మాణంలో వెర్టిఫైడ్ టైల్స్, సెరామిక్ టైల్స్, గ్లేజ్ సెరామిక్ టైల్స్, బ్లాక్ గ్రానైట్, సాల్ ఉడ్ తలుపులు, ప్లాస్టిక్ ఎమల్సన్ పెయింటింగ్ వంటి వాటిని వాడుతున్నారు. ఎల్ అండ్ టీ, షాపూర్ పల్లోంజీ వంటి పెద్ద సంస్థలు వీటిని నిర్మిస్తున్నాయి.
        గ్రామాలలో 6 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు.  ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పట్టణ),  ఎన్టీఆర్ నగర్ పట్టణ గృహనిర్మాణ పథకాల కింద పట్టణ ప్రాంతాలలో 5,24,000 ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో దాదాపు లక్షా 50వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. పట్టణ ప్రాంతాలలో చాలా చోట్ల స్థలాలు అందుబాటులో లేకపోవడం వల్ల నిర్మాణాలలో జాప్యం జరుగుతోంది.  ఇప్పటి వరకు 1,88,930 ప్లాట్లు లబ్దిదారులకు కేటాయించారు. మిగిలిన ప్లాట్లను కూడా త్వరగా కేటాయించే పనుల్లో అధికారులు ఉన్నారు. మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. సీఎం ఆదేశాలతో అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో జెట్ స్పీడ్ తో నిర్మాణాలు జరుగుతున్నాయి.  గృహ నిర్మాణం వేగంగా జరగడానికి పెండింగ్ బిల్లులను కూడా అంతే వేగంగా క్లియర్ చేస్తున్నారు.  హడ్కో నుంచి రావలసిన  నిధులను విడుదల చేయించడానికి వత్తిడి పెంచుతున్నారు.  లబ్దిదారుల వాటాగా రూ.472.88 కోట్లు చెల్లించారు. వారం, పది రోజుల్లో హడ్కో నుంచి రూ.500 కోట్లు, కేంద్రం నుంచి మరో రూ.500 కోట్లు వచ్చే అవకాశం ఉంది.
                  వాస్తవానికి బ్యాంకుల నుంచి రుణాలు పొందిన తరువాత నిర్మాణాలు చేపట్టాలని ముందు అనుకున్నారు. లబ్దిదారుల ఎంపిక, బ్యాంకుల రుణాల మంజూరు ప్రక్రియలు ఆలస్యమవుతుందని నిర్మాణాలను మొదలుపెట్టి పూర్తి చేస్తున్నారు. పట్టణాలలో మునిసిపల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీలు నిబంధనల ప్రకారం లబ్దిదారులను ఎంపిక చేస్తాయి. ఆ తరువాత లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు. మరో పక్క బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఒక్కో బ్లాక్ ని ఒక్కో బ్యాంకుకు కేటాయిస్తారు. బ్యాంకులు కూడా తమ బ్యాంకు మార్గదర్శకాలను అనుసరించి రుణాలు మంజూరు చేస్తాయి. అపార్ట్ మెంట్ల నిర్మాణం, లబ్దిదారుల ఎంపిక, రుణాల మంజూరుకు సంబంధించి  ఒక అవగాహనకు రావడానికి బ్యాంకర్లతో అధికారులు పలుసార్లు సమావేశమయ్యారు. అనుమానాలను నివృత్తి చేసుకొని ఒక స్పష్టతకు వచ్చారు. మొత్తం 46 బ్యాంకులు, వాటికీ చెందిన 5,560 శాఖలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. బ్యాంకులకు లక్ష్యాలు నిర్ణయించారు. స్థలాలు సమకూర్చి, ప్రభుత్వమే ప్లాట్లు నిర్మించి ఇస్తున్నందున బ్యాంకులు కూడా సామాజిక బాధ్యతగా భావించి రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలని ప్రభుత్వం కోరుతోంది.  ఉభయ గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలు ఇళ్ల నిర్మాణంలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అయిన ఇళ్లను కేటాయిస్తున్నారు. బ్యాంకులు కూడా లబ్దిదారులకు ఖాతాలు లేకపోతే ఖాతాలు తెరిపిస్తున్నాయి. రుణాలు మంజూరులో చిలకలూరిపేట ఆంధ్రాబ్యాంకు బ్రాంచ్ ముందంజలో ఉంది.  అవినీతి జరుగకుండా, లబ్దిదారులు వేధింపులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇల్లు పొందిన ఆనందం లబ్దిదారుని కళ్లలో కనిపించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు, మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.  దేశంలోనే పెద్దఎత్తున చేపట్టిన ఈ ప్రాజెక్టుని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.  ఇళ్ల నిర్మాణం, కేటాయింపులు త్వరితగతిన జరగడానికి ప్రతి 15 రోజులకు సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.   
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...