Jan 28, 2019


త్రాగునీరు, ఉపాధి, గృహనిర్మాణానికి ప్రాధాన్యత
కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశాలు
              సచివాలయం, జనవరి 28: త్రాగునీరు, ఉపాధి, గృహనిర్మాణ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని మంత్రి మండలి సమావేశ మందిరంలో సోమవారం ఉదయం తొలిసారిగా జరిగిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. కలెక్టర్ల సమయం ఆదా అవడం కోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   ప్రతి గ్రామంలో, పట్టణంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందిలేకుండా చూడాలని చెప్పారు. అందుకు కావలసిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. రానున్న వేసవి కాలానికి తాగునీటి సరఫరాపై పంచాయతీరాజ్ శాఖ ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని చెప్పారు. నిరుద్యోగ యువతకు తగిన శిక్షణ ఇప్పించి, ఏజన్సీల ద్వారా లేదా నేరుగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి వారికి ఉపాధి కల్పించాలన్నారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలని చెప్పారు. కేటాయించి మంజూరు కాని ఇళ్లను ఫిబ్రవరి 1వ తేదీకీ మంజూరు చేయాలని ఆదేశించారు. 9వ తేదీన ఒకే  రోజు 3 లక్షల  గృహప్రవేశం జరగాలని ఆదేశించారు.  అలాగే కొత్త రేషన్ కార్డులను, కొత్త వృద్ధాప్య పెన్షన్ పత్రాలను ఫిబ్రవరి 1వ తేదీకి లబ్దిదారులకు అందజేయాలని చెప్పారు. ఆలస్యం చేయకుండా చుక్కల భూములు, ఇతర భూ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. చుక్కల భూముల విషయంలో అధికారులు బుక్ నాలెడ్జ్‌ ను అనుసరించడం వల్లనే ఇన్నాళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోలేదన్నారు. గుంటూరు జిల్లాలో చుక్కల భూములకు సంబంధించిన సమస్యలు దాదాపు 28 వేలు పరిష్కారం అయ్యాయని, ఈ విషయంలో గుంటూరు జిల్లా కలెక్టర్ అనుసరించిన విధానాన్ని అనుసరించమని ఆదేశించారు. సాంకేతిక సమస్యలతో లేనిపోని ఇబ్బందుల్ని సృష్టించకుండా సరళమైన విధానాలతో సమస్యను పరిష్కరించాలన్నారు. దావోస్ వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ప్రకృతి సేద్యంపై చర్చ జరిగిందన్నారు. ప్రపంచానికి భారతదేశం తరఫున మనం అందించే గొప్ప కానుక ప్రకృతి సేద్యం అని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని చెప్పారు. తాను ప్రకృతి సేద్యం ద్వారా పండిన పంటనే తింటున్నానని, అందరూ అదే తినాలని సూచన చేశారు. అధికారులు బాధ్యత తీసుకుని ప్రకృతి సేద్యంపై దృష్టి పెట్టాలన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలన్నింటినీ సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న బంద్‌కు పిలుపు ఇచ్చిందని, దానికి ఇబ్బందిలేకుండా 2, 3, 4 తేదీలతో జన్మభూమి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా అన్న క్యాంటీన్లను వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆదరణ, ఇతర సంక్షేమ కార్యక్రమాలను క్షుణ్ణంగా సమీక్షించుకుని చివరి లబ్ధిదారుని వరకు చేరేలా చూడాలన్నారు.  బీసీలు ఎప్పటి నుంచో అడుగుతున్నందున కొత్తగా 10 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనాభా దామాషా ప్రకారం పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలన్నారు. కాపు రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించడానికి ఈ అంశాన్ని శాసనసభకు తీసుకొస్తున్నామని చెప్పారు. సమాజంలో ఎవరూ తాము పేదవాళ్లం, తమకు గుర్తింపు లేదని బాధ కూడదన్నతది తన భావనగా వ్యక్తం చేశారు. అగ్రవర్ణాలలో వున్న పేదలకు కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. ఎస్‌సీ, ఎస్‌టీ సబ్ ప్లాన్ మాదిరిగా బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తున్నామన్నారు.  అత్యంత వెనుకబడిన కులాల వారికి నెలకు 100 యూనిట్ల, బార్బర్ షాపులకు, స్వర్ణకారులకు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.  అమరావతిలో  100 కోట్లతో పూలే స్మారక కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 106 గురుకులాలు ఉన్నాయని, కొత్తగా 69 ఏర్పాటు చేస్తామన్నారు. మన సంప్రదాయ సంగీత కళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, డోలు, సన్నాయి, వయోలిన్ వంటి సంగీత కళలకు ఇప్పటికీ ఎంతో డిమాండు వుందని చెప్పారు. రాజధానిలో సంగీత కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు సీఎం తెలిపారు. ఆర్టీజీకి, ఆయా శాఖల క్షేత్రస్థాయి పరిశీలనకు అనుసంధానం  ఉండాలన్నారు.  
రంగు మారిన ధాన్యాన్ని గ్రేడింగ్ లేకుండా రూ.1,550లకు కొనుగోలు చేయాలని ఆదేశించారు. 31, 1 తేదీలలో ఫెతాయ్ తుఫాన్ నష్టం పరిశీలనకు కేంద్రం బృందం వస్తుందని, వారికి రంగుమారిన ధాన్యాన్ని, నష్టం ఫొటోలను చూపించాలన్నారు.
ఉపాధి హామీ నిధుల కేటాయింపులో కేంద్రం కాలయాపన చేస్తుందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర సహాయాలపై ఢిల్లీ వెళ్లి ఆయా శాఖల మంత్రులపై వత్తిడి తేవాలని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి సూచన చేశారు. గ్రామాలలో గార్బేజ్ కలెక్షన్ పనులు ఉధృతం చేయాలని,  డ్రెయిన్లలో పూడిక ఉంటే తీయించాలని,  అన్ని గ్రామాలు పరిశుభ్రంగా కనిపించాలన్నారు. పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత, సుందరీకరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. పెండింగ్ పనులు ఉంటే షార్ట్ టెండర్లు పిలిచి పూర్తిచేయాలని ఆదేశించారు. కడప హజ్ భవన్ నిర్మాణం కోసం అవసరమైన నిధుల్ని విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం సూచన చేశారు.
కొత్త రేషన్ కార్డులు, ప్ల్పిట్ కార్డుల కోసం 55,540 దరఖాస్తులు రాగా, 40,040 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ కమిషనర్ రాజశేఖర్ చెప్పారు. 7,024 దరఖాస్తులు తిరస్కరించామని, 8,476 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నట్లు వివరించారు.  10,033 కొత్త రేషన్ కార్డులు, 5,196 ప్ల్పిట్ రేషన్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. 24,811 రేషన్ కార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

            మంత్రి నారా లోకేష్ బృందం దావోస్ పర్యటనపై సమాచార శాఖ వీడియో లఘుచిత్రాన్ని ప్రదర్శించించింది.  ఏపీలో అనుసరించిన ప్రకృతి సేద్యం విధానాల్నిఇండోనేషియా దేశమంతటా అమలుచేస్తామని ఆ దేశ ప్రతినిధి ప్రకటించడం గర్వకారణంగా ఉందని సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యదర్శి బి.రామాంజనేయులు పేర్కొన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కిందని, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లో ఏపీకి దేశంలో మొదటిస్థానం దక్కిందని ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలో 225 ఉత్తమ గ్రామ పంచాయతీలలో 133 మన రాష్ట్రం నుంచే ఎంపికైనట్లు, వాటిలో 33 చిత్తూరు జిల్లాలోనే ఉన్నట్లు తెలిపారు. విద్యాశాఖ దేశంలో మూడవ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు కార్యక్రమంలో 48 మంది భాగస్వాములకు పురస్కారాలు ప్రకటించారు. ఆయా శాఖల సిబ్బందిని సీఎం అభినందించారు. ఇన్నోవేషన్స్‌లో మనం నెంబర్ వన్‌గా రావాలన్నారు. తన భార్య దత్తత తీసుకున్న కొమరోలు గ్రామాన్ని కూడా చాలా బాగా అభివృద్ధి చేశారని, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ తన స్వగ్రామాన్ని అభివృద్ధి చేశారని,  స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తున్న స్వచ్ఛంద సేవకులను మన:స్పూర్తిగా అభినందిస్తున్నాన్నారు. అటువంటి వారు ఇంకా ఎక్కువ మంది ముందుకు రావాలన్నారు.
                   10 వేల ఇళ్ల స్థలాలు అందిస్తున్నట్లు  గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. కృష్ణాజిల్లాలో చుక్కల భూమి సమస్య లేదని కృష్ణా జిల్లా కలెక్టర్  బి.లక్ష్మీకాంతం చెప్పారు.  కృష్ణా జిల్లాలో అనుసరించిన డిజిటలైజేషన్ విధానాల్ని అసోం రాష్ట్ర మంత్రి,  అధికార బృందం పరిశీలించి ప్రశంసించారని, వారి సచివాలయంలో అమలు చేయనున్నట్లు కూడా చెప్పారన్నారు. కొత్తగా తీసుకొస్తున్న భూధార్ నమూనా కార్డును ఐటీ సలహాదారు జె. సత్యనారాయణ ముఖ్యమంత్రికి చూపించారు. భూధార్ కార్డులో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి క్యూఆర్ కోడ్ ను పొందుపరిచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంక్షేమానికి సంబంధించి 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది. జన్మభూమిలో వచ్చిన ఫిర్యాదులను, చంద్రన్న బీమా, పెళ్లికానుక, ముఖ్యమంత్రి యువ నేస్తం పనితీరుని సమీక్షించారు. ఈ వీడియో సమావేశంలో ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునీఠ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...