Jun 9, 2017

లంచం సొమ్ము తిరిగి ఇచ్చివేయాలి: సీఎం

నవ నిర్మాణ దీక్ష ఆరవ రోజు బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఇకపై ప్రభుత్వానికి మూడో నేత్రం ఉంటుదని అవినీతిపరులను హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలు ద్వారా లబ్ది చేకూర్చే పనులు చేసిపెడతామని ప్రజల వద్ద లంచాలు తీసుకున్నవాళ్లు   ఈ నెలాఖరులోపు ఆ సొమ్ము ఇచ్చేయాలన్నారు. లంచాలు తీసుకునేవారిలో పరివర్తన తీసుకురావాలన్నది తన ఆకాంక్ష అన్నారు. జూలై నుంచి తప్పు చేస్తే మాత్రం ఊరుకునేదిలేదని, కఠినంగా ఉంటామని హెచ్చరించారు.

పరిష్కార వేదికకు ఫిర్యాదు- లంచం తిరిగి ఇచ్చిన ఉద్యోగి
విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో జూన్ 7వ తేదీ బుధవారం నిర్వహించిన నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్ టీజీ) సీఈఓ బాబు.ఏ మాట్లాడుతూ పారదర్శక పాలన, జవాబుదారీతనం గురించి వివరించారు. ప్రజలే ముందు అనే నినాదంతో పరిష్కార వేదిక పేరుతో పేరుతో మే 26న ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ 1100కు సంబంధించి ఒక సంఘటనను తెలిపారు.  కృష్ణా జిల్లాకు చెందిన భూపతి అనే తెల్లరేషన్ కార్డుదారుడు కార్డులో  తప్పుగా వచ్చిన తన భార్య పేరు మార్పుకోసం 2016 ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నాడు. 2017 మే వరకు దానిని సరిచేయకపోగా ఆ ఉద్యోగి లంచం అడిగినట్లు భూపతి 1100 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేశాడు. కాల్ సెంటర్ సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని సంబంధిత ఉద్యోగి దృష్టికి తీసుకువెళ్లారు. భయపడిన ఉద్యోగి భూపతి వద్దకు వెళ్లి అతని వద్ద లంచంగా తీసుకున్న రూ.500లు అతనికి తిరిగి ఇచ్చివేశాడు. అంతే కాకుండా ఆ ఉద్యోగి మరో పది మంది వద్ద  తీసుకున్న రూ.500ల లంచం డబ్బును కూడా తిరిగి ఇచ్చివేశాడు. వాస్తవానికి లంచం ఇచ్చినట్లు ఒక్క భూపతి మాత్రమే ఫిర్యాదు చేశారు. ఉద్యోగి మాత్రం భయపడి లంచం తీసుకున్న అందరికీ తిరిగి ఇచ్చివేశాడు.

చంద్రన్న బీమాతో దుకాణం: లక్ష్మీ
నవ నిర్మాణ దీక్ష 4వ రోజు జూన్ 5వ తేదీ సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాల చర్చలో పలువురు లబ్దిదారులతో  మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రన్న బీమా లబ్దిదారు లక్ష్మి మాట్లాడుతూ.... పెళ్లైన ఏడాదికి నాకు బాబు పుట్టాడు. అదే సమయంలో రోడ్డు ప్రమాదంలో మా వారు చనిపోయారు. నేను ఒంటరినైపోయాను. నా వాళ్లు ఎవరూ నాకు సాయం చేయలేదు. ఆర్థికంగా దయనీమైన స్థితిలో ఉన్న నాకు చంద్రన్న బీమా పథకం కింద ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చింది. ఆ డబ్బుతో దుకాణం ఏర్పాటు చేసుకున్నాను. నెలకు రూ.15వేల వరకు ఆదాయం వస్తోంది. చంద్రన్న బీమా వల్లే తన కుటుంబం నిలబడినట్లు లక్ష్మి చెప్పారు.

మీరే స్ఫూర్తి, 18 గంటలు పని చేస్తాం: సివిల్ ర్యాంకర్లు
విజయవాడలో  జూన్ 5వ తేదీ సోమవారం  జరిగిన  నవ నిర్మాణ దీక్ష 4వ రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సివిల్ సర్వీస్ పరీక్షల్లో రాష్ట్రం నుంచి ర్యాంకులు సాధించిన 22 మందిని శాలువలు, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ సందర్భంగా ర్యాంకర్లు మాట్లాడుతూ... ‘‘మాకు మీరే స్ఫూర్తి. మీలాగే చిత్తశుద్ధితో రోజుకు 18 గంటలు పని చేస్తాం. తెలుగు జాతి గౌరవాన్ని, కీర్తిని ఇనుమడింపేచేసేలా శక్తివంచనలేకుండా శ్రమిస్తాం. మీరు రోజుకు 18 గంటలు పని చేస్తే, మా స్థాయిలో మేం ఎన్ని గంటలు పని చేయాలి? అందరం కలిసి పనిచేస్తే రాష్ట్రంలో అద్భుతాలనే ఆవిష్కరించగలం’’అని వారు సీఎంతో అన్నారు. ఆ సందర్భంలో కొందరు ర్యాంకర్ల కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. ‘‘మీరు ప్రారంభించిన డ్వాక్రా సంఘంలో చేరి, అక్కడ తీసుకున్న రుణంతోనే పిల్లలను ఈ స్థాయికి తీసుకురాగలిగాను’’ అని గోపాలకృష్ణ తల్లి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

ఏపీకి బ్రాండ్ చంద్రబాబే: గోపాలకృష్ణ
సివిల్స్ మూడవ ర్యాంకర్ గోపాల కృష్ణ మాట్లాడుతూ...‘‘ ఏపీకి బ్రాండ్ చంద్రబాబే. విశాఖలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు అక్కడే ఉండి సహాయక చర్యలు సమీక్షించారు. స్వయంగా రంపం పట్టుకుని పడిపోయిన చెట్లను కోశారు. ఈయనేంటి మనిషా? యంత్రమా? అనిపించింది. ఆయనే మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలి. నాలో ఆత్మస్థైర్యం తగ్గినప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగాలను యూట్యూబ్ వంటి వాటిలో చూస్తుంటాను. ఎంతో శక్తిని ఇస్తాయి’’ అని చెప్పారు.

ఏపీ అంటే చంద్రబాబు అంటున్నారు: దినేష్ కుమార్
సివిల్స్ ఆరవ ర్యాంకర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ..‘‘ఇతర రాష్ట్రాలకు ఎక్కడకు వెళ్లినా ఏపీ అంటే చంద్రబాబు నాయుడు పేరు చెబుతున్నారు. ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాలకు శిక్షణ కోసం వెళ్లినప్ఫుడు, ఏపీ నుంచి వచ్చానని చెప్పగానే,  మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా? మీలాంటివారికి మంచి ప్రోత్సాహం అందిస్తారు కదా! నదులు అనుసంధానం అని ఏళ్లతరబడి వింటున్నాం, అయితే సీఎం చంద్రబాబు ఏడాదిలో కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసి ఫలితాలను ప్రజలకు చూపించగలిగారు’’ అని అంటున్నారు.

చంద్రబాబు పెద్ద కలెక్టర్: మల్లవరకు బాల లత
సివిల్స్ 165వ ర్యాంకర్ మల్లవరకు బాల లత మాట్లాడుతూ ‘‘ చిన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడే నాకు స్ఫూర్తి. రోజుకు 18 గంటలైనా సరే కష్టపడే తత్వం, కార్యదక్షత ఆయన నుంచే నేర్చుకోవాలి. కలెక్టర్లు కూడా ఆయన వద్ద మాట్లాడేందుకు భయపడతారు. ఎందుకంటే ఆయనకున్న విషయ పరిజ్ఞానం అటువంటిది. ఆయనే పెద్ద కలెక్టర్’’ అని అన్నారు.

తహశీల్డారే ఇంటికి వచ్చి న్యాయం చేస్తానన్నారు: రాములమ్మ
పరిష్కారవేదిక కాల్ సెంటర్ 1100కు ఫోన్ చేస్తే వెంటనే తమకు అనుకూలంగా స్పందన వచ్చిందని కర్నూలు జిల్లా రాములమ్మ అనే ఆమె చెప్పారు. జరిగిన సంఘటన ఆమె మాటల్లోనే... నాకు రావలసిన ఆస్తిని కుటుంబ సభ్యులే పంచి ఇవ్వలేదు. చంపేసి ఎస్ఐకి లక్ష రూపాయలు ఇస్తే అడిగేవారు ఉండరని బెదిరించారు. దీనిపై నా తమ్ముడు 1100కి ఫోన్ చేశాడు. విషయం అంతా వివరించి ఫిర్యాదు చేశాడు. ఆ తరువాత వెంటనే అధికారుల్లో కదలిక వచ్చింది. తహశీల్డారే స్వయంగా మా ఇంటికి వచ్చారు. జరిగినది ముఖ్యమంత్రికి చెప్పవద్దు న్యాయం చేస్తానని చెప్పారు.

కృష్ణా జిల్లాలో వంద శాతం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు
నిర్ధేశించిన గడువులోపే లక్ష్యం పూర్తి
రాష్ట్రంలో పొగరహిత జిల్లాగా కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 13,95,649 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.  జూన్ 2వ తేదీ నవనిర్మాణ దీక్షనాటికే  వంద శాతం ఎల్పీజీ గ్యాస్ కనుక్షన్లు ఇచ్చి లక్ష్యాన్ని సాధించింది. దీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ప్రకటించారు. మూడు నెలల క్రితం వరకు జిల్లాలో 12,08,324 కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్, జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేన శ్రద్ధ వహించి జూన్ 1వ తేదీ నాటికి మిగిలి ఉన్న 1,87,324 కనెక్షన్లు ఇచ్చి లక్ష్యాన్ని సాధించాగలిగారు. ప్రజా సాధికార సర్వే నివేదిక ఆధారంగా గ్యాస్ కనెక్షన్లు లేనివారి జాబితాను జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు సేకరించారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్యాస్ కనెక్షన్ లేనివారి ఇంటికి సిబ్దందే స్వయంగా వెళ్లి కావలసిన పత్రాలను పూర్తి చేయించారు. వాటిని వారే గ్యాస్ ఏజన్సీలకు అందజేసి, త్వరగా పరిశీలన పూర్తి చేయించి చాలా వేగంగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు. దాంతో నిర్ధేశించిన గడువులోపే లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పొగ రహిత రాష్ట్రంగా సీఎం ప్రకటించారు.

ఇల్లు కట్టుకున్నాం - నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నా: లక్ష్మీ సామ్రాజ్యం
నవ నిర్మాణ దీక్ష 4వ రోజు జూన్ 5వ తేదీ సోమవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంక్షేమ పథకాల చర్చలో పలువురితో సీఎం మాట్లాడారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన లక్ష్మీ సామ్రాజ్యం తన అనుభవాలను వివరించారు. ఆమె మాటల్లోనే... మా వారు వస్త్ర దుకాణంలో గుమస్తాగా పని చేసేవారు. రూ. 2 వేలు జీతం. అందులో రూ.250 లు ఇంటి అద్దె కింద ఇచ్చేవారం. అదే సమయంలో మా పెద్దబ్బాయికి ఆరోగ్యం దెబ్బతింది. మందులు కొనేందుకు కూడా డబ్బులేక చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడే డ్వాక్రా సంఘంలో చేరాను. సంఘం నుంచి తీసుకున్న రుణంతో చేనేత మగ్గంపై వస్త్రాలు నేశాను. విజయవాడ డ్వాక్రా బజార్ లో దుకాణం ఉచితంగా ఇస్తామని, మీరు నేసిన వస్త్రాలు అక్కడ అమ్ముకోమని అధికారులు చెప్పారు. వస్త్ర వ్యాపారం చేస్తూ రూ.20 లక్షలతో సొంత ఇల్లు కట్టుకున్నాం. నెలకు రూ.10వేల ఆదాయం పొందాలని సీఎం అంటున్నారు. నాకు ఇప్పుడు రూ.20 వేలు ఆదాయం వస్తోంది.

కృష్ణా జిల్లాలో తీర్మానాలు
2017 జూన్ 2 నుంచి 8 వరకు ఏడు రోజులపాటు కృష్ణా జిల్లాలో  జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో మొత్తం 2.84 లక్షల మంది పాల్గొన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సుకు ఆరు రోజులపాటు దాదాపు 92 వేల మంది హాజరయ్యారు. జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో 1.92 లక్షల మంది హాజరయ్యారు. మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ విజయవంతంగా నవనిర్మాణ దీక్షలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో చివరి రోజు మినహా అన్ని రోజులు ముఖ్యమంత్రి హాజరు కావడం విశేషం.  ముగింపు రోజు మహా సంకల్పం సందర్భంగా కృష్ణా జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఆమోదించిన తీర్మానాలు ఈ దిగువ ఇస్తున్నాం.
* ఆగస్టు 15నాటికి జిల్లాలో 970 గ్రామ పంచాయతీలను ఏడీఎఫ్‌గా ప్రకటించాలి.
 *బడి ఈడు పిల్లలను అందరినీ బడుల్లో చేర్పించాలి.
 * 2017-18 సంవత్సరానికి చంద్రన్నబాటలో భాగంగా 500 కి.మీ.గ్రావెల్‌ రోడ్లు, 120 కి.మీ. బీటీ రోడ్లు, 121 గ్రామ పంచాయతీల భవనాలు, 254 అంగన్‌వాడీ భవనాలను నిర్మాణం చేయాలి.

* 10వేల లోపు ఆదాయం కలిగిన స్వయం సహాయక సభ్యులకు ఆదాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.
 * జిల్లా స్థిర ధరలతో ఉన్న స్థూల జాతీయోత్పత్తిని పెంచి 15 శాతం వృద్ధి సాధించాలి.  *తలసరి ఆదాయం రూ.1.25 లక్షల నుంచి రూ.1.43 లక్షలకు పెంచాలి.
* రక్తహీనత లేని జిల్లాగా తీర్చిదిద్దాలి. 2018 జూన్‌ 2నాటికి 100 శాతం ప్రసవాలు ఆసుపత్రిలో చేసేవిధంగా చర్యలు తీసుకోవాలి. డిసెంబరు 31 నాటికి చిన్న పిల్లల్లో పౌష్టికాహారం లోపం గుర్తించి బరువు పెరిగే విధంగా ఆహారాన్ని అందించాలి. పౌష్టికాహారం లోపం లేని జిల్లాగా ప్రకటించాలి.
* వచ్చే ఏడాది జూన్‌2 నాటికి మచిలీపట్నం- విజయవాడ రహదారి విస్తరణ, నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
 * డిసెంబరు 31 2017 నాటికి కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించుకోవాలి.
 * అక్టోబరు 2 నాటికి విజయవాడ- జగదల్‌పూర్‌ జాతీయ రహదారి విస్తరణ పూర్తి చేయాలి.
* వచ్చే జూన్‌2 నాటికి బందరు రోడ్డు బృహత్తర ప్రణాళిక పూర్తి చేసి ఓడరేవు నిర్మాణానికి అవసరమైన 3292 ఎకరాలను భూసమీకరణ ద్వారా సేకరించి పనులు ప్రారంభించాలి.
* డిసెంబరు 31 నాటికి బందరు కాలువలో కాలుష్యం నివారించాలి. గడపగడప నుంచి 100 శాతం చెత్త సేకరణ కనీసం 9 వార్డుల్లో చేయాలి. వార్డుకు 100 చెట్లు నాటి పర్యావరణ, పచ్చదనం కాపాడాలి. వచ్చేఏడాది నాటికి వీఎంసీ 10 పార్కుల్లో పచ్చదనం పెంచి పర్యావరణ హితకారిగా మారాలి. పిల్లలకు ఆటసామగ్రి సమకూర్చాలి.
* చేపలు రొయ్యలు ఉత్పత్తిని పెంచేందుకు, పాలదిగుబడిని పెంచేందుకు లక్ష్యాలను నిర్దేశించారు.ఈ ప్రగతి ద్వారా జిల్లాలో 1100 పరిష్కార వేదిక, కైజాలా వినియోగించుకొని రియల్‌టైమ్‌ గవర్నెనెన్సును అందుబాటులోకి తేవాలి.

కంట తడిపెట్టిన చంద్రన్న బీమా లబ్దిదారులు
నవ నిర్మాణ దీక్ష 4వ రోజు జూన్ 5వ తేదీ సోమవారం గుంటూరు జిల్లా గురజాలలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు యరపతనేని శ్రీనివాసరావు సమక్షంలో పలువురు మహిళలు ప్రభుత్వం నుంచి తాము పొందిన లబ్దికి ఉద్వేగాన్ని ఆపుకోలేక కంటతడి పెట్టుకున్నారు. చంద్రన్న బీమా చెక్కులు అందుకునే సమయంలో దొడ్ల ఏసుబాబు సతీమణి మరియమ్మ, గణపా జానకిరామ్ సతీమణివ రమాదేవి  కన్నీటిపర్యంతమయ్యారు. దాచేపల్లి మండలం గామాలపాడుకు చెందిన  జానకిరామ్ ద్విచక్రవాహనంపై వెళుతూ మే 16న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దాంతో ఆ కుటుంబం దిక్కులేనిదైపోయింది. ఈ పరిస్థితుల్లో నెల తిరగకుండానే రూ.5 లక్షల చెక్కును ప్రభుత్వం ఆ కుటుంబానికి అందజేసింది. దాంతో చంద్రన్న బీమా పథకం తమ కుటుంబానికి ఎంతో భరోసానిచ్చిందని రమాదేవి విలపిస్తూ చెప్పారు. ఈ సందర్భంగా దాచేపల్లి మండలాధ్యక్షుడు అంబటి నవకుమార్ మాట్లాడుతూ కేవలం రూ.15ల ప్రీమియంతో రూ.5 లక్షల ప్రమాదబీమా పథకం దేశంలో ఎక్కడా లేదని చెప్పారు. ఈ పథకాన్ని అర్ధం చేసుకొని ఇందులో సభ్యులుగా చేరాలని ఆయన కోరారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...