Jun 2, 2017

అవినీతిలేని ప్రభుత్వం-అదే నా బ్రాండ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Ø రాష్ట్రం కోసం 2 నిమిషాలు ఆలోచించండి
Ø అవినీతిపై చర్యలు మొదలు
Ø పరిష్కార వేదిక ద్వారా ఫలితాలు
Ø పంటల బీమా కనీసం రూ.15వేలు
Ø ఏపీఎఫ్ఎంఐఎస్ చట్టంలో మార్పులు
Ø ఆగస్ట్ 1కి ప్రతి ఇంటికి గ్యాస్
Ø ఏపీజీఐసీ పాలసీ, 2017-2020
Ø డాక్టర్ షీలా భీడే కమిటీ సిఫార్సుల ఆమోదం

సచివాలయం, జూన్1: అవినీతిలేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన 
లక్ష్యమని, అదే తన బ్రాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మంత్రి మండలి సమావేశం అనంతరం గురువారం సాయంత్రం సచివాలయం బ్లాక్ 1 సమావేశ మందిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రివర్గ సమావేశంలో అజెండాలో వున్న 25 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రాజకీయ అవినీతి, మీడియా అవినీతి అని వేరు వేరు రంగులు ఉండవని అవినీతి అంతా ఒకటే రంగన్నారు. చర్యలు తీసుకోవడం మొదలుపెడితే తప్పులు జరగవని చెప్పారు. టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్ 1100 (పరిష్కారవేదిక) ద్వారా మంచి ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 25వేల ఫిర్యాదులు అందాయని, వాటిలో 550 మాత్రమే కొత్త ఫిర్యాదులని వివరించారు. ఈ  ఫిర్యాదులన్నిటినీ మీకోసం వెబ్ సైట్ లో పెడుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా హౌసింగ్, హాస్పటల్, ఫించన్లు,రేషన్ కార్డులు, చంద్రన్న బీమా వంటివి ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. ఫిర్యాదులు విచారణ దశలో ఉద్యోగులు, బ్రోకర్లు తీసుకున్న లంచాలను తిరిగి ఇచ్చివేసినట్లు తెలిపారు. ఒక్క రేషన్ కార్డుకు సంబంధించి ఫిర్యాదును విచారిస్తుంటే పది మంది వద్ద తీసుకున్న లంచం తిరిగి ఇచ్చివేసినట్లు వివరించారు. చర్యలు తీసుకోవడం మొదలుపెడితే అవినీతి దానంతట అదే ఆగిపోతుందన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో ఫిర్యాదిదారుడు సంతృప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రతి పనికి కాలపరిమితి విధించినట్లు సీఎం తెలిపారు. ఆ కాలపరిమితి లోపల పనిచేయకపోతే సంబంధింత ఉద్యోగికి పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు. అవినీతి చాలా వరకు తగ్గిందని, అయినప్పటికీ కొంతమంది కరుడుగట్టిన తప్పుడు వ్యక్తులు ఉంటుంటారని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  మునిసిపాలిటీల పరిధిలో చట్ట విరుద్ద నిర్మాణలపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. టెక్నాలజీ ఒకప్పుడు మేథావులకు ఉపయోగపడేదని, ఇప్పుడు అది సామాన్య మానవుడికి మిత్రుడైందన్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయని చెప్పారు. ప్రభుత్వంలో ఇప్పుడు పనులు చకచకా ఎలా జరుగుతున్నాయో ఒక వ్యక్తి తన అనుభవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సీఎం సూచనల మేరకు మీడియా సమావేశంలో ప్రభుత్వ మీడియా సలహాదారు పరకా ప్రభాకర్ చదివి వినిపించారు.
 నీరు-ప్రగతి - ఏపీఎఫ్ఎంఐఎస్ చట్టంలో మార్పులు
మంత్రి మండలి సమావేశంలో నీరు-ప్రగతిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. నీటి  యాజమాన్య పద్దతులు సమర్థవంతంగా నిర్వహించేందుకు రైతుల భాగస్వామ్యం ఉండేవిధంగా ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతుల యాజమాన్య నీటిపారుదల వ్యవస్థ(ఏపీఎఫ్ఎంఐఎస్) చట్టంలో మార్పులు తీసుకురానున్నట్లు చెప్పారు. నీటి సంఘాల ఎన్నికల ప్రక్రియను సరళతరం చేయనున్నట్లు, రైతులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో మాదిరి చట్టంలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. వారి పదవీ కాలపరిమితి రెండేళ్ల నుంచి 5 ఏళ్లకు పెంచనున్నట్లు చెప్పారు. రైతులకు రూ.1680 కోట్ల ఇన్ పుట్ సబ్జిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు.
కనీస పంటల బీమా రూ.15వేలు
రాష్ట్రంలో 9.45 లక్షల మంది రైతులకు రూ.595 కోట్లు పంటల బీమా అందించనున్నట్లు సీఎం తెలిపారు. ఒక్కో రైతుకు బీమా కనీసం రూ.15 వేల రూపాయలు అందజేస్తారన్నారు. అంతకంటే ఎక్కువ వచ్చేవారికి ఎక్కువ ఇస్తారన్నారు. తక్కువ వస్తే కనీసం రూ.15వేలు ఇస్తారని చెప్పారు.
ఏపీజీఐసీ పాలసీ, 2017-2020  పీపీపీ విధానంలో గ్లోబల్ ఇన్-హౌస్ సెంటర్లను నెలకొల్పేందుకు ఏపీజీఐసీ పాలసీ, 2017-2020ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ పాలసీతో మల్టీనేషనల్ కంపెనీలకు ఏపీ గమ్యస్థానం కానున్నదన్నారు. ఈ పాలసీ ద్వారా మౌలిక సౌకర్యాలను కల్పించడంతో పాటు ఉద్యోగాల కల్పనపై కూడా అవగాహన కుదురుతుందని చెప్పారు.
డాక్టర్ షీలా భీడే కమిటీ సిఫార్సుల ఆమోదం
ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్- 2014లోని షెడ్యూల్ 9 కింద వున్న 9 బీసీ ఫెడరేషన్లకు సంబంధించిన రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన ఆస్తులు, అప్పుల పంపకాలపై డాక్టర్ షీలా భీడే కమిటీ చేసిన సిఫార్సులను మంత్రిమండలి ఆమోదించినట్లు తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్ మెడికల్ ఫ్యాకల్టీ పదవి విరమణ వయస్సును 60 నుంచి 63 ఏళ్లకు పెంచుతూ మంత్రి మండలి తీర్మానించినట్లు చెప్పారు. 2017-18 విద్యా సంవత్సరానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్రానికి మెడికల్ పీజీ సీట్ల సంఖ్యను పెంచడం, అదే సమయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ఎక్కువమంది ప్రొఫెసర్లు పదవి విరమణ చేయనున్న దృష్ట్యా పదవి విరమణ వయో పరిమితిని పెంచాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రం కోసం 2 నిమిషాలు ఆలోచించండి
జూన్ 2వ తేది ఉదయం 10 గంటలకు నవనిర్మాణ దీక్ష సందర్భంగా ప్రజలందరూ రాష్ట్రం కోసం రెండు నిమిషాలు ఆలోచించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. భావితరాల భవిష్యత్, మెరుగైన జీవనం కోసం స్వాతంత్ర్య దినోత్సవానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దీనికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యుద్ధ విమానంలో రాష్ట్ర విభజన బిల్లు తీసుకురావడం - పార్లమెంట్ లో టీవి ప్రసారాలను నిలిపివేయడం-వార్ రూమ్ ఏర్పాటు- కుట్ర రాజకీయాలు- లాలూచీ  హేతుబద్దం కానివిధంగా రాష్ట్ర విభజన అడుగడుగునా దగా  అసహనం  అభద్రత  ఆవేదన- అప్పులేగానీ, ఆస్తులు లేవు ... వంటి అంశాలనన్నిటినీ జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నారు. అన్యాయం చేసినవారు సిగ్గుపడేవిధంగా అభివృద్ధి సాధించాలన్నారు. రెండవ ప్రపంచం యుద్ధం తరువాత బూడిదలో నుంచి కసి,

తపనతో జపాన్ అభివృద్ధి చెందిందని, ఆ మాదిరిగా మనం కూడా అత్యంత శక్తవంతమైన రాష్ట్రాన్ని రూపొందించుకోవాలని పిలుపు ఇచ్చారు. జూన్ 2న నవనిర్మాణ దీక్ష జరుపుకుంటున్నామని, చరిత్ర వున్నంత వరకు ఇది   జరుగుతుంది, ఇది ఎవరినో నిందించేందుకు కాదని అన్నారు. జూన్ 8న మహా సంకల్పం జరుపుకుంటున్నామని, వారం రోజులపాటు ఈ మూడేళ్లలో సాధించిన ప్రగతిపై చర్చ జరగాలన్నారు. దక్షిణ భారతదేశంలో మిగిలిన రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తక్కువుగా వుండటానికి ఎవరు కారణమో అందరూ ఆలోచించాలని, ప్రజలకు వివరించాల్సిన అవసరం వుందని చెప్పారు. జూన్ 8 నాటికి రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు వుండకూడదని, వచ్చే ఏడాది నవనిర్మాణ దీక్ష నాటికి ఏం చేయాలో కూడా ఇప్పుడే నిర్ణయించుకుందామన్నారు. గత ఏడాది జూన్ 2 నాటికి వంద శాతం ఇళ్లకు విద్యుత్ అందించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 1 నాటికి వంద శాతం ఇళ్లకు గ్యాస్ అందిస్తామన్నారు.

జూన్ 2వ తేది ఉదయం 10 గంటల సమయానికి రాష్ట్రంలో ప్రతి ఒకరూ నవనిర్మాణ దీక్ష  ప్రతిజ్ఞ చేయాలన్నారు. బస్సులలో వెళుతున్నా రెండు నిమిషాలు ఆగి ప్రతిజ్ఞ చదవాలని విజ్ఞప్తి చేశారు. 3న ఆంధ్రప్రదేశ్ విభజన తీరు – 2014లో రాష్ట్రం పరిస్థితి  చట్టం, హామీలలో సాధించినవి, సాధించాల్సినవి - ఈ మూడేళ్లలో జరిగిన ప్రగతి  లక్ష్యాలపై  చర్చ జరగాలన్నారు. జూన్ 4 వ్యవసాయం - అనుబంధ రంగాలు  జల సంరక్షణ - సుస్థిర అభివృద్ధి వ్యూహం -కరువు రహిత రాష్ట్రం  తుఫాన్లు ఎదుర్కొన్న విధానం – ‘నీరు-చెట్టు’ – ‘నీరు-ప్రగతి’ – పట్టిసీమ - నదుల అనుసంధానం  పోలవరం - ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు  చెక్‌డ్యాంలు - భూగర్భ జలాల పెంపు  రెయిన్ గన్లు  పంటకుంటలు  పొలం పిలుస్తోంది - భూసార పరీక్షలు  ఇన్‌పుట్ సబ్సిడీ  రుణ ఉపశమనం అంశాలపై చర్చించాలన్నారు. జూన్ 5 సంక్షేమం  సమ్మిళిత అభివృద్ధి - అధిక ఫలితాల సాధన  అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు  ప్రధానమైన సంక్షేమ అభివృద్ధి పథకాలపై చర్చ  ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలు  డ్వాక్రా సంఘాలు- సామాజికరంగం అభివృద్ధిపై చర్చించాలని చెప్పారు. జూన్ 6 మానవ వనరుల అభివృద్ధి  పెట్టుబడుల ఆకర్షణ  ఉద్యోగ కల్పన -విద్య  వైద్యం  నైపుణ్యాభివృద్ధి  పరిశ్రమలు  రెండు భాగస్వామ్య సదస్సులు విజయవంతం-తాగునీరు- గ్రామీణ, పట్టణ ప్రాంత గృహ నిర్మాణం- విద్యుత్ రంగం-మౌలిక సదుపాయాలు-రోడ్ నెట్ వర్క్ వంటి అంశాలపై చర్చ జరగాలన్నారు. జూన్ 7న ప్రజలే ముందు  పారదర్శక,  జవాబుదారీ సుపరిపాలన  రెవిన్యూ-పోలీస్- మైనింగ్- జీవీఏ  సుస్థిర వృద్ధి లక్ష్యాలు  సమాజ వికాసం  కుటుంబ వికాసం  సంతోష ఆంధ్రప్రదేశ్  విజన్ 2022, 2029, 2050 - అవార్డులు  విజయాలపై చర్చించాలన్నారు. జూన్ 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు మహాసంకల్పం తీసుకోవాలన్నారు. విభజన అవమానాన్ని దిగమింగుకొని కసితో  రాష్ట్రాభివృద్ధిపై శ్రద్ధ వహించాలన్నారు. నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పంలో ప్రజలందరూ  భాగస్వాములు కావాలని, ఆశీర్వదించాలని సీఎం కోరారు. మీడియా సమావేశంలో సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...