Mar 21, 2019

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు



జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో సమావేశం
                
సచివాలయం, మార్చి 21 : సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, శాంతి భద్రతలపై గురువారం సాయంత్రం సచివాలయంలోని 5వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో సమావేశంలో సమీక్షించారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఎక్సైజ్, వాణిజ్యపన్నులు, రవాణా, ఆదాయపు పన్ను  మొదలైన శాఖలు సమన్వయంతో ఒక బృందంగా పనిచేయాలన్నారు. ఆయా శాఖల సిబ్బంది బాధ్యతతో కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని, అవకతవకలను అరికట్టాలని ఆయన సూచించారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున ఎన్నికల నిబంధనలు అతిక్రమించినవారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని, వారికి వివరణ ఇవ్వటానికి 48 గంటలు మాత్రమే సమయం ఇవ్వాలని తెలిపారు. సోషల్ మీడియా, వాట్సాప్­లలో వివాదస్పద పోస్టింగులు పరిశీలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే వివరణ ఇవ్వటానికి వారికి తప్పనిసరిగా నోటీసులు ఇవ్వాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ గురించి కేంద్ర బలగాలు, రాష్ట్ర స్పెషల్ పోలీస్ బృందాలు విధులు నిర్వహిస్తాయని, అవసరమైనచోట రిటైర్డు పోలీసులు, ఎక్స్­సర్వీస్ మెన్, ఎన్­సిసి, ఎన్­ఎస్ఎస్ బృందాల సహాయం తీసుకోమని గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు లెవనేత్తిన పలు నిర్వహణాపరమైన అంశాలపై పరిష్కార మార్గాలను సూచించారు. 

అదనపు డిజి (లా&ఆర్డర్) రవిశంకర్ మాట్లాడుతూ, అన్ని జిల్లాలలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీలను ఆదేశించారు. రాజకీయ అధిపత్యం, కులం, ఫ్యాక్షన్ పరంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాలన్నారు. సరిహద్దు జిల్లాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 2014 లో నమోదైన కేసులతో ఇప్పడు నమోదైన కేసులను పోల్చి సమీక్షించారు. ఎక్సైజ్ కమిషనర్ ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఎక్సైజ్ కేసులపై సమీక్షించారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లాల నుంచి మద్యం తరలి రాకుండా జాగ్రత్త వహించాలన్నారు. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది, మద్యం అక్రమ రవాణాను నియంత్రించాలన్నారు.

అదనపు సీఇఓ సుజాత శర్మ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలు, ఫోటో ఓటర్ స్లిప్లులు, ఈవీఎంల గురించి వివరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసిసి), శాంతిభద్రతలు, ఓటర్ల జాబితా, ఈవీఎంలు, ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు, అభ్యర్ధులు, రాజకీయ పార్టీల ఖర్చులు, ఎన్నికల నిబంధనల అతిక్రమణ, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలపై కేసులు, లైసెన్సు కలిగిన ఆయుధాల స్వాధీనం, ఎక్సైజ్ కేసులు తదితర అంశాలపై చర్చించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ప్రతిస్పందిస్తూ ఆయా జిల్లాలలో నమోదైన నిబంధనల అతిక్రమణ కేసులు, నగదు, మద్యం, బంగారం, వెండి, లైసెన్సు కలిగిన ఆయుధాల స్వాధీనానికి సంబంధించిన కేసుల వివరాలు తెలియజేశారు. నాన్ బెయిలబుల్ వారెంట్స్, పెండింగులో ఉన్న వారెంట్స్, అరెస్టులు, బైండోవర్ కేసులు గురించి వివరించారు. ఎన్నికల ముందు రోజు పోలింగ్ కేంద్రాలకు సిబ్బందిని, సామాగ్రిని తరలించడానికి కావలసిన బస్సులు, తదితర ఏర్పాట్ల గురించి వివరించారు. ఐజిపి కె.వి.వి గోపాల రావు, డిఐజి ఎం. రఘురామ్ (సిఎపిఎఫ్ నోడల్ అధికారి), ఎస్పీ కమ్యూనికేషన్స్  జి. సూర్యకుమార్, అదనపు సీఇఓ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...