Mar 26, 2019


అసెంబ్లీకి 3,925 – లోక్ సభకు 548 నామినేషన్లు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది

Ø మొత్తం ఓటర్లు : 3,93,45,717
Ø మహిళలు : 1,98,79,421
Ø పురుషులు : 1,94,62,339
                       సచివాలయం, మార్చి 26: 2019 సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలలో 548 మంది, 175 శాసనసభ స్థానాలలో 3,925 నామినేషన్లు దాఖలు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభకు సంబంధించి అత్యధికంగా నంద్యాల స్థానానికి 38, అతి తక్కువగా చిత్తూరు స్థానానికి 13 నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. 17 స్థానాల్లో 15కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. శాసనసభ కు సంబంధించి కూడా నంద్యాలలోనే అత్యధికంగా 61, అతి తక్కువగా పార్వతీపురం, పాలకొండలలో 10 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన వివరించారు. 118 స్థానాలలో 15 కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైనట్లు తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల 15 మంది పేర్లు, ఒక నోటా కలుపుకొని 16 వరకు ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుందని చెప్పారు. 16 దాటితే 2వ యూనిట్, 32 దాటితే 3వ యూనిట్, 48 దాటితే 4వ యూనిట్ ని అనుసంధానించవలసి ఉంటుదన్నారు.
చట్టం ప్రకారం, చట్టంలోని నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి నామినేషన్లను పరిశీలిస్తారని, అక్కడ పరిశీలకులు కూడా ఉంటారని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి న్యాయ నిపుణులు అభిప్రాయాలు తెలుసుకుంటున్నామని, అలాగే సినిమాటోగ్రఫీ చట్టంలోని, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

మొత్తం ఓటర్లు  3,93,45,717
                 ఈ నెల 25వ తేదీ నాటికి రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,93,45,717 ఉన్నట్లు తెలిపారు. 2014తో పోల్చితే 26,24,109 మంది ఓటర్లు అదనంగా కలిసినట్లు చెప్పారు. 7.08 శాతం పెరుగుదల ఉందన్నారు.  మొత్తం ఓటర్లలో మహిళలు 1,98,79,421 మంది ఉండగా, పురుషులు  1,94,62,339 మంది, 3వ జెండెర్ 3,957 మంది ఉన్నట్లు వివరించారు. దివ్యాంగులు 5,27,734 మంది, అందులో అంథులు 82,748 మంది ఉన్నారని తెలిపారు.  ప్రవాసాంధ్ర ఓటర్లు 5,323 మంది ఉన్నారని చెప్పారు. కొత్తగా  18-19 సంవత్సరాల మధ్య వయసు గల యువ ఓటర్లు 10,15,219 మందిని చేర్చినట్లు  తెలిపారు. కొత్త ఓటర్లకు అవగాహన కల్పించడంలో, వారిని ఓటర్లుగా చేర్చడంలో, దరఖాస్తులు పరిష్కరించడంలో ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది కృషిని సీఈఓ ప్రశంసించారు. ఒకే రోజు 4.5 లక్షల దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. 45వేల మంది బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ) ఉండటం వల్ల, తహశీల్డార్లు, ఆర్డీఓలు, జిల్లా కలెక్టర్లు అందరూ ఒక బృందంగా ప్రత్యేక శ్రద్ధతో విశేష కృషి చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.
              రాష్ట్ర వ్యాప్తంగా సీవిజల్ టీమ్స్ 3,635 ఉన్నాయని, మొత్తం 2,614 ఫిర్యాదులు రాగా, వాటిలో 1,014 వాస్తవమైనవని,  వంద నిమిషాల్లోపల 66 శాతం వాటికి స్పందించినట్లు, తగు చర్యలు తీసుకున్నట్లు  తెలిపారు. ఇంకా 40 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. ఈ ఫిర్యాదులు ఆధారంగా 17 కేసులలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. రూ.12.13 కోట్ల విలువైన నగదు, రూ.92 లక్షల విలువైన చీరలు, డ్రెస్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నగదు, బంగారం, వెండి, చీరలు, డ్రెస్ మెటీరియల్, ఇతర వస్తువులు మొత్తం రూ.30.66 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ.17 కోట్ల విలువైన 467 లక్షల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత ఎన్నికలలో స్వాధీనం చేసుకున్నదానికి ఇది రెట్టింపు అని చెప్పారు. 20 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన పోలీస్ ఫ్లైయింగ్ స్వ్కాడ్, ఎక్సైజ్ సిబ్బంది, ఆదాయపు పన్ను, వాణిజ్య పన్నుల శాఖ, నోడల్ అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నట్లు ప్రశంసించారు.
        ఇప్పటి వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రాజకీయ పార్టీలకు 367 నోటీసులు పంపామని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయి, అభ్యర్థులు ఖరారైనందున ఇక అభ్యర్థులకు సంబంధించిన ఉల్లంఘనలపై కూడా నోటీసులు పంపుతామని చెప్పారు. ఓటర్లకు, ఓటింగ్ శాతం పెంచడానికి మై ఓట్ క్యూ యాప్ బాగా ఉపయోగపడుతుందన్నారు. ఓటర్ ఓటు వేయడానికి పోలింగ్ బూత్ కు వెళ్లే ముందు చెక్ చేస్తే అక్కడ క్యూలో ఎంత మంది ఉన్నారో తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రతి 15 నిమిషాలకు బూత్ సిబ్బంది ఈ యాప్ ని అప్ డేట్ చేస్తుంటారన్నారు.

                    ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నట్లు సీఈఓ చెప్పారు. గ్రాడ్యుయేట్ నియోజవకర్గాలలో  అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ చేయడం వల్ల బ్యాలెట్ పేపర్ పెద్దదిగా ఉందని, వాటిని బండిల్స్ గా తయారు చేయడానికి  ఈ రోజు సరిపోతుందని, ఫలితాలు రేపు తెలిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నంలో ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఒక రౌండ్ పూర్తి అయిందని, మొదటి రౌండ్ లో 17,293 ఓట్లు లెక్కించారని, రఘువర్మకు 7,834 ఓట్లు రాగా, శ్రీనివాసులు నాయుడుకు 5,232 ఓట్లు వచ్చినట్లు గోపాల కృష్ణ ద్వివేది వివరించారు.
                       అదనపు సీఈఓ సుజాత శర్మ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల సిబ్బంది, సామాగ్రిని పోలింగ్ బూత్ ల వద్దకు తరలించడానికి వాహనాలు,  పోలింగ్ బూత్ ల వద్ద షామియానాలు, ఓటర్లు కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు, మంచినీటి సౌకర్యం కల్పించడం, దివ్యాంగులకు వీల్ చైర్లు, అంథులకు బ్రెయిలీ డమ్మీ బ్యాలెట్ ను అందించడం  వంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓ వివేక్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...