May 30, 2018


ఎయిడ్స్ నియంత్రణకు విస్తృతంగా ప్రచారం
అధికారులను ఆదేశించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య
Ø జూన్ 1 నుంచి తల్లిబిడ్డ రక్ష, ‘మీ ఎయిడ్స్ స్థితి’ కార్యక్రమాలు
Ø జూన్  15 నుంచి   గ్రామాలలోనే వైద్య పరీక్షలు
Ø శాఖల సమన్వయంతో ఎయిడ్స్ నియంత్రణ
Ø సాధికార మిత్రుల ద్వారా ప్రచారం 

               సచివాలయం, మే 30: రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి, ప్రజలలో అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అధికారులను ఆదేశించారు. సచివాలయం 5వ బ్లాక్ లో వైద్యఆరోగ్య శాఖ సమావేశ మందిరంలో బువారం ఉదయం జరిగిన ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎయిడ్స్ కేసులు పెరిగిపోవడానికి కారణాలను తెలుసుకోవాలని, ఏ గ్రూపులవారు ఈ వ్యాధికి గురవుతున్నారో కనుగొనాలని చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో ఎయిడ్స్ ని నియంత్రించాలన్నారు. సాధికార మిత్రుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి కార్యక్రమంలో దీనిని ఒక అంశంగా పరిగణించి ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త దంపతులకు కౌన్సిలింగ్ ఇప్పించాలని చెప్పారు. ఎయిడ్స్ రోగులు మందులు తీసుకోవడానికి ఎక్కువ దూరం వెళ్లకుండా వారికి అందుబాటులో  ఉంచాలని ఆదేశించారు. ఎక్కువగా గర్భిణీ మహిళలకు ఎయిడ్స్ వస్తుందని, బిడ్డకు కూడా ఆ వ్యాధి సోకే ప్రమాదం ఉన్నందున భార్యభర్తలు ఇద్దరికీ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పారు. తల్లిబిడ్డ రక్ష కార్యక్రమం కింద జూన్ 1 నుంచి నెల రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, ఇందులో భాగంగా ప్రతి గర్భిణీకి హెచ్ఐవీ, సిఫిలెస్ టెస్ట్ తప్పనిసరిగా చేయాలన్నారు. ‘మీ హెచ్ఐవీ స్థితి’ పేరుతో జూన్ 1 నుంచి నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ప్రశ్నాపత్రం అందజేసి వివరాలు సేకరించాలన్నారు. జూన్ నెల 15 నుంచి స్వచ్ఛంద సంస్థల సిబ్బంది గ్రామాలకు వెళ్లి హెచ్ఐవీ పరిక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ఎవరికైనా హెచ్ఐవీ ఉన్నట్లు తెలిస్తే వారిని ఆస్పత్రులకు తరలించాలని పూనం మాలకొండయ్య అన్నారు.
రాష్ట్రంలో ఎయిడ్స్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, సిబ్బంది, నిధులు, మందుల సరఫరా కేంద్రాలు, ఇతర రాష్ట్రాలలో పరిస్థితులు, స్వచ్ఛంద సంస్థల పనితీరు, ఆలిండియా రేడియో, దూరదర్శన్ లలో ప్రచారం తదితర అంశాలను సమావేశంలో చర్చించారు.  ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి.రాజేంద్రప్రసాద్, ఐఈసీ డిడి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...