May 17, 2018


తిరుమల ఆధ్యాత్మికతకు భంగం కలిగిస్తే ప్రభుత్వం ఉపేక్షించదు
ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి
                 సచివాలయం, మే 17: తిరుమల ఆధ్యాత్మికతకు భంగం కలిగించినా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నాలు ఏ స్థాయివారు చేసినా ప్రభుత్వం ఉపేక్షించదని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, దేవాదాయ శాఖలు)  కెఈ కృష్ణమూర్తి హెచ్చరించారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులో తన ఛాంబర్ లో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవాస్థానాల(టీటీడీ) ప్రధాన అర్చకులు రమణదీక్షితులు  హోదాను మరచి తాను పని చేస్తున్న ధార్మిక క్షేత్ర ప్రతిష్టను దిగజార్చేవిధంగా మాట్లాడారన్నారు. తిరుమల ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రమని, దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్ధం వస్తుంటారని తెలిపారు. అటువంటి క్షేత్రంపై రమణదీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన తన సాంప్రదాయ అర్చక వృత్తిని మరచి రాజకీయ వృత్తిని స్వీకరించినట్లుగా మాట్లాడారన్నారు. ముఖ్యంగా పనిగట్టుకొని పక్క రాష్ట్రమైన తమిళనాడులో ప్రత్యేకంగా ఆహ్వాన కార్డులు పంపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిమరీ రాజకీయాల నుంచి స్వామివారిని రక్షించుకోవాలన్న వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రధాన అర్చకులుగా ఇతరులకు ఆదర్శంగా ఉండవలసిన ఆయన ఈ విధంగా మాట్లాడటం భావ్యంకాదన్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఆలయ నియమనిబంధనలను అతిక్రమించి రమణదీక్షితులు తన మనవడిని అంతరాలయంలోకి తీసుకువెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణ భక్తులు వెళ్లే మార్గంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని, మళ్లీ అదేరీతిలో వస్తారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రమణదీక్షితులు వీఐపీల అతిధిగృహాలకు వెళ్లి ఆశీర్వచనాలు తెలుపుతారని, స్వామి సేవలకంటే ధనికుల సేవే ఆయనకు పరమావధిగా పేర్కొన్నారు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు టీటీడీ పాలక మండలి అర్చకుల వయోపరిమితిని నిర్ణయిస్తూ ఆయనను తొలగించిందన్నారు. రాజ్యాంగం, చట్టాలు ఆధారంగా టీటీడి పాలకమండలి ఏర్పడుతుందని చెప్పారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ప్రాచీన హిందూమత సాంప్రదాయాలను కొనసాగిస్తుందన్నారు. తనవల్లే స్వామివారికి ఇంతటి ప్రాచుర్యం లభించిందన్నట్లు మాట్లాడితే పతనం ప్రారంభమైనట్లేనన్నారు. రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. అర్చకుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు, తగాదాలు ఈ విధంగా బహిర్గతమవుతున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. రమణదీక్షితులకు ముగ్గురు కుమారులు ఉన్నారని, వారు చెన్నైలోని ప్రైవేటు సంస్థలలో పని చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వారు ఏనాడూ పూజలకు రాలేదన్నారు. అయితే ఆయన వారిని కూడా టీటీడీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

ప్రతిఏడాది స్వామి వారి నగల తనిఖీ
ప్రతి సంవత్సరం స్వామివారి నగలను అధికారులు తనిఖీ చేస్తారని ఉపముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో జస్టిస్ జగన్నాధరావు కమిటీ, జస్టిస్ వాద్వా కమిటీ సమగ్రంగా విచారించి, శ్రీవారి నగల వాడకం, వాటి భద్రత విషయంలో పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. టీటీడీలో ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుందని చెప్పారు. ఒక ఆర్థిక సలహాదారు, ముగ్గురు ఐఏఎస్ అధికారుల ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు కొనసాగుతాయన్నారు. తిరుమల ఆలయం గురించి అవాకులు, చవాకులు ఎవరు పేలినా తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్నారు.  ఎవరు ఏ విధులు నిర్వహించడానికి నియమితులయ్యారో, ఆ విధులు నిర్వహించడం శ్రేయస్కరం అన్నారు. వాటిని అతిక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదన్నారు. టీటీడీలో చాలా ఉత్తమమైన విధానాలు అనుసరిస్తున్నారని, ఆ నిబంధనలనే చాలా దేవాలయాల్లో అనుసరిస్తున్నారని తెలిపారు. పాలక మండలి నిర్ణయాలను సమర్థిస్తున్నట్లు చెప్పారు. పాలక మండలే కాకుండా పరిస్థితులను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవలసి బాధ్యత తమపై కూడా ఉంటుందన్నారు. అవసరమైతే టీటీడీ ఆస్తులు, ఆభరణాల తనిఖీకి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.  సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ కూడా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...