May 22, 2018


రొయ్యల పెంపకందారుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
ఆ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష

Ø రొయ్యల మార్కెట్ విస్తృత పరచాలి
Ø ఎగుమతులు పెంచాలి
Ø రుణాలు ఇచ్చే అవకాశాలు పరిశీలన
Ø ధరలు పడిపోకుండా చర్యలు 

               సచివాలయం, మే 21: సముద్ర ఉత్పత్తులు, రొయ్యల వ్యాపారాన్ని విస్తృతంచేసి అమ్మకాలను, ఎగుమతులను పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం జరిగిన సముద్ర ఉత్పత్తులు, ముఖ్యంగా చెరువులలో రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులపై జరిగిన  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రొయ్యల ధరలు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధర తగ్గడం, యాంటిబయాటిక్స్ వాడకం వల్ల ఎగుమతులను తిరస్కరిచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.  ఈ పరిస్థితులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రైతులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, కేంద ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎంపెడా అధికారులతో సీఎస్ సమీక్షించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మన రొయ్యల అమ్మకాల మార్కెట్ ని అంతర్జాతీయంగా విస్తరింపజేసి ఎగుమతులను పెంచి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని  అధికారులకు సూచించారు. యాంటిబయాటిక్స్ వాడకుండా రైతులకు అవగాహన కలిగించాలన్నారు.

         గత ఏడాది కిలో రూ.500 ఉన్న రొయ్యల ధరలు రూ.380 లకు పడిపోయినట్లు అధికారులు సీఎస్ కు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ లో మనకు పోటీగా ఉన్న ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్ వంటి దేశాలలో ఉత్పత్తి పెరిగిందని తెలిపారు.  దాంతో వారు ధరలు తగ్గించి ఎగుమతులు చేయడంతో వారి ఎగుమతులు పెరిగాయని చెప్పారు. ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, రష్యాలలో మార్కెట్ పెద్దగాలేదన్నారు.  అంతేకాకుండా మన దేశంలో కూడా ఒడిషా, పశ్చిమబెంగాల్, గుజరాత్, తమిళనాడులలో ఉత్పత్తి పెరిందని చెప్పారు. యాంటి బయాటిక్స్ వాడకం వల్ల మన ఎగుమతులను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దానికి తోడు అమెరికాలో యాంటి డంపింగ్ డ్యూటీని 0.84 శాతం నుంచి 2.34 శాతానికి పెంచడం వల్ల కూడా ఎగుమతులు తగ్గినట్లు వివరించారు. మన రాష్ట్రంలో కొన్ని ఫార్మా కంపెనీలు తయారు చేసే పొడిలో యాంటిబయాటిక్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

           ఈ పరిస్థితులలో అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ ని విస్తృతపరచి ఎగుమతులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని దినేష్ కుమార్ కోరారు. అలాగే ధరలు పడిపోకుండా, రైతులు నష్టపోకుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా రైతులకు ఇచ్చే మాదిరిగా రొయ్యల సాగు చేసేవారికి రుణాలు ఇచ్చే అవకాశం ఉందేమో మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్ పోర్ట్ డెవలప్ మెంట్ అథారిటీ(ఎంపీఈడీఏ) ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. యాంటిబయాటిక్స్ ఉన్న పౌడర్ ని తయారుచేసే కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో రొయ్యల సాగుని, దాని ద్వారా విస్తరించే నీటి, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని అధికారును ఆదేశించారు. కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యల సాగు వల్ల తలెత్తే కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించి ఆక్వా విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో కాలుష్యాన్ని నియంత్రించాలన్నారు. ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణమైన యాంటిబయాటిక్ వాడకాన్ని నిరోధించాలని చెప్పారు. నాణ్యమైన రొయ్యల ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ అన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు వారు కాలువల నీటిలో కాలుష్య స్థాయిలను పరీక్షించాలని ఆదేశించారు. బోర్లను ఏపీవాల్టా(నీటి భూమి, చెట్ల చట్టం) ప్రకారం నియంత్రించాలన్నారు.
చేపలు, రొయ్యల సాగు, ఉత్పత్తి, ఎగుమతులు, ఎగుమతులలో పోటీ, ఏపీ ఫిషరీస్ పాలసీ-2015, ప్రోత్సహక పథకాలు, రొయ్య పిల్లల ఉత్పత్తి, ఇన్సూరెన్స్, మార్కెట్ విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్ ధరలు, యాంటీబయాటిక్స్ అమ్మకాల నియంత్రణ, ఆక్వాషాపులపై దాడులు, ల్యాబులు, ఆక్వాకు విద్యుత్, సౌరశక్తి, డీజిల్ వినియోగం తదితర అంశాలను చర్చించారు.

సముద్ర ఉత్పత్తులు, చెరువలలో రొయ్యల పెంపకాన్ని  అభివృద్ధిపరచడం కోసం 9 జిల్లాల్లో 82 ఎగుమతి కేంద్రాలను, 68 ప్రాసెసింగ్ యూనిట్లను, 70 స్టోరేజ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హేచరీస్ ని, ఆక్వాషాపులను తనిఖీ చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారి చెప్పారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి జీ.అనంత రాము, ఫిషరీస్ శాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైఎస్ ప్రసాద్, ఎంపీఈడీఏ డిప్యూటీ డైరెక్టర్ ఏ.లహరి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...