May 11, 2018




           రాష్ట్రాభివృద్ధికి పరిశ్రమలే కీలకం
జనరల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్లతో మంత్రి అమరనాధ రెడ్డి సమీక్ష


Ø జూన్ లేక జూలైలో ఎంఎస్ఎంఈ సదస్సు
Ø మొదటి దశలో ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఏర్పాటు
Ø 42 ప్రాంతాల్లో  ఏపీఐఐసీ స్వాధీనంలో భూములు
Ø అధికారులకు మే 31 డెడ్ లైన్
Ø ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి
            సచివాలయం, మే11: రాష్ట్రాభివృద్ధిలో పరిశ్రమలే కీలకంగా ఉంటాయని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాధ రెడ్డి అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ఏపీఐఐసీ జిల్లా పరిశ్రమల కేంద్రాల జనరల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్ల సమావేశంలో ఎంఎస్ఎంఇ పార్కులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాట్లను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న చిన్నచిన్న పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలిచేందుకు నియోజకవర్గ స్థాయిలోనే ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం  ప్రతి నియోజకవర్గంలో సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్) పార్క్ ఏర్పాటు చేయడానికి కావలసిన భూములను త్వరగా గుర్తించి, సేకరించాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక పార్కు  ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ లేక జూలైలో ఎంఎస్ఎంఈ సదస్సు నిర్వహించాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెప్పారు.  అప్పటికల్లా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వీలైనన్ని ఎక్కువ ఎంఒయులు అయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీ లోపల ప్రతి రెవెన్యూ డివిజన్ లో పార్కుకు సరిపడ  భూమిని గుర్తించి స్వాధీనం చేసుకోవాలన్నారు. మొదట అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములకు ప్రాధాన్యత ఇచ్చి స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. తరువాత అసైన్ట్ భూములకు, ప్రైవేటు భూములకు వరుసక్రమంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భూముల సేకరణ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆయా జిల్లా కలెక్టర్ల సహకారంతో పరిష్కరించాలని చెప్పారు. సందర్భం, అవసరానుసారం పరిశ్రమల శాఖ కార్యదర్శి, కమిషనర్, ఏపీఐఐసీ ఎండి, ఎమ్మెల్యేలు, ఆయా జిల్లాల మంత్రులు, తన స్థాయిలో ఎవరి అవసరమైతే వారితో చెప్పించి భూములు స్వాధీనం చేసుకోవాలన్నారు. అత్యధిక మందికి ఉపాధి కల్పించే పార్కుల ఏర్పాటుకు  అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పనిని నిర్ణీత సమయం నిర్ధేశించుకొని పూర్తి చేయాలన్నారు.  ఈ నెల 31వ తేదీ లోపల ఈ పనులన్నీ పూర్తి చేయాలని, మళ్లీ ఏర్పాటు చేసే సమీక్షా సమావేశానికి అందరూ పూర్తి వివరాలతో రావాలని చెప్పారు.  పార్కుకు ఎంపిక చేసిన స్థలంలో లేఅవుట్లు,  రోడ్లు, కాలువలు, నీరు, విద్యుత్ సౌకర్యం వంటి మౌలిక వసతులను సమకూర్చడానికి కూడా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అలాగే పార్కులలో పెట్టుబడులు పెట్టడానికి, చిన్న పరిశ్రమలను స్థాపించడానికి ముందుకు వచ్చినవారి వద్ద నుంచి డీపీఆర్ (డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లు తీసుకొని పంపించాలన్నారు. ఆయా ప్రాంతాల్లో స్థాపించే పరిశ్రమలకు అవసరమైనమేరకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పారు.  పనులు వేగంగా జరగడం కోసం రాష్ట్రస్థాయి అధికారాలను కూడా జిల్లా అధికారులకు అప్పగించామన్నారు. ఆన్ లైన్ లో పారిశ్రామిక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ఆలస్యం లేకుండా వెంటనే చెల్లించాలన్నారు. ప్రోత్సాహకాలు ప్రకటించడంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. రానున్న పది రోజుల్లో రూ.2వేల కోట్ల బ్యాంకు రుణం రానున్నట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలన్నింటీని క్లియర్ చేయాలనే ఉద్యేశంతో ఆ రుణం మొత్తం ప్రోత్సాహకాలకే ఉపయోగిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎప్పుడైతే పరిశ్రమలకు సరైన సమయంలో సక్రమంగా ప్రోత్సాహకాలు అందజేస్తే అప్పుడు ప్రభుత్వంపై వారికి నమ్మకం ఏర్పాడుతుందని, తద్వారా మరింత మంది పారిశ్రామికవేత్తలు రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని వెల్లడించారు. ఇక ఇప్పటివరకు చేసుకున్న ఎంఒయులపై ప్రత్యేకమైన దృష్టిపెట్టి వాటిని గ్రౌండ్ అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఇక జిల్లా పరిశ్రమల కేంద్రాల కార్యాలయాలు లేనిచోట కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. పరిశ్రమల అధికారులపైనే ఈ రాష్ర్ట భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. కాబట్టి అధికారుల వద్దకు వచ్చే పారిశ్రామికవేత్తలకు సహకరించి వారు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.    సింగిల్ డెస్క్ పోర్టల్ పనితీరు బాగుందని ప్రశంసించారు.
ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి
పారిశ్రామికపరంగా వెనకబడిన ప్రకాశం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రకాశం జిల్లా ఎంఎస్ఎఈ పార్కులకు అనుకూలంగా ఉంటుందన్నారు. వీలైనన్ని ఎక్కువ ఎంఒయులు ఆ జిల్లాకు వచ్చేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. అలాగే శ్రీకాకుళం జిల్లా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని, అందువల్ల ఆ ఎంఒయులు చేయాలని సూచించారు.
ఏపీఐఐసీ స్వాధీనంలో 42 ఎంఎస్ఎంఈ పార్కుల భూములు
         రాష్ట్రం వ్యాప్తంగా 42 ఎంఎస్ఎంఈ పార్కులకు సంబంధించిన భూములు ఏపీఐఐసీ స్వాధీనంలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. మరికొన్ని నియోజకవర్గాల్లో భూములను గుర్తించినట్లు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ భూములు లేవని, ప్రైవేటు పట్టాభూములు కొనుగోలు చేయాలని చెప్పారు. జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, నియోజకవర్గాల వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు, ఎంఎస్ఎంఈ పార్కుల కోసం ఎంపిక చేసిన భూములు, వాటి స్వాధీనం, భూములకు సంబంధించిన సమస్యలు, ఏపీఐఐసీ స్వాధీనంలోని  భూములు, మౌలిక వసతులకు టెండర్లు, మౌలిక వసతుల కల్పన, ఉపాధి అవకాశాలు, ఆటోనగర్ల ఏర్పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, చిత్తూరు జిల్లాలో ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు, పార్కులలో భవన నిర్మాణాలు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆన్ లైన్, మీసేవలకు సంబంధించి సాంకేతిక సమస్యలు, పెద్ద ప్రాజెక్టులు, మెగా ప్రాజెక్టులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పెట్టుబడి సబ్సిడీ బకాయిలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఎంఓయులు, మెగా ఫుడ్ పార్క్, ప్రైవేటు ఫుడ్ పార్కులు మొదలైన పలు అంశాలను ఈ సమావేశంలో సమీక్షించారు.
                ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రీతం రెడ్డి,  కార్యదర్శి సాలమన్ అరోకియా రాజ్, కమిషనర్ సిద్ధార్ధ జైన్, ఏపీ పరిశ్రమల మౌలిక వసతుల సంస్థ(ఏపీఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఏ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈఓ వైఎస్ ప్రసాద్, పరిశ్రమల శాఖ 13 జిల్లాల జనరల్ మేనేజర్లు, జోనల్ మేనేజర్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...