May 7, 2018


    పేదరిక నిర్మూలనే మా ధ్యేయం
ఆర్థిక మంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు
             సచివాలయం, మే 7: పేదరిక నిర్మూలనే తమ ధ్యేయమని, పేదరిక నిర్మూలన కోసం రాష్ట్రంలో  అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జరిగిన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం విధివిధానాలను వ్యతిరేకించే విషయంలో ఒకే అభిప్రాయం కలిగిన పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల తొలి సమావేశం ఏప్రిల్ 10న కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. రెండవ సమావేశానికి ఏపీ రాజధాని అమరావతి ఆతిధ్యమిచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జనాభా నియంత్రణలో కేరళ అందరికన్నా ముందుందని, ఆ తరువాత తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జనాభా నియంత్రణకు ప్రాధాన్యత ఇచ్చామని, పెద్దఎత్తున ప్రచారం చేశామని, ఏడెనిమిది ఏళ్లలో జనాభా పెరుగుదల రేటును తగ్గించగలిగామని చెప్పారు. జనాభా నియంత్రణ పాటించడం వల్ల నియోజక వర్గాల పునర్‌ విభజన జరిగితే  దక్షిణ భారతంలో పార్లమెంట్  సీట్ల సంఖ్య తగ్గిపోతుందన్నారు. ప్రస్తుతం జనాభా నియంత్రణ తమ విధానం కాదన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం  నిధులను  కేటాయిస్తే పురోగమనంలో వున్న రాష్ట్రాలు నష్టపోతాయన్నారు. అక్షరాశ్యత పెంపొందించడం ద్వారా జనాభాను నియంత్రణపై అవగాహన కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు. నేటి యువత ఉద్యోగానికి, జీవితంలో స్థిరపడటానికి ప్రాధాన్యత ఇస్తూ పెళ్లిని వాయిదా వేస్తుందన్నారు. పెళ్లి చేసుకున్న ఒక్కరితోనే సరిపుచ్చుకుంటున్నారని చెప్పారు. దాంతో జనాభా గణనీయంగా తగ్గుతోందన్నారు. దక్షిణ కొరియాలో పెళ్లి కాని యువత 35 శాతం వరకు ఉన్నట్లు తెలిపారు. సమాఖ్య విధానానికి విఘాతం కలిగించేవిధంగా కేంద్ర వ్యవహరిస్తోందని విమర్శించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలను దండించడం సరికాదన్నారు. భారత ప్రభుత్వం సహకార సమాఖ్య వ్యవస్థను గౌరవించాలన్నారు. గతంలో టిడిపి వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆందోళన మేరకు సర్కారియా కమిషన్ ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ కమిషన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలను స్పష్టంగా తెలియజేసిందన్నారు. రాష్ట్రం విడిపోవడంతో అత్యధిక ఆదాయం కలిగిన హైదరాబాద్ ను కోల్పోయినట్లు తెలిపారు. విభజన సమయంలో పార్లమెంటులో అప్పటి ప్రధాన మంత్రి  ప్రకటించిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వని అంశాన్ని ప్రస్తావించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కఠిన విభజన వల్ల తలసరి ఆదాయంలో వెనుకబడి వున్నామన్నారు. రాష్ట్రం అనేక వడిదుడుకులను ఎదుర్కొంటూ రెండంకెల వృద్ధి రేటుని సాధిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా, గ్యాస్ సరఫరాలో వంద శాతం ఫలితాలను సాధించినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో వనరులు బాగా ఉన్నాయని, టెక్నాలజీ సపోర్టుతో భవిష్యత్ లో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామికి న్యాయవాదిగా రాజ్యాంగం గురించి విపులంగా తెలుసని,  ఇక్కడ హాజరైన వారంతా వివిధ రంగాల్లో  ప్రముఖ నేపథ్యం కలిగినవారు కావడం విశేషంగా చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్రం తీరు ప్రగతిశీల రాష్ట్రాలకు శిక్ష విధించినట్టుగా వుందని పేర్కొన్నారు. పురోగతిలో వున్న రాష్ట్రాలు ఎట్టిపరిస్థితుల్లోనూ నష్ట పోవడానికి వీల్లేదని,  ఈ అన్యాయాన్ని సహించేది లేదని,  న్యాయం జరిగే వరకు పోరాడుతామని చెప్పారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వస్తోందని, 2011 జనాభా లెక్కల ఆధారంగా కేంద్ర నిధుల కేటాయింపు జరపడం సరికాదన్నారు. కష్టపడుతోన్న వారినే శిక్షించేలా కేంద్రం వ్యవహరిస్తోందని, తమ రాష్ట్రం విషయంలో అదే జరుగుతోందన్నారు. కేంద్రం నిధులూ ఇవ్వదు, రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించదని అన్నారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను మార్చాల్సిందిగా కోరుతూ రాష్ట్రపతిని కలుద్దామని అన్నారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని గౌరవించాలని అన్నారు.
            ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ 15వ ఆర్ధిక సంఘం రూపొందించిన విధివిధానాల వల్ల  రాష్ట్రాలు ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని కోల్పోతున్నాయన్నారు.  యుద్ధ సమయంలో ఇలాంటి విధానాన్ని అమలు చేయాల్సి వుందని, కేంద్రం ఇందుకు విరుద్ధంగా సాధారణ పరిస్థితుల్లోనూ సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా వుండాలో సర్కారియా కమిషన్ స్పష్టంగా పేర్కొందని చెప్పారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల సమాఖ్య సమతుల్యత దెబ్బతింటుందన్నారు.
పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి  మాట్లాడుతూ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాలను సంప్రదించవలసిన అవసరం ఉందన్నారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఏ రకంగా సమాఖ్య స్పూర్తి అవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఏకపక్ష ధోరణిపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్  రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతోందన్నారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. గత నెల 10న కేరళలో జరిగిన సమావేశంలో  నాలుగు రాష్ట్రాల మద్దతే లభించిందని, ఈ సమావేశానికి మద్దతిచ్చే రాష్ట్రాల సంఖ్య పెరిగిందని కేరళ ఆర్థిక మంత్రి  డాక్టర్ టీఎం థామస్ ఇసాక్ చెప్పారు. 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలను వ్యతిరేకించే రాష్ట్రాల సంఖ్య భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందని  భావిస్తున్నామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తామంటే జనాభా నియంత్రణను అమలు చేసిన రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.  ఏపీని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు నిరంతరం  కృషి చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆర్ధిక మంత్రి డాక్టర్ అమిత్ మిత్ర కొనియాడారు.  గ్రీన్ ఫీల్డ్ రాజధాని ఏర్పాటు చేయడాన్ని చంద్రబాబు ఛాలెంజ్ గా తీసుకున్నారన్నారు. ఐటీ రంగంలో చంద్రబాబు ఎటువంటి కృషి చేశారో అందరికీ తెలుసని చెప్పారు. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. 15వ ఆర్ధిక సంఘం ద్వారానే కాదు, వివిధ రూపాల్లో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో ఏ కేంద్రం వ్యవహరించని విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.  ప్రజాకర్ష పథకాలకు నిధుల కోత పెట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని,  15వ ఆర్ధిక సంఘం విధి విధానాల విషయంలో కేంద్రం వ్యవహరిస్తోన్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు రాష్ట్రపతి దగ్గరకు వెళ్లాల్సి ఉందని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 15వ ఆర్ధిక సంఘం విధి విధానాలు ఇబ్బందికరంగా ఉన్నాయని ఢిల్లీ డెప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేర్కొన్నారు. కేరళలో జరిగిన ఆర్థిక మంత్రుల సదస్సులో తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు. పంజాబ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి కేవలం 29 శాతం నిధులు మాత్రమే వస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలకు కేంద్ర వాటా ఎక్కువగా వెళ్తోందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యవహరిస్తోందని  పంజాబ్ ఆర్ధిక మంత్రి మన్ ప్రీత్ సింగ్ అన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...