May 2, 2018


  మంత్రి మండలి సమావేశం
02.05.2018 బుధవారం  సాయంత్రం
      సచివాలయం 1వ బ్లాక్ మంత్రి మండలి సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది.
సచివాలయం 1వ బ్లాక్  సమావేశ మందిరంలో బుధవారం రాత్రి మంత్రులు కాలువ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, సీహెచ్ ఆదినారాయణ రెడ్డి, కొల్లు రవీంద్ర మంత్రి మండలి సమావేశం వివరాలను  విలేకరులకు వివరించారు.

మంత్రిమండలి సమావేశంలోని ముఖ్యాంశాలు
మంత్రి కాలువ శ్రీనివాసులు వివరించిన అంశాలు
11వ పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు ఆమోదం.
       11వ పే రివిజన్ కమిషన్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. పీఆర్‌సీ పాత బకాయిల్లో ప్రస్తుతానికి ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయించింది.
       పాత బకాయిల మొత్తం రూ.3,999 కోట్లు. దీన్ని విడతలవారీగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ఎన్ని విడతలనేది ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తారు. పెన్షనర్లకు నగదు రూపంలో, ఉద్యోగులకు జీపీఎఫ్ రూపంలో చెల్లింపులు చేస్తారు.
       రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపుదలను నిర్ణయించడానికి ప్రతి ఐదేళ్లకు ఒక పర్యాయం పే రివిజన్ కమిషన్‌ను నియమించడం పరిపాటి.
       ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 28.02.2013లో పదవ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయగా, 29.05.2014లో ఆ కమిషన్ నివేదికను ఇచ్చింది. 29 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న ఈ కమిషన్ చేసిన సిఫారసులను మించి ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
       ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం నాన్ టీచింగ్ సిబ్బంది, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థలలో పనిచేసే ఉద్యోగులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితులను తెలుసుకుని వారందరికీ ఏ మేరకు జీతభత్యాలను అందించాలనే అంశంపై నూతన పే రివిజన్ కమిషన్ అధ్యయనం చేసి సిఫారసులు చేస్తుంది.
       బాధ్యతలు చేపట్టిన ఏడాది వ్యవధిలోగా పే రివిజన్ కమిషన్ తన నివేదికను అందిస్తుంది.
       13 జిల్లాలలోని 4.3 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సిబ్బందికి పే రివిజన్ కమిషన్ వల్ల లబ్ది పొందుతారు. 3.5 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు.
       కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీద కూడా చర్చ జరిగింది. తదుపరి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
ఏపీ వర్చువల్ క్లాస్‌రూమ్ కార్పొరేషన్ :
       ఏపీ వర్చువల్ క్లాస్‌రూమ్ కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
       ప్రపంచ విద్యావిధానంలో ఎన్నో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేవలం తరగతి గదిలో నల్ల బోర్డుపై పాఠాలు నేర్పే పరిస్థితులు క్రమక్రమంగా మాయమై డిజిటల్, -లెర్నింగ్ విధానాలు అమల్లోకి వచ్చాయి.
       పాఠ్య పుస్తకాల ద్వారా సంప్రదాయ బోధన, కంఠస్థం చేసే పద్దతులు పోయి ఆచరణాత్మక విద్యాబోధన విధానాలు అందుబాటులోకి వచ్చాయి.
       డిజిటల్ టెక్నాలజీ గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. ఐటీ నుంచి ఐవోటీ దిశగా విద్యావిధానం కూడా మార్పు చెందింది. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్ల తరహా ఇతర మొబైల్ పరికరాలు, ల్యాప్‌టాప్ వంటి ఆధునిక పరికరాల వ్యాప్తితో పాఠ్యాంశాలన్నీ డిజిటైజ్ అవుతున్నాయి.
       గ్లోబల్ మార్పులకు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యాలయాలలో ఇప్పటికే వీడియో ప్రదర్శనలు, -లెర్నింగ్ మెథడ్స్, ఆచరణాత్మక ప్రదర్శనలు, ఆన్‌లైన్ శిక్షణ వంటి నవీన డిజిటల్ ప్లాట్‌ఫారాలలో ఇంటరాక్టీవ్ విద్యాబోధన జరుగుతోంది.
       ఎనర్జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టుమెంట్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం 13.10.2017న రూ.160 కోట్లతో వర్చువల్ క్లాస్‌రూమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తొలుత 4 వేల ప్రభుత్వ/మున్సిపల్ పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదులను ఆరంభించారు. దీన్నిప్పుడు రాష్ట్రవ్యాప్తం చేయడానికి సంకల్పించారు. అందులో భాగంగానే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వ్యవస్థీకృతం చేస్తున్నారు.
       ప్రైవేట్ కంపెనీగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. పండిట్ నెహ్రూ బస్టేషన్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటీవ్ బ్లాకులో రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తారు. రూ.10 ముఖవిలువతో రూ.10 వేల ఈక్విటీ షేర్లతో రూ. లక్ష మూలధన వ్యయంతో కార్పొరేషన్‌ను ఏర్పాటుచేస్తారు. ఏపీఎస్ఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ కార్పొరేషన్‌కు సీఎండీగా వ్యవహరిస్తారు.
       రాష్ట్రంలోని విద్యాలయాలలో వర్చువల్ క్లాసురూముల ఏర్పాటుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. విద్యార్థులలో సమున్నత విజ్ఞాన సముపార్జన, నైపుణ్యాభివృద్ధికి దోహదపడే వర్చువల్ విద్యబోధనకు కార్పొరేషన్ అవసరమైన పరికరాలను సమకూరుస్తుంది.  జిల్లా, రాష్ట్ర స్థాయిలలో వర్చువల్ బోధనకు ఉపయోగపడే కేంద్రీకృత స్టూడియోలను కార్పొరేషన్ ఏర్పాటుచేస్తుంది. బోధనకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ సహకారం అందిస్తుంది.
       ప్రభుత్వ పాఠశాలలకు వర్చువల్ క్లాసురూమ్ సేవలు ఉచితంగానే అందించినా ప్రైవేట్ విద్యాసంస్థల నుంచి కొంత రుసుము వసూలు చేస్తారు. అలాగే, ఈ వర్చువల్ క్లాసురూములను ఉపయోగించుకుని వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన శిక్షణ అందించడం ద్వారా కార్పొరేషన్‌కు మరికొంత ఆదాయం అందుతుంది.

బందరులో డీప్ వాటర్ పోర్టు, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ :
       మజిలీపట్నం పోర్టు అభివృద్దికి, అక్కడ డీప్ వాటర్ పోర్ట్-ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్ (ILMZ) ఏర్పాటుకు అవసరమైన రూ.1092 కోట్ల రుణాన్ని ప్రభుత్వం గ్యారంటీగా ఉండి వివిధ బ్యాంకుల నుంచి సమకూర్చుకోవాలన్న INCAP ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
       మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టుకు సంబంధించిన భూ సేకరణ, రైలు అనుసంధానం వంటి ఇతర అభివృద్ధి కార్యకలాపాలను చేపట్టేందుకు ఈ రుణం దోహదపడుతుంది.
       కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR) ద్వారాఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్టుమెంట్ డిపార్టుమెంట్ బందరు డీప్ వాటర్ పోర్టు అభివృద్ధి పనులను,ILMZ ఏర్పాటును చేపట్టింది.
       వీటన్నింటికీ అవసరమైన రూ.1092 కోట్ల రుణాన్ని బహిరంగ మర్కెట్ ద్వారా, అంటే ప్రభుత్వరంగ బ్యాంక్‌ల నుంచి సమకూర్చుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమం అయ్యింది.
       బందరులో ILMZ ఏర్పాటుకు వెయ్యి ఎకరాల భూ సేకరణ అవసరమని కంటైనర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CONCOR) ప్రతిపాదించింది. దీనికిగాను రూ.300 కోట్లు, పోర్టు కోసం అవసరమైన భూ సేకరణకు గాను మరో రూ.600 కోట్లు, రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీకి అవసరమైన భూసేకరణకు గాను మరో రూ. 120 కోట్లు,R&R  కోసం ఇంకో రూ.40 కోట్లు కలిపి మొత్తం రూ. 1060 కోట్లు అవసరమవుతాయని అంచనా.
అనంతలో బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్శిటీ :
       అనంతపురము జిల్లా గౌనివారిపల్లిలో బెస్ట్ ఇన్నోవేషన్ యూనివర్శిటీ ఏర్పాటు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
       బెంగళూరుకు చెందిన గట్టి వ్యాలీ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది.
       A.P.ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం కింద ఏర్పాటు చేస్తున్న ఈ సరికొత్త విశ్వవిద్యాలయం  2018-19 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది.
       ఆంధ్రప్రదేశ్‌ను నాలేడ్జ్ స్టేట్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా రూపొందించాలన్న ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా దీన్ని ఏర్పాటుచేస్తున్నారు.
       దాదాపు రూ. 151 కోట్లతో 102 ఎకరాలలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు.
అనంతలో విండ్ సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టు :
       అనంతపురము జిల్లాలో 160 మెగావాట్ల సామర్ధ్యం గల విండ్ సోలార్ హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టు నెలకొల్పడానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.
       40 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు, 120 మెగవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు కలుపుకుని 40 MWh ఎనర్జీ స్టోరేజ్ సదుపాయంతో కూడిన హైబ్రీడ్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటుచేస్తారు.
       న్యూఢిల్లీలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) ఈ ప్రాజెక్టును ఏర్పాటుచేస్తోంది.
       అనంతపురము జిల్లా రామగిరి, కనగానపల్లి మండలాలలో NREDCAP అభివృద్ధి చేస్తున్న విండ్ సోలార్ హైబ్రీడ్ పార్కులో భాగంగా ఈ ప్రాజెక్టును ఏర్పాటుచేస్తారు.
       స్టోరేజ్ సదుపాయంతో కూడిన ఈ గ్రీన్‌ఫీల్డ్ హైబ్రీడ్ ప్రాజెక్టు ఏర్పాటు ప్రపంచంలోనే మొదటిది కావడం విశేషం.
ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు సిబ్బంది :
       ఉంగుటూరు మండల పరిధిలో జాతీయ రహదారి మార్గంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఆత్కూరు పోలీస్ స్టేషన్‌కు అవసరమైన పోలీస్ సిబ్బందిని మంజూరుచేస్తూ మంత్రిమండలి నిర్ణయం.
       విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఈస్టు డివిజన్‌లో ఉన్న ఈ ప్రాంతానికి కొత్తగా పోలీస్ స్టేషన్ అవసరమని భావించి దాన్ని ఏర్పాటుచేశారు. ఈ స్టేషన్‌ కోసం ఒక పోలీస్ సబిన్స్‌పెక్టర్, ఇద్దరు ఎఎస్ఐలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 37మంది పోలీస్ కానిస్టేబుళ్లు, మొత్తం 45 పోస్టులను మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్వర్వులను మంత్రిమండలి రాటిఫై చేసింది. 
వైఎస్ఆర్ హార్టీకల్చర్ వర్శిటీకి పోస్టులు: 
       కడప జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ హార్టీకల్చరల్ యూనివర్శిటీకి డిప్యూటీ రిజిస్ట్రార్/డిప్యూటీ కంప్ర్టోలర్ కేడర్‌లో ఒక డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టును ఏర్పాటుచేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
       రూ.46,060-98,440 పే స్కేలులో ఈ పోస్టును మంజూరుచేస్తారు. దీనిపై ప్రభుత్వానికి అదనంగా పడే భారమేదీ ఉండదు.
ఇబ్రహీంపట్నం-లింగాయపాలెం మధ్య ఫెర్రీ సర్వీసులు:
       అంతర్గత జల రవాణా అభివృద్ధిలో భాగంగా విజయవాడ ఇబ్రహీంపట్నం ఫెర్రీ-రాజధాని పరిధిలోని లింగాయపాలెం మధ్య ఫెర్రీ సర్వీసులు నిర్వహించడానికి ప్రైవేట్ ఆపరేటరుకు అనుమతులు ఇస్తూ మంత్రిమండలి నిర్ణయం.
       ఇన్‌లాండ్ వెస్సెల్స్ యాక్ట్ ప్రకారం ఇబ్రహీంపట్నం-లింగాయపాలెం మధ్య తాత్కాలిక జెట్టీల ఏర్పాటుకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టరు జీటీ రామారావుకు అనుమతులు ఇస్తారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రోల్ ఆన్, రోల్ ఆఫ్ సర్వీసులను నిర్వహించడానికి అనుమతులు ఇస్తారు.
మచిలీపట్నంలో రైతుబజార్ :
       మచిలీపట్నం పురపాలక సంఘం పరిధిలో గల రాజుపేట ప్రాంతంలో అర ఎకరం పైబడిన స్థలంలో రైతు బజార్‌ను ఏర్పాటుచేయడానికి మంత్రిమండలి ఆమోదం.
       ఇక్కడ రైతుబజార్ ఏర్పాటు చేసే అంశంలో అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ, మచిలీపట్నం పురపాలక సంఘం కమిషనర్ మధ్య జరిగిన ఒడంబడికలో యాజమాన్యపు హక్కు, అద్దె తదితర షరతులలో మార్పులు చేయడానికి మంత్రిమండలి అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం రైతు బజార్ ఏర్పాటుచేస్తున్న భూమిని లీజు ప్రాతిపదికపై 25 ఏళ్లకు మార్కెటింగ్ శాఖకు బదలాయిస్తారు. దీనికోసం మచిలీపట్నం పురపాలక సంఘానికి నెలకు ఒక్క రూపాయి చొప్పున నామమాత్రపు అద్దెను మార్కెటింగ్ శాఖ చెల్లిస్తుంది.   
మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ
       పెన్నా నదిపై సంగెం ఆనకట్ట ద్వారా నెల్లూరు సమగ్ర మంచినీటి సరఫరా మెరుగుదల పథకం, నెల్లూరు సమగ్ర భూగర్భ మురుగునీటి పథకాల కోసం హడ్కో నుంచి తీసుకున్న రూ.173.20 కోట్ల రుణానికి సంబంధించి 2018-19 లో బడ్జెట్ కేటాయింపు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
భూకేటాయింపు
       కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 161 ఎకరాల భూమిని M/s నాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం.
       ఎకరం రూ. మూడున్నర లక్షలుగా ధర నిర్ణయం.
       ఏడాదికి రెండున్నల టన్నుల సామర్ధ్యంతో ఇంటిగ్రేటెడ్ డీఐ పైపుల తయారీ ప్లాంట్ నెలకొల్పుతారు. రూ. 1,040 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 1132 మందికి ప్రత్యక్ష ఉపాధి, 1044 మందికి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధి కలుగనుంది.
ఆర్డినెన్స్ : ఏపీ కంప్లసరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్-2002కు సవరణలు చేస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం.
       చంద్రన్న పెళ్లికానుక ద్వారా వివిధ వర్గాలకు ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా కానుక అందించేందుకు చట్టంలో అవసరమైన మార్పులుచేర్పులు చేస్తూ ఆర్డినెన్స్‌కు రూపకల్పన.
       పెళ్లికానుక అందించే విషయంలో జాప్యం కాకుండా, పారదర్శకంగా సాయం మొత్తాన్ని ఇచ్చేందుకు వివిధ శాఖలను సమన్వయ పరిచేందుకు ఈ ఆర్దినెన్స్ దోహద పడుతుంది.
భూకేటాయింపు : సీఆర్‌డీఏలో వివిధ సంస్థలు, కార్యాలయాలకు 51.92 ఎకరాలను అమరావతిలో కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం.
       సీబీఐకి ఎకరా రూ. కోటి చొప్పున మూడున్నర ఎకరాల కేటాయింపు
       ఇగ్నోకు ఎకరాకు రూ. కోటి చొప్పున 80 సెంట్లు కేటాయింపు
       ఇండియన్ మెటరోలాజికల్ శాఖకు ఎకరా రూ. కోటి చొప్పున ఎకరం కేటాయింపు
       విదేశీ వ్యవహారాల శాఖకు విదేశ్ భవన్ కోసం ఎకరం రూ. కోటి చొప్పున రెండు ఎకరాలు కేటాయింపు.
       యూనియన్ బ్యాంకు 1.57 ఎకరాలు, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 1.55 ఎకరాలు, ఇండియన్ బ్యాంకుకు 1.50 ఎకారాలను ఎకరానికి రూ. 4 కోట్లు చొప్పున కేటాయింపు
       సెంట్రల్ చిన్మయ ట్రస్ట్ మూడు ఎకరాలు, రూప్‌టెక్ ఎడ్యుకేషనల్ ఇండియాకు 4 ఎకరాలు, ఏపీ ట్రాన్స్‌కోకు సబ్ స్టేషన్ ఏర్పాటుకు 2.59 ఎకరాలు, ఏపీఈడీబీకి రెండు ఎకరాలు, ఏపీ పోలీస్ డిపార్ట్‌మెంట్ నిఘా విభాగానికి రెండు వేల చదరపు గజాలు, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీకి రెండు ఎకరాలు, ఎన్‌లెర్న్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మూడు ఎకరాలు, సెయింట్ లారెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ట్రస్ట్‌కు 4 ఎకరాలు, సద్భావన నాలెడ్జ్ ఫౌండేషన్‌కు 4 ఎకరాలు, ఆనందిలాల్ గణేష్ పొడార్ సొసైటీకి మూడు ఎకరాలు, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ అకాడమీకి 8 ఎకరాలు, గ్లోబల్ స్కూల్స్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 4 ఎకరాలు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
భూ బదలాయింపు : గతంలో బ్రహ్మకుమారీస్ సొసైటీ పేరుతో కేటాయించిన 10 ఎకరాల భూమిని బ్రహ్మకుమారీస్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుకు మార్చుకునేందుకు బ్రహ్మకుమారీస్ పంపిన ప్రతిపాదనలకు మంత్రిమండలి అంగీకారం.
       సీఆర్‌డీఏ పరిధిలోని ఈ స్థలంలో బ్రహ్మకుమారీస్‌ విద్యాలయాలు స్థాపించేందుకు ఈ కేటాయింపులు జరిపింది.
భూ బదలాయింపు : సీఆర్‌డీఏ పరిధిలో గతంలో జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ పేరుతో కేటాయించిన 50 ఎకరాల భూమిని జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్‌స్టిట్యూట్ పేరుకు మార్చుకునేందుకు వారు పంపిన ప్రతిపాదనలకు మంత్రిమండలి అంగీకారం.
ముసాయిదా బిల్లు : ఆదాయపు పన్ను విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఏపీ హౌసింగ్ బోర్డు యాక్ట్-1956’కు మార్పులు చేస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం.
రివైజ్డ్ డ్రాఫ్ట్ పాలసీ : అమృత్ పథకం కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వివిధ పురపాలక సంఘాలలో యూజర్ చార్జీల వసూలుకు సంబంధించి రూపొందించిన రివైజ్డ్ డ్రాఫ్ట్ పాలసీకి మంత్రిమండలి ఆమోదం.
       మంచినీటి కుళాయి కనెక్షన్లు, చార్జీల మార్పులు చేర్పులకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసేందుకు వీలు కలుగుతుంది.
నష్ట పరిహారం : రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లోని జేఎన్ రోడ్డులో రహదారి విస్తరణకు తీసుకున్న భవన సముదాయం కోసం పరిహారంగా బీపీఎస్-2015’ కింద రూ. కోటీ 15 లక్షల 55 వేలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం.
డెవలప్‌మెంట్ అథారిటీస్‌ యాక్ట్‌లో కొత్త రూల్స్ : ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ యాక్ట్-2016లోని సబ్ సెక్షన్ 1, 2లో మార్పులతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీస్ రూల్స్-2018’కు మంత్రిమండలి ఆమోదం.
       దీని ప్రకారం విశాఖపట్నం, తిరుపతి, పుట్టపర్తి, మచిలీపట్నం, గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలకు, మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించి చైర్‌పర్సన్ల హోదాలు-జీతభత్యాలకు సంబంధించి నియమావళి వుంది.
ఆస్తి పన్ను మినహాయింపు : గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రామకృష్ణ మిషన్ వారి వివేకానందా విద్యావిహార్ హైస్కూల్‌కు, సిబ్బంది నివాస సముదాయాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపును ఇస్తూ మంత్రిమండలి ఆమోదం.
       ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యాలయాన్ని నిర్వహిస్తున్నందుకు ప్రోత్సాహకంగా మంత్రిమండలి నిర్ణయం.
లీజు ప్రాతిపదికన భూ కేటాయింపు : తూర్పూగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేటలో 5.57 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన విష్ణు సేవాశ్రమం, యోగాశ్రమం నెలకొల్పేందుకు శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర స్వామీ ట్రస్టుకు అప్పగిస్తూ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
       ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున 11 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం.
లీజు కాలపరిమితి తగ్గింపు : తిరుపతిలోని రామకృష్ణ మిషన్ ఆశ్రమానికి 2017 జులైలో 33 ఏళ్ల పాటు కేటాయించిన భూమి లీజు కాలపరిమితిని వారి విజ్ఞాపన మేరకు 30 ఏళ్లకు తగ్గించేందుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది.
డీపీఆర్‌ కోసంవాప్కాస్‌కు చెల్లింపులు : ప్రకాశం బ్యారేజ్ నుంచి పెదగంజాంకు కొమ్మమూరు కాలువ ద్వారా వరద నీటి మళ్లింపునకు సంబంధించి సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికను రూపొందించడం కోసం వాప్కాస్ సంస్థకు రూ. 3.59 కోట్లు కన్సల్టెన్సీ ఫీజుగా చెల్లించేందుకు పరిపాలనపరమైన అనుమతులకు మంత్రిమండలి ఆమోదించింది.
       అలాగే ఈ ప్రాంతంలో వచ్చే వరద నీటిని గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు ఎత్తిపోయడం ద్వారా సంగం బ్యారేజ్‌కు తరలించే ప్రణాళికను వాప్కాస్ తమ నివేదికలో పొందుపరుస్తుంది. 
భూ కేటాయింపు ఉత్తర్వుల రద్దు
ల్యాండ్ రెవెన్యూ శాఖ
       గుంటూరులోని  నల్లపాడులో  నాదెండ్ల రంగయ్య తన ఆధీనంలో ఉన్న మిగులు భూమి సర్వే.నెం. 245/2A లోని 491.17.మీ స్థలానికి  సంబంధించి క్రమబద్ధీకరణ కోసం  2008లో గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రమంత్రిమండలి రద్దు చేసింది.
ల్యాండ్ రెవెన్యూ శాఖ
       గుంటూరులోని  నల్లపాడులో  మిగులు భూమి సర్వే. నెం. 245/2A 491.17.మీ స్థలానికి సంబధించి అందులో నివసిస్తున్న పాపినేని సాంబశివరావుకు ఆ భూమిని క్రమబద్ధీకరిస్తూ 2008లో గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర మంత్రివర్గం రద్దు చేసింది.

మంత్రి సోమిరెడ్డి ప్రసంగం
Ø అగ్రి గోల్డ్ బాధితుల అంశం చర్చించారు. వారికి న్యాయం చేయడానికి మంత్రులు ఆదినారాయణ రెడ్డి, నక్కా ఆనందబాబు, సుజయ కృష్ణ రంగారావుల ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.
Ø కోర్టు పర్యవేక్షణలో బాధితులకు న్యాయం చేస్తాం.
Ø వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర కనీస మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు మాత్రం చేయడంలేదు.
Ø బిజేపీ పాలిత రాష్ట్రాలకు, మన రాష్ట్రానికి మధ్య కేంద్రం వివక్ష చూపుతోంది. కేంద్ర రైతుల గొంతు నొక్కుతోంది. కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోంది.

Ø -------------------------------------
మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రసంగం
Ø గోడౌన్ల నిర్మాణానికి కేంద్రం గతంలో ఇచ్చిన 35 శాతం సబ్సిడీని కేంద్రం రద్దు చేసింది.
Ø    పంటల బీమాకు సరైన విధానంలేదు.
Ø  ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాన్ని రాష్ట్రంలో నిర్వీర్యం చేశారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...