May 31, 2018


విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్ మెంట్
విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు

·       58 వేల కుటుంబాలకు ప్రయోజనం
·       15 ఏళ్ల లోపు సర్వీస్ ఉంటే 2 ఇంక్రిమెంట్లు
·       15 ఏళ్లకు మించి ఉంటే 3 ఇంక్రిమెంట్లు
·       32 మరణించిన కుటుంబాలవారికి ఉద్యోగాలు
·       పంపిణీ, సరఫరా నష్టం అతితక్కువతో దేశంలో నెంబర్ 1

             సచివాలయం, మే 31: విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు చెప్పారు.  సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన విద్యుత్ శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజల, ఉద్యోగుల పక్షపాతిగా పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలు, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి పీఆర్సీలో 30 శాతం ఫిట్ మెంట్ బెనిఫిట్ ఇచ్చామన్నారు. గడచిన నాలుగేళ్లలో వినియోగదారులపై అదనంగా విద్యుత్ చార్జీల భారం మోపకుండానే ఉద్యోగులకు 25 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. 2018 పీఆర్సీ, ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ కార్యదర్శులతో మాట్లాడి ఈ విషయంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల 31,543 ఉద్యోగులతోపాటు 26,493 మంది పెన్షన్ దారులు మొత్తం 58,036 మందికి అంటే అన్ని కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని  వివరించారు. 15 ఏళ్ల లోపు  సర్వీస్ ఉన్నవారికి రెండు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్ల దాటినవారికి మూడు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపారు. ఈ అంశంలో ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం సామరస్యపూరక వాతావరణంలో ఒక ఒప్పందానికి రావడం సంతోషంగా ఉందన్నారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి ఈ నిర్ణయాలు తీసుకున్నందున ప్రభుత్వంపై అదనంగా రూ.860 కోట్ల భారం పడుతుందని చెప్పారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఉద్యోగులను సంతృప్తి పరిస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు.  మరణించిన 32 మంది రెస్కో (గ్రామీణ విద్యుత్ సహకార సంఘం) ఉద్యోగుల కుటుంబాలలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా సీఎం అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 9 రెస్కోలు ఉన్నాయని, వాటిలో నష్టాలు వచ్చే ఏడిటిని ప్రభుత్వ శాఖలో కలిపివేసినట్లు చెప్పారు.
                 విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు అతి తక్కువతో దేశంలో మొదటి స్థానంలో మన రాష్ట్రం నిలిచిందని మంత్రి కళా వెంకట్రావు చెప్పారు. దేశంలో ఈ నష్టాలు 18 శాతంగా ఉందని, దానిని 15 శాతానికి తగ్గించాలని కేంద్ర నిర్ణయించిందని, అయితే మన రాష్ట్రంలో 9.72 శాతం మాత్రమే ఉందని వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణ ఫలితంగా, ఉద్యోగుల కృషి ఫలితంగా ఇది సాధించినట్లు తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు. కొత్తగా చేపట్టే సంస్కరణల్లో విద్యుత్ ని నిల్వ చేసే యూనిట్లను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా విజయనగరం జిల్లా మక్కువలో, నెల్లూరు జిల్లాలో ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విండ్, సోలాల్ విద్యుత్ ఉత్పత్తిపై కూడా దృష్టిపెట్టినట్లు తెలిపారు. విద్యుత్ సంస్కరణల్లో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి కళా వెంకట్రావు అన్నారు.

సీఎం చంద్రబాబుకు, మంత్రి కళా వెంకట్రావుకు కృతజ్ఞతలు
              రాష్ట్రం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పటికీ విద్యుత్ రేట్లు కూడా పెంచకుండా తమకు 25 శాతం ఫిట్ మెంట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ టి. చంద్రశేఖర్, కన్వీనర్ వేదవ్యాస్ లు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు  తగ్గించడానికి తాము కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆందోళన ధోరణి లేకుండా సామరస్యపూర్వక వాతావరణంలో ఒక అంగీకారం కుదిరినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. 2004లో 7 రెస్కోలు ప్రభుత్వంలో కలిశాయని, చనిపోయిన 32 మంది రెస్కో ఉద్యోగుల కుటుంబాల వారికి ఉద్యోగులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ శాఖలో సిబ్బంది కొరతగా ఉందని, సిబ్బందిని నియమించాలని కోరినట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై కూడా చర్చించామని రెండు రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వారు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...