May 24, 2018


ప్రకృతి వ్యవసాయం ద్వారా
రసాయన రహిత ఆహారం, పర్యావరణ పరిరక్షణ
ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు విజయకుమార్

Ø 5 లక్షల మంది రైతులు, 1.25 లక్షల హెక్టార్లు లక్ష్యం
Ø 6 ఏళ్లలో రూ.16,134 కోట్లు వ్యయం
Ø భవిష్యత్ ప్రణాళిక జూన్ 2న  ప్రకటన
Ø జూన్ 5న దేశంలోనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం
Ø త్వరలో యాప్ రూపకల్పన

             సచివాలయం, మే24: ప్రకృతి వ్యవసాయం రసాయన రహిత పౌష్టికాహారం అందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు, రైతు సంక్షేమానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వ వ్యవసాయ రంగ సలహాదారు టి.విజయకుమార్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో గురువారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. అటు రైతులకు, ఇటు ప్రజలకు, పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 2015 సెప్టెంబర్ లో దీనిని ప్రవేశపెట్టామని,  2016 ఖరీఫ్ లో  అమలు చేయడం మొదలుపెట్టినట్లు తెలిపారు. రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. 2018 నాటికి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 972 గ్రామాల్లో 63 వేల హెక్టార్లలో ఈ వ్యవసాయ పద్దతులను అనుసరిస్తున్నట్లు వివరించారు. రైతులను చైతన్యపరచి, ఈ వ్యవసాయం పట్ల వారికి అవగాహన కల్పించి 2018-19లో రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ పద్దతిలో సాగుచేయించదలచినట్లు చెప్పారు. ఈ ఏడాది మూడు వేల గ్రామాల్లో 5 లక్షల మంది రైతుల చేత 1.25 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేయించడం ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. భవిష్యత్ లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ పద్దతిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఆరేళ్లలో ఇందు కోసం రూ.16,134 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.  ఈ వ్యవసాయం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కవ వస్తుందన్నారు. ప్రజలకు రసాయన రహిత ఆహారంతోపాటు రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. ఒక నెల రోజులపాటు వర్షాలు కురవకపోయినా ఈ వ్యవసాయపద్దతిలో పంటలకు నష్టం ఉండదని, దీనికి నీరు తక్కువ అవసరం ఉంటుందని తెలిపారు. భూమిలోనే సారం ఎక్కువగా ఉంటుదని, పోషకవిలువలు అన్నీ ఉంటాయని, అవే ఉపయోగపడతాయని వివరించారు. ఈ వ్యవసాయం ద్వారా రైతుకు 13 రెట్లు ఆదాయం ఎక్కవ వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులు ఈ విధానినికి మారడానికి అయిదేళ్లయినా సమయం పడుతుందని, ఆ లోపు రైతు సంఘాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సమాయత్తం చేస్తామన్నారు.

త్వరలో మొబైల్ యాప్
              త్వరలో ఒక మొబైల్ యాప్ ను రూపొందించి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు ఉపయోగపడేవిధంగా వివరాలు అందిస్తామని చెప్పారు. విత్తన దశ నుంచి పంట కోత దశ వరకు ఆయా పంటలకు రైతులు అనుసరించిన పద్దతులు, వాడిన సహజ ఎరువుల వివరాలు అందులో పొందుపరిచే ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ పద్దతి ద్వారా ఇతర రైతులకు ఆ వివరాలు తెలియడంతోపాటు, వినియోగదారులకు కూడా ఆ పంటలకు ఎటువంటి సహజసిద్ధ ఎరువులు వాడింది తెలుస్తుందన్నారు. జనవరిలో మన రాష్ట్రంలోని రైతులకు సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ 9 రోజుల పాటు ప్రకృతి వ్యవసాయలో శిక్షణ ఇచ్చి ఎంతో సహాయపడినట్లు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన ఈ వ్యవసాయ పద్దతులకు కేంద్ర ప్రభుత్వంతోపాటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించినట్లు తెలిపారు. రైతులకు ఆదాయం ఎక్కువ రావడానికి, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను రైతు బజార్లలో ప్రత్యేక స్టాల్స్ ద్వారా అమ్మకాలు జరుపుతామన్నారు. మహిళా సంఘాల ద్వారా మార్కెటింగ్ చేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. సచివాలయంలో కూడా ఒక స్టాల్ పెట్టే ప్రతిపాదనను పరిశీలించమని అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విస్తృత పరచడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగం వారు సహాయసహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. బీఎన్ పీ పారిబాస్ బ్యాంకువారు కూడా సహకరిస్తున్నట్లు చెప్పారు. వాతావరణ మార్పులకు తట్టుకోవడంలో ప్రకృతి వ్యవసాయం ఉత్తమైనదిగా పేర్కొన్నారు. ఈ ఉత్పత్తుల మార్కెటింగ్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

జూన్ 5న భారత్ లోనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం
             ఈ ఏడాది జూన్ 5న భారత్ లోనే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపనున్నట్లు విజయకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జూన్ 2వ తేదీన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్, సమ్మిళిత అభివృద్ధి ప్రపంచ వ్యాపార మండలి అధ్యక్షులు సన్నీ వర్గీస్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నాచుర్ అంతర్జాతీయ అధ్యక్షుడు పవన్ సుఖ్ దేవ్, పీఎన్ బీ పారిబాస్ గ్లోబల్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యులు ఆంటోని సిరే తదితరులు మన రాష్ట్రానికి వస్తున్నట్లు తెలిపారు. ఆ రోజున గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎందురుగా బైబిల్ మిషన్ గ్రౌండ్స్ లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 నాటికి 60 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించే విధంగా రూపొందించిన ప్రణాళికను ప్రకటిస్తారని చెప్పారు.  ఆ రోజున యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ విభాగంతో ఒక ఒప్పొందం కూడా చేసుకోనున్నట్లు విజయకుమార్  తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...