Apr 19, 2018


ప్రత్యేక హోదా కలిగిన 3 రాష్ట్రాలపై ఓ అధ్యయనం
(ఉత్తరాఖండ్,  హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్)
       
  ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏ మేరకు అభివృద్ధి చెందాయో తెలుసుకోవడానికి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రాలపై హిమాచల్ ప్రదేశ్ లోని సిరమూర్ జిల్లా పాంటాసాహిబ్ కు చెందిన  త్రివేణి స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్స్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వారు ఒక అధ్యయనం చేశారు.  ఈ అధ్యయనానికి  ప్రాజెక్ట్ డైరెక్టర్ గా డాక్టర్ ధ్యాన్ సింగ్ టోమర్, కన్సల్టెంట్ గా ప్రొఫెసర్ శ్యామ ప్రసాద్ వ్యవహరించారు.  కేంద్ర ప్రభుత్వ ప్లానింగ్ కమిషన్ లోని సోషియో ఎకనామిక్ రిసెర్చ్ డివిజన్ వారు ఈ అధ్యయనానికి  నిధులు సమకూర్చారు.  అధ్యయన నివేదికను వారు సోషియో ఎకనామిక్ రిసెర్చ్ డివిజన్ వారికి అందజేశారు.  ప్రధానంగా ప్రత్యేక హోదాతో వచ్చిన రాయితీలు, నిధుల కారణంగా  ఈ మూడు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రగతి, ఆర్ధికాభివృద్ధి ఏ మేరకు జరిగిందన్న అంశంపై పరిశోధన జరిగింది. ప్రత్యేక హోదా ఉన్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, కశ్మీర్ లలో బాగా అభివృద్ధి చెందిన జిల్లా ఒకటి, వెనుకబడిన జిల్లా ఒకటి చొప్పున రాష్ట్రానికి  రెండేసి జిల్లాలను తమ పరిశోధనకు ఎంపిక చేసుకున్నారు. అలాగే ప్రత్యేక హోదా కలిగిన ఈ రాష్ట్రాలకు సరిహద్దున గల పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి ఏ మేరకు జరిగిందన్న అంశంపై కూడా రెండేసి జిల్లాలను ఎంపిక చేసుకుని పరిశోధన కొనసాగించారు. ప్రత్యేక హోదా కింద ఈ రాష్ట్రాలకు భారీగా నిధులు వచ్చినప్పటికీ,  వాటి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ లతో పోలిస్తే పారిశ్రామికాభివృద్ధిలో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కశ్మీర్ బాగా వెనుకబడ్డాయి. ప్రత్యేక హోదా ప్రకటించిన అనంతరం ఈ మూడు రాష్ట్రాల్లో అభివృద్ధి విషయంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్న విషయం గమనార్హం. ఫ్యాక్టరీలు పెరిగాయి. మూలధనం పెరిగింది. పెట్టుబడులు పెరిగాయి. పారిశ్రామిక కార్మికుల సంఖ్య పెరిగింది. పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపే వారి సంఖ్య పెరిగింది. కార్మికుల వేతనాలు పెరిగాయి. ఉత్పత్తి పెరిగింది. ప్రత్యేక హోదా ప్రకటించడం వల్ల ఈ మూడు రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు మధ్య పారిశ్రామికీకరణ, అభివృద్ధి విషయంలో తీవ్ర అసమానతలు ఏర్పడ్డాయి. అలాగే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో కూడా ఈ అసమానతలు తీవ్రంగా ఉండటం గమనార్హం. పారిశ్రామికాభివృద్ధి విషయంలో హిమాచల్ ప్రదేశ్ కన్నా ఉత్తరాఖండ్ బాగా లబ్ధి పొందింది. రాష్ట్ర విభజన తరువాత ఉత్తరాఖండ్ లో ఉన్న వనరులకు ప్రత్యేక హోదా ఊతంగా మారి ఆ రాష్ట్రాన్ని విజయపథాన నిలబెట్టింది. అదే సమయంలో జమ్మూ కశ్మీర్ కున్న కొన్ని సమస్యల కారణంగా ఆ రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడే ఉంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు దేశ వ్యాప్తంగా పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించడంలో బాగానే విజయవంతమయ్యాయి. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రత్యేక హోదా దోహదపడింది.
ప్రత్యేక హోదా దుర్వినియోగం
            ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు పలువురు ప్రత్యేక హోదాను దుర్వినియోగం చేశారు. తమ పరిశ్రమల్లో ఉత్పత్తి విలువను బాగా పెంచి చూపించి ఎక్సైజ్ డ్యూటీ వంటి మినహాయింపులు ద్వారా భారీ మొత్తంలో  ప్రయోజనాలు పొందారు. ఈ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు తమకు కావాల్సిన నిపుణులను దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి తీసుకుని వారికి అధిక వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించారు. స్థానిక యువతకు మాత్రం నిర్ధేశించిన సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించలేదు. స్థానికులకు ఉపాధి కల్పించాన్న నిబంధనను తుంగలో తొక్కారు. దాదాపు 50 శాతం కంపెనీలు ఈ విధంగా నిబంధనలు అతిక్రమించాయి. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి  ఒనగూడే ప్రయోజనాలేంటన్న అంశంపై స్థానిక ప్రజల్లో చాలా మందికి కనీస అవగాహన లేదు. దీంతో హోదా రావడం వల్ల మంచి జరిగిందనేవారు 32.9 శాతం మంది ఉంటే, నిజంగా అభివృద్ధి జరిగిందని చెప్పేవాళ్లు 29 శాతం మంది మాత్రమే ఉన్నారు. ప్రత్యేక హోదా కారణంగా ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రణాళికలు విస్తృతమవుతాయని నమ్మేవాళ్లు 44 శాతం ఉంటే, అంతగా నమ్మకం లేని వాళ్లు 29 శాతం ఉన్నట్లు వారు జరిపిన సర్వేలో తేలింది. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వాల పనితీరు పట్ల 39 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. హోదా పొందిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మాత్రమే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని కోరుకునే వారి సంఖ్య 66.7 శాతంగా ఉంది.  తమ రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఉపయోగపడుతుందని నమ్మేవాళ్ల సంఖ్య మాత్రం 89 శాతంగా ఉంది.
జమ్మూ-కశ్మీర్ కోసం ప్రత్యేక ప్యాకేజీ
                ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా పరిశ్రమలకు వివిధ రూపాల్లో రాయితీలు కల్పించారు. పారిశ్రామికాభివృద్ధి కోసం జమ్మూ-కశ్మీర్  రాష్ట్రం 2002 జూన్ 14న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం పరిశ్రమలకు పదేళ్ల పాటు 100 శాతం ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కేంద్ర పెట్టుబడి రాయితీ పథకం కింద పదేళ్ల పాటు పరిశ్రమల స్థాపనకు అయ్యే ఖర్చులో 15 శాతం లేదా 30 లక్షల రూపాయలకు మించకుండా మినహాయింపు కల్పించారు. పరిశ్రమల నిర్వహణ కోసం పెట్టే పెట్టుబడిలో మూడు శాతం వడ్డీ రాయితీని పదేళ్ల పాటు వర్తింపజేశారు.  కేంద్ర సమగ్ర బీమా పథకం కింద పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు పదేళ్ల పాటు వంద శాతం బీమా సౌకర్యం కల్పించారు. మొదటి ఐదేళ్ల పాటు వంద శాతం ఆదాయపన్ను మినహాయింపు ఇచ్చారు. ఆ తరువాతి ఐదేళ్ల పాటు 30 శాతం పన్ను మినహాయింపు ఇస్తారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రత్యేక ప్యాకేజీ
               ఈ రెండు రాష్ట్రాల్లో నూతన పారిశ్రామిక విధానాన్ని 2003 జనవరి 7న ప్రకటించారు. షరతులతో 100 శాతం ఎక్సైజ్ రాయితీ ఇచ్చారు. తొలి ఐదేళ్ల వరకు 100 శాతం ఆదాయపన్నులో మినహాయింపు, తరువాత 30 శాతం పన్ను మినహాయింపు వర్తింపజేశారు. 15 శాతం లేదా రూ.30 లక్షలకు మించకుండా పెట్టుబడి రాయితీ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లలో కూడా కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ రుణాలు అందజేస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేంద్రం నుంచి రాయితీలు అందుతున్నాయి. చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు ప్రధాన మంత్రి రోజ్ గార్ యోజన ద్వారా పెట్టుబడిలో 15 శాతం రాయితీ లభిస్తుంది. స్థానిక మానవ వనరులకు ఉపాధి కల్పించని పరిశ్రమలకు పై రాయితీలు కల్పించరాదన్న నిబంధనను ఉత్తరాఖండ్ రాష్ట్రం ఖచ్చితంగా అమలు చేస్తోంది.
పరిశ్రమలు పెట్టుబడులు – ఉపాధి కల్పన
             ఉత్తరాఖండ్ లో రూ.23,905 కోట్ల పెట్టుబడులతో 16,012 పరిశ్రమలను స్థాపించి 1,61,610 మందికి ఉపాధి కల్పించారు. హిమాచ్ ప్రదేశ్ లో రూ.10,104 కోట్ల పెట్టుబడులతో 7,606 పరిశ్రమలను ప్రారంభించి 95, 618 మందికి ఉపాధి కల్పించారు. జమ్మూ,కశ్మీర్ లో రూ. 1989 కోట్ల పెట్టుబడులు పెట్టి 8,091 పరిశ్రమలను స్థాపించి 59,621 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ప్రత్యేక హోదా కల్పించినంత మాత్రాన అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉండవు. ఆయా రాష్ట్రాలలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, భూమి, వనరుల లభ్యతపై  ఆధారపడి అభివృద్ధి చెందుతాయి. 
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...